తెలంగాణలో హరితహారం గిరిజన రైతులకు సమస్యగా ఎలా మారింది? వాళ్లు ఎందుకు పోరాటం చేస్తున్నారు?

గిరిజనులు
ఫొటో క్యాప్షన్, హరితహారంలో భాగంగా అధికారులు అటవీ భూముల్లో మొక్కల పెంపకం చేపడుతున్నారు. ఈ భూముల్లో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులు దీనికి అడ్డుపడుతున్నారు
    • రచయిత, దీప్తి బత్తిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ రాష్ట్రంలో పోడు భూములపై గిరిజన రైతులకు, అటవీ అధికారులకు మధ్య పోరాటం తారస్థాయికి చేరుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం సత్యనారాయణపురం గ్రామంలో, ములకలపల్లి మండలం గుట్టగూడెం గ్రామంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం జై సేవాలాల్ గ్రామంలో జరిగిన ఘటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి.

తెలంగాణలోని 11 జిల్లాలో పోడు భూములు అత్యధికంగా ఉన్నాయి. దశాబ్దాలుగా ఈ భూములనే నమ్ముకొని గిరిజన రైతులు సాగు చేసుకుంటున్నారు. అయితే హరితహారం పథకం పేరిట అధికారులు అటవీ భూముల్లో మొక్కల పెంపకం చేపడుతున్నారు. ఇక్కడే అటవీ సిబ్బందికి పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులకు మధ్య వివాదం చెలరేగుతోంది.

భూ హక్కు పత్రాలు ఉన్న భూములను వదిలేసి మిగతా ప్రదేశంలో మొక్కలు నాటుతామని, ప్రభుత్వ ఆదేశాల అమలుకు సహకరించాలని అధికారులు అంటున్నారు. ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ తాము పోడు భూమిని వదిలే ప్రసక్తే లేదంటున్నారు గిరిజనులు.

మొక్కలను నాటేందుకు వెళ్లిన అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న అటవీ అధికారుల ఫిర్యాదుల మేరకు గత 20 రోజులలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 46 మంది గిరిజనులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు బీబీసీ తెలుగుకు తెలిపారు.

గిరిజనులు

ఫొటో సోర్స్, Getty Images

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం సత్యనారాయణపురం గ్రామంలో 80 కోయ గిరిజన కుటుంబాలు 200 ఎకరాల అటవీ భూముల్లో 25 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నాయి.

గిరిజన రైతు ఉకం. మోహన్ రావు బీబీసీ తెలుగుతో మాట్లాడుతూ “ప్రభుత్వ అటవీ భూములను ఆక్రమించామని ఆరోపిస్తూ 2001 నుండి అటవీ అధికారులు మాపై కేసులు పెడుతున్నారు. దశాబ్దాలుగా మేం ఈ భూములనే సాగు చేసుకుంటున్నాం. రెవెన్యూ అధికారులకు, ఐటీడీఏ అధికారులకు ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాం. మా గోడు పట్టించుకునే వారే లేరు. ఈ సంవత్సరం కూడా సాగు చేయనివ్వలేదు” అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. భూ హక్కు పత్రాలు లేక కొంత మంది గిరిజన రైతులు రోజు కూలీలుగా మారాల్సిన దుస్థితి తలెత్తిందని తెలిపారు.

జూన్ చివరి వారంలో అటవీ అధికారులు హరితహారం మొక్కలు నాటేందుకు ట్రాక్టర్లతో దుక్కులు చేస్తుండగా గిరిజనులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున మోహరించిన పోలీసు, అటవీ అధికారులను అడ్డుకునేందుకు గిరిజనులు అక్కడికి భారీగా తరలి రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మొక్కలు నాటే పనులను అడ్డుకున్న 30 మంది గిరిజనులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం గుట్టగూడెం గ్రామ శివారులోని కంపార్ట్మెంట్ నెం 42 లో వంద ఎకరాల భూమిలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు అటవీ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. అక్కడ పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులు, అధికారుల మధ్య దీనిపై రెండు నెలలుగా వివాదం సాగుతోంది.

1998 నుంచి 500 ఎకరాలలో పోడు సాగు చేసుకుంటున్నట్టు గిరిజన రైతులు చెబుతున్నారు. వీరిలో కొంత మందికి భూ హక్కు పత్రాలు కూడా ఉన్నాయి. తమకు కూడా భూ హక్కులు కల్పించాలంటూ కొంత మంది పెట్టుకున్న అర్జీలు ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉన్నాయి. ఆర్ఓఎఫ్ఆర్ పద్ధతి కింద కొందరికి పట్టాలు మంజూరు అయ్యాయి.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

మరోవైపు ప్రభుత్వం తమను ఖాళీ చేయించడాన్ని సవాలు చేస్తూ గిరిజనులు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. కోర్టులో విచారణ కొనసాగుతోంది. తుది తీర్పు వచ్చే దాకా భూ హక్కు పత్రాలు ఉన్న భూములు, ఆర్ఓఎఫ్ఆర్ పద్ధతి కింద పట్టాలు మంజూరు అయిన భూముల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని కోర్టు ఆదేశించింది.

జులై చివరి వారంలో గుట్టగూడెంలో మొక్కలు నాటేందుకు వెళ్లిన అధికారుల విధులకు ఆటంకం కలిగించారని అటవీ అధికారి కె.మల్లికార్జున చేసిన ఫిర్యాదు మేరకు 16 మందిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు బీబీసీ తెలుగుకు తెలిపారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం జై సేవాలాల్ ఊరు తండ గ్రామంలో గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూముల్లో హరితహారం మొక్కలు నాటుతున్న అటవీ అధికారులను గిరిజనులు అడ్డుకున్నారు. పోలీస్ బందోబస్తుతో మొక్కలను నాటినట్టు అటవీ అధికారులు బీబీసీ తెలుగుకు తెలిపారు.

జూన్ 24న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభించింది. 2015లో ప్రారంభమైన హరితహారం కింద 230 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికి 159 కోట్ల మొక్కలు నాటినట్టు సమాచార హక్కు చట్టం కింద దాఖలైన ఓ పిటిషన్‌కు జవాబుగా వెల్లడించింది ప్రభుత్వం.

గత సంవత్సరం కొమరం భీమ్ జిల్లాలో అటవీ శాఖకు చెందిన ఓ మహిళా అధికారిపై దాడి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం గుట్టగూడెం అటవీ అధికారులపై దాడి... ఇలా నిత్యం అటవీ సిబ్బందికి, పోడు సాగుదారులకు మధ్య వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభించిన నెల రోజులలోనే తెలంగాణలోని 11 జిల్లాలోని గిరిజన గ్రామాలలో అటవీ అధికారులను గిరిజనులు అడ్డుకున్నారని సమాచారం.

తెలంగాణ హరితహారం

ఫొటో సోర్స్, Facebook/Telanganaku Haritha Haram

మాజీ పార్లమెంటు సభ్యుడు, సీపీఐఎం నేత మిడియం బాబు రావు దీనిపై బీబీసీతో మాట్లాడారు.

“అర్హతగల గిరిజనులందరికీ భూ హక్కు పత్రాలు ఇస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అనేక సార్లు హామీ ఇచ్చారు. కానీ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఏమీ చేయలేదు. ఆరు సంవత్సరాలలో, అటవీ హక్కుల చట్టాన్ని అమలుకు అటవీ హక్కుల కమిటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు” అని ఆయన అన్నారు.

ఫిబ్రవరి 24 న కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ తో రాష్ట్ర ప్రభుత్వాల సమీక్ష జరిగింది. షెడ్యూల్డ్ తెగలు, ఇతర సంప్రదాయ అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం, 2006 ప్రకారం పద్నాలుగు రాష్ట్రాల్లో పోడు భూముల హక్కు పత్రాల కోసం దాఖలు చేసుకున్న 543,432 అర్జీలను తిరస్కరించారు.

ఎఫ్‌ఆర్‌ఏ కింద పోడు భూముల హక్కు పత్రాల కోసం దాఖలు చేసుకున్న 2,03,976 అర్జీలలో 89,956 అర్జీలను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. దరఖాస్తులు తిరస్కరించిన వారిని ఎఫ్ఆర్ఏ కింద తొలగించాలని ఫిబ్రవరి 13, 2019న సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది.

తిరస్కరించిన అర్జీల పై కోర్టుకు పూర్తి సమాచారం ఇవ్వనందున ఉత్తర్వులపై ఫిబ్రవరి 28, 2019న కోర్టు స్టే ఇచ్చిందని వివరించారు మిడియం బాబు రావు. తిరస్కరించిన అర్జీలను సమీక్షించాలని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు సూచించింది.

దీనిపై మహిళా కిసాన్ అధికార్ మంచ్ నేషనల్ ఫెసిలిటేషన్ మెంబర్ ఎస్ .ఆశలత బీబీసీ తెలుగుతో మాట్లాడారు. అటవీ హక్కు పత్రాల కోసం అర్జీలు పెట్టుకొని తిరస్కరించబడిన 89,956 గిరిజనులకు ఎందుకు తమ దరఖాస్తులను తిరస్కరించారో కారణాలు చెప్పలేదంటున్నారు.

హరితహారం

ఫొటో సోర్స్, Facebook/Telanganaku Haritha Haram

“ప్రాజెక్టుల కోసం ఓ వైపు నుంచి భూమి మళ్లించి, మరోవైపు గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములల్లో హరితహారం మొక్కలు నాటుతున్నారు. అటవీ హక్కుల చట్టం కింద పెట్టుకున్న అర్జీలను 40%కి పైగా తిరస్కరించారు. వాటిపై తిరిగి అర్జీలు పెట్టుకునే అవకాశం కల్పించకుండానే, అర్జీలు పెండింగ్ లో ఉండగానే భూముల నుండి వెళ్లగొడుతున్నారు. పరిహారక అటవీకరణ నిధి చట్టం (కాంపా) కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో హరితహారం పథకం అమలు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం” అని ఆమె అన్నారు.

‘‘రాజకీయ పార్టిలు రాజకీయ లబ్ది కోసమే చూస్తున్నాయి తప్ప చిత్తశుద్ధితో పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం లేదు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య భూ వివాదాలను పరిష్కరించటానికి సమగ్ర భూ సర్వే చేపట్టాల్సిన అవసరం ఉంది’’ అని ఆశలత అభిప్రాయ పడ్డారు.

2016లో కేంద్రం కాంపా చట్టాన్ని ఆమోదించింది. పారిశ్రామిక, అటవీయేతర ప్రయోజనాలకుగాను నష్టపోయిన అడువులను భర్తీ చేయడమే ఈ చట్టం లక్ష్యం. ఈ చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వాల అటవీశాఖలకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిధులు అందిస్తుంది.

ఆగస్టు 2019 లో రూ. 47,436 కోట్ల జాతీయ నిధి నుంచి తెలంగాణ రాష్ట్రానికి రూ. 3110.38 కోట్లు ఇచ్చింది కేంద్రం. అంతే కాక 2014 నుంచి 2019 వరకు తెలంగాణ రాష్ట్రానికి రూ.592.38 కోట్లు కాంపా చట్టం కింద కేటాయించింది.

సమాచార హక్కు చట్టం కింద సంపాదించిన వివరాల ప్రకారం 2014 నుంచి 2019 వరకు కాంపా నిధుల నుంచి రూ. 519.97 కోట్లు హరితహారం పథకం అమలుకు ఖర్చుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం.

గూడూరు నారాయణ రెడ్డి

ఫొటో సోర్స్, Gudur Narayana Reddy

ఫొటో క్యాప్షన్, గూడూరు నారాయణ రెడ్డి

హరితహారం పేరుతో ప్రజా ధనాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం కొల్లగొట్టే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ నేత గూడూరు నారాయణ రెడ్డి ఆరోపించారు.

“సమాచార హక్కు చట్టం కింద సంపాదించిన వివరాల ప్రకారం 2015 నుంచి 2020 వరకు మెక్కలు నాటేందుకు ఈ ప్రభుత్వం రూ. 3630 కోట్లు ఖర్చుపెట్టింది. హరితహారం కార్యక్రమంలో కప్పే కండువాలపైనే రూ 6.91 కోట్లు ఖర్చు పెట్టారు” అన్నారు కాంగ్రెస్ నేత గూడురు నారాయణ రెడ్డి.

గిరిజన ప్రాంతంలో ఎదురవుతున్న పోడు సాగు భూవివాదంపై రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్‌ను అడిగే ప్రయత్నం చేసింది బీబీసీ తెలుగు. బీబీసీ అడిగిన ప్రశ్నలకు మంత్రి వారం రోజులు అయినా స్పందించలేదు. అటవీ శాఖ అధికారుల కూడా స్పందించలేదు.

గతంలో అర్హత కల్గిన గిరిజనులందరికీ భూ హక్కు పత్రాలను అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సార్లు హామీ ఇచ్చారు. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి విధాన పరమైన రూపకల్పన జరగలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)