చైనా, భారత్ సరిహద్దు ఉద్రిక్తతలు: ‘బొమ్మలాట’లో ఇండియా చైనాను ఓడించగలదా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లోని పాంగాంగ్ సరస్సు దగ్గర ఆగస్టు 29-30న రెండు దేశాల సైనికుల మధ్య మళ్లీ ఘర్షణలు జరిగాయనే వార్తలు వస్తున్నాయి.
దీనిపై ఒక ప్రకటన జారీ చేసిన భారత్ “రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన చైనా సైనికులు సరిహద్దుల్లో యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించారు, కానీ భారత సైనికులు వారిని అడ్డుకున్నార”ని చెప్పింది. అయితే, చైనా సైన్యం వాస్తవాధీన రేఖను కచ్చితంగా పాటిస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి చెప్పారు.
మరోవైపు భారత్ నెలనెలా ఆర్థిక, వ్యాపార రంగాల్లో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ చైనాపై ఆధారపడడాన్ని తగ్గించే విషయం మాట్లాడుతోంది.
భారత ప్రభుత్వం ఇటీవల చైనా యాప్స్‌పై నిషేధం విధించాలని నిర్ణయించింది. ఆ తర్వాత ప్రభుత్వ ఒప్పందాల్లో విదేశీ కంపెనీలు తక్కువగా పాల్గొనేలా వాణిజ్య నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. అయితే, ఈ నిర్ణయాలన్నింటి వల్ల చైనాతో వ్యాపారంపై పెద్దగా ప్రభావం పడినట్లు కనిపించడం లేదు.
యాప్స్, ప్రభుత్వ కాంట్రాక్టుల నుంచి చైనా కంపెనీలను బయటకి పంపించడం కోసం అన్ని సన్నాహాలూ చేసిన తర్వాత ఇప్పుడు భారత్ దృష్టి చైనా ‘బొమ్మల మార్కెట్’ మీద పడింది.
ఆగస్టు 30న ‘మన్ కీ బాత్’లో కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ “ప్రపంచ బొమ్మల మార్కెట్ దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలకు పైనే ఉంది. అయితే, అందులో భారత్ భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంది.
కానీ ఇంత పెద్ద వారసత్వం, సంప్రదాయాలు, వైవిధ్యం, యువ జనాభా ఉన్న మన దేశం నుంచి ఇంత తక్కువ భాగస్వామ్యం ఉండడం బాగుందా. లేదు. అది వినడానికి సరిగా లేదు. మనమంతా కలిసి దీనిని ముందుకు తీసుకెళ్లాలి” అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బొమ్మల ప్రపంచ మార్కెట్
అయితే మోదీ చైనా పేరు ప్రస్తావించలేదు. కానీ, భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చైనా బొమ్మలకు ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే.
బొమ్మలు తయారు చేయడంలో ప్రపంచంలోని టాప్ 5 దేశాల్లోనే లేని భారత్ హఠాత్తుగా ప్రపంచంలోనే టాప్‌లో ఉన్న చైనా బొమ్మలతో ఎలా పోటీపడగలదు.
భారత ప్రధాన మంత్రి సెట్ చేయాలనుకుంటున్న టార్గెట్ ప్రస్తుత పరిస్థితుల్లో అంత సులభం కాదనేది సుస్పష్టం.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 86 శాతం బొమ్మలు చైనా నుంచే వెళ్తాయి. రెండో స్థానంలో యూరోపియన్ యూనియన్ దేశాలు ఉన్నాయి.
2019లో ప్రపంచ బొమ్మల మార్కెట్ 105 బిలియన్ డాలర్ల పరిశ్రమగా ఉంది. అది 2025 నాటికి 131 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది.
ఇక, భారత్ విషయానికి వస్తే ప్రపంచ బొమ్మల మార్కెట్‌లో మన భాగస్వామ్యం 0.5 శాతం కంటే తక్కువే ఉంది.
భారత్‌లో దాదాపు రూ. 16 వేల కోట్ల విలువైన బొమ్మల మార్కెట్ ఉంది. అందులో స్వదేశంలో తయారయ్యే బొమ్మలు 25 శాతమే. మిగతా 75 శాతంలో దాదాపు 70 శాతం కేవలం చైనా నుంచే వస్తున్నాయి. 5 శాతం బొమ్మలు మిగతా దేశాల నుంచి దిగుమతి అవుతాయి.
ప్రపంచంలో బొమ్మలు తయారీలో అన్నిటికంటే ముందున్న కంపెనీల్లో లెగో, మెటల్, బాందాయీ నామ్‌కో ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి పేర్లు ఉన్నాయి. వీటిలో ఎక్కువ ప్లాంట్స్ చైనాలోనే ఉన్నాయి.
అలాంటప్పుడు, చైనా బొమ్మలకు బదులు భారతీయుల మొదటి చాయిస్ అయ్యేలా దేశంలో బొమ్మలు తయారు చేయడమనేది భారత్‌కు అతిపెద్ద సవాలుగా మారనుంది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ బొమ్మల మార్కెట్
దిల్లీ సదర్ మార్కెట్‌లో భారీ చైనా బొమ్మల మార్కెట్ ఉంది. అక్కడ షాపులకు వెళ్లే కస్టమర్లు తరచూ “బాబూ, తక్కువ ధరలో మంచి బొమ్మలు చూపించు” అనడం వినిపిస్తుంటోంది.
నిజానికి చౌకగా వచ్చే చైనా బొమ్మలు భారతీయులకు అలవాటైపోయాయి. అందులో చాలా వెరైటీలు కూడా ఉంటాయి. అవి ట్రెండ్‌తోపాటూ మారుతుంటాయి. మార్కెట్‌లో ఏ కొత్త కార్టూన్ షో వచ్చినా, ఆ కారెక్టర్‌ను మనం కొన్ని నెలల్లోనే మార్కెట్లో చూడచ్చు. ఇక కొత్త గేమ్స్ విషయానికి వస్తే చైనా బొమ్మలకు ఏవీ సాటిరావు. వాటి ధర కూడా చాలా తక్కువ.
భారత్‌లో అలాంటి బొమ్మల మార్కెట్‌లో ఇన్నోవేషన్ లోటు చాలా ఉంటోందని వ్యాపారులు చెబుతున్నారు.
భారత్‌లో బొమ్మల తయారీలో దక్షిణ భారత నగరాలు ముందంజలో ఉన్నాయి. కర్ణాటక రాంనగర్‌లో చెన్నపట్న, ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని కొండపల్లి, తమిళనాడులోని తంజావూర్, అసోంలోని ధుబ్రి, ఉత్తరప్రదేశ్‌లో వారణాసిలో బొమ్మలు తయారు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Twitter/pmoinidia
ఇబ్బందుల్లో కొయ్య బొమ్మల వ్యాపారులు
కానీ, అవి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాయో తెలుసుకోడానికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్రాన్ ఖురేషీ చెన్నపట్నలోని ఒక బొమ్మల వ్యాపారితో మాట్లాడారు.
సమీవుల్లా నలుగురైదుగురు కార్మికులతో చెన్నపట్నలో బొమ్మల తయారుచేస్తుంటారు. టాయ్ క్లస్టర్ అయిన అది బెంగళూరు-మైసూర్ హైవేపై ఉంది. అక్కడ చెక్క బొమ్మలు తయారుచేస్తుంటారు. ప్లాస్టిక్, మిగతా పదార్థాలతో పర్యావరణానికి ముప్పు వస్తుండండతో, వీరు మళ్లీ చెక్క బొమ్మల ట్రెండ్ తీసుకొచ్చారు. సమీవుల్లా తన వ్యాపారం గురించి బీబీసీతో మాట్లాడారు.
”కరోనా సమయంలో మా పరిస్థితి చాలా ఘోరంగా మారింది. గత ఐదు నెలల్లో ఇక్కడ పనిచేసేవారు ఎక్కువగా వెల్డింగ్ లేదా తాపీమేస్త్రీ పనులకు వెళ్లిపోవాల్సి వచ్చింది. మొదట్లో కూడా రోజుకు ఐదారు వందలు సంపాదించేవాళ్లం. కానీ కరోనా తర్వాత ఈ ఐదు నెలలు చాలా దారుణంగా నడిచాయి” అన్నారు.
చెన్నపట్న క్రాఫ్ట్ పార్కును కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం భారత దేశంలో ఇలాంటి పార్క్ ఇదొక్కటే. ఇక్కడ కర్ణాటక నుంచే కాకుండా, తమిళనాడు, కేరళ బొమ్మల తయారీ కార్మికులు కూడా వచ్చి మెషిన్లతో ఫినిషింగ్ పనులు చేస్తుంటారు. తర్వాత ఈ బొమ్మలను భారత్‌లోని మిగతా మార్కెట్లలో, ప్రపంచ మార్కెట్లలో అమ్ముతారు.
ఈ క్రాఫ్ట్ పార్కును నోట్లరద్దుకు ముందే ప్రారంభించారు. దాని గురించి పార్క్ సీఈఓ శ్రీకళ కాదిదల్ బీబీసీతో మాట్లాడారు.
“నోట్లరద్దుకు ముందు మా దగ్గరకు వివిధ రాష్ట్రాల నుంచి చాలా మంది బొమ్మలు తయారుచేసేవారు వచ్చేవారు. కానీ నోట్ల రద్దుతో మాకు మొదటి షాక్ తగిలింది. ఒక చెయ్యి తెగిపోయినట్టు అయ్యింది. తర్వాత జీఎస్టీతో రెండో దెబ్బ తగిలింది. ఈ బొమ్మలపై ప్రభుత్వం 12 శాతం జీఎస్టీ వేసింది. తర్వాత ఈ పరిశ్రమ రెండు చేతులూ తెగిపోయాయి. మిగిలిన పని కరోనా పూర్తి చేసింది. ఇప్పుడు పరిశ్రమ అనేదే లేకుండాపోయింది” అన్నారు.
“మొదట్లో 5.5 శాతం వ్యాట్ పడేది. ఇప్పుడు 12 శాతం జీఎస్టీ. అలాంటప్పుడు మేం చైనా బొమ్మలతో ఎలా పోటీపడగలం. అంగన్‌వాడీలకు కూడా మా బొమ్మలు కొనరు. వాటికి కూడా చైనా బొమ్మలనే కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం కనీసం స్థానిక అంగన్‌వాడీల కోసం అయినా చెన్నపట్న బొమ్మలు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేయాలి” అంటున్నారు శ్రీకళ

ఫొటో సోర్స్, TWITTER/PMO INDIA
చైనాతో పోటీకి భారత్ సవాలు
బహదూర్‌గఢ్ టాయ్ ఫ్యాక్టరీ ‘ప్లేగ్రో’ యజమాని మనూ గుప్తా కూడా ఇదే చెప్పారు. జీఎస్టీ వల్ల ఆయన సమీవుల్లా కంటే ఎక్కువ సమస్యలు ఎదుర్కొన్నారు. గుప్తా కంపెనీలో ఎక్కువగా బ్యాటరీ లేదా ఎల్ఈడీ లైట్లున్న బొమ్మలు తయారవుతాయి. వాటిపై ప్రభుత్వం 18 శాతం జీఎస్టీ వేసింది.
ప్రభుత్వం జీఎస్టీ తగ్గించాలని, అన్ని రకాల బొమ్మలకు ఒకే రకం జీఎస్టీ అమలుచేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
మను గుప్తా టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కన్వీనర్ కూడా. ప్రధాని ప్రయత్నం మంచిదేనని ఆయన చెబుతున్నారు.
“దానివల్ల టాయ్ ఇండస్ట్రీ బలోపేతం అవుతుంది. కానీ, కొన్ని ప్రాథమిక సౌకర్యాలు కూడా కల్పిస్తే, జనం ఈ పరిశ్రమలోకి రావడానికి ఆసక్తి చూపిస్తారు” అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ బొమ్మల పరిశ్రమలో వెనకబడ్డానికి మూడు కారణాలు చెబుతున్నారు.
మొదటిది-డిజైన్, మార్కెట్ సమన్వయంలో లోపం. భారత్‌లో కొన్ని మంచి డిజైన్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. అంటే ఎన్ఐటీ అహ్మదాబాద్ లాంటి ప్రాంతాల్లో బొమ్మల డిజైన్ కోర్సులు ఉన్నాయి. కానీ అక్కడ ఆ ఇండస్ట్రీలో ఏవి కీలకం అనేది పెద్దగా చెప్పరు. దాంతో విద్యార్థులు ఆన్-లైన్ గేమ్స్ తయారు చేయడం గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఈ మార్కెట్లో అతిపెద్ద భాగమైన ఎడ్యుకేషనల్ టాయ్స్, ప్లాస్టిక్ టాయ్స్, బ్యాటరీ ఆపరేటెడ్ టాయ్స్ లాంటి వాటిపై దృష్టి పెట్టడం లేదు.
రెండోది-స్థలం ఇంకో సమస్యగా మారింది. చైనా ప్రభుత్వం తమ దేశంలో 14 ప్లగ్ ఇన్ టాయ్ సిటీ సెంటర్లు నిర్మించింది. కంపెనీలు అక్కడకు వెళ్లి వెంటనే తమ పనులు ప్రారంభించవచ్చు. చైనాలో లేబర్ కాస్ట్ కూడా భారత్ కంటే చాలా తక్కువ ఉంటుంది.
మూడోది
- భారత్‌లో ఇప్పుడు సెప్టెంబర్ 1 నుంచి బొమ్మలకు బీఎస్ఐ మార్క్ తప్పనిసరి చేస్తున్నారు. బీఎస్ఐ మార్క్ క్వాలిటీ కంట్రోల్ కోసం వేస్తారు.
కానీ ఇప్పుడు వ్యాపారులందరూ దీనికి పూర్తిగా సన్నద్ధంగా లేరు. వారికి మూడు నెలల సమయం అవసరం. బొమ్మల వ్యాపారంలో చాలామంది చిన్న, మీడియం వ్యాపారులు కూడా ఉంటారు. కరోనా కాలంలో అలాంటి వారు క్వాలిటీ కంట్రోల్‌కు సంబంధించిన అన్ని ప్రమాణాలూ పాటించాలంటే టైం పడుతుంది.
భారత ప్రభుత్వం కూడా మొదట బొమ్మలు తయారుచేసే కంపెనీల కోసం అలాంటి అన్ని సౌకర్యాలూ కల్పించాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే భారత్ బొమ్మల మార్కెట్‌లో చైనాను ఎదుర్కోగలుగుతుంది.
ఇవి కూడా చదవండి:
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ప్రణబ్ ముఖర్జీ మరణానికి కారణమైన సెప్టిక్ షాక్ అంటే ఏమిటి?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- హైదరాబాద్, విజయవాడల మధ్య హైస్పీడ్ రైలు సాధ్యమేనా
- నైలు నదిపై నీటి యుద్ధం.. భారీ ఆనకట్ట రేపిన వివాదం
- దుబాయ్ నుంచి వచ్చేసిన సురేశ్ రైనా మౌనం వీడాడు.. తన బాధేంటో చెప్పాడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








