ప్రపంచ పర్యావరణ దినోత్సవం: లక్ష కోట్ల చెట్లతో గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను నిర్మూలించవచ్చా?

రెయిన్ ఫారెస్ట్ పై పొగమంచు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మిఖెల్ మార్షల్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం.

అడవులను సంరక్షించడం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతలను పెంచే కార్బన్ డై ఆక్సైడ్‌ తగ్గిపోతుందని, తద్వారా భూమి చల్లబడుతుందనే అభిప్రాయం ఉంది. కానీ, అది అంత సులభమైన పనేమీ కాదు.

పర్యావరణ మార్పుల నుంచి ఈ భూమిని రక్షించడానికి మొక్కలు పెంచడం ఒక్కటే మార్గమనే ప్రచారం ఇటీవల కాలంలో బాగా పెరిగింది.

ప్రపంచ అడవులను కాపాడటానికి వాటికి మరింత భద్రత కల్పించాలని, నరికిన వృక్షాలని తిరిగి నాటాలని సందేశం ఇస్తూ పర్యావరణ పరిరక్షక ప్రచారకురాలు గ్రెటా థన్‌బర్గ్‌ ఒక చిత్రాన్ని కూడా నిర్మించారు.

ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షక ప్రచారకర్తలు పర్యావరణం కోసం రకరకాల ప్రచారాలను నిర్వహిస్తున్నారు.

గత దశాబ్దంలో బ్రిటన్ ప్రభుత్వం కొన్ని కోట్ల మొక్కలు నాటింది. 2016లో భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రోజులోనే 5 కోట్ల మొక్కలు నాటారు. ఇథియోపియా ఒకే రోజులో 35 కోట్ల మొక్కలు నాటినట్లు ప్రకటించుకుంది.

ప్రస్తుతం ఉన్న అడవులని కాపాడుకుంటూ కొత్త వాటిని నాటడం మంచిదే. అయితే, పర్యావరణ పరిరక్షణ కోసం పూర్తిగా మొక్కల మీదే ఆధారపడకూడదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మొక్కలు నాటడం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రస్తుతం గాలిలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్‌ని అత్యుత్తమంగా నిర్మూలించగలిగేవి చెట్లు అని తేలింది

ఈ సంవత్సరం మొదట్లో ఒక పరిశోధనా సంస్థ లక్ష కోట్ల వృక్షాలతో గాలిలో ఉన్న పావు వంతు కార్బన్ డై ఆక్సైడ్‌ని నిర్మూలించవచ్చని చెప్పింది.

వృక్షాలు పర్యావరణ సంరక్షణకు సహకరిస్తాయి. కానీ, వాటంతట అవే వాతావరణ పునర్నిర్మాణానికి సహకరించవంటూ చాలా మంది ఈ వాదన పట్ల విమర్శలు చేశారు.

గతంలో ఎన్నడూ లేనంతగా వాతావరణంలోకి గ్రీన్‌హౌస్ వాయువులు ముఖ్యంగా కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతుండటం వలన వాతావరణంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి.

దీంతో ఐస్ షీట్లు కరగడం, సముద్ర మట్టాలు పెరగడం, హారికేన్లు సంభవించడం, కరువు పెరగడం జరుగుతోంది.

గ్రీన్‌హౌస్ వాయువులని వాతావరణంలోకి విడుదల చేయడం పూర్తిగా ఆపగలగడమే ఒక పరిష్కారం. ఉదాహరణకి ఫాసిల్ (బొగ్గు, గ్యాస్ తరహా) ఇంధనాల వాడకానికి బదులు సోలార్ శక్తి ద్వారా నడిచే పరికరాలు వాడటం ఒక మార్గం.

అడవులని నిర్మూలించడం ద్వారా వాతావరణంలోకి అత్యధిక శాతంలో కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతుంది.

2017లో ప్రపంచ వ్యాప్తంగా 41 బిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అయితే అందులో 4 బిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ అడవుల నిర్మూలన కారణంగా చోటు చేసుకుంది. చెట్లు నరకడం ఆపితే ఏటా విడుదల అయ్యే వ్యర్ధాలలో 10 శాతం తగ్గించవచ్చు

అయితే ఇప్పటికే చాలా వినాశనం జరిగింది. గాలిలోంచి కార్బన్ డై ఆక్సైడ్‌ని నిర్మూలించడానికి సరైన మార్గాలు కనిపెట్టాల్సి ఉంది.

ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలా రకాలైన సాంకేతిక మార్గాలని ప్రతిపాదించారు. కానీ, వృక్షాలు కార్బన్ డై ఆక్సైడ్ గ్రహించడంలో ముఖ్యమైన పాత్రని పోషిస్తాయి.

అయితే కొత్త మొక్కలు నాటడం కానీ, లేదా కొత్తగా అడవులని అభివృద్ధి చేయడం కానీ చేయాలి. చెట్టు సజీవంగా ఉన్నంతవరకు గాలిలో కార్బన్ డై ఆక్సైడ్‌ని అవి పట్టి ఉంచుతాయి. ఇందుకోసం ముఖ్యంగా అమెజాన్ లాంటి అడవులని నాశనం చేయడం ఆపాలి.

ప్రపంచంలో ఇంకా 0.9 బిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో అడవులని పెంచేందుకు అవకాశం ఉందని 2019లో స్విట్జర్లాండ్‌కి చెందిన థామస్ క్రౌథెర్ నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొంది.

ఈ అడవులు అభివృద్ధి చెందితే 752 బిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్‌ని గాలిలోంచి తీసుకోగలవని ఈ అధ్యయనం తెలిపింది.

అయితే, ఈ అధ్యయనం ఇతర పర్యావరణ శాస్త్రజ్ఞుల నుంచి విమర్శలు ఎదుర్కొంది. చెట్లు నిల్వ ఉంచగలిగే కార్బన్ డై ఆక్సైడ్ శాతంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

క్రౌథెర్ విడుదల చేసిన అధ్యయనంలో చెట్లు నాటడానికి అందుబాటులో ఉన్నట్లు చెప్పిన స్థలంలో ఇప్పటికే చెట్లు ఉన్నాయని విమర్శించారు. వీటిని అక్టోబర్ 2019లో ఒక సైన్స్ పత్రిక ప్రచురించింది.

ఇంకా చాలా నిగూఢమైన సమస్యలు ఉన్నాయి. వాతావరణాన్ని చెట్లు అనేక రకాలుగా ప్రభావితం చేస్తాయి. మంచు, గడ్డితో పోల్చి చూస్తే చెట్లు భూమిని దట్టంగా కప్పి ఉంచగలవు. ఎక్కువ చెట్లు నాటితే భూమిని పూర్తిగా కప్పి ఉంచినట్లే. భూమి దట్టమైన నలుపులోకి మారితే వేడిని ఎక్కువగా గ్రహించి ఉష్ణోగ్రతల్ని పెంచుతుంది.

దీని వలన చెట్లు కార్బన్ డై ఆక్సైడ్‌ని గ్రహించి, ఉష్ణోగ్రతల్ని తగ్గించడానికి మధ్య ఒక సమతుల్యత అవసరం. మొక్కలు నాటడం వలన కొన్ని ప్రాంతాలలో మాత్రమే పర్యావరణ పరిరక్షణ తోడ్పడుతుందని చెప్పవచ్చు.

మొక్కలు

ఫొటో సోర్స్, Getty Images

చెట్లు నాటడానికి ఉష్ణ ప్రదేశాలు అనుకూలంగా ఉంటాయి. శీతల ప్రదేశాలలో చెట్లు నాటడం వలన పెద్దగా ఉపయోగం ఉండదని 2007లో నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొంది.

చెట్లు కార్బన్ డై ఆక్సైడ్‌ని గ్రహించడం మాత్రమే కాకుండా కొన్ని ప్రమాదకరమైన వాయువులని గాలిలోకి వదులుతాయి. దట్టమైన అడవుల్లో నడిచేటప్పుడు వాటి వాసన తెలుస్తుందని లీడ్స్ యూనివర్సిటీ కి చెందిన డొమినిక్ స్ప్రాక్ లెన్ అన్నారు.

ఈ వాయువులు ఒకదానితో ఒకటి కలిసి ప్రమాదకరమైన ఏరోసోల్స్‌ని విడుదల చేస్తాయి.

ఇవి గాలిలో పొగ మంచుని తయారు చేస్తాయి. మబ్బుల కోసం ఈ కణాలు విత్తనాలలా ఉపయోగపడతాయని స్ప్రాక్ లెన్ చెప్పారు.

చెట్ల నుంచి విడుదలయ్యే వాయువులు కూడా ఒక్కొక్కసారి గ్రీన్ హౌస్ వాయువులు లాంటి మీథేన్, ఓజోన్ విడుదల అవ్వడానికి కారణం అవుతాయి. ఇది మరొక సమస్యలా పరిణమించవచ్చని అడవులకి, వాతావరణ మార్పులకి మధ్య ఉన్న సంబంధం చాలా సంక్లిష్టతతో కూడినదని, దీనిని అర్ధం చేసుకోవడం కష్టమని ఎక్సటెర్ యూనివర్సిటీకి చెందిన అంగర్ అనే శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు.

ఈ భూమిని కాపాడాలంటే మొక్కలు నాటవద్దంటూ న్యూయార్క్ టైమ్స్‌లో ఆమె ఒక వ్యాసం కూడా రాశారు.

అయితే అంగర్ ప్రతిపాదించిన విధానం ఇతర శాస్త్రవేత్తల నుంచి అనేక విమర్శలు ఎదుర్కొంది .

పరిశ్రమ నుంచి వెలువడుతున్న పొగ

ఫొటో సోర్స్, Getty Images

వాతావరణ సమస్యలు ఎదుర్కోవడానికి చెట్లు ఎంతవరకు ఉపయోగపడతాయి?

సహజ రీతుల్లో వాతావరణాన్ని పరిరక్షించాలంటే వెట్‌ల్యాండ్స్ (చిత్తడి నేలలు)ని సంరక్షించడం, ఇతర పరిరక్షక పద్ధతులని అవలంబించడం, పంట పొలాల నుంచి విడుదలయ్యే వ్యర్ధాలని తగ్గించడం లాంటివి చెయ్యాలని 2017లో నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొంది.

సహజ విధానాలను పాటించడం ద్వారా ప్రతి ఏటా 23.8 బిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్‌ని బంధించి ఉంచుతాయని తెలిపింది.

వాతావరణం విషయంలో అనిశ్చితి అయితే ఉంటుంది. వాతావరణం అనుకోని రీతిలో మార్పులకి లోనవుతూ ఉంటుంది.

దీంతో చెట్లు పెరిగే తీరులో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇది ఎలా అనేది ఇంకా సమాధానం దొరకని ప్రశ్న అని షెఫీల్డ్ యూనివర్సిటీకి చెందిన డేవిడ్ బీర్లింగ్ అన్నారు.

అవి సరైన పోషకాలు లేక ఎదగవా? లేక మంటల్లో చిక్కుకుంటాయా? లేక వాటిని కరువు ఆవరిస్తుందో తెలియదని అన్నారు.

పొడిగా ఉండే ప్రాంతాల్లో మొక్కలు నాటడం వలన నీటి కరువు ఏర్పడుతుందని చైనా పేర్కొంది.

అయితే, ఉష్ణ ప్రాంతాలలో మొక్కలు నాటడం వలన వర్షపాతం పెరిగిందని 2018లో జరిపిన ఒక అధ్యయనం పేర్కొంది.

చెట్లు పెంచడం కేవలం వాతావరణ పరిరక్షణకు మాత్రమే కాకుండా జీవ వైవిధ్య అభివృద్ధికి కూడా దోహదం చేస్తుందని స్ప్రాక్ లెన్ అన్నారు.

వ్యాపార రకాలైన అకాశియా, యూకలిఫ్టస్ చెట్లను పెంచడం వలన జీవ వైవిధ్య అభివృద్ధికి ఎటువంటి సహకారం అందదని ఆయన అన్నారు.

సహజ అడవులని సంరక్షించడమే ఉత్తమమైన మార్గమని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం శాస్త్రీయంగా కన్నా సాంఘిక రాజకీయ అనిశ్చితి నెలకొని ఉంది. అధిక సంఖ్యలో మొక్కలు ప్రజలు ఎక్కడ నాటుతారు? ఎక్కడ పడితే అక్కడ మొక్కలు నాటడానికి స్థలం లేదని స్ప్రాక్ లెన్ అన్నారు.

వెల్ష్ హిల్స్‌లో గొర్రెల పెంపకం ఎక్కువగా జరగడం వలన అక్కడ చెట్లని పెంచే పరిస్థితి లేదని చెప్పారు. అలాగే స్థలాన్ని ఉపయోగించుకోవడంలో కూడా అనేక వివాదాలు నెలకొని ఉన్నాయి.

పర్యావరణాన్ని పరిరక్షించడానికి మొక్కలను సరైన ప్రాంతాల్లో నాటితేనే అవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే దట్టమైన అడవులని మనం నివసిస్తున్న సమాజాల్లో ప్రజలు ఆమోదించే విధంగా ఎలా అభివృద్ధి చేయాలనేది ఇప్పుడు పర్యావరణ పరిరక్షకుల ముందున్న పెద్ద సవాలు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)