జీడీపీ పతనంపై చిదంబరం విమర్శలు: ‘మోదీ సర్కారుకు సిగ్గే లేదు.. ఇప్పటికీ తన తప్పులను ఒప్పుకోవడం లేదు’

చిదంబరం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, భరణి ధరణ్
    • హోదా, బీబీసీ, తమిళం

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, జీడీపీ దారుణంగా పడిపోవడానికి ప్రభుత్వ అసమర్థతే కారణమని కేంద్ర మాజీ ఆర్ధికమంత్రి పి.చిదంబరం విమర్శించారు.

వృద్ధిరేటులో క్షీణతపై చిదంబరం ‘బీబీసీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. " ప్రభుత్వాన్ని మేం హెచ్చరిస్తూనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ఆర్థికవేత్తలు కూడా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూనే ఉన్నారు.

మూడు రోజుల కిందట వెలువడిన ఆర్బీఐ వార్షిక నివేదిక ఏం జరగబోతోందో ముందే చెప్పింది'' అని చిదంబరం అన్నారు.

భారతదేశపు వృద్ధిరేటు ఏప్రిల్ నుంచి జూన్‌ మధ్య కాలంలో - 23.9 శాతానికి పడిపోయింది. ఈ గణాంకాలను విడుదల చేసిన నేషనల్‌ స్టాటిస్టికల్ ఆఫీస్‌, కోవిడ్‌ మహమ్మారి, దాని తర్వాత విధించిన లాక్‌డౌన్‌లాంటి పరిణామాలు అప్పటికే మందగమనంలో ఉన్న ఆర్ధిక వ్యవస్థను మరింత కుంగదీశాయని పేర్కొంది.

భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉందన్న విషయం బహుశా ప్రధానమంత్రికి, ఆర్దికమంత్రికి తప్ప అందరికీ తెలుసని చిదంబరం ఎద్దేవా చేశారు.

మోదీ

ఫొటో సోర్స్, Getty Images

"మోదీ సర్కారు నిర్లక్ష్యానికి దేశ ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు. ముఖ్యంగా నిరుపేదలు మరిన్ని సమస్యల్లో కూరుకుపోయారు. ప్రభుత్వం ఇన్నాళ్లూ కథలు చెబుతూ వచ్చింది. అవన్నీ అబద్ధాలని అధికారికంగా నిరూపణైంది'' అని చిదంబరం అన్నారు.

మహమ్మారిని ఎదుర్కోడానికి మోదీ ప్రభుత్వం ప్రకటించిన దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రణాళికల ఫలాలు అందడానికి కొంత సమయం పడుతుంది కదా అన్న మాటను చిదంబరం అంగీకరించలేదు.

"మోదీ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుందని ఏ ఆర్ధికవేత్తా నమ్మడం లేదు. ఆర్బీఐ నివేదిక చూడండి. అది చూశాక కూడా మోదీ ప్రభుత్వం మహమ్మారికి ముందు ఏదో చేసిందని మీరు నమ్మితే దానికి నేనేమీ చేయలేను'' అని చిదంబరం వ్యాఖ్యానించారు.

కేవలం వ్యవసాయం, అటవీ, మత్స్యశాఖల్లో మాత్రమే 3.4 శాతం వృద్ధిరేటు నమోదైందని చిదంబరం అన్నారు.

వ్యవసాయం

ఫొటో సోర్స్, Getty Images

"వ్యవసాయం విషయంలో ప్రభుత్వానికేమీ సంబంధం లేదు. ఏం ఉత్పత్తి అవుతోంది, ఏం అమ్ముతున్నారు, ఏం కొంటున్నారు, ఏది ప్రభావితమవుతోంది అన్నవి ప్రభుత్వ విధానాలు నిర్దేశించాలి. కానీ అదృష్టవశాత్తు వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం వదిలేసింది. రైతులను దేవుడే కాపాడుతున్నాడు.

ఈ ఆర్ధిక సంక్షోభానికి భగవంతుడి చర్యలే కారణమైతే, వ్యవసాయాన్ని రక్షించినందుకు మనం ఆ దేవుడికి కృతజ్జతలు తెలపాలి. ఒక్క వ్యవసాయ రంగం తప్ప అన్నిరంగాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. తయారీ, నిర్మాణ, వ్యాపార, హోటల్‌ రంగాలలో వృద్ధిరేటు 40 నుంచి 50 శాతం వరకు పడిపోయింది '' అని చిదంబరం చెప్పారు.

2020 మొదటి అర్ధభాగంలో ఆర్థిక మందగమనం, 2008నాటి మహా ఆర్ధిక సంక్షోభంకన్నా తీవ్రమైనదన్న ఆర్బీఐ నివేదిక వాస్తవమని చిదంబరం అన్నారు.

శక్తికాంత దాస్

ఫొటో సోర్స్, EPA

"ఆర్బీఐ హెచ్చరిక అక్షరాల వాస్తవం. కానీ చాలా ఆలస్యంగా వెలువడింది. అది మూడు రోజుల కిందటే వచ్చింది. కానీ మేం ఆరు నెలలుగా చెబుతూనే ఉన్నాం. లాక్‌డౌన్‌ పెట్టిన తర్వాత గత మూడు నెలలుగా మేం హెచ్చరిస్తూనే ఉన్నాం. ఆర్బీఐ ఇలాంటి హెచ్చరికలన్నింటినీ కలిపి ఒకేసారి చెప్పింది. రాబోయే రోజుల్లో డిమాండ్‌ సంక్షోభం వస్తుందని మేం చెప్పలేదా? వినియోగం పెరగాలని మేం హెచ్చరించలేదా? పేదలకు డబ్బు పంచాలని మేం సూచించలేదా'' అని ఆయన అన్నారు.

"ఆర్థిక ఉద్దీపనలు, చిన్నతరహా పరిశ్రమలలో ఉపాధికి రక్షణలు, డిమాండ్‌ పెంపు, ఇవన్నీ మేం గతంలో చెప్పినవే. వాటినే ఇప్పుడు సీఈఏ, ఇతర ఆర్థికవేత్తలు వల్లె వేస్తున్నారు. ఆరు నెలల కిందట ఈ మేథావులంతా ఎక్కడికి వెళ్లారు'' అని చిదంబరం ప్రశ్నించారు.

భవిష్యత్తులో భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతుందన్న ప్రశ్నకు ఆయన స్పందించారు.

నిర్మల సీతారామన్

ఫొటో సోర్స్, Getty Images

" స్వల్పకాలంలో వృద్ధిలోకి మళ్లడం సాధ్యంకాదు. దీనికి ఎక్కువకాలం పడుతుందని ఆర్బీఐ చెబుతోంది. అది నిజమే. ఒక పాజిటివ్‌ వృద్ధిరేటు నమోదుకావాలంటే కొన్ని నెలలు పడుతుంది. కానీ ఈ ప్రభుత్వం తన తెలివితక్కువతనంతో మరిన్ని తప్పులు చేసింది. ఈ కారణంగా కోలుకోవడానికి మరింత కాలం పడుతుంది'' అని చిదంబరం వ్యాఖ్యానించారు.

ప్రపంచంలోని పలుదేశాలు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు పరిష్కారం ఏంటన్న ప్రశ్నకు చిదంబరం సమాధానం ఇచ్చారు.

"కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఆర్థిక వ్యవస్థల మీదా ప్రభావం చూపింది. ఇండియాకు అందులో మినహాయింపు లేదు. దీన్నుంచి బయటపడటం ఎలా అన్నదే ప్రశ్న.

ఇందుకు రెండు మార్గాలున్నాయి. ఒకటి, కొన్ని విషయాలు ప్రభుత్వం చేతిలో కూడా ఉండవు. కానీ ప్రభుత్వం ఈ మహమ్మారి మీద తీవ్రగా పోరాడాల్సి ఉంటుంది.

రెండోది, మహమ్మారి ప్రభావం నుంచి బయటపడటానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రత్యామ్నాయాల మీదా దృష్టి పెట్టాలి. కానీ మోదీ సర్కారు అలాంటి పని ఏదీ చేయలేదు.

ఈ పరిణామాలన్నీ ఊహించినవే. కానీ ఈ విషయంలో మోదీ సర్కారు పరువు పోయింది. అది తన లోపాలను అంగీకరించడానికి సిద్ధంగా లేదు'' అన్నారు చిదంబరం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)