'ఏనుగులను హింసించి చంపేస్తారు, ఆ తర్వాత మొసలి కన్నీళ్లు పెడతారు...''

సంగీతా అయ్యర్

ఫొటో సోర్స్, Sangita Iyer

ఫొటో క్యాప్షన్, లక్ష్మి అని పిలిచే ఆ ఏనుగును చూడగానే తనకు ప్రేమ పుట్టిందని సంగీతా అయ్యర్ అన్నారు.
    • రచయిత, స్వామినాథన్ నటరాజన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సంగీతా అయ్యర్ గత కొన్నేళ్ల నుంచీ మతం పేరుతో ఏనుగులను వేధించడాన్ని అంతం చేయాలనే మిషన్‌లో ఉన్నారు.

“దేవుడు తానే సృష్టించిన ఒక జీవి పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తే ఎలా భరించగలడు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం” అని ఆమె బీబీసీతో అన్నారు.

కేరళలో పుట్టినా ప్రస్తుతం టొరంటోలో ఉంటున్న అయ్యర్ దీనిపై ఒక డాక్యుమెంటరీ రూపొందిస్తున్నారు. చిన్నపిల్లలకు ఏనుగంటే ఎంత ఇష్టమో, అలాగే తనకూ వాటిని చూస్తే చాలా సంతోషంగా ఉంటుందని ఆమె చెప్పారు.

“నేను చిన్నప్పుడు ఏనుగుల పెరేడ్ చూసేదాన్ని. నాకది చాలా బాగా నచ్చేది” అన్నారు.

కానీ, వేడుకల కోసం ఉపయోగించే ఏనుగులు ఎన్ని బాధలు భరిస్తున్నాయో ఆమెకు తర్వాత తెలిసింది.

కన్నీరు పెడుతున్న గజరాజు

ఫొటో సోర్స్, Sangita Iyer

ఫొటో క్యాప్షన్, పండుగలు, ఉత్సవాల్లో ఏనుగులు చాలా బాధను అనుభవిస్తాయి

లోతైన గాయాలు

కొన్నేళ్లు కెనడాలో ఉన్న సంగీత తన తండ్రి మొదటి వర్ధంతి కోసం 2013లో భారత్ వచ్చారు. ఆ ట్రిప్‌లో ఉన్నప్పుడు ఆమె సంప్రదాయం ప్రకారం అలంకరించే ఆభరణాలు, దుస్తులేవీ లేకుండా ఏనుగులను చూశారు. వాటి పరిస్థితిని చూసి తల్లడిల్లిపోయారు.

“వాటిలో చాలా ఏనుగులకు నడుము దగ్గర తీవ్రమైన గాయాలున్నాయి. వాటి పాదాల నుంచి రక్తం కారుతోంది. కాళ్లకు వేసిన గొలుసులు ఒరుసుకుని వాటికి చర్మం కోసుకుపోయింది. వాటిలో చాలా ఏనుగులకు కళ్లు సరిగా కనిపించడం లేద”ని సంగీత చెబుతున్నారు..

పనిచేసే, ప్రదర్శనలకు ఉపయోగించే జంతువులకు సంబంధించిన షరతులను చాలా స్పష్టంగా రాశారు. సంగీతా రూపొందించిన ‘గాడ్స్ ఇన్ షకిల్స్’(సంకెళ్లలో దేవుడు) డాక్యుమెంటరీలో ఆలయాల్లో ఉన్న ఏనుగులు ఎంత దారుణ పరిస్థితుల్లో ఉన్నాయో బయటపెట్టింది.

“అవి నిస్సహాయ స్థితిలో ఉంటాయి. వాటికి వేసే గొలుసులు చాలా భారీగా ఉంటాయి. అవన్నీ చూసి సహించలేకపోయాను” అంటారు సంగీత.

గురువాయూర్ ఆలయం వద్ద యాభైకి పైగా ఏనుగులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గురువాయూర్ ఆలయం వద్ద యాభైకి పైగా ఏనుగులు

గొప్పల కోసం

హిందూ, బౌద్ధ సంప్రదాయంలో ఏనుగులను పవిత్రంగా భావిస్తారు. ఆలయాల్లో, బౌద్ధ ఆరామాల్లో శతాబ్దాల నుంచీ ఏనుగులను శతాబ్దాల నుంచీ ఊరేగింపులకు, ఇతర కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. భక్తులు ఏనుగుల నుంచి ఆశీర్వాదాలు కూడా తీసుకుంటుంటారు.

కొన్ని ఏనుగుల గొప్పతనం అవి చనిపోయిన తర్వాత కూడా కనిపిస్తుంటుంది. కేరళలోని గురువాయూర్ ఆలయం దగ్గర కేశవన్ అనే ఒక ఏనుగు విగ్రహం మనకు కనిపిస్తుంది.

ఏనుగులు మావటీలు

ఫొటో సోర్స్, Sangita Iyer

వేడుక విగ్రహాలు

1976లో చనిపోవడానికి ముందు 72 ఏళ్ల వయసులో కేశవన్ ఆ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిందని చెబుతారు. ఆలయాల్లో ఉన్న ఏనుగులు చనిపోతే అందరూ గుమిగూడడం, సంతాపం ప్రకటించడం మామూలే.

“వారు హింసించి ఏనుగులను చంపేస్తారు. అవి చనిపోయిన తర్వాత దీపాలు వెలిగించి మొసలి కన్నీళ్లు పెడతారు” అంటారు సంగీత.

స్వయంగా హిందువు అయిన సంగీత, ఆలయాల్లో ఏనుగులను ఉపయోగించడం ఆపివేయాలని వాదిస్తున్నారు.

“భారత్‌లో ప్రస్తుతం 2,500 ఏనుగులు మనుషుల అదుపులో ఉన్నాయి. వీటిలో దాదాపు 20 శాతం ఏనుగులు కేరళలోనే ఉన్నాయి. ఆలయాలు, కొందరి దగ్గర ఈ ఏనుగుల యాజమాన్య హ్కులు ఉన్నాయి”.

ఏనుగులకు ఉన్న సాంస్కృతిక, మతపరమైన ప్రాధాన్యం గురించి సంగీతకు తెలుసు. కానీ, ఏనుగు చాలా తెలివైన, సున్నితమైన, సామాజిక జీవి అని ఆమె చెబుతున్నారు.

ఏనుగులు

ఫొటో సోర్స్, Sangita Iyer

ఉత్సవ విషాదం

ఏనుగుల పాదాలు గట్టి నేలపై, కంకర వేసిన దారుల్లో నడవడానికి తగినట్లు ఉండవు. వేసవిలో ఆ దారులు చాలా వేడెక్కుతాయి.

వేడుకల సమయంలో గట్టిగా వినిపించే సంగీతం ఉంటుంది. శబ్దాలు ఉంటాయి. జనం భారీగా ఉంటారు. బాణాసంచా పేలుస్తారు. ఏనుగులు అలాంటి వాతావరణంలో ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో అవి బెదిరిపోయినట్లు కనిపించకుండా ఉండడానికి వాటిని కొడుతుంటారు” అని సంగీత చెప్పారు.

ఏనుగులను అదుపుచేయడానికి మావటి అంకుశం, ముళ్లున్న గొలుసులు. మొనదేలిన ఐరన్ రాడ్లు ఉపయోగిస్తుంటారు.

ఆమె తన డాక్యుమెంటరీ కోసం 25 గంటల ఫుటేజ్ చిత్రీకరించారు. అందులో ఏనుగులపై చూపిస్తున్న క్రూరత్వానికి సంబంధించి ఎన్నో దృశ్యాలను రికార్డు అయ్యాయి.

“నేను చాలా కదిలిపోయాను. ఈ అందమైన జంతువులు బాధపడుతుంటే, ముఖం తిప్పుకుని వెళ్లిపోతే ఏలా? అని నాలో నేనే అనుకున్నా”

ఏనుగులపై జరిగే హింస గురించి వినగానే ఆమె భావోద్వేగానికి గురవుతారు. తిరువంబడి ఆలయ అథారిటీ దగ్గర ఉన్న రామభద్రం అనే ఏనుగుకు ఏం జరిగిందో చెప్పారు.

“ఆ ఏనుగు తొండానికి పక్షవాతం వచ్చింది. అది నీళ్ల ట్యాంకులో తన తొండం వేసినా, నీళ్లు తాగడం దానికి చాలా కష్టంగా ఉండేది. అది చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపించింది” అన్నారు.

చివరకు ఆ ఏనుగు పరిస్థితి ఎంత ఘోరంగా మారిందంటే, అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా దానికి కారుణ్యమరణం ఇవ్వాలని సూచించింది. కానీ, చనిపోయేవరకూ దానిని ఆలయ వేడుకల్లో ఉపయోగిస్తూనే వచ్చారు.

రక్తమోడుతున్న గాయాలు

ఫొటో సోర్స్, Sangita Iyer

ఫొటో క్యాప్షన్, రక్తమోడుతున్న గాయాలు

గాయాల నుంచి ఆగని రక్తం

శరీరం గాయాలతో నిండిపోయిన మరో ఏనుగును కూడా ఆమె చూశారు.

“ఒక ఏనుగు చర్మంలో చాలా లోతైన గాయాలు నాకు కనిపించాయి. వాటిని నుంచి రక్తం కారుతూనే ఉండేది. ఒక మనిషి వాటిని అలా హింసించగలడని నేను ఊహించలేయాను. మావటీలు ఏనుగులను హింసిస్తుంటారు. కానీ సంపాదనలో పడి దానిని ఏ ఆలయాలూ పట్టించుకోవడం లేదు” అన్నారు.

ఏనుగులు

ఫొటో సోర్స్, Sangita Iyer

లాభసాటి వ్యాపారం

ఏనుగుల లాబీయింగ్ చేసే గ్రూప్ చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యాపారంలో చాలా డబ్బు వస్తుంది. కొన్ని ఏనుగులు ప్రతి వేడుకలో 75 వేల రూపాయలకు పైగా తెచ్చిపెడతాయి.

థెచికొట్టుకావు రామచంద్రన్ కూడా అలాంటి ఏనుగే. దాని ద్వారా లక్షలు సంపాదించేవారు. ఆసియాలో అతిపెద్ద పెంపుడు ఏనుగు కూడా అదేనని చెబుతారు.

త్రిచూర్‌లో ప్రతిఏటా జరిగే ఏనుగుల పెరేడ్‌కు రామచంద్రన్ ఇప్పటికీ ఒక ఆకర్షణగా నిలుస్తోంది. దాని పేరున వీకీపీడియాలో ఒక పేజ్ కూడా ఉంది.

రామచంద్రన్ వయసు ఇప్పుడు 56 ఏళ్లు. దానికి పాక్షికంగా కళ్లు కనిపించడం లేదు. ఆ కంగారులో అది చాలాసార్లు జనాలపైకి వెళ్లడంతో ఆరుగురు చనిపోయారు కూడా. అయినా దానిని సేవల నుంచి రిటైర్ చేయించాలని చూస్తున్న వన్యప్రాణి అధికారులు ప్రయత్నాలు విఫలమవుతున్నాయి.

రామచంద్రన్‌ను ఇప్పటికీ చాలా వేడుకల్లో భారీ శబ్దాల్లోకి పంపిస్తున్నారు.

ఏనుగుల ద్వారా మరింత డబ్బు సంపాదించేందుకు కొత్త కొత్త వేడుకలకు కూడా సిద్ధమవుతుంటారని సంగీత చెబుతున్నారు.

ఆసియా ఏనుగుల్లో మగ ఏనుగులకు మాత్రమే దంతాలు ఉంటాయి. కేరళ ఆలయాలు అలాంటి ఏనుగులనే ఇష్టపడతాయి. కానీ, దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో ఆడ ఏనుగులను కూడా ఉపయోగిస్తున్నారు.

సంగీత స్నేహితురాలు లక్ష్మి

ఫొటో సోర్స్, Sangita Iyer

ఫొటో క్యాప్షన్, సంగీత స్నేహితురాలు లక్ష్మి

తొలిచూపు ప్రేమ

20014లో సంగీత ఒక ఆడ ఏనుగును చూశారు. దాన్ని చూడగానే ముగ్ధురాలయ్యారు. “నేను లక్ష్మిని మొదటిసారి చూసినప్పుడు, తొలి చూపులోనే దానితో ప్రేమలో పడిపోయా” అంటారు సంగీత

“నేను ఆ ఏనుగును తాకాను. దాని మెడకింద నిమిరాను. నా వాసన చూసేందుకు అది నా తలపై తొండం పెట్టింది. ఏనుగులకు వాసన పసిగట్టే శక్తి అద్భుతంగా ఉంటుంది”.

ఏడాది తర్వాత లక్ష్మిని చూసిన సంగీత షాక్ అయ్యారు. దాని కళ్లలో నీళ్లు కారుతుండడం చూసి తట్టుకోలేకపోయారు.

“లక్ష్మి మావటి భోజనాన్ని తినేసింది. దాంతో, అతడు దానిని చాలా దారుణంగా కొట్టాడు. అంకుశంతో దాని కంట్లో పొడిచాడు. అలా అది గుడ్డిదైపోయింది”.

ఆ సమయంలో లక్ష్మికి కచ్చితంగా చాలా ఆకలేసి ఉంటందని సంగీతకు అనిపించింది.

“ఆలయాల్లో ఉండే ఏనుగులకు సరిగా తిండి పెట్టరు. ఎందుకంటే, అవి ఆలయాల లోపల పేడ వేస్తాయని వాళ్లకు భయం ఉంటుంది” అన్నారు.

సంగీత ఫిర్యాదు చేయడంతో లక్ష్మిని గాయపరిచిన ఆ మావటిని తొలగించారు.

ఏనుగులు

ఫొటో సోర్స్, Sangita Iyer

మూడు రోజులు కట్టేసి కొడతారు

ఏనుగులు తమ మాట వినడానికి మావటిలు వాటిని దారుణంగా హింసిస్తుంటారు.

మగ ఏనుగులను బంధీగా ఉన్నప్పుడు అత్యంత హింసాత్మక శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది.

మావటిలు ఆ ఏనుగులను మూడు రోజులపాటు గొలుసులతో కట్టేసి దారుణంగా కొడతారు. దాంతో, ఆ తర్వాత అవి ఆ మావటి చెప్పినట్లు వింటుంటాయి.

ఏనుగులు

ఫొటో సోర్స్, Sangita Iyer

అక్రమంగా బంధిస్తారు

శ్రీలంక, థాయ్‌లాండ్ లాంటి దేశాల్లో కూడా ఏనుగులను ఇలాంటి పనులకే ఉపయోగిస్తున్నారు.

చాలా డిమాండ్ ఉండడంతో గున్న ఏనుగులను అక్రమంగా బంధించే కార్యకలాపాలు పెరగవచ్చని సంగీత భావిస్తున్నారు. బలవంతంగా ఏనుగుల బ్రీడింగ్‌ను కూడా ప్రోత్సహించే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

బలవంతంగా ఏనుగుల బ్రీడింగ్ చేయడం ఒక విధంగా ఒక మహిళపై అత్యాచారం జరగడం లాంటిదే.

“గున్న ఏనుగులను పర్యటకులకు వినోదం అందించడానికి ఉపయోగిస్తున్నారు. థాయ్‌లాండ్ అలాంటి వాటిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంద”ని సంగీత చెప్పారు.

సంగీతకు భారత ప్రభుత్వం నుంచి విమెన్ అచీవర్స్ అవార్డు లభించింది. కానీ, సొంత రాష్ట్రంలో మాత్రం ఆమె ప్రయత్నాలకు మిశ్రమ స్పందన కనిపిస్తోంది.

“కొంతమంది దీనిని పూర్తిగా కొట్టిపారేస్తారు. తాము చేసేది తప్పని వారు అసలు అంగీకరించరు”

ఏనుగు లక్ష్మి

ఫొటో సోర్స్, Sangita Iyer

ఫొటో క్యాప్షన్, లక్ష్మికి ఇప్పుడు ఒక కన్ను కనిపించదు.. అయినా అది పని చేస్తూనే ఉంది.

బలపడుతున్న గళం

సాంస్కృతిక పరిరక్షకులుగా చెప్పుకునే కొందరి నుంచి సంగీతకు బెదిరింపులు వస్తున్నాయి.

“సోషల్ మీడియాలో కామెంట్లతో నన్ను అణచివేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ, మా గళం ఇప్పుడు ఇంతకు ముందు కంటే బలపడింది” అంటారు సంగీత.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)