హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రి: వివాదం ఏమిటి, ఇప్పుడేం జరుగుతుంది?

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
వందేళ్ల చరిత్రకు తాళాలు పడనున్నాయి.
ప్రభుత్వ పంతం గెలవబోతోంది.
దశాబ్దాల తరబడి కోట్ల మందికి ఉచిత సేవలందించిన ఉస్మానియా ఆసుపత్రి భవనం బహుశా త్వరలో కనుమురుగు కావచ్చు.
పేదలకు వైద్యం అందాలంటే ఆ భవనం కూలాల్సిందే అన్న వాతావరణం నెలకొంది ఇప్పుడు హైదరాబాద్ వైద్య సర్కిళ్లలో..
''గాంధీ - ఉస్మానియా ఆసుపత్రులు, తెలంగాణ పేదలకు తల్లితండ్రులు''.. ఈ ఆసుపత్రులు ఖ్యాతి తెలిసిన వారు చెప్పే వర్ణన ఇది. ఇది అతిశయోక్తి కాదు.
తెలంగాణ వ్యాప్తంగా పేదలకు ఏ పెద్ద జబ్బు వచ్చినా వారికి ముందుగా గుర్తొచ్చేవి ఈ రెండు ప్రభుత్వ ఆసుపత్రులే.
గాంధీ ఆసుపత్రిని పూర్తిగా కరోనా వైద్యానికి వాడుతుండడంతో ఇప్పుడు ఒత్తిడి అంతా ఉస్మానియా ఆసుపత్రిపై పడింది. ప్రైవేటు ఆసుపత్రిల్లో లక్షలు పోసే అవయవ మార్పిడి వంటివి కూడా ఉస్మానియాలో ఉచితంగా చేస్తారు.
ఇటీవల కురిసిన వర్షాలకు ఉస్మానియా ఆసుపత్రిలోకి నీళ్లు రావడం, పేషెంట్లు పడుకున్న వార్డుల్లో కూడా నీళ్లు నిల్వ ఉండడం, కేవలం వాన నీరే కాకుండా డ్రైనేజీ నీరు కూడా అక్కడ చేరడంతో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ వైద్య వ్యవస్థనే ప్రశ్నించాయి. దీంతో ఆసుపత్రి కట్టలేకపోయింది మీరేననీ, ఆసుపట్రి కట్టనివ్వనిది మీరేననీ ప్రభుత్వ ప్రతిపక్షాలు తిట్టుకున్నాయి. పోటా పోటీగా పర్యటనలూ చేశాయి.
ఈ గొడవలన్నిటి మధ్యే ఆ భవనాన్ని ఖాళీ చేసి సీల్ చేయాలని ప్రభుత్వం బుధవారం ఆదేశించింది.

కొత్త భవనాలకు సమస్య ఏంటి?
సాధారణంగా వందేళ్లు పైబడ్డ ఏ కట్టడమైనా పురాతన కట్టడంగా పరిగణిస్తారు. ఈ ఆసుపత్రిని అలనాటి హైదరాబాద్ ఘనతకు నిదర్శనంగా గుర్తిస్తారు. అందుకే ఈ భవనాన్ని కూల్చివేయవద్దని పురాతన కట్టడాలను పరిరక్షించే కార్యకర్తలు, ఉస్మానియాలో ఒకప్పుడు చదువుకున్న, వైద్యం చేసిన వారు అప్పట్లో డిమాండ్ చేశారు. వారు కొన్ని ప్రత్యామ్నాయాలు సూచించారు. ప్రతిపక్షాలు కూడా అప్పట్లో ఈ భవనాల కూల్చివేతను నిరసించాయి. కొందరు కోర్టుకు వెళ్లారు.
దీంతో వారితో చర్చించడమో, కోర్టులో పోరాడడమో చేయకుండా, మొత్తానికి ఆ ప్రతిపాదననే పక్కన పడేసింది తెలంగాణ ప్రభుత్వం.
కొత్త భవనాల కోసం ఉన్న ప్రత్యామ్నాయాలు:
- చారిత్రక భవనాన్ని, ఇతర పాత భవనాలను కూల్చి అక్కడే కొత్తవి కట్టడం
- చారిత్రక భవనాన్ని కూల్చకుండా, బాగు చేయించి, ఆసుపత్రి కోసం వాటి పక్కన ఖాళీ స్థలాలు లేదా ఇతర బ్లాకుల స్థానంలో కొత్తవి కట్టడం
- ఆ భవనాన్ని అలా వదిలేసి లేదా బాగు చేసి, ఆసుపత్రిని మాత్రం వేరే ఎక్కడైనా ఖాళీ స్థలం చూసి కొత్తగా కట్టడం

ఇందులో మొదటి ఆప్షన్ గురించి ప్రభుత్వం మాట్లాడినప్పుడు, కొందరు పురాతన కట్టడాలను పరిరక్షించే ఆందోళనకారులు రెండో ఆప్షన్ సూచించారు. ఇప్పుడు కొన్ని ప్రతిపక్షాలు మూడో ఆప్షన్ చెబుతున్నాయి.
ఈలోపు కొందరు కోర్టుకు వెళ్లారు. కోర్టులో కేసు సాగుతోంది. అయితే సచివాలయం భవనాల విషయంలో కూడా కొందరు కోర్టుకు వెళ్లినప్పటికీ ఆ కేసులో చురుగ్గా కదిలిన తెలంగాణ ప్రభుత్వం ఉస్మానియా ఆసుపత్రి కేసులో మాత్రం అంత వేగంగా కదల్లేదు.
''ఉస్మానియా అనగానే అందరూ ఎంతసేపూ హెరిటేజ్ హెరిటేజ్ అంటున్నారు. కానీ ఈ ప్రాంగణం 27 ఎకరాలు ఉంది. ఆ పాత భవనాలను కదల్చకుండా, వాటికి ఏమీ కాకుండా, ఇదే ప్రాంగణంలో విశాలమైన భవనాలు కట్టవచ్చు. ఆ విషయం ఎవరూ మాట్లాడడం లేదు. ప్రభుత్వం తలచుకుంటే పార్కింగ్ ఉండే పోలీస్ స్టేషన్ వైపు సుమారు 5 ఎకరాలు ఖాళీ ఉంది. ఇక జైలు వార్డు ఉండే దోబీఘాట్ వైపు చాలా ఖాళీ ఉంది. అక్కడ విశాలమైన భవనాలు అత్యంత సులువుగా కట్టొచ్చు'' అంటున్నారు డాక్టర్ విజయేందర్.
''ఇక్కడకు రోజూ 2-3 వేల మంది ఔట్ పేషెంట్లుగా వస్తారు. ఇక ఇన్ పేషెంట్లుగా అధికారికంగా 1,159 మంది ఉంటారు. కానీ ఎక్కువ మంది వస్తారు కాబట్టి అదనంగా కింద పరుపులు వేసి, ఎలాగోలా ఇంకా చాలా మందిని అడ్జస్ట్ చేస్తాం. అంత మందికి సేవలందించే ఆసుపత్రి కొత్త భవనాలకు స్థలం ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణం శంకుస్థాపన చేయాలని మేం కోరుతున్నాం.'' అన్నారు విజయేందర్.

ఇప్పటి వరకూ ఏం జరిగింది?
అంతకుముందు 2010లో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉండగా ఈ ఆసుపత్రి భవనాలు బాగు చేయడానికి 200 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. కానీ పనులు ముందుకు సాగలేదు. 2010 నవంబర్ 11న జీవో విడుదల అయింది. చారిత్రక కట్టడానికి రిపేర్లు చేసి, దాన్ని అలానే ఉంచి మిగిలిన భవనాలను మాత్రం కూలగొట్టి వాటి స్థానంలో కొత్తది కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మూడేళ్ల వ్యవధిలో 12 లక్షల ఎస్ఎఫ్టీలో కొత్త భవనాలు నిర్మించాలని ప్రతిపాదించారు. దానికోసం కన్సల్టెన్సీకి కూడా పనులు అప్పగించారు. ఆ తరువాత ఆ పనుల పర్యవేక్షణకు వైద్యులు, పూర్వ విద్యార్థులు.. ఇలా చాలా మందితో కమిటీలు కూడా వేశారు. కానీ అది ముందుకు సాగలేదు.
2015లో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉస్మానియా ఆసుపత్రిని కూల్చేసి వాటి స్థానంలో 24 అంతస్తులుండే రెండు భారీ భవనాలను నిర్మించాలని తలపెట్టింది. దానికోసం ఎమ్మెల్యేలతో పరిశీలనా బృందాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రయత్నించింది. అప్పట్లో కేసీఆర్ స్వయంగా ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించారు. కానీ ఒక్క అడుగూ ముందుకు పడలేదు.

ఆ భవనం ఎంత కాలం ఉంటుంది?
ఉస్మానియా భవనాలు బాగుచేశాక ఎంత కాలం నిలిచి ఉంటాయో చూడాలంటూ అప్పట్లో ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీ వేసింది. బాగు చేసినా ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం ఉండబోదని చెప్పింది జేఎన్టీయూ నిపుణుల బృందం. దీంతో బాగుచేత బదులు కూల్చివేతకు మొగ్గు చూపింది తెలంగాణ ప్రభుత్వం.
కానీ జేఎన్టీయూ నివేదికను తప్పు పట్టింది ఇంటాక్ (భారతదేశం చారిత్రక కట్టడాలను పరిరక్షించడానికి కృషి చేసే ట్రస్ట్). ఇంటాక్ తమ ఇంజినీర్లను దిల్లీ నుంచి పిలిపించి మూడు రోజులు అధ్యయనం చేసింది, ఈ భవనానికి ప్లాస్టరింగ్ స్టింగ్ పనులు చేస్తే చాలనీ, నిర్మాణం చెక్కుచెదరలేదనీ చెప్పింది. 2015, 2019లలో రెండుసార్లు ఈ బృందం ఉస్మానియా బిల్డింగును సందర్శించింది.
''భవనం బలంగా, భద్రంగా ఉంది. చాలా కాలం ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే పైపైన దెబ్బతింది. ప్లాస్టరింగ్ పనులు చేస్తే చాలు. దీంట్లో అన్ని ఆధునిక సౌకర్యాలూ కల్పించవచ్చు. పక్కనే కొత్త భవనాలు కూడా కట్టవచ్చు. జేఎన్టీయూ నిపుణులు సరిగా పరిశీలించలేదు. జేఎన్టీయూ వారు చెప్పిన కలపను ప్రధాన నిర్మాణంలో వాడలేదు. కేవలం అలంకారాలకు, తలుపులకు మాత్రమే వాడారు. నిర్వహణ లోపాలూ, లీకేజీలు, మొక్కలు పెరగడం ఆపితే చాలు.'' అని నివేదిక ఇచ్చారు ఇంటాక్ ఇంజినీర్లు.
అయితే ఇంటాక్ నివేదికతో విభేధిస్తున్నారు తెలంగాణ మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ అధికారులు. ''అక్కడ కొత్త భవనాలు నిర్మాణం చేయలేం. పేరుకు కాగితాలపై 26.5 ఎకరాలు ఉన్నా, వాస్తవంగా అంత భూమి లేదు. ప్రధాన భవనం కింద నుంచే మురుగు కాలువ వెళుతోంది. చారిత్రక కట్టడాలకు వంద మీటర్ల దూరంలో ఏమీ కట్టకూడదనీ, కట్టినా అవి భుజం ఎత్తు దాటకూడదని ఇలా నిబంధనలున్నాయి. అక్కడ ఆ చారిత్రక భవనం కూల్చకుండా కొత్తది కట్టడం అసాధ్యం. కనీసం ఆ భవనాన్ని బాగు చేయండీ డబ్బులు ఇస్తామన్నా, ఆగా ఖాన్ ట్రస్ట్, తెలంగాణ పురాతత్త్వ శాఖలు కూడా మేం చేయలేమని చెప్పేశాయి. అందుకే అక్కడ పనులు సాగడం లేదు. ఆ భవనం కూల్చనిదే పనికాదు.'' అని బీబీసీతో అన్నారు పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి.

నిర్లక్ష్యమే
ఉస్మానియా ఆసుపత్రి భవనాన్నీ, మొత్తం ప్రభుత్వ వైద్య రంగాన్నీ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు ఐఎంఎ హైదరాబాద్ చాప్టర్ పబ్లిసిటీ విభాగం ఛైర్మన్ డా. మహమ్మద్ ఇక్బాల్ జావీద్. ఆయన తండ్రి అదే ఆసుపత్రిలో పనిచేశారు. దీంతో అక్కడే పుట్టి పెరిగి, ఆసుపత్రి వైభవం చూసి, అక్కడే చదువుకుని డాక్టర్ అయ్యారు ఇక్బాల్ జావీద్.
ఆయన తనకు ఆసుపత్రితో ఉన్న అనుబంధం గురించి చెబుతూనే, ప్రభుత్వ వైద్య రంగంలో ఈ ఆసుపత్రి ప్రాధాన్యత, ప్రభుత్వ వైద్య రంగ చారిత్రక నిర్లక్ష్యం గురించి వివరించారు.
''అప్పట్లో ముఖ్యమంత్రి, ఐఏఎస్‌లు అయినా వైద్యానికి ఇక్కడికే వచ్చేవారు. వందేళ్ల క్రితమే మత్తుమందుపై ఇక్కడ పరిశోధనలు జరిగాయి. ఎప్పుడైతే 1985లో ప్రైవేటు మెడికల్ కాలేజీలు వచ్చాయో, అప్పటి నుంచీ దుర్దశ మొదలైంది. పలుకుబడి ఉన్నవారు అక్కడకు వెళ్తున్నారు. ప్రభుత్వం వారు ప్రైవేటులో వైద్యం చేయించుకుని రీయంబర్సుమెంటు పొందుతున్నారు. దీంతో ఈ ఆసుపత్రికి కనీసం సున్నం వేయించడం కూడా మానేశారు'' అన్నారాయన.
''ఒకప్పుడు ఆసుపత్రి నిర్వహణ చూడడానికి ఆర్ఎండ్‌బీ సిబ్బంది ఇదే ఆసుపత్రి ప్రాంగంణలో ఉండేవారు. వారు రోజూ రౌండ్స్ వేస్తూ చిన్న చిన్న రిపేర్లను తక్షణం బాగు చేయించేవారు. ఇన్ఫ్రా కార్పొరేషన్ వచ్చాక ఆ వ్యవస్థ పోయింది. మేం పూర్వ విద్యార్థుల తరపున అప్పట్లో కొణిజేటి రోశయ్యను కలిశాం. ఆయన వెంటనే 200 కోట్లు ఇచ్చారు. పనికాలేదు. తరువాత ఈటల రాజేందర్‌ను కలిశాం. కొత్త భవనాలు ఇదిగో వస్తాయి అదిగో వస్తాయి అన్నారు. రాలేదు. మళ్లీ ఏడాది క్రితం కలిస్తే, ఇప్పుడు కొత్త భవనాలకు డబ్బు లేదు. పాత భవనాలు బాగు చేయడానికి డబ్బు ఇస్తాం అన్నారు. అదీ లేదు.'' అని ఆరోపించారు డాక్టర్ జావీద్.
''మేం 2000 సంవత్సరం నుంచి ఆందోళన చేస్తున్నాం. ముందు రెండు టవర్లు అన్నారు. తరువాత ఆరోగ్య మంత్రి రాజేందర్ ఒక టవర్ కడుతున్నాం అన్నారు. ఆ తరువాత అదీ జరగలేదు. దీంతో వంద రోజుల పాటూ ఉస్మానియా డాక్టర్లు రోజుకు రెండు గంటలు సమ్మె చేశారు. అప్పుడూ కదల్లేదు. ఏడాది క్రితం కలసినప్పుడు, ఇప్పుడు కొత్త భవనాలకు డబ్బు లేదు. ఈ భవనం, ఇతర భవనాల బాగుచేతకు వంద కోట్లు ఇస్తామని స్వయంగా రాజేందర్ చెప్పారు. కానీ అదీ జరగలేదు. ఇప్పుడు సడన్‌గా నీళ్లొచ్చేశాయి. వందేళ్లలో ఎప్పుడూ రాని నీళ్లు ఇప్పుడే వచ్చాయంటే మాకేదో అనుమానం కూడా ఉంది''
''మేం చెప్పేది ఒకటే ఒక్కో గోడా ఒక్కో మీటర్ వెడల్పు ఉండే ఆ భవనాన్ని కూల్చడానికి కూడా 35-40 కోట్లు ఖర్చు అవుతుంది. దాన్ని బాగు చేయడం మీకు ఇష్టం లేకపోతే అలా వదిలేయండి. కానీ కూల్చకండి. పక్కన వేరే కొత్త భవనం కట్టండి'' అన్నారు జావీద్.

ఫొటో సోర్స్, Iqbal Javed
రాజకీయం
కాంగ్రెస్, బీజేపీల రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ కుమార్, బండి సంజయ్, ఇతర ప్రతిపక్షాల నేతలు ఆసుపత్రిని సందర్శించారు. మంత్రుల బృందం కూడా వెళ్లింది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తప్పు పట్టాయి. మంత్రులు మాత్రం ప్రతిపక్షాల వల్లే మేం కొత్త భవనాలు కట్టలేకపోతున్నాం అన్నారు. మరోవైపు రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఉస్మానియా విషయాన్ని టేకప్ చేసి ఆసుపత్రి యాజమాన్యానికి నోటీసులు ఇచ్చింది.
అదేరోజు ఆసుపత్రిని సందర్శించిన మంత్రుల బృందం ప్రతిపక్షాలపై ఇంతెత్తున లేచింది. ''పేదల కోసం 27 ఎకరాల్లో కొత్త భవనాలు కడతామంటే కొందరు ప్రతిపక్షాల వారు కోర్టులకు వెళ్లారు. ఆసుపత్రిలోకి నీళ్లొస్తే హంగామా చేస్తారా?'' అని తలసాని ప్రశ్నించారు. అధికారులు వెంటనే పరిస్థితిని చక్కదిద్దారని వివరించారు. హెరిటేజ్ భవనం అయితే బాగు చేయకూడదా? అని ఆయన ప్రశ్నించారు. ఇక్కడి ప్రతిపక్షాలు దరిద్రమైనవని, వైద్యం విషయంలో కేసీఆర్‌కు ప్రణాళిక ఉందని ఆయన అన్నారు.
''ఉస్మానియా ఆస్పత్రిలో మురుగునీరు రావడానికి ప్రతిపక్షాలే కారణం. 2015 లో కొత్త భవనాలు కడతాం అంటే కేసులు వేసి అడ్డుకున్నారు. ఇక్కడ సమస్య రాగానే వెంటనే పరిష్కరించాం'' అన్నారు మంత్రి ఈటల. ''కొత్త భవనాన్ని ఇపుడున్న స్థలంలో కడితే అడ్డుకోబోమని హామీ ఇస్తే, ఒక్క ఏడాదిలో అద్భుత భవనాన్ని కట్టి చూపిస్తాం'' అన్నారు మంత్రి శ్రీనివాస గౌడ్.
కానీ ఈ అంశంపై ప్రతిపక్షాలు తీవ్రంగానే స్పందిస్తున్నాయి. ''రాష్ట్రంలోని ప్రతిపక్షాలు, ఇతర పౌర సంస్థలూ 110 ఏళ్ళ భవనాన్ని కూల్చవద్దని కోరాయి. ఆ భవనాన్ని కాపాడాలని చెప్పాయి. అయితే, దాని ఉద్దేశం ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించవద్దని కాదు. ఆమాటకొస్తే బీజేపీ సహా ఎవరూ దాన్ని వ్యతిరేకించరు. అసలు కేసీఆర్ మరోచోట ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించకుండా ఎవరు ఆపారు? వేరే చోట మంచి స్థలం వెతికి అక్కడ ఉస్మానియా ఆసుపత్రిని పెద్దగా, కొత్తగా నిర్మించవచ్చు కదా? తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ప్రతిపక్షాలపై ఆరోపణలు చేస్తోంది టీఆర్ఎస్. ప్రగతి భవన్, పోలీస్ హెడ్ క్వార్టర్స్, సెక్రటేరియట్ బదులు బడులు, ఆసుపత్రులు నిర్మించాలి కేసీఆర్'' అన్నారు బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర రావు.

ఫొటో సోర్స్, Iqbal Javed
కోర్టు కేసు:
తెలంగాణ వైద్య రంగంపై సోమవారం హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఆ సమయంలో ఉస్మానియా ఆసుపత్రి ప్రస్తావన వచ్చింది. ''నేను ఉస్మానియా గురించి కూడా గౌరవ కోర్టు వారికి వివరించాను. వెంటనే స్పందించిన ఏజీ (ప్రభుత్వం తరపున) ఆ కేసుపై స్టే ఉందనీ, అందుకే కొత్త భవనాలు కట్టడం లేదనీ అన్నారు. నేను అందుకుని ఆ కేసుపై స్టే లేదని చెప్పాను. అప్పుడు న్యాయమూర్తి జోక్యం చేసుకుని, ఒకవేళ స్టే ఉంటే మీరు వాదించి, కేసు తేల్చుకోవచ్చు కదా? అలా ఎందుకు వదిలేయడం? పైగా ఆ పక్కనే ఖాళీ స్థలం ఉందిగా? అక్కడ ఎందుకు కొత్త భవనాలు నిర్మించరు? అని ప్రశ్నించారు'' అని కోర్టులో జరిగిన వాదనలు వివరించారు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్.
సచివాలయం కేసును వెంటనే ఫాలో అప్ చేసిన తెలంగాణ ప్రభుత్వం, ఉస్మానియా ఆసుపత్రి కేసును ఎందుకు ఫాలో అప్ చేయలేదన్న ప్రశ్నకు తెలంగాణ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.
కూల్చేయమంటోన్న కొందరు డాక్టర్లు
అయితే ఇప్పటి వరకూ ఉస్మానియా ఆసుపత్రిని కూల్చవద్దనే అక్కడి డాక్టర్లు చెప్పేవారు. కానీ మొదటిసారిగా ఆ భవనాన్ని కూల్చేసి కొత్తది కట్టాలంటూ కొందరు మంగళవారం ఆందోళన చేపట్టారు.
విచిత్రంగా, డాక్టర్లు ఆందోళన చేసిన మరునాడే అంటే మంగళవారం ఆందోళన జరగ్గా, బుధవారమే ఆ భవనాన్ని ఖాళీ చేయాలనీ, సీల్ వేయాలనీ, ఆ ఆదేశాల పాటించకపోతే సీరియస్ గా పరిగణించాల్సి వస్తుందనీ తెలంగాణ ప్రభుత్వ వైద్య విద్య డైరెక్టర్, ఉస్మానియా సూపరింటెండెంట్ కి ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఆదేశాల ఘనత తమదేనంటూ చాలా మంది ఉస్మానియా వైద్యులు సంబరపడుతున్నారు. కొందరు మాత్రం ఆ భవనాన్ని బాగు చేయకపోయినా పర్లేదు, కూల్చుకుండా, మిగతా వాటి స్థానంలో కొత్తవి కడితే బాగుండు అంటున్నారు. కానీ పేదలకు వైద్యం అందడానికి ఆ భవనమే అడ్డంకి అన్న ధోరణిలో వాతావరణాన్ని మార్చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఆ భవనాన్ని కాపాడుతూనే మరో కొత్త పెద్దాసుపత్రి కట్టండి అని ఎవరూ గట్టిగా అనలేని పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు అప్పట్లో ఉస్మానియా ఆసుపత్రిపై వేసిన కేసు గురువారం హైకోర్టులో విచారణకు రానుంది.

ఫొటో సోర్స్, Intach
ఉస్మానియా ఆసుపత్రి చరిత్ర
1866లో సాలార్‌జంగ్-1 చేతుల మీదుగా అఫ్జల్‌గంజ్ ఆసుపత్రిగా ప్రారంభం అయింది. ప్రస్తుతం ఉన్న భవనాలు చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో 1908లో పనులు ప్రారంభించగా, 1919లో పూర్తయ్యాయి. దీన్ని భారతీయ - బ్రిటిష్ వాస్తు శైలిలో, భారతీయ, బ్రిటిష్ ఆర్కిటెక్ట్‌లు కలసి నిర్మించారు. విన్సెంట్ ఎస్క్ అనే బ్రిటిష్ ఇంజినీర్ ఈ ఉస్మానియా ఆసుపత్రితో పాటూ హైకోర్టు, సిటీ కాలేజ్, కాచిగూడ రైల్వే స్టేషన్, కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్‌లు డిజైన్ చేశారు.
అప్పట్లో ఈ భవనం నిర్మాణానికి 20 లక్షల రూపాయలు ఖర్చయింది. మూసీ నదిని ఆనుకుని 26.5 ఎకరాల్లో ఈ ఆసుపత్రి నిర్మించారు. ఒక్క ఐపీ బ్లాకే 2.37 ఎకరాల్లో ఉందంటే ఆ ఆసుపత్రి ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం 11 బ్లాకులు ఉన్నాయి.
ఇక ఒస్మానియా మెడికల్ కాలేజీ 1846లో అప్పటి ఐదవ నిజాం రాజు మీర్ తనియత్ అలీ ఖాన్ హయాంలో హైదరాబాద్ మెడికల్ స్కూల్ గా ప్రారంభం అయింది. ఆ తరువాత 1919లో ఒస్మానియా మెడికల్ కాలేజీ అనే పేరు పెట్టారు. మలేరియా మందును కనుగొనడంలో పురోగతి హైదరాబాద్లోనే జరిగిందని తెలుసు. సర్ రోనాల్డ్ రాస్ పరిశోధనలకు అఫ్జల్‌గంజ్ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ ఎంతో సహకారం అందించాయి. ముఖ్యంగా మత్తు వైద్యం (అనస్తీషియా)పై ఎన్నో ప్రయోగాలు జరిగాయి. ప్రపంచంలోనే తొలి మహిళా మత్తు డాక్టర్ రూపా బాయి ఇక్కడే చదువుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- ‘నేను 420’ అంటూ నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్.. గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థుల దారుణం
- మనిషి మెదడు తినే అమీబా మళ్లీ కనిపించింది
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? ‘పది మందిని విడుదల చేసిన చైనా’
- జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహాయం కోరారు’
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








