బోట్స్‌వానా: వందల సంఖ్యలో ఏనుగులు అక్కడ ఎలా చనిపోతున్నాయి? ఏమిటీ మిస్టరీ?

ఫొటో సోర్స్, SUPPLIED
బోట్స్‌వానాలో గత రెండునెలలుగా అసాధారణ రీతిలో వందలాది ఏనుగులు చనిపోవడం మిస్టరీగా మారింది.
ఈ సంవత్సరం మే నెల నుంచి బోట్స్‌వానాలో అసాధారణ రీతిలో మరణిస్తున్న వందలాది ఏనుగుల మిస్టరీ గురించి బోట్స్వానా పరిశోధనలు జరపనున్నది
మరణించిన ఏనుగుల నుంచి సేకరించిన శాంపిళ్ళను కెనడా, దక్షిణ ఆఫ్రికా, జింబాబ్వే లోని ల్యాబ్ లకు పంపిస్తారు.
బోట్స్‌వానాలోని ఒకవాంగో డెల్టా ప్రాంతంలో గత రెండు నెలల్లో 350 కి పైగా ఏనుగు మృత దేహాలు కనిపించినట్లు డాక్టర్ నియాల్ మక్కాన్ చెప్పారు.
“ఎందుకు చనిపోతున్నాయో ఎవరికీ అర్థం కావట్లేదు”. ల్యాబ్‌కు పంపిన శాంపిల్స్ ఫలితాలు రావడానికి కొన్ని వారాలు పట్టవచ్చని ప్రభుత్వం పేర్కొంది.
హెచ్చరిక: ఈ కింది చిత్రాలు ఆందోళన కలిగించవచ్చు.
ఈ మరణాలను మొదట స్థానిక పర్యావరణ పరిరక్షకులు గుర్తించి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారని యూకే స్వచ్ఛంద సంస్థ నేషనల్ పార్క్ రెస్క్యూలో పనిచేస్తున్న డా. నియల్ మక్కాన్ బీబీసీ కి తెలిపారు.
"మూడు గంటల పాటు డెల్టా ప్రాంతంలో సాగిన విమాన ప్రయాణంలో 169 ఏనుగుల మృతదేహాలను గుర్తించారు. అంత తక్కువ సమయంలో అన్ని మృతదేహాలను గుర్తించడం అసాధారణమైన విషయం. తరువాతి నెలల్లో మరిన్ని మృతదేహాలు బయటపడ్దాయి. మొత్తం 350కి పైగా మృతదేహాలు బయటపడ్డాయి" అని మక్కాన్ చెప్పారు.
“కరువు కాటకాలు లేకపోయినా అనూహ్యంగా ఇన్ని ఏనుగులు చనిపోవడం వింతగా ఉంది” అని ఆయన అన్నారు.
చనిపోయిన ఏనుగుల దంతాలు సవ్యంగానే ఉనాయని, ఇది ఏనుగుల వేట కాదని బోట్స్‌వానా ప్రభుత్వం నిర్థరించింది.

ఫొటో సోర్స్, SUPPLIED
వేట కాకపోతే మరేమై ఉంటుంది?
“ఏనుగులు మాత్రమే చనిపోయాయి. వేటగాళ్ల పనే అయితే సైనేడ్ ప్రభావం వలన ఇతర జంతువులు కూడా చనిపోయుండాలి. కానీ అలా జరగలేదు.” అని మక్కాన్ అన్నారు.
గత ఏడాది సహజ ఆంత్రాక్స్ విషవాయువులు వెలువడి బోట్స్‌వానాలో దాదాపు వంద ఏనుగులు చనిపోయాయి. ఈసారి కూడా అదే కారణమై ఉంటుందనే అనుమానాన్ని డా. మక్కాన్ తాత్కాలికంగా తోసిపుచ్చారు.
అయితే విషయవాయువుల ప్రభావం లేదా ఏదైనా వ్యాధి సోకి చనిపోయుండొచ్చనే కారణాలను పూర్తిగా కొట్టివేయలేమని అన్నారు.
ముఖ్యంగా వాటి ముఖాలు వడలిపోయి ఉండడం, చనిపోయేముందు అవి గుండ్రంగా తిరుగుతూ ఉన్నాయనే గుర్తులు పై కారణాలను సూచిస్తున్నాయని, వాటి నాడీ వ్యవస్థ దెబ్బతినడం వలన అలా గుండ్రంగా తిరిగి ఉండొచ్చని డా. మక్కాన్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Supplied
ఏది ఏమైనా, సరైనా కారణాలు తెలిసేవరకూ, ఈ వ్యాధి మానవులకు సంక్రమించే అవకాశాన్ని కొట్టివేయలేమని ఆయన అన్నారు. ముఖ్యంగా వ్యాధికి మూలం నీటి వనరులు లేదా మట్టి అయితే మనుషులకు సంక్రమించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. కోవిడ్-19 జంతువులనుంచీ మనుషులకు సంక్రమించిన విషయాన్ని డా. మక్కాన్ గుర్తు చేసారు.
బోట్స్‌వానా వన్యప్రాణి, జాతీయ ఉద్యానవనాల విభాగం డైరెక్టర్ డా. సైరిల్ టోలో, ది గార్డియన్ పత్రికతో మాట్లాడుతూ ఇప్పటివరకూ 280 ఏనుగులు చనిపోయినట్టు తేలింది. మిగతావి ఇంకా నిర్థరణ కావల్సి ఉందని అన్నారు.
ఇలా అనూహ్యంగా ఏనుగులు చనిపోవడానికి కారణాలు ఇంకా తెలీదు. పరీక్షలకు శాంపిల్స్ పంపించాం. ఫలితాలు రావడానికి ఇంక కొన్ని వారాలు పట్టొచ్చు అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు
- అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆగ్రహ జ్వాలలు - ‘‘ఊపిరి ఆడటం లేదు... చచ్చిపోతున్నాం’’
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- కరోనావైరస్: ముంబయి మహానగరాన్ని కోవిడ్-19 ఎలా ధ్వంసం చేసింది
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుదాడుల నుంచి బతికి బయటపడ్డ మొసలి ఇప్పుడు మృతి
- జాక్ మా: కరోనావైరస్ను కట్టడి చేయాలని, చైనా ప్రతిష్ఠను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్న మహా కోటీశ్వరుడు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








