భారత్-చైనా 1962 యుద్ధం: ‘హిందీ-చీనీ భాయీ భాయీ’ వినీ వినీ చెవులు పగిలిపోయాయి.. చైనా యుద్ధ ఖైదీగా ఉన్న భారత సైనికుడి కథ

చైనా సరిహద్దులో భారత సైనికులు
    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

1962 యుద్ధంలో యువ సెకండ్ లెఫ్టినెంట్‌గా పనిచేసి, బ్రిగేడియర్‌గా రిటైరైన అమరజీత్ బహల్ 2012లో బీబీసీతో ఫోన్లో మాట్లాడుతూ వెక్కి వెక్కి ఏడ్చారు.

ఆ సమయంలో భారత-చైనా యుద్ధం గురించి చెప్పిన అమరజీత్ బహల్ “అది లోతైన గాయం లాంటిది. యుద్ధబంధీలు అయ్యామనే బాధ ఉన్నప్పటికీ, చైనా సైనికులకు ఎదురు నిలిచి పోరాడామనే ఆత్మగౌరవం కూడా ఉంది” అన్నారు.

చండీగఢ్ నుంచి బీబీసీతో టెలిఫోన్లో మాట్లాడుతున్నప్పుడు భారత్-చైనా యుద్ధం జరిగి దశాబ్దాలు అవుతున్నా బ్రిగేడియర్ బహల్ మాటల్లో వినిపించిన ఆ దమ్ము, యువ సెకండ్ లెఫ్టినంట్‌గా ఉన్నప్పుడు ఆయనలో ఎంత జోష్ ఉండేదో చెబుతోంది.

యుద్ధంలో పాల్గొనాలని సీనియర్ అధికారులు ఆదేశించడంతో బహల్ సంతోషంతో ఉబ్బిపోయారు. 17 పారాచూట్ ఫీల్డ్ రెజిమెంట్‌, ఆగ్రాలో నియమితులైన ఆయన 1962 సెప్టెంబర్‌ 30న ఆగ్రా నుంచి నెఫాకు బయల్దేరారు.

ఎత్తుపల్లాలపై ప్రయాణించి తేజ్‌పూర్‌లో ఆగిన అప్పటి సెకండ్ లెఫ్టినెంట్ ఏజేఎస్ బహల్ తర్వాత తంగ్ధార్ చేరుకున్నారు. త్వరలో తనకు ఎన్ని కష్టాలు ముంచుకొస్తున్నాయో బహల్ అప్పుడు ఊహించలేకపోయారు.

రిటైర్డ్ బ్రిగేడియర్ అమరజీత్ బహల్
ఫొటో క్యాప్షన్, రిటైర్డ్ బ్రిగేడియర్ అమరజీత్ బహల్

ఆరోజు ఉదయం

అక్టోబర్ 19న చైనా సైనికులు హఠాత్తుగా కాల్పులు ప్రారంభించి, బుల్లెట్ల వర్షం కురిపించిన ఆ ఉదయాన్ని బహల్ ఎప్పుడూ మర్చిపోలేకపోయారు. చైనా వ్యూహం గురించి తెలుసుకోవడంలో భారత్ వెనకబడింది.

అన్ని కాంటాంక్టులు తెగిపోయాయి. కానీ, ఆయన తన 40 మంది జవాన్లతో ముందుకు సాగారు. ఆ రోజు సెకండ్ లెఫ్టినెంట్ ఏజేఎస్ బహల్ ఎంత సాహసం చూపించారంటే, ఎంతోమంది సీనియర్ అధికారుల పుస్తకాల్లో దానికి చోటు లభించింది.

సరిహద్దుల్లో ఉన్న భారత సైనికులకు ఆయుధాలను డకోటా విమానంలో పంపించేవారు. వాటిని సైనికులు ఉన్న ప్రాంతాల్లో వదిలేవారు. కానీ దట్టమైన అడవుల్లో ఆయుధాలు వెతకడం చాలా కష్టమైపోయేది. అప్పుడు సెకండ్ లెఫ్టినెంట్ బహల్, ఆయన జవాన్ల దగ్గర మందుగుండు అంతంతమాత్రంగానే ఉంది.

అక్టోబర్ 19న ఉదయం 4 గంటలకు కాల్పులు మొదలయ్యాయి. 9 గంటల వరకూ కొనసాగాయి. అప్పుడు ఆకాశం బద్దలవుతోందా అన్నట్టు అనిపించిందని బహల్ చెప్పారు.

ఆ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కానీ యుద్ధంలో ప్రతికూల పరిస్థితులకు సిద్ధంగా ఉండే సైనికుడులా సెకండ్ లెఫ్టినెంట్ బహల్ బ్రాందీ పోసి వారి గాయాలకు కట్టుకట్టారు.

బహల్, ఆయన జవాన్లు చైనా దాడికి సమాధానం ఇస్తూనే, ఫైరింగ్ కూడా చేస్తున్నారు. కానీ వారు ఎవరినీ కాంటాక్ట్ చేయలేకపోతున్నారు.

చైనా సరిహద్దులో భారత సైనికులు

ఫొటో సోర్స్, Getty Images

యుద్ధ ఖైదీగా

చివరికి భయపడినంతా జరిగింది. సెకండ్ లెఫ్టినెంట్ బహల్, ఆయన జవాన్ల దగ్గర బుల్లెట్లు అయిపోతున్నాయి. చివరికి వారు కోరుకోకపోయినా యుద్ధబంధీలుగా మారాల్సి వచ్చింది.

అలాంటి దారుణమైన పరిస్థితిని ఏ సైనికుడూ కోరుకోడు. కానీ, చాలామంది భారత అధికారులు, సైనికులు అక్కడనుంచి వెళ్లిపోతున్నా, తన జవాన్లలో ఒక్కరు కూడా వెనకడుగు వేయకపోవడం చూసి గర్వంగా అనిపించిందని బ్రిగేడియర్‌గా రిటైరైన బహల్ చెప్పారు.

బహల్‌ను తుపాకీ బట్‌తో కొట్టిన చైనా సైనికులు ఆయన పిస్టల్ తీసుకున్నారు. ఆయన జవాన్ల దగ్గరున్న ఆయుధాలు కూడా లాక్కున్నారు. నాలుగు రోజుల తర్వాత బహల్, ఆయన సహచరులను షేన్ ఈలో ఉన్న యుద్ధబందీల శిబిరానికి చేర్చారు.

ఆ క్యాంపులో దాదాపు 500 మంది యుద్ధబందీలు ఉండేవారు. ఆ సమయంలో సెకండ్ లెఫ్టినెంట్‌గా ఉన్న బహల్ “అక్కడ మేం కెప్టెన్, లెఫ్టినెంట్‌ అందరితో కలిసి ఉన్నాం. మేం తినే చోట ఉన్న మా జవాన్లతో మాట్లాడగలిగేవాళ్లం. ఎందుకంటే మాకోసం అక్కడే వంట చేసేవారు. కానీ మేజర్, లెఫ్టినెంట్ కల్నల్‌ను విడిగా ఉంచేవారు. వారిని బయటికి రానిచ్చేవారు కాదు. మేజర్ జాన్ డాల్వీ ఎక్కడో దూరంగా ఉండేవారు. ఆయన జీవితం చాలా కష్టంగా ఉండేది“ అన్నారు..

భారత జవాన్లు వంటగదిలో ఉండడం బహల్‌కు కలిసొచ్చింది. ఆయనకు ఉదయాన్నే లైట్ బ్లాక్ టీ ఇచ్చేవారు. కానీ మధ్యాహ్నం, రాత్రి ఎప్పుడూ రోటీ, అన్నం, ముల్లంగి కూర మాత్రమే ఉండేది.

ఒకవైపు అక్కడ కష్టాలు, కొట్టడం, ఖైదీ లాంటి పరిస్థితి ఉంటే, మరోవైపు ఆ క్యాంప్ అంతా “హిందీ-చీనీ భాయీ భాయీ అనే పాట మార్మోగుతూ ఉండేది. ఒకప్పుడు భారత్, చైనా స్నేహానికి గుర్తుగా ఉన్న ఆ పాటను ఆ సమయంలో వినడం బహల్‌కు ఇబ్బందిగా అనిపించింది.

“చుట్టూ హిందీ-చీనీ భాయీ భాయీ అనే పాట మార్మోగుతుండేది. ఆ పాట ఎప్పటిలాగే పెట్టేవారు. అది విని విని మా చెవులు పగిలిపోయాయి. ఎందుకంటే చైనాతో బంధాలు మెరుగుపడడం లేదు” అని ఆయన చెప్పారు.

యుద్ధబందీలుగా ఉన్న సైనికులతో చాలా కఠినంగా వ్యవహరించేవారు. కొట్టడం కూడా జరిగేది. బ్రిగేడియర్ బహల్, ఆయన జవాన్లకు కూడా అలాగే జరిగింది. కానీ. అప్పట్లో ఆయన యువకుడు, దాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు.

చైనా సైనికాధికారులు అనువాదకుల సాయంతో భారత యుద్ధబంధీలతో మాట్లాడేవారు. భారత్‌ అమెరికా కీలుబొమ్మ అని చూపించడానికి ప్రయత్నించేవారు. ఆ విషయం అంగీకరించాలని ఒత్తిడి చేసేవారు.

యుద్ధబందీలుగా ఉన్నప్పుడు ఆ జైలు నుంచి తప్పించుకోడానికి ప్రయత్నంచడం అనేది సైనికుడి విధి. బహల్ మనసులో కూడా అదే ప్లాన్ ఉంది. అందుకే, జైలు నుంచి పారిపోయాక పనికొస్తాయని, బహల్, ఆయన ఇద్దరు జవాన్లు అనారోగ్యం సాకుతో మందులు సేకరించేవారు.

వారు తప్పించుకోడానకి తగిన పరిస్థితి వచ్చేవరకూ ఎదురుచూశారు, కానీ ఆలోపే విడుదలయ్యారు.

చైనా సరిహద్దులో భారత సైనికులు

ఫొటో సోర్స్, Getty Images

కుటుంబాన్ని చేరుకున్నారు

“మమ్మల్ని విడుదల చేస్తామని ప్రకటించినప్పుడు, సంతోషంగా అనిపించింది. అప్పుడు సమయం భారంగా నడిచినట్టు అనిపించింది. 20 రోజులు 20 నెలలుగా అనిపించింది. తర్వాత మమ్మల్ని గుమ్లాలో వదిలేశారు. మేం భారతమాతను ముద్దాడి, ‘మాతృభూమి దైవం లాంటి, భారత భూమి మనది’ అని గట్టిగా నినాదాలు చేశాం” అని బహల్ చెప్పారు.

చైనా శిబిరంలో ఉన్న సమయంలో తాము యుద్ధబందీలుగా ఉన్నామని రెడ్‌క్రాస్ దగ్గర వారు తమ బంధువులకు సమాచారం పంపించారు.

అయితే, అప్పటికే “సెకండ్ లెఫ్టినెంట్ బహల్ కనిపించడం లేదు, ఆయన చనిపోయుంటారని భావిస్తున్నాం” అని ఆర్మీ హెడ్ క్వార్టర్ నుంచి ఆయన ఇంటికి టెలిగ్రామ్ వెళ్లింది.

బహల్ అది చెబుతూ చాలా భావోద్వేగానికి గురై, ఏడ్చేసారు. “స్వదేశానికి తిరిగి రావడంలో ఉన్న సంతోషాన్ని బహుశా, ఒక యుద్ధబందీ మాత్రమే అర్థం చేసుకోగలడు” అన్నారు.

ఒక సైనికుడి కథ

ఫొటో సోర్స్, Getty Images

అమృతం లాంటి టీ

ఏడు నెలల తర్వాత అమరజీత్ బహల్ చైనా యుద్ధబందీల శిబిరం నుంచి స్వదేశానికి బయల్దేరారు.

“భారత్ రాగానే నాకు ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన టీ ఇచ్చారు. ఆ టీలో పాలు, చక్కెర కూడా ఉన్నాయి. ఆ టీ అమృతంలా అనిపించాయి” అని బహల్ చెప్పారు.

ఆ తర్వాత బహల్, ఆయన జవాన్లను డీ-బ్రీఫింగ్(యుద్ధబందీలుగా ఉన్న సైనికులను లోతుగా విచారిస్తారు)కోసం రాంచీ పంపించారు.

అక్కడ బహల్‌ను మూడు రోజులు ఉంచారు. కానీ, ఆ తర్వాత ఆయనకు ఆల్ క్లియల్ ఇచ్చారు. ఆ తర్వాత సెలవుపై వెళ్లిన బహల్, మళ్లీ తన రెజిమెంట్‌లోకి వచ్చారు.

రిటైర్డ్ బ్రిగేడియర్ బహల్ యుద్ధబందీ అయినందుకు బాధపడలేదు. కానీ ఆ సమయంలో తనకు తీపి, చేదు అనుభవాలు ఎదురయ్యాయని ఆయన చెప్పారు.

ఇందులో తీపి అనుభవం “ఒక యువ అధికారిగా నేను యుద్ధంలో పాల్గొన్నాను, గాయపడ్డాను, యుద్ధబందీ కూడా అయ్యాను. నేను బందీ కాకుండా ఉంటే, మరో యుద్ధం కూడా చేసుండేవాడిని. ఇది నా చేదు అనుభవం” అన్నారు బహల్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)