చైనాలో ఆస్ట్రేలియా టీవీ యాంకర్ నిర్బంధం - BBC Newsreel

ఫొటో సోర్స్, Getty Images
చైనాలో ఆస్ట్రేలియా పౌరురాలు, ప్రఖ్యాత టీవీ యాంకర్ చెంగ్ లేను నిర్బంధంలోకి తీసుకున్నారు.
బీజింగ్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ చెంగ్ లేను చైనా ప్రభుత్వం నిర్బంధించింది. చెంగ్ లే చైనాలో పుట్టినప్పటికీ ఆస్ట్రేలియా వలస వెళ్లడంతో ఆమెకు అక్కడి పౌరసత్వం లభించింది.
చైనా గ్లోబల్ టెలెవిజన్ నెట్వర్క్ (సీజీటీఎన్) లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న చెంగ్ లే గత నెల అర్థాంతరంగా అదృశ్యమయ్యారు. ఆమె నిర్వహించిన కార్యక్రమాలు సీజీటీఎన్ వెబ్సైట్‌నుంచీ మాయమయ్యాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా కాంటాక్ట్‌లో లేకపోవడంతో వారంతా కలత చెందుతున్నారు.
45 యేళ్ళ చెంగ్ లేను నిఘా పేరుతో చైనా ప్రభుత్వం నిర్బంధించిందని ఆస్ట్రేలియా ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.
ఆస్ట్రేలియా అధికారులు ఆమెతో వీడియో కాల్‌లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అయితే కేసు వివరాలేవీ స్పష్టంగా తెలియలేదని అంటున్నారు.
చైనాలో పుట్టినప్పటికీ ఉద్యోగరీత్యా ఆమె తల్లిదండ్రులు మెల్బోర్‌కు వలస వెళ్లడంతో ఆమె ఆస్ట్రేలియాలోనే చదువు, ఉద్యోగం కొనసాగించారు. చెంగ్ లే కు ఆస్ట్రేలియా పౌరసత్వం లభించింది. 2000లలో ఉద్యోగరీత్యా చైనాకు తిరిగి వచ్చారు.
టీవీ వ్యాఖ్యతగా మంచి పేరు సంపాదించుకున్న చెంగ్ లే అనేకసార్లు అంతర్జాతీయ టీవీ చర్చల్లో చైనాకు మద్దతిచ్చారు. అయినప్పటికీ ఆమెను నిర్బంధంలోకి తీసుకోవడంలో కారణలేమీ అంతుచిక్కట్లేదని పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
అయితే, ఈ అంశం ఆస్ట్రేలియా, చైనాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలను రేకెత్తిస్తుందని భావిస్తున్నారు.
కేసు వెయ్యకుండా నెలల తరబడి నిర్బంధించే వెసులుబాటు ఉన్న చైనా చట్టాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2018లో ఆస్ట్రేలియా ప్రభుత్వం భద్రతా కారణాల రీత్యా హువాయి కంపెనీ 5జీ నెట్వర్క్ టెండర్‌ను రద్దు చేసింది. అప్పటినుంచీ ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
ఆస్ట్రేలియా ఈ ఏప్రిల్‌లో కరోనావైరస్ మహమ్మారికి కారణమయ్యిందంటూ చైనాను వేలెత్తి చూపడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ చెంగ్ లే నిర్బంధం మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది.

ఫొటో సోర్స్, Reuters
మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద కార్టూన్లను మళ్లీ ప్రచురించిన చార్లీ హెబ్డో
మహమ్మద్ ప్రవక్తపై గతంలో ప్రచురించిన వివాదాస్పద కార్టూన్లను ఫ్రెంచ్ మేగజీన్ చార్లీ హెబ్డో వాటిని పునఃప్రచురించింది.
ప్రవక్త బొమ్మలు వేయడం ఇస్లాం మతంలో నిషిద్ధం.
ఇదివరకు 2015లో ఇవే కార్లూన్లను ప్రచురించినపుడు ఆ మేగజీన్ కార్యాలయంపై దాడి జరిగింది.
ఇద్దరు ఇస్లామిస్టు ఆగంతకులు తుపాకులు, ఇతర ఆయుధాలతో చార్లీ హెబ్డో సిబ్బందిపై దాడి చేశారు. ఆ ఘటనలో 12 మంది చనిపోయారు. మృతుల్లో ప్రముఖ కార్టూనిస్టులు కూడా ఉన్నారు.
అప్పట్లో ఈ సంఘటన సంచలనం సృష్టించింది. భావ ప్రకటన స్వేచ్ఛ గురించి తీవ్ర చర్చకు దారితీసింది.
దాడి చేసిన ఆగంతకులు ఆ తర్వాత భద్రతా సిబ్బంది కాల్పుల్లో హతమయ్యారు.
వీరికి సహకరించినట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్న 14 మందిపై బుధవారం నుంచి విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే చార్లీ హెబ్డో ఆ కార్టూన్లను మరోసారి ప్రచురించింది.

ఫొటో సోర్స్, AFP
'మంగోలియన్ భాషా సంస్కృతులను అణచివేస్తున్నారు': చైనాలో నిరసన ర్యాలీలు
మంగోలియన్ భాషపై వేటు వేయడం పట్ల నిరసనలు తెలుపుతూ ఉత్తర చైనాలోని మంగోలియన్లు మొన్న వారాంతంలో ర్యాలీలు నిర్వహించారు.
మంగళవారం నాడు పాఠశాలల్లో కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. అనేకమంది తల్లిదండ్రులు భాషపై ఆంక్షలకు నిరసనగా తమ పిల్లలను స్కూళ్లకు పంపించలేదు.
మంగోలియన్ జాతి ప్రజలు ఎక్కువగా నివసించే ఇన్నర్ మంగోలియాలోని పాఠశాలల్లో మూడు ప్రధాన పాఠ్యాంశాలైన రాజనీతి శాస్త్రం, చరిత్ర, భాష-సాహిత్యాల బోధనను క్రమంగా చైనీస్ భాష మాండరిన్‌లోకి మార్చాలంటూ ఇటీవల కొత్త నిబంధనలు జారీచేశారు.
ఈ నిబంధనలు మంగోలియన్ భాషా, సంస్కృతులకు ముప్పుగా భావిస్తున్నారు స్థానిక మంగోలియన్లు.
అయితే, దేశం మొత్తంగా జాతీయ భాషా బోధనా విధానాన్ని బలోపేతం చేసే దిశలోనే ఈ చర్యలు తీసుకున్నామని అధికారులు అంటున్నారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో ఎటువటి చర్చలూ చేయరాదని ప్రజలను హెచ్చరించారు. దీనిపై పెట్టిన కొన్ని పోస్టులను తొలగించారు.
''మా స్వదేశం మంగోలియా. మా భాష మంగోలియన్. మేము ఎప్పటికీ మంగోలియన్లమే... మా భాషను, సంస్కృతిని అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారు'' అని నిరసనకారులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
1700 పోర్న్ చిత్రాలలో నటించిన రాన్ జెరెమీకి 250 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం
అమెరికాలో ప్రముఖ అడల్ట్ స్టార్ రాన్ జెరెమీ 15 ఏళ్ల బాలికతోపాటు 13మంది మహిళలపై లైంగిక అకృత్యాలకు పాల్పడినట్లు కేసు నమోదైంది.
ఆయన 2004 నుంచి ఈ అకృత్యాలకు పాల్పడుతున్నారని లాస్ ఏంజెలెస్ పోలీసులు వెల్లడించారు.
2014, 2019లో ఆయనపై ఇదే తరహా ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి.
నాలుగు దశాబ్దాలుగా 1700 పైగా పోర్నోగ్రఫీ సినిమాలలో రాన్ నటించారు. ఆ ఆరోపణలు రుజువైతే అతనికి 250 సంవత్సరాల శిక్ష పడుతుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.
అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని రోన్ అంటున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఇద్దరు మహిళలపై అత్యాచారం, మరో ఇద్దరిపై లైంగిక వేధింపులు ఆరోపణలపై జెరెమీ కోర్టుకు హాజరయ్యారు.
తన క్లయింట్‌కు 4,000 మందితో శారీరక సంబంధం ఉందని, మహిళలే ఆయన కోసం పరిగెత్తుకు వస్తారని, అత్యాచారం చేయాల్సిన అవసరం తన క్లయింట్‌కు లేదని కోర్టులో జెరెమీ తరఫు లాయర్ వాదించారు.
జెరెమీ అత్యధిక పోర్న్ చిత్రాలలో కనిపించిన హీరోగా గిన్నిస్ రికార్డ్ కూడా ఉంది.

ఫొటో సోర్స్, Reuters
అల్లర్లలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ట్రంప్ సమర్థన
అమెరికాలో జరుగుతున్న ఘర్షణల్లో పాత్ర ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న తన మద్దతుదారులను వెనకేసుకొచ్చారు ఆ దేశ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్.
గతవారం ఇద్దరిని చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక టీనేజర్, శనివారం ఆరెగాన్ ఘర్షణల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన మద్దతుదారులు అంతా ఆత్మరక్షణలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని ట్రంప్ అన్నారు.
''నా మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఉండడం నిజమే. కానీ, వారిది శాంతియుత ప్రదర్శన. ఆత్మరక్షణలో భాగంగా పెయింట్ పెల్లెట్స్ కాల్చారు. నిజమైన బుల్లెట్లు కావు'' అని విలేకరుల ప్రశ్నకు ట్రంప్ సమాధానం చెప్పారు.
అయితే, ఈ ఘటనలపై విచారణ జరుపుతున్నామన్నారు.
డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, తన రాజకీయ ప్రత్యర్థి జో బైడెన్ ప్రస్తుత పౌర ఘర్షణలకు కారణమని ఆరోపణలున్న అతివాద వామపక్ష యాక్టివిస్టుల ఊసెత్తడంలేదని ట్రంప్ విమర్శించారు.
నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ఒపీనియన్ పోల్స్‌లో ట్రంప్ కంటే జో బైడెన్ ముందున్నారు.

ఫొటో సోర్స్, Reuters
అమెరికాలో 60 లక్షలు దాటిన కోవిడ్ కేసులు
అమెరికాలో కరోనావైరస్ విజృంభణకు ఏమాత్రం అడ్డుకట్టపడడం లేదు. తాజాగా ఆ దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 60 లక్షలు దాటింది.
జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ కోవిడ్ గణాంకాల ప్రకారం గత నెల రోజుల్లోనే అమెరికాలో సుమారు 10 లక్షల కేసులు నమోదయ్యాయి.
ఇప్పటివరకు అక్కడ 1,83,000 మంది కోవిడ్ కారణంగా మరణించారు.
ప్రపంచం మొత్తం మీద నమోదైన కోవిడ్ కేసుల్లో నాలుగో వంతు ఒక్క అమెరికాలోనే ఉన్నట్లు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు చెబుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2.5 కోట్లకుపైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. అన్ని దేశాల్లో కలిపి 8,46,000 మంది ఈ వైరస్ బారి పడి మరణించారు.
అయితే, ప్రపంచవ్యాప్తంగా టెస్టులు అందరికీ జరగకపోవడం.. చాలామందిలో లక్షణాలు కనిపించనప్పటికీ కరోనావైరస్ సోకడం వంటి కారణాల వల్ల వాస్తవ కేసుల సంఖ్య, మరణాలు కూడా ఇంతకంటే చాలా ఎక్కువే ఉండొచ్చన్న అభిప్రాయం ఉంది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
- చలికాలంలో కరోనా మరింత విజృంభిస్తుందా.. ప్రాణనష్టం పెరుగుతుందా
- కరోనావైరస్: ప్రపంచ మహమ్మారి మీద యుద్ధంలో మానవాళి గెలుస్తోందా?
- మోదీ చెప్పినట్లు దేశంలో రోజుకు 10 లక్షల టెస్టులు చేయడం సాధ్యమేనా...
- కరోనావైరస్ ఆదివాసీ తెగలను అంతం చేస్తుందా...
- కరోనావైరస్తో అల్లాడిన వూహాన్ నగరంలో ఇప్పుడు అంబరాన్నంటే సంబరాలు
- ఎక్స్ పొనెన్షియల్ గ్రోత్ బయాస్: కోవిడ్-19 కేసులు లెక్కించడంలో జరుగుతున్న కామన్ తప్పిదం ఇదే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








