భారత్ - చైనా సరిహద్దు ఉద్రిక్తతలు: ప్యాంగాంగ్ సో వద్ద ఘర్షణలు.. భారత్, చైనా పరస్పర ఆరోపణలు

ఫొటో సోర్స్, Getty Images
తూర్పు లద్దాఖ్‌లో ఇదివరకు ఒప్పందాల ప్రకారం అంగీకరించిన సరిహద్దులను చైనా సైనికులు మళ్లీ ఉల్లంఘించినట్లు భారత ప్రభుత్వం సోమవారం తెలిపింది. అయితే.. తమ సైనికులు వాస్తవాధీన రేఖను దాటలేదని సోమవారం చెప్పిన చైనా.. భారత సైన్యమే రేఖను ఉల్లంఘించిందని మంగళవారం నాడు ఆరోపించింది.
ఈ నేపథ్యంలో సరిహద్దులో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. సమస్యను పరిష్కరించేందుకు ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
ప్యాంగ్యాంగ్ సో దగ్గర ఏం జరిగింది?
చైనా సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ పరిస్థితిలను మార్చేందుకు ప్రయత్నించారని, భారత సైనికులు వారిని అదుపుచేశారని భారత ప్రభుత్వం సోమవారం నాడు పేర్కొంది.
అయితే ఈ ఘర్షణలో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు.

ఫొటో సోర్స్, PIB
దీనిపై భారత సైన్యం పీఐబీలో ఒక ప్రటకన విడుదల చేసింది. ''ప్యాంగాంగ్ సో సరస్సు సమీపంలో చైనా సైనికుల కవ్వింపు చర్యలను భారత సేనలు అడ్డుకున్నాయి'' అని చెప్పింది.
చర్చల ద్వారా శాంతి స్థాపనకు భారత సైన్యం కట్టుబడి ఉందని.. అదే సమయంలో దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగితే సహించేది లేదని ఉద్ఘాటించింది. తాజా వివాదంపై చుషుల్‌లో బ్రిగేడియర్ కమాండర్ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని తెలిపింది.
ఆగస్టు 29 రాత్రి ఈ కవ్వింపు చర్యలు చోటుచేసుకున్నట్లు భారత సైన్యం పేర్కొంది. సరిహద్దుల్లో పరిస్థితులను తారుమారు చేసేందుకు చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రయత్నించిందని పేర్కొంది. అయితే పరిస్థితులు చేయి జారిపోకుండా భారత సైనికులు అడ్డుకున్నట్లు వివరించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
చైనా స్పందన ఏమిటి?
అయితే.. చైనా సరిహద్దు బలగాలు వాస్తవాధీన రేఖను కచ్చితంగా పాటించాయని.. ఎన్నడూ ఆ రేఖను దాటలేదని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ మీడియాతో చెప్పినట్లు గ్లోబల్ టైమ్స్ పత్రిక సోమవారం తెలిపింది.
''రెండు దేశాల సరిహద్దు బలగాలు సరిహద్దు ప్రాంతాల అంశాలపై సంప్రదింపులు జరుపుతున్నాయి'' అని కూడా ఆయన పేర్కొన్నట్లు చెప్పింది.
మంగళవారం నాడు భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం ఒక ట్వీట్ చేస్తూ.. భారత సైన్యం ఎల్ఏసీని ఉల్లంఘించినట్లు ఆరోపించింది. సరిహద్దు దళాలను నియంత్రించాలని ఇండియాను చైనా అధికారికంగా కోరినట్లు చెప్పింది.
భారత సైనికులు ఆగస్ట్ 31న భారత - చైనాల మధ్య ఒప్పందాన్ని ఉల్లంఘించారని, ప్యాంగాంగ్ సో దక్షిణ ఒడ్డున, పశ్చిమం వైపు రెకిన్ పాస్ దగ్గర అక్రమంగా సరిహద్దు దాటారని, ఇలాంటి రెచ్చగొట్టే చర్యల వల్ల సరిహద్దు వద్ద ఉద్రికతలు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించింది.
సరిహద్దు దళాలను నియంత్రించాలని, ఇరు దేశాల మధ్య ఒప్పందాలను గౌరవించాలని, అక్రమంగా జొరబడిన సైనుకులను వెనక్కు పిలిపించాలని, ఉద్రిక్తతలు పెంచే ఎలాంటి చర్యలనైనా నిరోధించాలని కోరింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఏమన్నారు?
తాజా ఘర్షణల నేపథ్యంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు తమ అభిప్రాయాలను తెలియజేసారు.
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరంలో మాట్లాడుతూ "రెండు దేశాల్లోనూ 100 కోట్ల కంటే ఎక్కువ జనాభా ఉన్నప్పుడు ఎవరికి వారి సొంత చరిత్ర, సంస్కృతి ఉంటాయి. ఇరు దేశాల మధ్య ఒక అవగాహన, సంబంధాల మధ్య సమతౌల్యం రావడం అవసరం. రెండు దేశాలూ ఎప్పటికప్పుడు తమ బలాన్ని పెంపొందించుకుంటూ ఘర్షణలకు దిగుతూ ఉంటే దాని ప్రభావం ప్రపంచంలోని ఇతర దేశాలపై కూడా ఉంటుంది" అని అన్నారు.
మరోవైపు యూరోప్ పర్యటణలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఈ అంశంపై స్పందిస్తూ "భారత-చైనా సరిహద్దుల్లో శాంతిని కొనసాగించడానికి చైనా కట్టుబడి ఉంటుంది. చైనా సైన్యం కవ్వింపు చర్యలకు ఎప్పుడూ పాల్పడదు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించడానికి చైనా సిద్ధంగా ఉంది" అని అన్నారు.

చైనా సైన్యం రెచ్చగొడుతోంది: అనురాగ్ శ్రీవాస్తవ
చైనా ఆరోపణల విషయంలో భారత విదేశాంగ శాఖ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన జారీ చేసింది.
''భారత్ - చైనా సరిహద్దు వెంట పరిస్థితిని పరిష్కరించటానికి ఇరు దేశాలూ దౌత్య, సైనిక మార్గాల్లో సన్నిహితంగా చర్చిస్తున్న విషయం మీకు తెలుసు. ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం శాంతి, సామరస్యాలను కొనసాగించటానికి వీలుగా ఏ పక్షమూ రెచ్చగొట్టే చర్యలకు దిగరాదని.. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కూడా ఇంతకుముందు ఇద్దరు విదేశాంగ మంత్రులు, ప్రత్యేక ప్రతినిధులు అంగీకారానికి వచ్చారు. కానీ చైనా పక్షం ఆగస్టు 29 రాత్రి, 30వ తేదీన రెచ్చగొట్టే సైనిక కార్యకలాపాలు చేపట్టింది. ప్యాంగాంగ్ సరస్సు దక్షిణం ఒడ్డు ప్రాంతంలో యధాతధ పరిస్థితులను మార్చివేయటానికి ప్రయత్నించింది. భారత సైన్యం సోమవారం నాడు చెప్పినట్లుగా.. చైనా పక్షం రెచ్చగొట్టే చర్యలపై భారత పక్షం స్పందించింది. ప్రాదేశిక సమగ్రతను, మన ప్రయోజనాలను కాపాడటానికి వాస్తవాధీన రేఖ వెంట తగిన రక్షణాత్మక చర్యలు చేపట్టింది'' అని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.
''అంతేకాకుండా.. మంగళవారం ఆగస్టు 31న ఇరు పక్షాల గ్రౌండ్ కమాండర్లు పరిస్థితులను శాంతింప జేసేందుకు ఒకవైపు చర్చలు జరుపుతుండగానే.. చైనా సైన్యం మళ్లీ రెచ్చగొట్టే చర్యలకు దిగింది. భారత పక్షం సమయానికి రక్షణాత్మక చర్యలు చేపట్టటం వల్ల.. యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చటానికి చేసిన ప్రయత్నాలను నిరోధించగలిగింది'' అని వివరించారు.
చైనా సైన్యపు చర్యలు, ప్రవర్తనను చైనా పక్షానికి దౌత్య, సైనిక మార్గాల్లో తెలియజేశామని.. సరిహద్దు సైనికులను క్రమశిక్షణలో, నియంత్రణలో ఉంచాలని విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. వాస్తవాధీన రేఖ వెంట అపరిష్కృత సమస్యలన్నిటినీ శాంతియుత చర్చలతో పరిష్కరించుకోవాలనే వైఖరికి భారత్ కట్టుబడి ఉందని చెప్పారు.

ఫొటో సోర్స్, @GLOBALTIMESNEWS
ఉద్రిక్తతలను పెంచొద్దని కోరుతున్నాం: హువా చునియింగ్
భారత్ ఆరోపణలపై చైనా కూడా స్పందించింది. సరిహద్దు వద్ద పరిస్థితుల గురించి ప్రసార భారతి ప్రతినిధి అడిగిన ప్రశ్నకు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి హువా చునియింగ్ బదులిస్తూ.. సరిహద్దు విషయంలో ఇరు దేశాల మధ్య శాంతియుత, స్నేమపూర్వక సంప్రదింపులతో అంగీకారనీయమైన ఒప్పందానికి రాగలమని చైనా ఎల్లప్పుడూ భావిస్తోందని చెప్పారు. సరిహద్దు వద్ద శాంతి, సుస్థిరతలను పరిరక్సించటానికి ఇరు పక్షాలూ వివిధ స్థాయిల్లో చర్చలు జరుపుతున్నాయన్నారు.
''కానీ ఆగస్టు 31వ తేదీన.. భారత బలగాలు ప్యాంగాంగ్ సో సరస్సు దక్షిణం ఒడ్డున, రెకిన్ పర్వతం సమీపంలో మరోసారి అక్రమంగా ఎల్ఏసీ దాటాయి. వారి రెచ్చగొట్టే చర్యలు మళ్లీ ఉద్రిక్తతలకు దారితీశాయి? చైనా ప్రాదేశిక సమగ్రతను భారత పక్షం తీవ్రంగా ఉల్లంఘించింది. ద్వైపాక్షిక ఒప్పందాలను, ముఖ్యమైన ఏకాభిప్రాయాలను ఉల్లంఘించింది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సామరస్యాలను పాడు చేసింది'' అని ఆరోపించారు.
ఇటువంటి చర్యలను చైనా బలంగా వ్యతిరేకిస్తోందని.. వీటిపై భారత పక్షానికి కచ్చితమైన విజ్ఞాపనలు అందించామని చెప్పారు.
రెచ్చగొట్టే చర్యలన్నటినీ తక్షణమే నిలిపివేయాలని, ఎల్ఏసీని అక్రమంగా దాటిన బలగాలను ఉపసంహరించుకోవాలని, ఉద్రిక్తతలను పెద్దవి చేసే, పరిస్థితులను జటిలం చేసే చర్యలను మానుకోవాలని భారతదేశాన్ని తాము కోరుతున్నట్లు పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, AFP
నాలుగు నెలలుగా ఉద్రిక్తంగానే సరిహద్దులు...
భారత్, చైనా దేశాల మధ్య 3,500 కి.మీ పొడవైన సరిహద్దు ఉంది. 1962లో రెండు దేశాల మధ్య యుద్ధం కూడా జరిగింది.
లద్ధాఖ్ ప్రాంతంలో గత నాలుగు నెలల్లో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. జూన్ 15న లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య విధ్వంసకర ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు అప్పటినుంచి రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికీ పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి.
గాల్వన్ లోయలో జూన్ 15 నాటి ఘర్షణల అనంతరం రెండు దేశాల బలగాల మధ్య కొన్ని ఉప్పందాలు కుదిరాయి. అయితే ఇప్పటికీ చైనా బలగాలు కొన్నిచోట్ల వెనక్కి వెళ్లలేదని భారత సైన్యం చెబుతోంది. ముఖ్యంగా ప్యాంగాంగ్ సో సరస్సు సమీపంలో పరిస్థితులు ఎప్పటిలానే ఉన్నట్లు వెల్లడించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
భారత్, చైనా సరిహద్దు ఘర్షణల విషయంపై భారత్ ప్రభుత్వాన్ని విపక్షాలు, ముఖ్యంగా, కాంగ్రెస్ విమర్శిస్తున్నాయి. ప్రధాని మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా సోమవారం ట్విటర్‌లో విమర్శలు చేశారు.
''రోజూ భారత్‌పై దాడులు జరుగుతున్నాయి. చైనా సేనలు మన భూభాగాన్ని ఆక్రమించాయి. మన భూభాగంలోకి అక్రమంగా చొరబడుతున్నారు. మోదీ మీరు ఎక్కడున్నారు? చైనాతో ఎందుకు మాట్లాడట్లేదు? మీ మౌనం ఎందుకు?'' అని రణ్‌దీప్ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
- గల్వాన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? ‘పది మందిని విడుదల చేసిన చైనా’
- 'భారత సైనికులను ఎవరినీ నిర్బంధంలోకి తీసుకోలేదు' - చైనా
- కరోనావైరస్: భారత్‌లో గల్లంతవుతున్న కోవిడ్ మరణాలు ఎన్ని?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ రెండు, మూడు దశలకు డీసీజీఐ అనుమతి
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- కెప్టెన్‌గా ధోనీ తీసుకున్న 10 అసాధారణ నిర్ణయాలు
- కేరళ విమాన ప్రమాదంలో రియల్ హీరోలు వీళ్లే.. సెల్యూట్ చేసిన పోలీసు అధికారి
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
- ‘నేను ఆక్స్ఫర్డ్ కరోనావైరస్ వ్యాక్సీన్ వేయించుకున్నా.. ఇప్పుడు నేనేం చేస్తానంటే..’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








