ప్రణబ్ ముఖర్జీ మరణానికి కారణమైన సెప్టిక్ షాక్ అంటే ఏమిటి.. ఈ ‘హిడెన్ కిల్లర్’ నుంచి బయటపడలేరా

ఫొటో సోర్స్, Getty Images
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణానికి ముందు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి చెబుతూ దిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి వర్గాలు ఆయన సెప్టిక్ షాక్‌లో ఉన్నారని చెప్పాయి.
అయితే ఆసుపత్రి వర్గాలు చెప్పిన సెప్టిక్ షాక్ అంటే ఏమిటి.. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది. సెప్టిక్ షాక్‌లోకి వెళ్తే మరణం తప్పదా.. కోలుకుని బతికే అవకాశమే లేదా?
సెప్టిక్ షాక్ అనేది సెప్సిస్ లక్షణాల వల్ల ఏర్పడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
అసలు సెప్సిస్ అంటే ఏంటి ?
శరీరంలో ఇన్‌ఫెక్షన్ల కారణంగా సెప్సిస్ అనే స్థితి ఏర్పడుతుంది. బయటి నుంచి వచ్చిన వ్యాధికారక క్రిములపై శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి తీవ్రంగా పోరాడేటప్పుడు ఇది ఏర్పడుతుంది.
చిన్నచిన్న గాయాల నుంచి ప్రమాదకరమైన గాయాల వరకు శరీరంలోకి ఏ రూపంలోనైనా ఇన్‌ఫెక్షన్ సోకవచ్చు.
సాధారణంగా శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి బయటి నుంచి వచ్చే ఇన్‌ఫెక్షన్‌లను అడ్డుకుంటుంది.
కానీ ఇన్‌ఫెక్షన్ ఏదో ఒక విధంగా ప్రవేశించి, శరీరమంతా పాకినప్పుడు వ్యాధి నిరోధక వ్యవస్థ భారీ స్థాయిలో దానిపై యుద్ధం మొదలుపెడుతుంది.
ఇది శరీరంపై తీవ్రప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితి సెప్టిక్ షాక్‌కు దారి తీసి, చివరకు అవయవాలు పని చేయడం మానేసి మరణం సంభవిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
హిడెన్ కిల్లర్
హిడెన్ కిల్లర్‌గా పేరున్న ఈ సెప్టిక్ షాక్ ఏర్పడే పరిస్థితులను, దాని లక్షణాలను గుర్తించడానికి నిర్దిష్టమైన పరీక్ష విధానం ఏదీ లేదు.
జ్వరం, కడుపులో, గుండెలో మంటతో మొదలయ్యే దీని లక్షణాలు సెప్టిక్ షాక్‌కు దారి తీస్తాయి. కానీ వీటిని గుర్తించడం కష్టం.
ఈ లక్షణాలు చివరకు శ్వాసలో ఇబ్బందికి, చర్మంలో మార్పులకు కూడా కారణమవుతాయి. శరీరం మీద మచ్చలు, లేదంటే పాలిపోవడంలాంటి లక్షణాలు కనిపిస్తాయి.
సెప్సిస్‌ను గుర్తించడం కష్టం. కానీ రోగికి యాంటి బయాటిక్స్ ఇవ్వడానికి ముందు దీని లక్షణాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
సెప్సిస్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి సోకేది కాదు.

ఫొటో సోర్స్, Getty Images
సెప్సిస్ లక్షణాలు ఎలా ఉంటాయి?
పెద్దవాళ్లలో మాట తడబాటు, వణుకు, కండరాల నొప్పులు, మూత్ర విసర్జన లేకపోవడం, శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిలాంటి లక్షణాలతోపాటు గుండె కొట్టుకునే వేగం పెరగడం, శరీర ఉష్ణోగ్రత పడిపోవడం, శరీరం రంగు మారడం లేదంటే మచ్చలు ఏర్పడటంలాంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇక పిల్లల్లో అయితే రంగు మారడం, శరీరంపై మచ్చలు ఏర్పడటం, మగతలో ఉండటం, అతిగా నిద్రపోవడం, శరీరం విపరీతంగా చల్లబడిపోవడంలాంటి లక్షణాలు కనిపిస్తాయి.
వీటితోపాటు ఈ లక్షణాలున్న పిల్లలు వేగంగా శ్వాస పీలుస్తారు. శరీరాన్ని నొక్కితే ఏర్పడిన మచ్చ మాసిపోదు.
ఒక్కోసారి మూర్ఛ, స్పృహ కోల్పోవడం లాంటి లక్షణాలూ కనిపిస్తాయి.
ఇవి కూడా చదవండి:
- మోదీ సర్కారుకు సిగ్గే లేదు.. ఇప్పటికీ తన తప్పులను ఒప్పుకోవడం లేదు: చిదంబరం విమర్శలు
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- పర్యావరణ ప్రభావ అంచనా చట్టం ముసాయిదాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ 20 లక్షల లేఖలు
- కఫీల్ ఖాన్‌కు బెయిల్.. తక్షణ విడుదలకు అలహాబాద్ హైకోర్టు ఆదేశం
- మోదీ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా, మార్కెట్ పరిస్థితులు ఎందుకు మెరుగుపడట్లేదు?
- భవిష్యత్తులో ఉద్యోగాల పరిస్థితి ఏమిటి? ఏయే రంగాల్లో అవకాశాలు ఉంటాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








