భారత్ - చైనా ఉద్రిక్తతలు: కష్టకాలంలో భారత్‌కు అమెరికా అండగా ఉంటుందా లేక ముఖం చాటేస్తుందా?

ఫొటో సోర్స్, getty images
శత్రువుకు శత్రువు మిత్రుడు అని పాత నానుడి ఒకటుంది. అయితే భారత్, చైనా, అమెరికా విషయంలో ఇది ఎప్పుడూ సరిగా అతకట్లేదు. భారత్, చైనాల మధ్య వైరముంది. చెప్పాలంటే.. నేడు అది పతాక స్థాయికి చేరింది.
మరోవైపు అమెరికా, చైనాల మధ్యా వైరముంది. అది కూడా నేడు పతాక స్థాయికి చేరింది. అయితే భారత్, అమెరికాల మధ్య అలాంటి శత్రుత్వమేదీ లేదు. మరి చైనాతో పోరాటంలో భారత్‌కు అండగా అమెరికా నిలుస్తుందా?
భారత్‌కు అమెరికా ఎలాంటి మిత్రదేశం? చరిత్ర తిరగదోడినా లేక ప్రస్తుత పరిస్థితిని గమనించినా.. క్లిష్ట సమయాల్లో భారత్‌కు అమెరికా నుంచి అంత భరోసా ఏమీ దక్కలేదనే తెలుస్తోంది.
చైనాతో సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు చనిపోయారు. చైనా వల్లే ఘర్షణలు జరిగాయని భారత్ చెబుతోంది. ఇక్కడ అమెరికా స్పందన గమనిస్తే, చైనాకు ఇబ్బంది పెట్టేదిగాలేదు. మరోవైపు భారత్‌కు సంతృప్తి పరిచేదిగానూ లేదు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితి నడుమ హెచ్1బీ వీసాల వ్యవస్థను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ రద్దుచేశారు. ఈ నిర్ణయంతో భారతీయులపైనే ఎక్కువ ప్రభావం పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మరోవైపు గ్రీన్‌కార్డు, విదేశీయులకు ఇచ్చే హెచ్1బీ ఉద్యోగ అనుమతులపై విధించిన ఆంక్షలను ఈ ఏడాది చివరి వరకు ట్రంప్ పొడిగించారు. ఈ నిర్ణయాలతో భారతీయులపై నేరుగా ప్రభావం పడుతుందని గణాంకాలు సూచిస్తున్నాయి.
అమెరికా పౌరసత్వం, వలసల సేవల విభాగం సమాచారం ప్రకారం.. 5, అక్టోబరు 2018 నాటికి 3,09,986 మంది భారతీయులు వీసాల కోసం దరఖాస్తు చేశారు. ప్రపంచంలో మరే దేశం నుంచీ ఈ స్థాయిలో దరఖాస్తులు రాలేదు. భారత్ తర్వాతి స్థానంలో 47,172 దరఖాస్తులతో చైనా ఉంది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆప్త మిత్రులుగా ఒకరినొకరు చెప్పుకొంటున్నప్పుడు.. ఇలాంటి వైరుధ్యమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
"ఈ నిర్ణయాన్ని భారత్‌కు వ్యతిరేకంగా కంటే.. అమెరికాకు అనుకూలంగా చూడాలి. నవంబరులో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. మరోవైపు కరోనా ప్రభావంతో అమెరికాలో నిరుద్యోగ రేటు కూడా విపరీతంగా పెరిగింది. దీంతో నిరుద్యోగంపై ట్రంప్ దృష్టి సారించాల్సిన పరిస్థితి వచ్చింది. తాజా నిర్ణయం ట్రంప్ ఎన్నికల వ్యూహంలో భాగంగానే తీసుకున్నట్లు కనిపిస్తోంది."అని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని అమెరికన్, కెనడియన్, లాటిన్ అమెరికన్ స్టడీ సెంటర్ ప్రొఫెసర్ చింతామణి మహాపాత్ర వ్యాఖ్యానించారు.
తాజా నిర్ణయం రెండు దేశాల సామాజిక బంధాలపై ప్రభావం చూపుతుందని మహాపాత్ర వివరించారు. అయితే దీన్ని మిత్రుత్వం-శత్రుత్వం కోణంలో చూడకూడదని అన్నారు.
భారత్-చైనా సరిహద్దు వివాదం
ట్రంప్ తాజా నిర్ణయం తీసుకొనేందుకు కొన్ని రోజుల ముందు.. భారత్-చైనా సరిహద్దుల్లో రెండు దేశాల సైనికులు ఘర్షణలకు దిగారు. సరిగ్గా నాలుగు రోజుల తర్వాత ఈ అంశంపై అమెరికా అధికారికంగా స్పందించింది.
ఘర్షణల్లో అమరులైన జవాన్లకు జూన్ 19న అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో సంతాపం ప్రకటించారు. "చైనాతో జరిగిన ఘర్షణల్లో మరణించిన భారత సైనికులకు మేం నివాళులు అర్పిస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో అమరులైన జవాన్ల కుటుంబాలకు సంఘీభావం ప్రకటిస్తున్నాం." అని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు ట్రంప్ స్పందన కూడా ఆశించిన స్థాయిలో లేదు. "ఇది చాలా సంక్లిష్ట సమయం. భారత్ ప్రతినిధులతో మేం మాట్లాడుతున్నాం. చైనా ప్రతినిధులతోనూ చర్చిస్తున్నాం. ఆ రెండు దేశాల మధ్య పెద్ద సమస్యే ఉంది. పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నాం. వివాద పరిష్కారంలో సాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నాం"అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్-పాకిస్తాన్ వివాదాల పరిష్కారానికి సాయం అందిస్తామంటూ ఎప్పుడూ ట్రంప్ చెబుతుంటారు. దీన్ని భారత్ తిరస్కరిస్తూ వస్తోంది. చైనాతో తాజా వివాదంలోనూ ఆయన అదే విధంగా స్పందించారు.
చైనాతో వాణిజ్య యుద్ధం నడుస్తున్నప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో మోహరించిన తమ సైనిక బలగాలను వెనక్కి తీసుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్లు మహాపాత్ర వివరించారు. చైనాతో ఆర్థిక బంధాలు అమెరికాకు అనివార్యమని ఆయన అన్నారు.
"పరిస్థితులు మరింత దిగజారినా.. అమెరికా అన్నింటినీ పక్కనపెట్టి సాయం చేయడానికి ముందుకురాదని భారత్‌కు తెలుసు. అయితే చైనాను అమెరికా శత్రువుగా చూస్తుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు చైనాకు అర్థమయ్యేలా చెబుతోంది కూడా.. "అని మహాపాత్ర వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
1962లో భారత్‌కు అమెరికా సాయం అందించింది. ఆనాడు అమెరికా ముందు చైనా పరిస్థితి అంతంతే. అయితే భారత్‌పై చైనా దాడిచేసినప్పుడే.. అమెరికాపై క్యూబా క్షిపణి సంక్షోభం వచ్చిపడింది.
క్యూబాలో సోవియట్ యూనియన్ క్షిపణులను మోహరించింది. దీంతో అణు యుద్ధం జరగబోతుందనే ఆందోళనలు మరింత పెరిగాయి. మరోవైపు సాయం చేయాలంటూ అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీకి అప్పటి భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ వరుస లేఖలు రాశారు.
నెహ్రూ అభ్యర్థనపై సాయం చేసేందుకు కెనడీ అంగీకరించారు. అయితే ఆ సాయం అందేలోపే చైనా తమ సేనలను వెనక్కి తీసుకుంది. ఆ సమయంలో అమెరికా చేసేందుకు ఏమీ లేకుండా పోయింది.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాకు భారత్ సాయం
భారత్ సాయాన్ని అమెరికా కోరినప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అయితే అమెరికా బెదిరించి, పని పూర్తిచేయించుకుంది. హైడ్రాక్సీక్లోరోక్విన్ దీనికి ఉదాహరణ. ఈ ఔషధం కోసం భారత్‌ను అమెరికా అభ్యర్థించింది. ఈ విషయంపై తన మిత్రుడు మోదీతో మాట్లాడానని ట్రంప్ కూడా చెప్పారు.
హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను భారత్ పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేస్తోంది. అయితే కరోనావైరస్ ఆందోళనల నడుమ ఈ ఔషధం ఎగుమతి చేయకుండా భారత్ నిషేధం విధించింది. అయితే ట్రంప్ కోరిన అనంతరం ఎగుమతులపై నిషేధాన్ని భారత్ ఎత్తివేసింది.
అమెరికా మిత్ర దేశమో కాదో చెప్పడం అంత కష్టమా?
వ్యూహాత్మకంగా భారత్-అమెరికా రెండు దశాబ్దాల నుంచీ మిత్రదేశాలని మహాపాత్ర వివరించారు. అయితే ఆర్థిక అంశాలు, ఇతర సామాజిక బంధాల్లో రెండు దేశాలూ భిన్న మార్గాల్లో నడుస్తున్నాయని చెప్పారు.
"ట్రంప్ ఎవరినీ మిత్రుడు లేదా శత్రువుగా చూడడు. తమకు చేకూరే ప్రయోజనాల కోణంలోనే అందరినీ అమెరికా చూస్తుంది."
అంతర్జాతీయ సంబంధాల్లో మిత్రులు, శత్రువులు అంటూ ఎవరూ ఉండరని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టడీస్ డైరెక్టర్ హర్ష్ పంత్ కూడా వ్యాఖ్యానించారు. "రెండు దేశాల ప్రయోజనాల మధ్య ఘర్షణ వస్తే.. మూడో దేశం పెద్దగా చేసేదేమీ ఉండదు. అమెరికా-భారత్ ద్వైపాక్షిక బంధాలు భాగస్వామ్యం కంటే ఎక్కువ. సంకీర్ణం కంటే తక్కువ. అందుకే ఒక దేశం అంతర్గత అంశాల్లో మరో దేశం తలదూర్చకూడదు."

ఫొటో సోర్స్, EPA
కశ్మీర్‌పై ట్రంప్ ఆసక్తి
గత ఏడాది ఆగస్టులో కశ్మీర్‌పై ట్రంప్ స్పందించారు. "కశ్మీర్ వివాదాస్పద ప్రాంతం. అక్కడ ముస్లింలతోపాటు హిందువులూ ఉన్నారు. వారు కలిసి జీవించగలరని నేను చెప్పలేను. నేను చేయగలిగేది ఏదైనా ఉందంటే.. అది మధ్యవర్తిత్వమే."అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై స్పందిస్తూ ట్రంప్ ఆ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ వివాదంలో తృతీయ పక్ష జోక్యాన్ని భారత్ అంగీకరించదని తెలిసి కూడా.. మధ్య వర్తిత్వం వహించేందుకు తాము సిద్ధమని ట్రంప్ ప్రకటించారు.
ఆయన వ్యాఖ్యలు అమెరికా విధాన నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. కశ్మీర్ వివాదం.. భారత్-పాకిస్తాన్ ద్వైపాక్షిక బంధాలకు సంబంధించిన అంశమని అమెరికా భావిస్తోంది. ఈ విషయంలో భారత్ దృక్కోణాన్నీ అమెరికా పరిగణలోకి తీసుకుంటోంది.

ఫొటో సోర్స్, AFP
భారత్‌పై అమెరికా-ఇరాన్ బంధాల ప్రభావం
అమెరికా, ఇరాన్‌ల మధ్య శత్రుత్వం జగమెరిగిన సత్యం. ఇది గతంలో భారత్‌పైనా ప్రభావం చూపింది.
జులై 2015లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాలు, ఇరాన్ మధ్య అణు ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం ఇరాన్‌పై విధించిన ఆంక్షలను అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎత్తివేశారు. అయితే మే, 2018లో ఇరాన్‌పై మరింత ఒత్తిడిని పెంచేందుకు ఈ ఒప్పందాన్ని ట్రంప్ రద్దుచేశారు.
2018లో ఇరాన్‌తో ద్వైపాక్షిక బంధాలను సమీక్షించాలని భారత్‌ను అమెరికా కోరింది. మరోవైపు ఇరాన్ నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని సూచించింది. ఆ సమయంలో ఇరాన్‌కు భారత్ చైనా తర్వాత రెండో అతిపెద్ద చమురు దిగుమతిదారు. భారత్ చమురు దిగుమతుల్లో ఇరాన్ చమురు వాటా పది శాతం వరకూ ఉండేది. ఇరాన్‌తోపాటు ఇరాక్, సౌదీ అరేబియా నుంచీ భారత్ చమురు కొనుగోలు చేసేది.
అయితే, ఇరాన్ నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోకుండా అమెరికా కళ్లెం వేయగలిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్ అహ్మదాబాద్ పర్యటనకు ముందుగా ఇది జరిగింది. దీంతో మోదీ ప్రభుత్వానికి కాంగ్రెస్ వరుస ప్రశ్నలు సంధించింది. ఇరాన్ నుంచి తక్కువ ధరకు వచ్చే చమురు దిగుమతులపై నిషేధం విధించడంతో మార్కెట్‌లో ధరలు పెరిగాయని విమర్శించింది. ఈ అంశాన్ని ఒక్క భారత్ కోణంలోనే చూడటం సరికాదని, అమెరికా నిర్ణయం దాదాపు అన్ని దేశాల మీదా ప్రభావం చూపిందని హర్ష్ పంత్ వివరించారు. చాబహార్ నౌకాశ్రయంపై అమెరికా ఎలాంటి ఆంక్షలు విధించలేదని ఆయన గుర్తుచేశారు. ఇదంతా అమెరికా-ఇరాన్ దైపాక్షిక బంధాలకు సంబంధించిన అంశమని, దీనిలో భారత్‌తో శత్రుత్వం లేదా మిత్రుత్వం లాంటివేమీ లేవని ఆయన అన్నారు.
హర్ష్ పంత్ విశ్లేషణను చింతామణి కూడా అంగీకరించారు. ఇరాన్‌పై ఆంక్షలను ఇజ్రాయెల్ తప్పితే అన్ని దేశాలూ వ్యతిరేఖించాయని ఆయన చెప్పారు. భారత్‌పై ప్రతికూల ప్రభావం పడింది అనేది పూర్తిగా వేరే విషయమని ఆయన వివరించారు.
చమురు విషయంలో.. సరైన రవాణా మార్గాలు లేకపోవడం వల్లే భారత్ ఎక్కువ నష్టపోయిందని హర్ష్ పంత్ అభిప్రాయం వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, getty images
భారత్-అమెరికా వాణిజ్య బంధాలు
భారత్ నుంచి.. జనరల్ ప్రిఫరెన్స్ సిస్టమ్ (జీఎస్‌పీ) కింద ఎలాంటి సుంకం లేకుండా వస్తువుల దిగుమతి సదుపాయాన్ని 5 జూన్ 2019న అమెరికా నిలిపివేసింది. దీంతో వజ్రాలు, ఆభరణాలు, బియ్యం తదితర భారత ఎగుమతులపై 5.6 బిలియన్ డాలర్ల వరకూ ప్రభావం పడింది.
2019లో అయితే భారత్ నుంచి అమెరికాకు వచ్చే ఉత్పత్తులపై పది శాతం అదనంగా సుంకం విధించడం అమెరికా మొదలుపెట్టింది.
1976 నుంచి జీఎస్‌పీని అమెరికా అమలు చేస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రాధాన్యమిస్తూ అమెరికాతో భారత్ సహా 120 దేశాలు దీన్ని కుదుర్చుకున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాధాన్యమివ్వడంతోపాటు అమెరికా తక్కువ ధరకే వస్తువులను దిగుమతి చేసుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది.

2018లో జీఎస్‌పీ నుంచి అత్యధిక ప్రయోజనాలు పొందిన దేశంగా భారత్ నిలిచింది. దాదాపు 630 మిలియన్ డాలర్ల విలువైన సరకులను ఎలాంటి సుంకం లేకుండా అమెరికాకు భారత్ ఎగుమతి చేసింది.
అయితే తమ సంస్థలకు భారత్‌లో తగిన ప్రాధాన్యం లభించడం లేదని, భారత్ మార్కెట్లు తమకు సరిగా అందుబాటులో ఉండటంలేదని చెబుతూ జీఎస్‌పీని ట్రంప్ రద్దుచేశారు.
ముఖ్యంగా వైద్య పరికరాలు, డెయిరీ ఉత్పత్తులు భారత్ మార్కెట్‌లలో విక్రయించేందుకు అనుమతించడంలేదని ఆయన చెబుతున్నారు. జీఎస్‌పీపై పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ప్రయోజనమూ లభించలేదు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ట్రంప్ ఓ బిజినెస్ మ్యాన్‌లా చూస్తున్నారని చింతామణి అభిప్రాయపడ్డారు. "చర్చల్లో చాలా గట్టివాడిగా ఆయన్ను ఆయన చెప్పుకొంటుంటారు. భారత్‌పాటు కెనడా, చైనా, ఇతర ఐరోపా దేశాల చర్చల్లోనూ ఆయన ఇలానే వ్యవహరిస్తారు."
"ఆయన ప్రపంచంలోని అన్ని దేశాలతోనూ కఠినంగానే వ్యవహరిస్తున్నారు. అమెరికాలోని రాష్ట్రాలతో కూడా. ఆయన వాణిజ్య, ఆర్థిక విధానాలపై ఎప్పటికప్పుడు విమర్శలు వస్తుంటాయి. అహ్మదాబాద్‌కు మోదీతో కలిసి ఆయన వెళ్లినప్పుడు వాణిజ్య ఒప్పందాలు కుదురుతాయని అందరూ అంచనా వేశారు. కానీ స్నేహపూర్వకంగా వచ్చి వెళ్లిపోయారు."
"వాణిజ్య బంధాల్లో అమెరికా, భారత్ మార్గాలు భిన్నమైనవి."
ట్రంప్ అధ్యక్షుడిగా అధికారం చేపట్టాక ఇలాంటి పరిణామాలు చాలానే చోటుచేసుకున్నాయి. ఒబామాతోపాటు ఇదివరకటి అమెరికా అధ్యక్షుల హయాంలోనూ ఇలాంటి ఒడిదొడుకులు చోటుచేసుకున్నాయని నిపుణులు చెబుతున్నారు. రక్షణ వ్యవహారాలకు సంబంధించిన ఒప్పందాలైనా భద్రతకు సంబంధించి మరే అంశాలైనా భారత్-అమెరికాల మధ్య మంచి సంబంధాలున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
అణు పరీక్ష అనంతరం ఆర్థిక ఆంక్షలు
1971లో భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో మధ్యవర్తిగా వచ్చిన అమెరికా, పాకిస్తాన్‌కు సాయం చేసింది.
ఇందిరా గాంధీ హయాంలో అణు పరీక్షల (1974) అనంతరం అంతర్జాతీయంగా భారత్ పేరు ప్రఖ్యాతలు పెరిగాయి. భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాల తర్వాత అణు పరీక్షలు నిర్వహించిన దేశంగా భారత్ అవతరించింది. అయితే ఈ అణు పరీక్షల వల్ల రెండు దశాబ్దాలపాటు అమెరికాతో సంబంధాలు క్షీణించాయి. శాంతియుత లక్ష్యాల కోసమే ఈ అణు పరీక్ష చేపట్టినట్టు ఇందిరా గాంధీ చెప్పినప్పటికీ.. అణు ఇంధనంతోపాటు ఇతర అణు పదార్థాలు భారత్‌కు చేరకుండా అమెరికా అడ్డుకుంది.
1978లో అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ భారత్ వచ్చారు. అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి, ప్రధాని మొరార్జీ దేశాయ్‌లను ఆయన కలిశారు. భారత్ పార్లమెంటును ఉద్దేశించి కార్టర్ ప్రసంగించారు కూడా. అణ్వాయుధాలపై నియంత్రణ విధించే న్యూక్లియర్ నాన్-ప్రొలిఫరేషన్ యాక్ట్ గురించి ఆయన ప్రస్తావించారు. భారత్ సహా అన్ని దేశాల్లోని అణు కర్మాగారాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. భారత్ తిరస్కరణ అనంతరం.. అణు రంగాల్లో సహకారానికి అమెరికా ముగింపు పలికింది.
1998లో అణు పరీక్షల అనంతరం భారత్-అమెరికా బంధాలు మరింత క్షీణించాయి. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆర్థికపరమైన ఆంక్షలు విధించారు. భారత్‌లోని అమెరికా రాయబారినీ వెనక్కి పిలిపించారు. ఈ ఆంక్షలను 2001లో జార్జ్ బుష్ ఎత్తివేశారు.
1999 కార్గిల్ యుద్ధం సమయంలో క్లింటన్‌ను వాషింగ్టన్‌లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కలిశారు. అనంతరం నియంత్రణ రేఖ వెంబడి తమ సైన్యాన్ని పాక్ వెనక్కి తీసుకొంది.
ఇవి కూడా చదవండి:
- రూ.50,000కి చేరిన బంగారం ధర.. ఇప్పుడు కొంటే లాభమా.. అమ్మితే మంచిదా
- కరోనావైరస్ 'జీరో' అని ప్రకటించుకోవడానికి ఆ దేశాలకు ఎందుకంత తొందర?
- వయసు 100.. సంతానం 1600కిపైగా.. 50 ఏళ్లుగా సంతానోత్పత్తిలోనే.. ఇప్పుడు విశ్రాంతి
- డెక్సామెథాసోన్: కరోనావైరస్కు మంచి మందు దొరికినట్లేనా?
- కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి.. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది
- మీకు మీరే కరోనావైరస్ టెస్ట్ చేసుకోవచ్చు.. గంటలోనే ఫలితం తెలిసిపోతుంది
- గల్వాన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? ‘పది మందిని విడుదల చేసిన చైనా’
- 'భారత సైనికులను ఎవరినీ నిర్బంధంలోకి తీసుకోలేదు' - చైనా
- అమెరికా వీసా: హెచ్1బి సహా ఉద్యోగ వీసాలన్నీ 2020 చివరివరకూ బంద్ - ట్రంప్
- టిబెట్‌ను చైనా ఎప్పుడు, ఎలా తన ఆధీనంలోకి తీసుకుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








