హాంగ్‌కాంగ్ మీడియా దిగ్గజం జిమ్మీ లాయ్.. కొత్త భద్రతా చట్టం కింద అరెస్ట్

ఫొటో సోర్స్, EPA
విదేశీ శక్తులతో కుమ్మక్కయ్యాడనే ఆరోపణలతో హాంగ్ కాంగ్ మీడియా వ్యాపార దిగ్గజం జిమ్మీ లాయ్‌ని పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు. ఆయన వార్తా పత్రికల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.
చైనా గత జూన్ నెలలో కొత్తగా అమలులోకి తెచ్చిన వివాదాస్పద భద్రతా చట్టం కింద ఇప్పటివరకూ అరెస్ట్ చేసిన వారిలో అత్యంత ప్రముఖ వ్యక్తి జిమ్మీ లాయ్.
ప్రజాస్వామ్య గళం వినిపించే వారిలోనూ జిమ్మీ ప్రముఖులు. గత ఏడాది హాంగ్ కాంగ్‌లో చెలరేగిన నిరసనలకు మద్దతుగా నిలిచారు.
జిమ్మీ లాయ్ వయసు ప్రస్తుతం 71 సంవత్సరాలు. ఆయనకు బ్రిటన్ పౌరసత్వం కూడా ఉంది. ఆయన మీద ఫిబ్రవరి నెలలో చట్టవ్యతిరేక సమావేశం, బెదిరింపు అభియోగాలు నమోదు చేశారు.
జిమ్మీని సోమవారం అరెస్ట్ చేసిన అనంతరం పోలీస్ బెయిల్ మంజూరు చేశారు.
అల్లర్లకు జిమ్మీ ఆజ్యం పోశారని చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ వ్యాఖ్యానించింది. ఆయన ప్రచురణలు విద్వేషాలను రెచ్చగొట్టేలా, పుకార్లు పుట్టించేలా, హాంకాంగ్, చైనా అధికారులపై బురద జల్లేలా ఉన్నాయని పేర్కొంది.
జిమ్మీతోపాటు ఆయన ద్దరు కొడుకులు, తమ సంస్థ నెక్స్ట్ డిజిటల్‌లో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లనూ అరెస్టు చేసినట్లు గ్లోబల్ టైమ్స్ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
జిమ్మీ పత్రిక యాపిల్ డైలీ భవనంలో సోదాలు చేపట్టేందుకు పోలీసులు ప్రవేశిస్తున్న దృశ్యాలు కూడా మీడియాలో కనిపించాయి.
మరోవైపు ఈ అరెస్టును పోలీసులు కూడా ధ్రువీకరించారు. విదేశీ శక్తులతో కుమ్మక్కైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 39 నుంచి 72 ఏళ్ల మధ్య వయసున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు ఫేస్‌బుక్‌లో తెలిపారు. అయితే జిమ్మీ పేరును వారు ప్రస్తావించలేదు.
జిమ్మీ లాయ్ ఎవరు?
జిమ్మీ లాయ్ ఓ దిగ్గజ వ్యాపారవేత్త. ఆయన ఆస్తుల విలువ బిలియన్ డాలర్లపైనే ఉంటుంది.
వస్త్ర వ్యాపారంతో ఆయన బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. అనంతరం యాపిల్ డైలీ పత్రికను స్థాపించారు. ఈ పత్రిక చైనా అధినాయకత్వాన్ని విమర్శిస్తూ ఉంటుంది.
హాంకాంగ్‌పై చైనా ఆధిపత్యాన్ని వ్యతిరేకించే ఉద్యమకారుల్లో ఆయన కూడా ఒకరు. 2019 నిరసనలకు ఆయన మద్దతు పలికారు. అంతేకాదు ప్రదర్శనల్లో పాలుపంచుకున్నారు కూడా.
జూన్ 30న హాంకాంగ్ కొత్త భద్రతా చట్టాన్ని ఆమోదించినప్పుడు.. ఇది హాంకాంగ్‌కు చీకటి రోజని బీబీసీతో ఆయన చెప్పారు.
కొత్త చట్టంతో హాంకాంగ్ కూడా చైనాలా అవినీతి మయం అవుతుందని, ఇక్కడ వ్యాపారం చేసేవారికి ఎలాంటి రక్షణా ఉండదని అన్నారు.
''జైలుకు వెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అక్కడ నేను చదవడానికి వీలుపడని కొత్త పుస్తకాలు చదువుకోవచ్చు. అయినా నేను పాజిటివ్‌గానే ఉంటాను'' అని ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
ప్రతి స్పందన ఏమిటి?
అరెస్టును తాము ప్రత్యక్ష వేధింపులుగా పరిగణిస్తున్నామని, తాము న్యాయవాదులను ఏర్పాటు చేస్తున్నామని యాపిల్ డైలీ వర్గాలు తెలిపాయి.
పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య అభిప్రాయాలను అణచివేసేందుకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్లు తాము అనుకున్నవన్నీ నిజమయ్యాయని కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ ఆసియా విభాగం కో-ఆర్డినేటర్ టేవెన్ బట్లర్ వ్యాఖ్యానించారు.
''జిమ్మీని వెంటనే విడుదల చేయాలి. ఆయనపై అభియోగాలను వెనక్కి తీసుకోవాలి''
ఈ అరెస్టును తాము ముందుగానే ఊహించామని 1989 తియాన్‌మెన్ స్క్వేర్ నిరసనల్లో పాలుపంచుకున్న వాంగ్ డాన్ చెప్పారు. అయితే ఆయన కొడుకులను అరెస్టు చేయడాన్ని తాము ఊహించలేదని అన్నారు. కుటుంబ సభ్యులను అరెస్టు చేయడం ద్వారా జిమ్మి సంకల్పాన్ని దెబ్బతీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.
''ఈ విషయంలో అంతర్జాతీయ సంస్థలు చర్యలు తీసుకోవాలి''
జిమ్మీ అరెస్టును హాంకాంగ్ హక్కుల ఉద్యమకర్త జాషువా వాంగ్ కూడా ఖండించారు.

ఫొటో సోర్స్, Reuters
మీడియా భవిష్యత్తు అనిశ్చితిలో
గ్రేస్ సోయ్, బీబీసీ వరల్డ్ సర్వీస్, విశ్లేషణ
హాంకాంగ్‌లో అతిపెద్ద ప్రజాస్వామ్య అనుకూల పత్రికైన యాపిల్ డైలీ న్యూస్‌రూమ్‌పై 200 మంది పోలీసు అధికారులు సోదాలు చేపట్టడంతో చాలా మంది విస్మయానికి గురయ్యారు. ఇక్కడ పరిణామాలు వేగంగా మారుతున్నాయని చెప్పడానికి ఇది నిదర్శనం.
నేషనల్ సెక్యూరిటీ చట్టాన్ని ఆమోదించినప్పుడే ఇలాంటివి జరుగుతాయని తాము ఊహించినట్లు యాపిల్ డైలీ ఉద్యోగి ఒకరు వివరించారు.
హాంకాంగ్‌పై చైనా ప్రభుత్వ ఆధిపత్యంతోపాటు హాంకాంగ్ అధికారులనూ జిమ్మీ తరచుగా విమర్శించేవారు.
అందుకే ఆయన్ను నగరంలో ఘర్షణలకు కారణమయ్యే వ్యక్తిగా చైనా అధికార వార్తా సంస్థ ముద్ర వేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, విదేశాంగ మంత్రి మైక్ పాంపేయోలను ఆయన కలిసినప్పుడు చైనా ఆగ్రహం వ్యక్తంచేసింది.
నెక్స్ట్ మీడియా ప్రతి వార్తనూ సంచలనంగా చూపిస్తుందని విమర్శలు ఉన్నాయి. అయితే చైనాతో వ్యాపార సంబంధాల్లేని అతి తక్కువ మీడియా సంస్థల్లో ఇది కూడా ఒకటి.
ఈ ఏడాది 25వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్న యాపిల్ డైలీ.. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఈ విషయంపై తాము తగిన సమయంలో తగిన విధంగా స్పందిస్తామని పత్రిక పేర్కొంది. అయితే జిమ్మీ మాత్రం స్పందించలేదు. ఈ వివాదాన్ని తట్టుకొని సంస్థ నిలబడుతుందా? లేదా అనేది అస్పష్టంగా మారింది.
ఇవి కూడా చదవండి:
- చైనా వెళ్లిన ఇంటర్‌పోల్ చీఫ్ ఏమయ్యారంటే..
- ముస్లిం వీగర్లను వేధించారని 28 చైనా సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన అమెరికా
- చైనా దూకుడుకు బ్రేకులు పడ్డట్లేనా? ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న కల నెరవేరేనా?
- వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








