పర్యావరణ పరిరక్షణ: కొత్తగా అడవులను పెంచటం వల్ల ‘మేలు కన్నా హాని ఎక్కువ’

మొక్కలు నాటుతున్న చిన్నారులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పర్యావరణ పరిరక్షణకు చెట్లు నాటాలని ఇథియోపియా నిర్ణయించింది
    • రచయిత, మ్యాట్ మెక్‌గ్రాత్‌
    • హోదా, బీబీసీ పర్యావరణ ప్రతినిధి

చెట్లు ఎక్కువగా పెంచడం వల్ల పర్యావరణానికి కలిగే లాభంకన్నా నష్టమే ఎక్కువ అంటున్నాయి రెండు పరిశోధనలు. చెట్లు పెంచడానికి ఇచ్చే నగదు ప్రోత్సాహకాలు ఎదురు తంతాయని, ఇలాంటి వాటివల్ల కార్బన్ ఉద్గారాలపై పెద్దగా ప్రభావం ఉండదని ఒక పరిశోధనా పత్రం తేల్చింది.

కొత్తగా నాటే అడవులు పీల్చుకునే కార్బన్‌ వాయువుల గురించి అతిగా ఊహించుకుంటున్నారని మరో పేపర్‌ తేల్చింది. ఈ రెండు పరిశోధనా పత్రాల సారాంశం ఏంటంటే పర్యావరణ పరిరక్షణకు చెట్లు నాటడమొక్కటే పరిష్కారం కాదు.

పర్యావరణంలో కలిగే దుష్పరిణామాలను అడ్డుకోడానికి చెట్లు నాటడమొక్కటే పరిష్కారం అన్న భావన గత కొన్నేళ్లుగా బలహీనపడుతోంది.

చిలీలోని నార్తోఫోగస్‌ అలెస్సాండ్రీ అడవులలో మొక్కలు నాటగా మిగిలిన ప్రాంతం

ఫొటో సోర్స్, CRISTIAN ECHEVERRÍA

ఫొటో క్యాప్షన్, చిలీలోని నార్తోఫోగస్‌ అలెస్సాండ్రీ అడవులలో మొక్కలు నాటగా మిగిలిన ప్రాంతం

కార్బన్‌ వాయువులను పీల్చుకోవడంలో అడవులు కీలకపాత్ర పోషిస్తాయని గతంలో జరిగిన పరిశోధనలు తేల్చాయి. వాటిని నమ్మి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు విస్తారంగా అడవులను పెంచడం ప్రారంభించాయి. మొక్కల పెంపకం మీద అనేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాయి. చెట్లు పెంచితే పర్యావరణంలో దుష్పరిణామాలను ఆపవచ్చని విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాయి.

తాము అధికారంలోకి వస్తే పెద్ద సంఖ్యలో చెట్లు నాటతామని యూకేలో గత ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు హామీలు గుప్పించాయి.

ట్రిలియన్‌ ట్రీస్‌ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా మొక్కల పెంపకంపై ప్రకటన చేశారు దీనికి మద్దతుగా ఒక బిల్లును యూఎస్‌ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. ''బాన్‌ ఛాలెంజ్‌'' అంటూ చెట్లునాటే ఛాలెంజ్‌ కూడా నడిచింది.

2030 కల్లా 350 మిలియన్‌ హెక్టార్లలో నాశనమైన అడవుల ప్రాంతంలో తిరిగి పచ్చదనం తీసుకురావాలని పలు దేశాలు ప్రతిజ్జ చేశాయి. ఇప్పటి వరకు 40 దేశాలు ఈ ప్రతిజ్జను పాటిస్తున్నాయి. కానీ సైంటిస్టులు మాత్రం మొక్కలు నాటడానికి ఉరుకులు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.

ఎర్త్ డే సందర్భంగా శ్వేతసౌధంలో చెట్టు నాటుతున్న డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎర్త్ డే సందర్భంగా శ్వేతసౌధంలో చెట్టు నాటుతున్న డోనల్డ్ ట్రంప్

బాన్‌ ఛాలెంజ్‌ పేరుతో ఇప్పటి వరకు నాటిన మొక్కల్లో 80 శాతం మొక్కలు మోనోకల్చర్‌ మొక్కలని, పండ్లు, రబ్బరులాంటివి ఇందులో ఎక్కువగా ఉన్నాయని తేలింది. ఈ రీసెర్చ్‌ చేసిన పరిశోధకులు ఇందులో ప్రైవేట్‌ మొక్కల పెంపకందార్లకు ఆర్ధికంగా ఇచ్చిన ప్రతిఫలాలపై దృష్టిపెట్టారు.

ఈ చెల్లింపులు మొక్కల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమని తేలింది. ఈ పరిశోధనలో చిలేలో అడవుల పెంపకానికి ఇచ్చే సబ్సిడీలకు సంబంధించి 1974 నుంచి 2012 వరకు విడుదల చేసిన డిక్రీలను పరిశీలించారు. వీటిని చూస్తే ప్రపంచంలో ఇదే అతి పెద్ద అడవుల పెంపకం ప్రాజెక్టు అని అర్ధం చేసుకోవచ్చు.

కొత్తగా అడవులను పెంచడానికి ఈ చట్టం ప్రకారం 75 శాతం రాయితీలు లభిస్తాయి. వాస్తవానికి ఈ పథకం ప్రకారం అప్పటికే ఉన్న అడవులలో చెట్లు నాటకూడదు. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చాలామంది మొక్కల పెంపకందారులు అడవులలోనే లాభదాయకమైన పండ్లను, ఫలాలను ఇచ్చే చెట్లను నాటడం మొదలు పెట్టారు. ఈ స్కీమ్‌ను చెట్లు ఉన్న ప్రాంతాలకు కూడా విస్తరించారు, కానీ స్థానిక అడవులున్న ప్రాంతంలో తగ్గించారు

చిలేలోని అడవులు పెద్ద మొత్తంలో కార్బన్‌ను నిల్వ చేసుకునే సామర్ధ్యం ఉన్నవని, కానీ కొత్తగా చేపట్టిన మొక్కల పెంపకం వల్ల అది తగ్గిపోయి, జీవవైవిధ్యం దెబ్బతిన్నదని ఈ అధ్యయనం నిర్వహించిన పరిశోధకులు అంటున్నారు.

''మొక్కలు పెంచడానికి చేపట్టిన పథకాలు సరిగా రూపొందించక పోయినా, అమలు చేయకపోయినా ఫలితాలు ఇలానే ఉంటాయి. డబ్బులు వృథాకావడంతోపాటు జీవవైవిధ్యం కూడా దెబ్బతింటుంది'' అని ఈ స్టడీ పేపర్‌ సహ రచయిత స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ ఎరిక్‌ లాంబిన్‌ అన్నారు. '' మనం కోరుకున్న దానికన్నా పూర్తిగా భిన్నమైన ఫలితాలు ఇవి '' అని ఆయన అన్నారు.

చిలీలో ఇటీవల నాటిన చెట్లు

ఫొటో సోర్స్, ROBERT HEILMAYR

ఫొటో క్యాప్షన్, చిలీలోని చిలే దీవిలో ఇటీవల పెంచిన తోటలు

ఇక దీనిపై పని చేసిన రెండో పరిశోధనా ప్రాజెక్టు కొత్తగా నాటిన అడవులు ఎంత వరకు కార్బన్‌ వాయువులను పీల్చగలవో పరిశీలించింది. ఇప్పటి వరకు సైంటిస్టులు మొక్కలు ఏ స్థాయిలో కార్బన్‌ వాయువులను పీల్చుకుంటాయో అంచనాలు వేసి ఒక నిర్ణీత నిష్పత్తిని నిర్ణయించారు. అయితే ఈ నిష్పత్తిపై అనుమానాలు వ్యక్తం చేసిన ఈ పరిశోధన, పరిస్థితులను బట్టి ఈ నిష్పత్తి మారుతుందని తేల్చింది.

ఈ సందర్భంగా పరిశోధకులు ఉత్తర చైనాలో ప్రభుత్వం నాటించిన చెట్లతోపాటు, గోబీ ఎడారిలో నాటిన మొక్కలను కూడా పరిశీలించారు. ఈ అడవుల నుంచి 11,000 మట్టి నమూనాలను సేకరించారు. నేలలో కార్బన్‌ లేని ప్రాంతాలలో మొక్కలు పెంచడం వల్ల ఆ ప్రాంతంలో ఆర్గానిక్‌ కార్బన్‌ పెరుగుతుందని గుర్తించారు.

కార్బన్‌ ఎక్కువగా ఉన్న నేలల్లో అడవులను నాటడం వవలన వాటి సాంద్రతలో తగ్గుదల కనిపించింది. మొక్కలు కార్బన్‌ను పీల్చుకునే శాతాల గురించి గతంలో వేసిన అంచనాలు కాస్త అతిశయంగా ఉన్నాయని ఈ పరిశోధకులు తేల్చారు.

''కర్బన ఉద్గారాలను తగ్గించాలనుకుంటే దానికి చెట్లు నాటడమొక్కటే పరిష్కారంకాదని ప్రజలు అర్ధం చేసుకోవాలి'' అని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన కొలరాడో స్టేట్ యూనివర్సిటీ చెందిన డాక్టర్‌ అన్పింగ్‌ చెన్‌ అన్నారు. ''అడవుల పెంపకంలో చాలా సాంకేతిక అంశాలను పరిశీలించవలసి ఉంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా పరిస్థితులు ఉంటాయి. వాటన్నింటినీ సమతుల్యం చేయాలి, ఏదో ఒక విధానమే సమస్యకు పరిష్కారం కాదు'' అన్నారు చెన్‌.

ఈ రెండు పేపర్లు 'నేచర్‌ సస్టెయినబిలిటి' అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

వీడియో క్యాప్షన్, దేశంలో కార్చిచ్చులు పెరుగుతున్నాయి.. కారణమేంటి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)