మనుషులను చంపే జంతువుల విషాలు.. ప్రాణాలూ కాపాడతాయి కూడా.. అవేమిటో తెలుసా?

పాము విషం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జో కార్మియర్
    • హోదా, సైన్స్ రచయిత

కరోనావైరస్ కారణంగా జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే రోగాల గురించే ఈ మధ్య కాలంలో ఎక్కువ చర్చ జరిగింది. కానీ, నిజానికి అవి చాలాకాలంగా మనుషుల ప్రాణాలు కాపాడే మందుల తయారీలో పెద్ద పాత్ర పోషిస్తున్నాయి.

చెట్లు, జంతువుల నుంచి ప్రాణాంతకమైన వ్యాధులకు మందులు కనిపెట్టడం ప్రాచీనకాలం నుంచి ఉంది.

దాదాపు 40,000 సంవత్సరాల క్రితం ప్రాచీన మానవులు నొప్పిని నివారించే మందును చెట్టు బెరడు నుంచి సేకరించారని పరిశోధనల్లో తేలింది. అప్పటి నుంచి చెట్లు, జంతువులు మానవులకు అవసరమయ్యే మందుల తయారీలో ఉపయోగపడుతూనే ఉన్నాయి.

ఆయుర్వేద విధానంలో కీళ్ల నొప్పులకు పాము విషంతో తయారైన ఔషధాలు వాడతారు. చైనా సంప్రదాయ ఔషధాల్లో ఖడ్గమృగం, ఎలుగుబంటి, పులి లాంటి 36 జంతువుల నుంచి సేకరించిన పదార్థాలను వాడతారు. పులికోచ అని పిలిచే పెద్ద సాలెపురుగు కక్కే విషాన్ని దక్షిణ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో క్యాన్సర్ కణితుల చికిత్సకు, పంటినొప్పి, ఆస్తమా వంటి వ్యాధులకు ఉపయోగిస్తారు.

అయితే ఈ సంప్రదాయ చికిత్సల్లో చాలా వాటిని బలపరిచే సైన్స్‌పరమైన ఆధారాలు లేవు. ఇలాంటి చికిత్సల కోసం జంతువులను అధిక సంఖ్యలో వేటాడడం వల్ల అనేక జంతువులు అంతరించిపోయాయి కూడా.

సంప్రదాయ చైనా మందుల తయారీలో అలుగులను (పాంగోలిన్స్) అధికంగా వాడతారు. ఇందుకోసం వీటిని ప్రత్యేకంగా వన్యప్రాణుల ఫారంలలో పెంచుతున్నారు. నిన్న, మొన్నటివరకూ కోవిడ్-19 వ్యాధికి ఈ అలుగులే కారణమని అనుకున్నారు కూడా.

ఇదే తరహాలో వన్యప్రాణులపై దోపిడీ కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఇటీవలే శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

అయితే, వన్యప్రాణులకు హాని కలగకుండా వాటినుంచి మందులకు అవసరమయే పదార్థాలను సంగ్రహించవచ్చా అనే ప్రశ్నకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవుననే సమాధానం ఇస్తోంది.

జంతువుల నుంచి ఏ రకమైన పదార్థాలూ సంగ్రహించే అవసరం లేదని, వాటి డీఎన్ఏ దొరికితే చాలని పరిశోధకులు అంటున్నారు.

ఆయుర్వేదం

ఫొటో సోర్స్, Getty Images

మొక్కల్లో ఔషధాల తయారీకి కావలసిన ప్రత్యేకమైన పదార్థాలను గత 100 ఏళ్లుగా పరిశోధకులు గుర్తించి, వేరు చేస్తున్నారు. కానీ ఇదే ప్రక్రియ జంతువుల్లో సాధ్యపడదు. జంతువుల్లో ప్రత్యేకంగా ఏ కణాలు మందులకు ఉపయోగపడతాయో తెలుసుకోవడం కష్టం. తెలిసినా వాటిని సంగ్రహించడం ఇంకా కష్టం.

కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. డీఎన్ఏ ద్వారా ఇది సాధ్యపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భవిష్యత్తులో జంతువుల నుంచి ఎక్కువగా అంటువ్యాధులు వ్యాపిస్తాయి. అలాగే వాటికి మందులు కూడా జంతువుల నుంచే రాబోతున్నాయి.

"మొక్కల మీద చాలాకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ జంతువుల మీద ఈ రకమైన పరిశోధనలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి" అని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌లో ఇమ్యునాలజిస్ట్‌గా పనిచేస్తున్న క్రిస్టీన్ బీటన్ అంటున్నారు.

విషాల నుంచి సేకరించిన పెప్టైడ్లను (ఎమినో ఆమ్లాల గొలుసులు) మల్టిపుల్ స్క్లెరోసిస్ (నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి), రూమటాయిడ్ ఆర్థ్రైటస్ (కీళ్లనొప్పులు), మయొటానిక్ డిస్ట్రొఫీలాంటి వ్యాధుల చికిత్సలో ఉపయోగించవచ్చా అనే అంశంపై ఆమె పరిశోధన చేస్తున్నారు.

పరిణామక్రమంలో జంతువుల్లో ఏర్పడ్డ పెప్టైడ్లు అని పిలిచే పెద్ద పెద్ద అణువులను కనుక్కోగలిగాం. ఇవి మానవ శరీరంలో ఉండే అణువులకు తోబుట్టువుల్లాంటివి.

అంటే నత్తలు, సాలెపురుగులు, పాములవంటి జంతువులనుంచి సేకరించిన పెప్టైడ్లను, అవసరమైనచోట సరైన ప్రభావం చూపేలా మానవ కణజాలంలోకి ప్రవేశపెట్టొచ్చు.

పాము విషం

ఫొటో సోర్స్, Getty Images

పెప్టైడ్లు కూడా ప్రొటీన్లలాంటి నిర్మాణాన్నే కలిగి ఉంటాయి కానీ చిన్న గొలుసులు లేదా అణువుల సముదాయాలను కలిగి ఉంటాయి. వీటిని మినీ ప్రొటీన్లని అనొచ్చు.

ఆస్పరిన్‌లాంటి మందుల్లో ఉండే అణువులకన్నా ఇవి 10 నుంచి 40 రెట్లు పెద్దవి. కానీ, శరీరంలోని నిర్దిష్టమైన భాగాలమీద గురిపెట్టి ప్రభావం చూపుతాయి. కాబట్టి దుష్ర్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) ఉండే అవకాశం తక్కువ.

జంతువుల్లో మందుల తయారీకి ఉపయోగపడే నిర్దిష్టమైన సమ్మేళనాలను కనిపెట్టగలిగే స్థాయికి ప్రస్తుతం జీవశాస్త్రం చేరుకుంది.

"ఇప్పుడు మనం వందలకొద్దీ సమ్మేళనాలను నెల రోజుల్లోనే పరిశీలించవచ్చు. పదిహేనేళ్లక్రితం ఇదే పనికి 10 ఏళ్ల సమయం పట్టేది. సమ్మేళనాలను ఒకదాని తరువాత ఒకటి జాగ్రత్తగా పరిశీలించవలసి వచ్చేది" అని బీటన్ అన్నారు.

పాములు, తేళ్ల నుంచి రోజులతరబడి విషాలను బయటకి తీసే బదులు ఇప్పుడు వాటిల్లో నిర్దిష్ట లక్షణాలున్న పెప్టైడ్స్ కనుక్కోవచ్చు.

1981లో మొట్టమొదటిసారిగా సరీసృపాల నుంచి తయారుచేసిన మందు రెప్టిలస్‌తో సహా ఇప్పటికే జంతువుల విషాలనుంచి తయారుచేసిన అనేక మందులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

జంతువుల నుంచి తయారుచేసే మందుల్లో చాలా వరకూ వాటి విషాలనుంచి తయారైనవే. విషం, ఈ భూమి మీద దొరికే కొన్ని అత్యంత క్లిష్టమైన రసాయన పదార్థాల్లో ఒకటి.

కాకపోతే ఈ విషాలను సంగ్రహించే ప్రయత్నాలు ఆ ప్రాణులకు హాని చేస్తాయి.

ఇప్పుడు జంతువులకు హాని తలపెట్టకుండా వాటి విషాలనుంచి ఈ పెప్టైడ్లను మాత్రమే సేకరించి మందులు తయారుచేసుకోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.

పాము

ఫొటో సోర్స్, Getty Images

బ్రెయిన్ స్ట్రోక్‌కు మందు

విషాల నుంచి తయారయ్యే ఔషధాల పరిశోధనల్లో అత్యంత ఆశాజనకమైన మందు... బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మెదడుకు శాశ్వత హాని జరగకుండా నివారించేది.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు సంభవించడానికి కారణమవుతున్న వ్యాధుల్లో బ్రెయిన్ స్ట్రోక్ రెండోది. దీని వల్ల ఏటా 60 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. 50 లక్షల మంది శాశ్వత అంగవైకల్యానికి గురవుతున్నారు. కానీ ఇప్పటివరకూ దీనికి సరైన చికిత్స లేదు.

ఇంతవరకూ దీని చికిత్స కోసం టిష్యూ ప్లాస్మినోజెన్ ఏక్టివేటర్ అనే ఒకే ఒక్క మందును యూఎస్ ఫుడ్ అండ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది. మెదడుకు చెందిన ధమనుల్లో గడ్దకట్టిన రక్తాన్ని విడగొట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. కానీ ఆక్సిజన్ అందకపోవడంవల్ల నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడకుండా కాపాడేందుకు ఏ చికిత్సా లేదు.

"ప్రస్తుతం ఇదే మనకున్న అతి పెద్ద సమస్య. స్ట్రోక్ వల్ల బ్రెయిన్‌కు ఏ స్థాయిలో, ఎలాంటి నష్టం కలుగుతుందో చెప్పలేం" అని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌ల్యాండ్‌లోని బయోకెమిస్ట్ ప్రొఫెసర్‌ గ్లెన్ కింగ్ అంటున్నారు.

ప్రొఫెసర్ కింగ్, నాడీ కణాల్లో అయాన్ చానళ్లల్లో ఉండే లోపాల వల్ల నాడీ వ్యవస్థకు కలిగే అస్వస్థతలపై పరిశోధన చేస్తున్నారు.

విషాలు నేరుగా ఈ అయాన్ ఛానెళ్ల మీద పనిచేస్తాయి.

సాలీడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫన్నెల్ వెబ్ స్పైడర్ కాటు మనిషిని చంపగలదు... కానీ ఆ విషాన్ని బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన రోగుల చికిత్సకు ఉపయోగిస్తారు

వెన్నెముక ఉండని 700కు పైగా జీవాల విషాల నుంచి సంగ్రహించిన పెప్టైడ్ల మీద ప్రొఫెసర్ కింగ్ పరిశోధనలు చేస్తున్నారు. వెన్నెముక ఉన్న జీవులతో పోలిస్తే వెన్నెముక లేని జీవుల్లో విషాలు అభివృద్ధి చెంది ఉంటాయి.

వీటి మీద పరిశోధనలు చేస్తున్నప్పుడు, కేవలం ఒకే ఒక్క పదార్థం బ్రెయిన్ స్ట్రోక్ చికిత్సకు పనికివస్తుందని ప్రొఫెసర్ కింగ్ కనుగొన్నారు.

ఆ పదార్థం పేరు హెచ్ఐ1ఏ. ఇది ఆస్ట్రేలియాలో జీవించే ఫనల్-వెబ్ స్పైడర్ (సాలెపురుగు) హాడ్రోనిష్ ఇంఫెన్సా నుంచి సేకరించిన విషంలో ఒక భాగం. 3,000 అణువులతో కూడిన ఈ పదార్థం "ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన రసాయన ఆయుధాగారం" అని కింగ్ పేర్కొన్నారు.

కింగ్ పరిశోధనాపత్రంలో 2017లో నేచురల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ప్రచురితమైంది. ఎలుకల మీద చేసిన ప్రయోగంలో, స్ట్రోక్ వచ్చిన ఎనిమిది గంటల తరువాత హెచ్ఐ1ఏను ఇస్తే పెద్ద నష్టం జరగకుండా నివారించవచ్చని తేలినట్లు అందులో పేర్కొన్నారు.

స్ట్రోక్ వచ్చిన నాలుగు గంటలలోపు దీన్ని ఇస్తే 90% నష్టాన్ని నివారించవచ్చని తేలిందని, దీనివల్ల వచ్చే దుష్ప్రభావాలు దాదాపు ఏమీ ఉండవని కింగ్ అంటున్నారు.

నత్త

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోన్ స్నెయిల్ విషాలు చేపలకు ప్రాణాంతకం.. కానీ మనుషుల్లో నొప్పిని నివారిస్తుంది

"విషాలు అన్నిసార్లూ మనకు ప్రమాదకరం కావు. లక్ష కన్నా ఎక్కువ సాలెపురుగులుంటే, వాటిలో మనుషులకు ప్రమాదం కలిగించేవి చాలా స్వల్ప మొత్తంలోనే ఉంటాయి" అని కింగ్ తెలిపారు.

ఉదాహరణకు కోన్ స్నైల్ (నత్త) విషాల నుంచి తయారుచేసే జింకానిటైడ్ మందు చేపలకు ప్రాణాంతకం కావొచ్చు. కానీ, మనుషుల్లో మాత్రం నొప్పిని నివారించే ఔషధంగా అది పనిచేస్తుంది.

అయాన్ ఛానళ్లమీద కింగ్ చేస్తున్న పరిశోధనల్లో ఇతర నాడీ వ్యవస్థకి సంబంధించిన రోగాలను కూడా పెప్టైడ్ల ద్వారా నయం చేయవచ్చని తేలింది.

హెచ్ఎం1ఏ అనే పెప్టైడ్‌ని మూర్చరోగాలకు చికిత్సలో భాగంగా వాడొచ్చని, డ్రావెట్ సిండ్రోమ్ అనే ప్రమాదకార మూర్చరోగానికి అందించే చికిత్సలో ఈ పెప్టైడ్ పనితీరు ఆశాజనకంగా ఉందని ఆయన అంటున్నారు.

‘‘మనుషుల్లోనూ, ఎలుకల్లోనూ ఈ డ్రావెట్ సిండ్రోమ్ లక్షణాలు ఒకే రకంగా ఉంటాయి. హెచ్ఎం1ఏను ఎలుకలపై ప్రయోగించినప్పుడు నాడీవ్యవస్థ పనితీరు బాగా మెరుగుపడింది. మరణ అవకాశాలు బాగా తగ్గాయి’’ అని కింగ్, 2018లో రాసిన పరిశోధనాపత్రంలో పేర్కొన్నారు.

తేలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డెత్‌స్టాకర్ తేలు విషంతో.. ఎంఆర్‌ఐ స్కాన్లలో కూడా దొరకని క్యాన్సర్ కణాలను గుర్తించి తొలగిస్తున్నారు పరిశోధకులు

క్యాన్సర్‌కు చికిత్స

ఫ్రెడ్ హట్చిన్సన్ క్యాన్సర్ యూనివర్సిటీకి చెందిన అంకాలజిస్ట్ జిమ్ ఓల్సన్, క్యాన్సర్ వ్యాధి నివారణకు పెప్టైడ్లను ఉపయోగించవచ్చా అని పరిశోధిస్తున్నారు.

డెత్‌స్టాకర్ అనే తేలు విషం నుంచి సంగ్రహించిన క్లోరోటాక్సిన్ సీవై5.5 అనే టాక్సిన్‌ను ఉపయోగించి ఎంఆర్ఐ స్కాన్ కన్నా సూక్ష్మంగా క్యాన్సర్ కణాలను పరిశీలించవచ్చని పరిశోధనలో తేలింది.

క్యాన్సర్‌ను గుర్తించడమే కాకుండా పూర్తిగా తొలగించేందుకు ఉపయోగపడే పెప్టైడ్స్‌ను కనుగొనే దిశలో మరికొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

ఆస్ట్రేలియాలో క్యూఐఎంఆర్ బెర్ఘోఫర్ మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన మరియా ఇకోనోమోపౌలౌ గొమెసిన్ పెప్టైడ్ చర్మ క్యాన్సర్ కణాలను తొలగించగలదని కనుగొన్నారు.

పాము

ఫొటో సోర్స్, Getty Images

నొప్పి నివారణకు పెప్టైడ్స్

ప్రతి ఐదుగురిలో ఒకరికి ఏవో ఒకరమైన దీర్ఘకాలిక నొప్పులు ఉంటాయి. ఇలాంటి నొప్పుల నివారణకు పెప్టైడ్స్‌ ఉపయోగపడతాయా అని పరిశోధనలు సాగుతున్నాయి.

విషాలు రోగ చికిత్సకు బంగారు గనుల్లాంటివి. పరిణామక్రమంలో లక్షల సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందుతూ నాడీవ్యవస్థ మీద తీవ్రంగా పనిచేసే లక్షణాలను ఇవి పెంపొందించుకున్నాయి.

"జంతువులనుంచి సంగ్రహించిన పెప్టైడ్స్ మానవాళికి చాలా ప్రయోజనకారకంగా ఉన్నాయి. ఇవి వేలల్లో లభ్యమవుతున్నాయి. వీటన్నిటితోనూ ఒక డాటాబేస్ తయారుచేసుకోగలిగాం. వీటిల్లో ఏది ఏ వ్యాధి చికిత్సకు ఉపయోగపడుతుందో కనిపెట్టడమే ఇప్పుడు మన ముందున్న సవాలు" అని ఆస్ట్రేలియా మొనాష్ యూనివర్సిటీకి చెందిన రే నార్టన్ అంటున్నారు.

పాము

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జంతువుల విషాలు.. లక్షలాది సంవత్సరాల పరిణామంలో ఇతర జంతువుల నాడీ వ్యవస్థ లక్ష్యంగా పనిచేసేలా రూపొందాయి

కరోనావైరస్‌కు మందు?

ప్రస్తుతం శాస్త్రవేత్తలు జంతువుల పెప్టైడ్ల నుంచి కరోనావైరస్‌కు మందును కనిపెట్టే దిశలో పరిశోధనలు చేస్తున్నారు.

ఫ్రెడ్ హట్చిన్సన్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్‌కు చెందిన జచరీ క్రూక్... కోవిడ్-19ను నివారించగలిగే పెప్టైడ్ కోసం డాటాబేస్‌ను పరిశోధిస్తున్నారు.

"కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌ను నిరోధించడానికి ఒక ఇన్‌హెలర్ ద్వారా లేదా నెబులైజర్ ద్వారా లోనికి పీల్చుకోగలిగే మందును తయారుచేయడమే లక్ష్యం" అని క్రూక్ అంటున్నారు.

క్రమంగా పెరుగుతున్న పర్యావరణ మార్పులు జీవవైవిధ్య సంక్షోభానికి దారి తీసి అనేక జాతుల జీవులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఏ జంతువుల విషాలు మనకు పనికొస్తాయో తెలిసే లోపే అవి అంతరించిపోయే ప్రమాదం ఉంది అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికైనా మనమంతా మేల్కొని పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ దిశగా చర్యలు చేపట్టకపోతే ఈ భూమి మీద అనేక జాతులను కోల్పోతామని హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)