పర్యావరణ ప్రభావ అంచనా చట్టం 2020: ముసాయిదాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ 20 లక్షల లేఖలు

సోలార్ పవర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎన్విరానమెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (ఈఐఏ) ముసాయిదాను వ్యతిరేకిస్తూ దాదాపు 20 లక్షల మంది ప్రభుత్వానికి లేఖలు రాశారు.

1986లో రూపొందించిన పర్యావరణ పరిరక్షణ చట్టానికి ఇటీవల సవరణలు ప్రతిపాదించిన కేంద్రం, పర్యావరణ ప్రభావ అంచనా(ఎన్విరానమెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్) 2020 ముసాయిదాను విడుదల చేసింది.

మౌలిక సదుపాయాలకు సంబంధించిన పెద్ద పెద్ద ప్రాజెక్టుల విషయంలో ప్రజల అభిప్రాయాన్ని, పర్యావరణ ప్రభావాన్ని పట్టించుకోకుండా ఈ ముసాయిదాలో ప్రతిపాదించిన సవరణలు పెట్టుబడిదారులకు లబ్ది చేకూర్చేలా ఉన్నాయని విమర్శకులు అంటున్నారు.

అంతేకాదు, హడావుడిగా లాక్‌డౌన్ సమయంలో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ చట్టం ముసాయిదాను మార్చి 23న వెల్లడి చేయగా ఆ తర్వాత రెండురోజులకు లాక్‌డౌన్ ప్రకటించారు.

ఈ ముసాయిదాపై ప్రజలు తమ అభిప్రాయం తెలిపేందుకు చివరి తేదీ జూన్ 30 అని మొదట ప్రకటించారు. దీనిపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవడంతో, కోర్టులు కూడా కలగజేసుకోవడంతో ఈ గడువును ఆగస్ట్ 11 వరకు పొడిగించారు.

సోలార్ పవర్

ఫొటో సోర్స్, Getty Images

"నిబంధనల ప్రకారం ఇలాంటి ముసాయిదాలపై ప్రజాభిప్రాయ సేకరణకు 60 రోజులు మాత్రమే గడువు ఉంటుంది. అయితే కోవిడ్-19 కారణంగా దానిని 150 రోజులకు పొడిగించామని" పర్యావరణ మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు.

ఈ ముసాయిదా ఇంగ్లిష్, హిందీలలో మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో, మిగతా ప్రధాన భారతీయ భాషలు మాట్లాడేవారికి దీనిపై తమ అభిప్రాయం చెప్పేందుకు అవకాశం లేకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి.

ఈ చట్టంపై అసమ్మతి తెలియ్తజేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. కొత్త సవరణలపై ప్రజల అసమ్మతిని ఈ-మెయిల్స్ ద్వారా సేకరిస్తున్న మూడు పర్యావరణ బృందాల వెబ్‌సైట్లను నిలిపివేశారు.

"మేము అసమ్మతి లేఖలు సేకరిస్తున్నప్పుడు మధ్యలో 26 రోజులు మా వెబ్‌సైట్ డౌన్ అయిపోయింది. చివరికి, ఈ ముసాయిదాకు వ్యతిరేకంగా మేం 3 లక్షల ఈ-మెయిల్స్ సేకరించగలిగాం" అని లెట్ఇండియా బ్రీత్‌కు చెందిన యష్ మార్వా తెలిపారు.

కాలుష్యం

ఫొటో సోర్స్, AFP

1994 నుంచి పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా, పెద్ద పెద్ద ప్రాజెక్టులను ప్రారంభించే ముందు లేదా విస్తరించే ముందు పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

గనుల తవ్వకం, విద్యుత్ కేంద్రాలు, రోడ్లు, పెద్ద పెద్ద రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలు, పరిశ్రమలు వంటి అన్నింటికీ పర్యావరణ అనుమతులు తప్పనిసరి. ప్రపంచ వ్యాప్తంగా 100కు పైగా దేశాలు ఇదే నిబంధనలను పాటిస్తున్నాయి.

2006 నుంచి ఈ చట్టానికి 55 సార్లు సవరణలు చేశారు. "వీటివల్ల ఏర్పడిన గందగోళానికి తెరదించడానికి ఒక కొత్త ముసాయిదాను తీసుకురావాలని నిర్ణయించాం. మేము చట్టాన్ని మార్చలేదు. కానీ గత 15 ఏళ్లల్లో వచ్చిన అన్ని సవరణలనూ పొందుపరుస్తూ, మరింత స్పష్టంగా ఈ ముసాయిదాను తయారుచేశాం" అని జా‌వ్‌డేకర్ తెలిపారు.

అయితే దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణులు భావిస్తున్నారు. ఎన్నో ప్రాజెక్టులు ఇప్పటికే అడ్డదారులు కనుగొన్నాయి అంటున్నారు.

ఉదాహరణకు ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న దారిలో 900 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతుల నుంచి తప్పించుకోవడానికి ఆ ప్రాజెక్టును 100 కిలోమీటర్ల లోపు రహదారి నిర్మాణ ప్రాజెక్టులుగా విభజించారు.

100 కిలోమీటర్లు దాటితేనే పర్యావరణ ప్రభావ అంచనా చట్టం అనుమతి తీసుకోవలసి ఉంటుంది.

అంతేకాదు, పెద్ద పెద్ద ప్రాజెక్టుల విషయంలో శాస్త్రవేత్తల పరిశీలన, ప్రజాభిప్రాయ సేకరణ జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.

పరిశోధకులు కాంచి కోహ్లీ, మంజూ మీనన్ 2009లో పర్యావరణ అనుమతి పత్రాలపై అధ్యయనం చేశారు.

అప్పటివరకూ అనుమతులు మంజూరైన 4 వేల పెద్ద ప్రాజెక్టుల నుంచి 223 శాంపిల్ ప్రాజెక్టులను తీసుకుని వాటి అనుమతి పత్రాలు పరిశీలించారు.

వాటిల్లో బొగ్గు గనులు, డ్యాములు, నీటిపారుదల, పెద్ద పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, టౌన్‌షిప్ ప్రాజెక్టులు లాంటివి ఉన్నాయి.

‘కాలింగ్ ద బ్లఫ్’ అనే శీర్షికతో వచ్చిన వారి అధ్యయనంలో పర్యావరణ అనుమతులు మంజూరు చేస్తూ విధించిన షరతులను 99 శాతం ప్రాజెక్టులు పూర్తి చేయలేదని తేలింది.

ఉదాహరణకు మొక్కలు నాటి, అడవులను పెంచాలి అనే షరతు ఉంటే దానిని పూర్తి చేయకపోవడం.

"షరతులు విధించడమే తప్ప అవి అమలయ్యేలా చూడడం కూడా తమ బాధ్యతేనని ప్రభుత్వం భావించడం లేదు. వాటిని అమలుచేయాలని చెబుతున్నారు అంతే. కానీ ఆ పద్ధతి పనిచేయడం లేదు" అని డాక్టర్ మంజూ మీనన్ అన్నారు.

డాక్టర్ మీనన్, దిల్లీలోని సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్‌లో సీనియర్ ఫెలోగా ఉన్నారు.

ప్రకాశ్ జావడేకర్

ఫొటో సోర్స్, facebook

"అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ…రెండూ సమతౌల్యంలో ఉండాలని" ప్రభుత్వం భావిస్తున్నట్టు మంత్రి చెప్పారు.

2014లో తాను పర్యావరణ మంత్రి పదవి చేపట్టే సమయానికి ఎన్నో రక్షణ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఆగిపోయి ఉన్నాయని, వాటన్నిటి జాబితా తయారుచేసి వారంలోపే అన్నిటికీ అనుమతులు మంజూరు చేశామని జావ్‌డేకర్ తెలిపారు.

పెద్ద పెద్ద ప్రాజెక్టుల విషయంలో ప్రజల నుంటి ఎప్పుడూ అసమ్మతి వస్తుందని ప్రభుత్వం భావిస్తోందని నిపుణులు అంటున్నారు.

కానీ అరుణాచల్ ప్రదేశ్‌లో హైడ్రోపవర్ ప్రాజెక్ట్ విషయంలో 2009, 2015 లలో ప్రజల అభిప్రాయాలను తాను పరిశీలించానని, ఆ ప్రాంతంలో అందరూ ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి సమ్మతించారని మీనన్ చెప్పారు.

అయితే. ఆ ప్రాజెక్టు‌తో పాటు వంతెనలు, పాఠశాలలు కట్టించాలని, ఉపాధి అవకాశాలు కల్పించి. భూ సంస్కరణలు కూడా చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు.

కానీ, ప్రభుత్వం ఆ డిమాండ్లు నెరవేర్చడానికి సుముఖంగా లేదని మీనన్ చెప్పారు.

ప్రస్తుతం 20 లక్షల లేఖలు అందుకున్న తరువాత కూడా ప్రభుత్వం ఈ ముసాయిదా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేదానిపై స్పష్టత లేదు.

"అన్ని అభ్యంతరాలను, సూచనలను పరిగణనలోకి తీసుకుంటున్నామని, అందరి అభిప్రాయాలు పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకుంటామని" జవ్‌దేకర్ తెలిపారు.

అయితే, ఇంతమంది నిక్కచ్చిగా తమ అభిప్రాయాలను తెలపడం శుభపరిణామంఅని పర్యావరణ నిపుణులు అంటున్నారు.

"ఇంతమంది ఈ అంశంపై స్పందించడం చూస్తుంటే పర్యావరణం విషయంలో ప్రజలు ఎంత ఆందోళనతో ఉన్నారో అర్థమవుతోంది. బహుశా ఈ లాక్‌డౌన్ సమయంలో కాలుష్యం తగ్గి, నీలాకాశం కళ్లకు కనిపిస్తుండడం, గాలిలో కాలుష్యం తగ్గడం చూసిన ప్రజలు పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తించారని అనిపిస్తోంది" అంటారు డాక్టర్ మీనన్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)