తొమ్మిది కోట్ల సంవత్సరాల కిందట డైనోసార్లు తిరిగిన ప్రాంతం ఇదే..

ఫొటో సోర్స్, AWI/JAMES MCKAY
- రచయిత, జొనాథన్ అమోస్
- హోదా, సైన్స్ కరస్పాండెంట్
ప్రస్తుతం పూర్తిగా మంచుతో కప్పుకుని ఉన్నపశ్చిమ అంటార్కిటికా ప్రాంతంలో తొమ్మిది కోట్ల సంవత్సరాల క్రితం (డైనోసార్ల కాలం) పచ్చని అడవి ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందులో డైనోసార్లు కూడా సంచరించి ఉంటాయని అంటున్నారు. ఆ అడవులకు సంబంధించిన శిలాజ అవశేషాలు తమ తవ్వకాలలో బయటపడ్డాయని తెలిపారు.
ప్రస్తుతం యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్లుగా, అంటర్కాటికా ఖండంలో అప్పుడు వేడి వాతావరణం ఉండేదని చెబుతున్నారు. అప్పట్లో సముద్ర మట్టాలు ఇప్పటి కంటే 100 మీటర్ల ఎత్తు ఉండేవని అంటున్నారు.
జర్మనీలోని ఆల్ఫ్రెడ్ వెజెనర్ ఇన్‌స్టిట్యూట్ (ఏడబ్ల్యూఐ) నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలను నేచర్ జర్నల్‌లో ప్రచురించారు.
2017లో పశ్చిమ ఆఫ్రికాలోని పైన్ ఐలాండ్ తీరంలో
ఏడబ్ల్యూఐ, బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే (బీఏఎస్)లతో పాటు మరికొన్ని సంస్థలు కలిసి భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టారు. సముద్రం అడుగున సుమారు 30 మీటర్ల లోతున కొన్ని అవశేషాలు దొరికాయని పరిశోధకులు వెల్లడించారు.
ఆ పదార్థాలను ప్రయోగశాలలో నిశితంగా పరిశీలించగా, పురాతన మట్టి, పుప్పొడి రేణువులు, చెట్ల వేళ్ల ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయని తెలిపారు.

ఫొటో సోర్స్, AWI/T.RONGE
పశ్చిమ అంటార్కిటికాలోని ఈ ప్రాంతం అప్పుడు సమశీతోష్ణ వర్షారణ్యం, చిత్తడి నేలలతో నిండి ఉండేదని, ప్రస్తుతం న్యూజిలాండ్‌లోని సౌత్ ఐలాండ్ అటవీ ప్రాంతం లాంటి పరిస్థితులు ఇక్కడ ఉండేవని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
ఆ అవశేషాలకు సంబంధించి తమ దగ్గర అద్భుతమైన ఎక్స్ రే ఫిలిం కూడా ఉందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ కాస్టన్ గోల్ చెప్పారు.
"డ్రిల్లింగ్ చేసుకుంటూ ఒక ఆధునిక చిత్తడి వాతావరణంలోకి చొచ్చుకెళ్లినట్లు అనిపించింది. అక్కడ వృక్షాల వేళ్లు, మొక్కల అవశేషాలు, పుప్పొడి రేణువులు ఉన్నాయి. అవి ఇప్పటివి కాదు, దాదాపు 9 కోట్ల సంవత్సరాల నుంచి అలా ఉండిపోయాయి. అద్భుతం అనిపించింది" అని కాస్టన్ గోల్ వివరించారు.
అప్పట్లో ఈ ప్రాంతంలో సగటు వార్షిక ఉష్ణోగ్రతలు 15, 16 డిగ్రీల సెల్సియస్, వేసవి కాలంలో 20 డిగ్రీల సెల్సియస్ దాకా ఉండొచ్చని శాస్త్రవేత్తల అంచనా.

ఫొటో సోర్స్, AWI/T.RONGE
భౌగోళిక, వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ప్రాంతంలోని అడవులకు ప్రత్యేక లక్షణాలుండే అవకాశం ఉందని శాస్త్రవేత్త డాక్టర్ జోహన్ క్లేగ్స్ అంటున్నారు.
“ఈ ప్రాంతంలో కొన్ని నెలల పాటు చీకటి ఉంటుంది. కాబట్టి, ఆ చెట్లకు చాలా కాలంపాటు మోడుబారి, తర్వాత మళ్లీ సాధారణ స్థితికి వచ్చే విశిష్ట లక్షణం ఉండి ఉంటుంది. ప్రస్తుతం భూగోళంపై అలాంటి ప్రత్యేక లక్షణాలున్న మొక్కలు లేవు” అని జోహన్ చెప్పారు.
ప్రస్తుతం కొన్ని కిలోమీటర్ల మందం మంచుతో కప్పి ఉండే అంటార్కాటికా ఖండంలో... ఒకప్పుడు వెచ్చని వాతావరణం, పచ్చని అటవీ సంపద ఉండేదంటే, ఊహించడానికే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
“ప్రస్తుతం అంటార్కిటికాలో హిమానీనదాలు కనివిందు చేస్తాయి. కానీ, ఒకప్పుడు ఇక్కడ హిమనీనదాలు లేవన్న విషయం భూగోళ చరిత్రను చూస్తే అర్థమవుతుంది” అని బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే(బీఏఎస్) డైరెక్టర్ ప్రొఫెసర్ జేన్ ఫ్రాన్సిస్ అంటున్నారు.
దక్షిణ ధ్రువానికి అత్యంత సమీపంలో (900 కిలోమీటర్ల దూరంలో) అడవుల ఆనవాళ్లకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టిన తొలి అధ్యయనం ఇదేనని ఆమె చెబుతున్నారు.

ఫొటో సోర్స్, JPKlages/AWI
"అవును, ఆ అడవులలో డైనోసార్‌లు జీవించి ఉండొచ్చు. ఇప్పుడు అంటార్కిటిక్ ద్వీపకల్పం చివరి దాకా వెళ్లి చూస్తే హడ్రోసార్‌లు, సౌరోపాడ్‌లు, డైనోసార్‌లకు సంబంధించిన ఎన్నో శిలాజాలు కనిపిస్తాయి. ప్రపంచంలోని మిగతా ప్రాంతాలలో నివసించిన డైనోసార్లు అన్నీ... చివరకు (క్రెటేషియస్ కాలంలో) అంటార్కిటికాకు చేరుకున్నాయి" అని ప్రొఫెసర్ జేన్ ఫ్రాన్సిస్ వివరించారు.
అప్పట్లో ఇక్కడి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ లాంటి కర్బన వాయువుల స్థాయి, ప్రస్తుతం ఉన్నదాని కంటే మూడు నాలుగు రెట్లు అధికంగా ఉండవచ్చు అని శాస్త్రవేత్తల అంచనా.
ప్రస్తుతం పర్యావరణంలో కార్బన్ డయాక్సైడ్ 400 పీపీఎం ఉందనుకుంటే, అప్పట్లో అది 1,000 పీపీఎం లేదా అంతకంటే ఎక్కువ ఉండేదని, గరిష్ఠంగా 1,600 పీపీఎం దాకా ఉండవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- అమెజాన్ ఆదివాసి తెగ: బ్రెజిల్ ప్రభుత్వంతో పోరాడుతున్న ఈ తెగ జనాభా 120 మాత్రమే
- కొత్త సినిమాలు విడుదలయ్యేదెప్పుడు? షూటింగ్‌లు మళ్లీ మొదలయ్యేదెప్పుడు ?
- అడవిని కాపాడే ఉద్యోగులకు ఆయుధాలెందుకు లేవు
- ఆలయంలో ఉత్సవాలకు ఏనుగులు.. అడ్డు చెబుతున్న జంతు సంరక్షకులు
- పర్యావరణానికి సిమెంటు సమాధి కడుతుందా.. 8 వేల ఏళ్ల కిందటే కాంక్రీటు ఉండేదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








