భారత్ - చైనా ఉద్రిక్తతల్లో పాకిస్తాన్ స్థానం ఏమిటి? ఎవరి వైపు మొగ్గుతుంది?

నరేంద్ర మోదీ, ఇమ్రాన్ ఖాన్, షి జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సహర్ బలోచ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

1962లో భారత్ - చైనాల మధ్య సరిహద్దు విషయంలో యుద్ధం మొదలైంది. అప్పుడు.. అప్పటి ఇరాన్ పాలకుడు (షా ఆఫ్ ఇరాన్) నాటి పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ అయూబ్ ఖాన్‌కు ఒక లేఖ రాశారు.

‘చైనా ఎరుపు సంకటాన్ని’ తప్పించుకోవటానికి భారత్ - చైనా సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యాన్నీ మోహరించాలని సూచించారు. అంటే భారత్‌తో కలిసి చైనాతో యుద్ధం చేయాలని చెప్పారు.

ఆ లేఖ కాపీని అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు కూడా షా ఆఫ్ ఇరాన్ పంపించారని భారత జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్ తన ‘బియాండ్ ద లైన్స్’ పుస్తకంలో పేర్కొన్నారు.

“భారత్ బలహీనతను మాకు అనుకూలంగా మలుచుకోకపోవడం నిజానికి పాకిస్తాన్ మంచితనమే కాదు, ఒక విధంగా అది సాయం కూడా అని, బయటి శక్తులు చూడాలి“ అని తర్వాత అయూబ్ ఖాన్ ఒక ప్రకటనలో చెప్పారు.

“ఏదైనా మూడో శక్తి భారత్ మీద దాడి చేస్తే, పాకిస్తాన్ ఏం చేస్తుంది?’ అని ప్రశ్నించినపుడు.. ‘పాకిస్తాన్ సైన్యం, భారత్ సైనికులతో కలిసి పోరాడుతుంది’ అని పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా సమాధానం ఇచ్చారు’’ అని కూడా కులదీప్ నయ్యర్ తెలిపారు. జిన్నాతో లాహోర్‌ లా కాలేజీలో జరిగిన తన సంభాషణ గురించి రాస్తూ.

లద్దాఖ్

ఫొటో సోర్స్, YAWAR NAZIR/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, లద్దాఖ్

1961లో చైనా సైనికులు టిబెట్, సాక్యాంగ్ సరిహద్దు నుంచి పశ్చిమంగా 70 మైళ్ల లోపల భారత ప్రాంతంలోకి చొరబడ్డారు. కానీ అంతకు ముందు 1960లో భారత్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ పీఎన్ థాపర్ ప్రభుత్వానికి రాసిన ఒక లేఖలో “భారత్ దగ్గర యుద్ధానికి అవసరమైన సామాన్లు ఎంత తక్కువగా ఉన్నాయంటే, చైనా, పాకిస్తాన్‌లో ఏదైనా తమను సులభంగా ఓడించి భారత్‌లో అడుగుపెట్టగలదని” చెప్పారు.

చైనా అప్పటికే భారత్ నుంచి అక్సాయ్ చీన్‌లో దాదాపు 15 వేల చదరపు మైళ్ల ప్రాంతాన్ని ఆక్రమించుకోవడంలో విజయవంతం అయ్యింది. సైనిక బలం విషయంలో చైనాతో పోలిస్తే భారత్ ఇప్పటికీ బలహీనంగానే ఉందని భావిస్తుంటారు.

ఇప్పుడు, మరోసారి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి. గల్వాన్ లోయలో జూన్‌లో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలో 20 మంది భారత సైనికులు మృతిచెందారు.

పాకిస్తాన్ మళ్లీ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఘటనలను ఆసక్తిగా గమనిస్తోంది.

సైన్యం

ఫొటో సోర్స్, TAUSEEF MUSTAFA

పాక్ స్థానం ఎక్కడుంది?

ఘర్షణ జరిగిన ప్రాంతం చాలా కీలకమైనది. అక్కడ భారత్, చైనాతో పాటు.. పాకిస్తాన్ సరిహద్దులు కూడా కలుస్తాయి.

చైనా, భారత్ మధ్య కొనసాగుతున్న ఈ ఉద్రిక్త వాతావరణంలో కొందరి దృష్టి పాకిస్తాన్ మీద కూడా నిలిచింది. దీనిపై బీబీసీ కొంతమంది విశ్లేషకులతో మాట్లాడింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ పాత్ర ఎలా ఉండవచ్చని తెలుసుకోడానికి ప్రయత్నించింది.

2019 ఆగస్టు 5న భారత ప్రభుత్వం కశ్మీర్‌పై తీసుకున్న నిర్ణయాలే భారత్, చైనా మధ్య ప్రస్తుత ఉద్రిక్తతలకు కారణం అని పాకిస్తాన్ సర్కారు భావిస్తోంది.

భారత్ ఆ రోజున జమ్ము-కశ్మీర్ రాజ్యాంగ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆ సమయంలో దీనిపై విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా, లద్దాఖ్ హోదాను మార్చడం సరికాదని చెప్పింది.

చైనా ప్రకటనను పాకిస్తాన్ సమర్థిస్తే, బదులుగా చైనా జమ్ము-కశ్మీర్ అంశంలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో పాకిస్తాన్‌కు తోడుగా నిలిచింది. 2019 ఆగస్టు 5 తర్వాత కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితిల జరిగిన రెండు సెషన్లలో పాకిస్తాన్‌నే చైనా సమర్థించింది.

ఇటీవల ఈ ఘటనకు ఏడాది పూర్తైన సందర్భంగా జారీ చేసిన ప్రకటనలో కూడా చైనా ఈ అంశంపై పాకిస్తాన్‌కు అనుకూలంగానే మాట్లాడింది.

కానీ, చైనా ప్రస్తుతం మరో కోల్డ్ వార్ కోరుకోవడం లేదు. అది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషీయేటివ్‌ను ప్రోత్సహించాలని అనుకుంటోంది. అటు పాకిస్తాన్ కూడా ఆర్థిక రహదారుల అభివృద్ధిలో చైనా తోడు కోరుకుంటోంది.

“పాకిస్తాన్ సాధారణంగా చైనాకు తోడుగా ఉంటుంది. చెప్పాలంటే ఇక్కడ భారత్‌దే తప్పు, పాకిస్తాన్‌ తనకు సాయం చేయదని తెలిసి కూడా భారత్, చర్చల ద్వారా దీనిని పరిష్కరించుకోగలిగితే మంచిదే. లేదంటే భారత్ ఆ ప్రాంతంలో తన దూకుడు విధానాన్ని సమీక్షించాల్సి ఉంటుంది” అని ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ సెనేటర్ ముషాహిద్ హుస్సేన్ సయ్యద్ అన్నారు.

పాకిస్తాన్, చైనా

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్, చైనా

1965లో పాక్‌కు అండగా...

చైనా, పాకిస్తాన్ పరస్పరం తోడుగా నిలబడేలా, అంత పెద్ద సందర్భాలు ఎప్పుడు వచ్చాయి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే, మనం కాస్త చరిత్ర పుటలు తిరగేయాల్సుంటుంది.

1962లో చైనా-భారత్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ ‘నిశ్శబ్ద దౌత్యం’ తర్వాత 1965లో జరిగిన భారత్-పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్‌కు చైనా అండగా నిలిచింది.

“అయితే, అమెరికాతో మాకు రక్షణ ఒప్పందం కూడా ఉంది. అది మా ప్రత్యర్థి కాదు. కానీ అమెరికా వాటన్నిటికీ విరుద్ధంగా భారత్‌ వైపు నిలిచింది. ఆ సమయంలో అప్పుడప్పుడే పాకిస్తాన్‌తో స్నేహం చేస్తున్న చైనాకు ఇది ఒక మంచి అవకాశంగా మారింది” అని ముషాహిద్ హుస్సేన్ సయ్యద్ అన్నారు.

ఇక, రెండో అవకాశం 1968లో వచ్చింది. కారణం పెషావర్‌కు ఆరు కిలోమీటర్లు దక్షిణంగా ఉన్న బడీ బేర్ ప్రాంతం. అమెరికా 1959 నుంచి 1970 వరకూ దానిని తూర్పు సోవియట్ యూనియన్‌పై గూఢచర్యానికి ఉపయోగించేది.

పాకిస్తాన్ దానిని ఆపేయాలని అమెరికాకు స్పష్టంగా చెప్పింది. పాకిస్తాన్ చేపట్టిన ఆ చర్యలకు చైనా సంతోషించింది. తర్వాత, వెంటనే సోవియట్ యూనియన్ కూడా ఆసియా భద్రత ఒప్పందంలో పాల్గొనేందుకు పాకిస్తాన్‌కు ఆహ్వానం పంపింది. కానీ పాకిస్తాన్ దానికి వెళ్లలేదు. ఆ సమగ్ర ఒప్పందం చైనాకు వ్యతిరేకంగా ఉండడమే అసలు కారణం. పాకిస్తాన్ అలా చేయాలనుకోలేదు.

ఇక పాకిస్తాన్ 1971లో అమెరికా, చైనా మధ్య చర్చలకు మార్గంపరిచింది.

తర్వాత ఐక్యరాజ్యసమితిలో చైనా సభ్యత్వం పునరుద్ధరణలో కూడా పాకిస్తాన్ కీలక పాత్ర పోషించిందని ముషాహిద్ హుస్సేన్ చెప్పారు.

పాకిస్తాన్, చైనా బంధం ఇప్పుడు చాలా ప్రత్యేకం. ఆ బంధం పునాదుల్లో జమ్ము-కశ్మీర్‌ను సొంతం చేసుకోవాలనే పాకిస్తాన్ పాత కోరిక కూడా ఉంది. మరోవైపు, ఇందులో 6,200 కోట్ల డాలర్ల ఒక ప్రాజెక్ట్ ప్రణాళిక కూడా ఉంది.

చైనా అనుకూల వాదనతో పాకిస్తాన్‌కు ఏం ప్రయోజనం.

మోదీ, జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

యుద్ధం చేసే స్థితిలో లేవు

ప్రస్తుతం చైనా, భారత్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను పాకిస్తాన్ చాలా నిశితంగా గమనిస్తోంది.

భారత్, చైనా మధ్య ఈ హింసాత్మక ఘర్షణలు జరిగిన కొన్ని రోజుల తర్వాత పాకిస్తాన్ నిఘా ఏజెన్సీ ఐఎస్ఐ తమ హెడ్ క్వార్టర్స్‌లో ఒక సమావేశం ఏర్పాటుచేసింది. అటు పాకిస్తాన్ సైన్యంలోని ఒక అత్యున్నత అధికారి కూడా భారత్ చైనా మధ్య జరుగుతున్న ఘటనల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వచ్చారు.

అవసరమైతే చైనాకు సాయం చేయడానికైనా సిద్ధం అని పాకిస్తాన్ అధికారులు చెప్పారు. కానీ ప్రస్తుతం మూడు దేశాల పరిస్థితి యుద్ధం చేసేలా లేదు. అలా ఉండడానికి ఆయా దేశాలకు తమదైన ప్రయోజనాలు ఉన్నాయి.

చైనాకు 13 దేశాలతో సరిహద్దులు ఉన్నాయి. వాటిలో 11 దేశాలతో చైనా సరిహద్దు ఒప్పందాలు చేసుకుంది. అయితే భారత్, భూటాన్‌ ఇప్పటికీ చైనాతో ఒప్పందం చేసుకోలేదు. ఇప్పుడు తమ వ్యాపారవేత్తలు ప్రాజెక్టు దగ్గరకు చేరుకోగలిగేలా, ఒక ఆర్థిక ఎజెండా ప్రకారం, భారత్‌తో కూడా ఒప్పందం చేసుకోవాలని చైనా అనుకుంటోంది.

మరోవైపు 2013లో పాకిస్తాన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఒక విఫలమైన దేశంగా చెప్పుకున్నారు. కానీ ఆ తర్వాత పాకిస్తాన్‌తో చైనా 6,200 కోట్ల డాలర్ల పెట్టుబడుల ఒప్పందం చేసుకుంది. దాంతో పాక్ గురించి ఆందోళన వ్యక్తం చేసిన చాలా దేశాలు, ఇప్పుడు ఆ ప్రాజెక్టులో భాగం అయ్యేందుకు క్యూలో నిలబడడం కనిపించింది.

“పాకిస్తాన్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఈ భరోసా ఏర్పడడడం చాలా అవసరం. అందుకే పాకిస్తాన్ సమయం వచ్చినపుడు భారత్‌కు వ్యతిరేకంగా గళమెత్తడమే కాదు, తమ, చైనా ప్రయోజనాలను కూడా ముందుంచుతోంది. ఆ ప్రయోజనాల కోసం ఆర్థిక కారిడార్ చాలా ముఖ్యం” ఇస్లామాబాద్‌లో చైనా సెంటర్‌కు సంబంధించిన డాక్టర్ ఫైజల్ ఉర్ రహమాన్ భావిస్తున్నారు.

పాకిస్తాన్, చైనా ఏదో ఒక ప్రయోజనానికి బదులుగా స్నేహం చేయడం లేదు. ఇక్కడ పాకిస్తాన్‌కు కశ్మీర్ అంశంలో చైనా అండ అవసరం అని మాజీ సెక్రటరీ జనరల్ రియాజ్ మహమూద్ ఖాన్ అన్నారు.

కానీ, ప్రస్తుతం గమనించాల్సిన ఒక విషయం ఉంది. 1992లో ఈ మూడు దేశాల దగ్గర అణ్వాయుధాలు లేవు. కానీ ఈ రోజు పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. అందుకే ఇవి చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)