EIA డ్రాఫ్ట్-2020: ఇరవై ఊళ్లు కలిసి రెండు కొండలను కాపాడుకున్నాయి.. ఈ పాత కథ ఇప్పుడు ఎందుకంటే

ఫొటో సోర్స్, SARANDASHNAMOORTHY
- రచయిత, ఏడీ బాలసుబ్రమణ్యన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తమిళనాడులో రెండు కొండలను తవ్వేందుకు ఓ మైనింగ్ సంస్థ సిద్ధమైతే, ఇరవై గ్రామాల వాళ్లు ఒక్కటై వాటిని కాపాడుకున్నారు. ప్రభుత్వం నిర్వహించే బహిరంగ విచారణను ఉపయోగించుకుని, ఆ 20 గ్రామాల ప్రజలు కొండల మైనింగ్ ప్రయత్నాన్ని ఆపారు. ఇదంతా 12 ఏళ్ల క్రితం జరిగింది.
మరి ఇప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నాం?
ఆ ఇరవై గ్రామాల వాళ్లు ‘బహిరంగ విచారణ’ అనే ఆయుధాన్ని ఉపయోగించుకున్నారు. కానీ, దాన్ని బలహీనం చేసేలా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన విధాన ముసాయిదా ఉందని పర్యావరణవేత్తలు అంటున్నారు. బహిరంగ విచారణ ప్రాధాన్యం గురించి వాళ్లు ఈ ఇరవై గ్రామాల కేసును ఉదాహరణగా చెబుతున్నారు.
ఇప్పటివరకూ భారత్‌లో అమల్లో ఉన్న ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అస్సెస్‌మెంట్ (ఈఐఏ)-2006 నోటిఫికేషన్ ప్రకారం ఏదైనా పెద్ద ఫ్యాక్టరీ నెలకొల్పాలన్నా, మైనింగ్ కార్యకలాపాలకైనా అనుమతి రావాలంటే బహిరంగ విచారణ తప్పనిసరి.
దీని స్థానంలో ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్‌ను తేవాలనుకుంటోంది. కొన్ని రోజుల క్రితం ఈఐఏ-2020 ముసాయిదాను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ఉన్న కొత్త నిబంధనలతో బహిరంగ విచారణ తప్పనిసరి కాకుండా పోతుందని పర్యావరణవేత్తలు అంటున్నారు. అందుకే ఈ 20 గ్రామాల ప్రస్తావన ఇప్పుడు వచ్చింది.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై కొండకు సమీపంలో కవుతి, వేడియప్పన్ అనే రెండు కొండలున్నాయి. వీటి చుట్టూ రిజర్వు ఫారెస్టు విస్తరించి ఉంది. ఈ అటవీ ప్రాంతంలో పెద్ద మొత్తంలో ఇనుప ఖనిజం ఉంది. జిందాల్ విజయ్‌నగర్ స్టీల్ లిమిటెడ్ దీన్ని తవ్వి తీయాలనుకుంది.
తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, జిందాల్ గ్రూప్ కలిసి తమిళనాడు ఐరన్ ఓర్ మైనింగ్ కార్పొరేషన్ (టీఐఎమ్‌సీఓ) అనే సంస్థను ఏర్పాటు చేసి కవుతిమలై రిజర్వు ఫారెస్టులో మైనింగ్ లీజుకు దరఖాస్తు చేశాయి. 325 హెక్టార్ల రిజర్వు ఫారెస్టు భూమిని లీజుకు ఇవ్వాలని కోరాయి.

ఫొటో సోర్స్, KAVUTHI VEDIYAPPAN PROTECTION ASSN
చుట్టుపక్కల ప్రజలకు దీని గురించి పెద్దగా తెలియదు. ఏదో పరిశ్రమ రాబోతోందని, తమకు మేలు జరుగుతుందని కొందరు అనుకున్నారు. కొంత మంది సామాజిక కార్యకర్తలు ఈ విషయంపై దృష్టి సారించారు.
ఈఐఏ 2006 నోటిఫికేషన్ ప్రకారం ప్రాజెక్టు ప్రతిపాదన రాపిడ్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (ఆర్‌ఈఐఏ)ను కూడా లీజు పొందాలనుకుంటున్నవారు ఫైల్ చేయాల్సి ఉంటుంది.
ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను, ఆర్‌ఈఐఏను స్థానిక సామాజిక కార్యకర్తలు సంపాదించగలిగారు. మైనింగ్‌తో అక్కడి కొండలపై, అడవిపై, స్థానిక ప్రజల ఆరోగ్యంపై పడే ప్రభావాన్ని తెలుసుకోనున్నారు.
ఈ మైనింగ్ కోసం 2.2లక్షల చెట్లు నరికివేయాల్సి వస్తుందని... ఇనుప ఖనిజ ధూళి, సిలికా ధూళి పీల్చుకోవడం వల్ల ఇక్కడివారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆర్‌ఈఐఏ నివేదికలో ఉంది.
దీంతో పర్యావరణవేత్తలు దీనిపై ఉద్యమం మొదలుపెట్టారు. ఆ ప్రాజెక్టు విషయంలో ప్రజల దృక్కోణం కూడా మారింది. వారు కూడా ప్రాజెక్టును వ్యతిరేకించారు.
రోడ్లను అడ్డగిస్తూ పెద్ద ధర్నాలేవీ జరగలేదు. అయితే, తమ వ్యతిరేకతను ఎలా తెలియజేయాలన్నది వారు సరిగ్గా గుర్తించారు.
2008 డిసెంబర్ 27న ఈ ప్రాజెక్టుపై బహిరంగ విచారణ జరిగింది. దీని కోసమే వారంతా వేచిచూస్తున్నారు.
తిరువణ్ణామలైలోని జిల్లా కలెక్టరేట్‌కు వేల మంది గ్రామస్థులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు చేరుకున్నారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో రెండు వందల మంది కూర్చునేందుకు మాత్రమే చోటు ఉంది.
ఓ రిపోర్టర్‌గా ఈ ఉద్యమాన్ని నేను ముందు నుంచి గమనిస్తున్నా. బహిరంగ విచారణ జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్నా.
కార్యకర్తల సాయంతో గ్రామస్థులు ఈ ప్రాజెక్టు గురించి బాగా తెలుసుకున్నారు. ఆ అవగాహనతో ఎలా చెప్పాలి, ఏం చెప్పాలో నిర్ణయించుకున్నారు. ఎవరో చెప్పిన మాటలను పలికే పంజరంలో చిలుకలా కాకూడదనుకున్నారు. అందుకే, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన సమాచారం తెలుసుకున్న తర్వాత, తమ వాదనను ముందుపెట్టారు.

ఫొటో సోర్స్, DR.M.RAJENDRAN
బహిరంగ విచారణ జరగబోయే హాలు కంపెనీ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో నిండిపోయి కనిపిస్తోంది.
కంపెనీ వారు ప్రాజెక్ట్ తరఫున వాదనలు వినిపించడానికి అక్కడికి వచ్చారు. దానిని వ్యతిరేకిస్తున్న గ్రామస్థులు కూడా అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్నారు.
మీటింగ్ మొదలవగానే ఒక అధికారి ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి నిలబడ్డారు. కానీ ఇంగ్లిష్‌లో మాట్లాడ్డం మొదలుపెట్టారు. కలెక్టర్ ఎం.రాజేంద్రన్ ఆయనతో అందరికీ అర్థమయ్యేలా తమిళంలో మాట్లాడాలని చెప్పారు.
ఆయన ప్రాజెక్ట్ గురించి చిన్న పరిచయ వాక్యాలు చెప్పగానే చుట్టుపక్కల నుంచి అభ్యంతరాలు మొదలయ్యాయి. అడ్వొకేట్ పాదూర్ రమేష్ ఈ ప్రాజెక్ట్ స్వాగతించడానికి తగినదే అనగానే, అక్కడున్న వారంతా ఆయనపై గట్టిగా అరవడం మొదలెట్టారు. దాంతో కలెక్టర్ వారిని శాంతపరిచారు.
తిరువణ్ణామలై పట్టణ ప్రజలు, గ్రామస్థులు తమ వాదనలు వినిపించడం మొదలెట్టారు. వారందరూ ఆ ప్రాజెక్టును వ్యతిరేకించారు. కానీ, అందరూ ఒక్కో వాదన వినిపించారు. తమదైన పద్ధతిలో చెప్పారు.
“ఆ కొండలపై 20 గ్రామాల ప్రజలు ఆధారపడుతున్నారు. కొండల నుంచి వచ్చే నీళ్లతోనే మేం వ్యవసాయం చేసుకోవాలి. అవే సరిపోవడం లేదు, మీరు అవి కూడా తవ్వేస్తే, మేమేం చేయాలి? తవ్వకాలతో ఆ మట్టంతా థురింజాలారు నదిలో కలుస్తుంది. గాలి, నేల, నీళ్లు కలుషితమై పశువులు, మనుషులపై ఆ ప్రభావం పడుతుంది. మాకు ఈ ప్రాజెక్ట్ అవసరం లేదు” అని ఇనామ్ కరియందాళ్ గ్రామ మాజీ సర్పంచ్ ఆర్.భద్రాచలం చెప్పారు.

ఫొటో సోర్స్, DIPR/TAMILNADU
కొంతమంది తమ పొలాలు బీళ్లుగా మారిపోతాయని కూడా భయపడ్డారు. ఇప్పుడు ప్రాణాలతో లేని ఒక మహిళ తమ కుటుంబం ఆ కొండలపైనే ఆధారపడి జీవిస్తోందని ఆరోజు చెప్పారు. “ఎవరైనా ఆ కొండలను కూల్చాలనుకుంటే, మొదట నన్ను చంపండి” అన్నారు.
ప్రజా విచారణలో గ్రామస్థులకు ఆస్పత్రి, వారి పిల్లల కోసం స్కూల్ నిర్మిస్తామని కంపెనీ వారు చెప్పారు. కానీ దానికి గ్రామస్థులు “ప్రభుత్వం మాకు స్కూలు, ఆస్పత్రులు ఇస్తోంది. మీరు మాకివ్వాల్సిన అవసరం లేదు. మొదట మీరు మాకు జబ్బులొచ్చేలా చేసి, తర్వాత ఆస్పత్రి కట్టిస్తారా?” అని ప్రశ్నించారు.
గ్రామస్థుల నుంచి వచ్చిన వ్యతిరేకతను చూసి జిల్లా కలెక్టర్ కూడా చాలా ప్రభావితం అయ్యారు.
“నేను మీ అందరి ఆందోళనను నోట్ చేసుకుంటున్నాను. చాలా శ్రద్ధగా కూడా విన్నాను. ఇదంతా వీడియో రికార్డింగ్ కూడా చేశాం. నేను దీనిని కచ్చితంగా ప్రభుత్వం దగ్గరకు పంపిస్తాను. లక్షల చెట్లను నరికేయడం అనేది ప్రభుత్వ విధానాల ప్రకారం లేదు. ఇది ఒక న్యూట్రల్ కన్సర్న్. ఈ కంపెనీ మైనింగ్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. చాలా దశల తర్వాత, అది ఈరోజు ఇక్కడ ప్రజా విచారణ వరకూ వచ్చింది. తమిళనాడు ప్రభుత్వం మీ మాటలు, మీ ఆందోళనలను పక్కనపెట్టి ఎలాంటి ప్రాజెక్టునూ అనుమతించడం జరగదు” అని కలెక్టర్ ఎం.రాజేంద్రన్ ఆ సమయంలో అన్నారు.

ఫొటో సోర్స్, KAVUTHI VEDIYAPPAN HILL PROTECTION ASSN/FB
కలెక్టర్ రాజేంద్రన్ రిపోర్ట్ చూసిన తర్వాత ప్రభుత్వానికి కూడా ప్రజలు ఏం కోరుకుంటున్నారో అర్థమైంది. అయితే సర్కారు అప్పుడు ఎలాంటి తక్షణ నిర్ణయం తీసుకోలేకపోయింది.
కలెక్టర్ రాజేంద్రన్ గ్రామస్థుల వాదనలున్న వీడియో రికార్డింగ్‌ను సిద్ధం చేశారు. దాని ఆధారంగా సుప్రీం కోర్టు సీడీసీని నియమించింది. చివరికి జూన్ 2009లో కొండలపై మైనింగ్ దరఖాస్తును కొట్టివేశారు.
ఆ తర్వాత కంపెనీ 2014లో కొత్తగా మళ్లీ దరఖాస్తు చేసుకుంది. ఈసారీ ఆ కంపెనీ నుంచి 23 హెక్టార్ల రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం కావాలనే డిమాండ్ కూడా వచ్చింది. కానీ ఈసారీ ప్రతిపక్షం దానికి వ్యతిరేకంగా చాలా బలంగా నిలబడింది.
నేను ఎం.రాజేంద్రన్‌తో మాట్లాడాను, ఆయన ప్రస్తుతం తమిళనాడు కోఆపరేటివ్ ఎలక్షన్ కమిషనర్ పదవిలో ఉన్నారు.
నేను ఆయనను దీని గురించి అడిగినపుడు, ఆ ఘటనకు సంబంధించిన విషయాలను ఆయన గుర్తు చేసుకున్నారు. “బహిరంగ సమావేశాలు అన్నిచోట్లా సజావుగా సాగవు” అన్నారు.
“చాలాసార్లు ప్రజలకు ప్రాజెక్టుల గురించి సరిగా తెలీక, వారు చెప్పిన వాటికి అంగీకరించడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎందుకు ఒప్పుకున్నామా అని చింతిస్తారు. అందుకే ఆ మీటింగ్ జరిగినప్పుడు ఆ ప్రాజెక్టు గురించి అక్కడ ప్రతి ఒక్కరికీ తెలిసేలా భరోసా నింపడం చాలా అవసరం అని నాకు అనిపించింది” అని రాజేంద్రన్ చెప్పారు.

ఫొటో సోర్స్, PIYUSH MANUSH/FB
సేలంకు చెందిన కార్యకర్త పీయూష్ సేథియా మొట్టమొదట ఈ రెండు కొండలపై జరిగే మైనింగ్ గురించి అక్కడి ప్రజలకు చెప్పారు. వారిని అప్రమత్తం చేశారు.
ఈఐఏ-2020 ప్రతిపాదిత ముసాయిదాలో 'ప్రజా విచారణ' అవసరం లేదని భావించారని ఆయన చెప్పారు.
2008లో కార్యకర్తలు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్నప్పుడు కంపెనీ తమ వైపు నుంచి చాలా హామీలు ఇచ్చింది. వాటిలో ఎక్కువ అబద్ధాలే ఉన్నాయి.
ఈ ప్రాజెక్టుతో పది వేల ఉద్యోగాలు వస్తాయని కంపెనీ గ్రామస్థులకు చెప్పింది. కానీ కలెక్టర్ ముందు విచారణ జరిగినప్పుడు దీనివల్ల 180 ఉద్యోగాలే వస్తాయని తేలింది.
ఈఐఏ-2020 ముసాయిదా బయటకొచ్చినప్పటి నుంచి ఇది 'బహిరంగ విచారణ' ప్రత్యామ్నాయాన్ని ప్రభావితం చేస్తుందని విశ్లేషణలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ చొరబాట్లకు గట్టిగా జవాబు ఇచ్చే భారత్ చైనాపై మౌనంగా ఎందుకు ఉంటోంది? దెబ్బకు దెబ్బ తీయవచ్చా? అడ్డంకులేంటి?
- రిలయన్స్ జియో 5జీ వస్తోంది.. కానీ భారతీయులు ఎన్నాళ్లు ఎదురు చూడాలి?
- కరోనావైరస్: లాక్డౌన్ తర్వాత వైరస్ బారిన పడకుండా... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్: మాస్కులు ఎక్కువ సేపు ధరిస్తే ఆక్సిజన్ కొరత ఏర్పడుతుందా? శాఖాహారం తింటే వైరస్‌ను అడ్డుకోవచ్చా?
- ఇండియా లాక్డౌన్: వైజాగ్, కోల్‌కతా మినహా దేశమంతా విమాన సర్వీసులు... ప్రయాణంలో పాటించాల్సిన నిబంధనలేంటంటే?
- ఆమె రాసిన ‘వుహాన్ డైరీ’లో ఏముంది? ఆమెను చైనాలో ‘దేశద్రోహి’ అని ఎందుకు అంటున్నారు?
- కరోనావైరస్: యూట్యూబ్‌లో తప్పుదోవ పట్టించే వీడియోలు చూస్తున్న కోట్ల మంది యూజర్లు
- కరోనావైరస్: పుకార్లు, తప్పుడు సమాచారాన్ని వైరల్ చేసే మనుషులు ఏడు రకాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








