భారత్, చైనా చర్చలు: వివాదాస్పద ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణకు అంగీకారం

ఫొటో సోర్స్, Getty Images
భారత్, చైనాల మధ్య గల్వాన్ లోయలో తీవ్ర ఘర్షణలు చోటుచేసుకుని రెండు వైపులా సైనికులు మరణించిన తరువాత ఏర్పడిన అత్యంత ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చేందుకు రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.
ఈ దిశగా సోమవారం(జూన్ 22న) మాల్దోలో జరిగిన కమాండర్ స్థాయి చర్చలు సానుకూల, సుహృద్భావ వాతావరణంలో నిర్మాణాత్మకంగా సాగాయని భారత సైనిక వర్గాల సమాచారం.
సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణకు ఈ చర్చల్లో పరస్పర అంగీకారం కుదిరింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
తూర్పు లద్దాఖ్‌లోని అన్ని వివాదాస్పద ప్రాంతాల నుంచి రెండు దేశాల బలగాలు వెనక్కు వెళ్లేలా ఏకాభిప్రాయం కుదిరిందని.. నిర్ణయించుకున్న పద్ధతులను రెండు దేశాల బలగాలు తప్పక పాటించేలా ఈ సమావేశంలో నిర్ణయించారు.
మంగళ, బుధవారాల్లోనూ చర్చలు కొనసాగనున్నట్లు ఆర్మీ వర్గాల సమాచారం.

ఫొటో సోర్స్, Getty Images
ఆ రోజు ఏమైంది?
జూన్ 15-16 తేదీల రాత్రి గల్వాన్ లోయలో జరిగిన తీవ్ర ఘర్షణలో భారత సైనికులు 20 మంది మరణించారు. చైనా కూడా తన సైనికులను కోల్పోయింది.
ఈ ఘటన తరువాత రెండు దేశాల మధ్య దాదాపు యుద్ధ వాతావరణం ఏర్పడింది.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం ఏర్పడడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది.

ఫొటో సోర్స్, Reuters
అయితే, ఈ ఉద్రిక్తతలను చల్లార్చేందుకు రెండు దేశాలూ ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే కమాండర్ స్థాయి చర్చలు మొదలయ్యాయి.
ఈ చర్చలకు ముందు రెండు దేశాల విదేశీ వ్యవహారాల మంత్రులూ ఫోన్‌లో సంభాషించుకున్నారు.

ఫొటో సోర్స్, PIB
ఎందుకీ వివాదం?
ప్రస్తుత వివాదానికి చాలా కారణాలున్నాయి. అయితే వీటి మూలాల్లో మాత్రం వ్యూహాత్మక లక్ష్యాలే కనిపిస్తున్నాయి. మరోవైపు రెండు దేశాలూ ఒకదానిపై మరొకటి ఆరోపణలు చేసుకున్నాయి ఇంతవరకు.
"ప్రశాంతంగా ఉండే గాల్వాన్ నది నేడు హాట్‌స్పాట్‌గా మారింది. ఎందుకంటే ఎల్ఏసీకి సమీపంలో శ్యోక్ నది వెంబడి దౌలత్ బెగ్ ఒల్డీ (డీబీవో) వరకు భారత్ రోడ్డు మార్గం నిర్మిస్తోంది. లద్దాఖ్‌లోని ఎల్ఏసీ వెంబడి అత్యంత మారుమూల, దాడికి అనువైన ప్రాంతమే ఈ డీబీవో" అని సైన్యంలో కల్నల్‌గా పనిచేసిన అజయ్ శుక్లా వివరించారు.
ఇక్కడి మౌలిక సదుపాయాలను పటిష్ఠం చేయాలని భారత్ తీసుకున్న నిర్ణయం చైనాకు ఆగ్రహం తెప్పించినట్లు కనిపిస్తోంది.
"గాల్వాన్ లోయ ప్రాంతం చైనా భూభాగం. అక్కడి సరిహద్దు చాలా స్పష్టంగా ఉన్నాయి" అని చైనా ప్రభుత్వ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ చెప్పింది.
"గాల్వాన్ లోయలోకి భారత్ సైన్యమే అక్రమంగా ప్రవేశించినట్లు చైనా సైన్యం చెబుతోంది. ఎల్ఏసీ వెంబడి పరిస్థితులను భారత్ తారుమారు చేయడంతో చైనాకు ఆగ్రహం వచ్చింది" అని మేధోమథన సంస్థ చెంగ్‌డూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ (సీఐడబ్ల్యూఏ) అధ్యక్షుడు డాక్టర్ లాంగ్ షింగ్‌చున్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి
- జపాన్ ఎందుకంత క్లీన్‌గా ఉంటుంది... ఏమిటా రహస్యం?
- ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్: పర్యావరణానికి ముప్పు తెస్తున్న ఆ ఉత్పత్తుల జాబితా ఇదే
- భారత్, చైనాల మధ్య ఘర్షణ వస్తే రష్యా ఎవరి వైపు ఉంటుంది?
- భారత్, చైనా: ఆసియాలోని రెండు అతిపెద్ద వ్యవస్థలు పోట్లాడుకుంటే ఏం జరుగుతుంది?
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: ఎవరి అండా లేకుండా నింగికెగిసిన తార.. అర్థంతరంగా నేల రాలడానికి కారణాలు ఏమిటి? బాధ్యులు ఎవరు?
- అమెరికా వీసా: హెచ్1బి సహా ఉద్యోగ వీసాలన్నీ 2020 చివరివరకూ బంద్ - ట్రంప్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









