చైనా - రష్యా దేశాలు అమెరికన్ డాలర్‌కు చెక్ పెడుతున్నాయా... డాలర్ పడిపోతే ఎవరికి నష్టం, ఎవరికి లాభం?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా కరెన్సీ డాలర్‌కు అంతర్జాతీయ మారక ద్రవ్యంగా గుర్తింపు ఉంది. అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్‌ను, ఆ తర్వాత యూరోను ఎక్కువగా వినియోగిస్తుంటారు. వివిధ దేశాల్లోని కేంద్రీయ బ్యాంకుల్లో ఉండే విదేశీ మారక నిల్వల్లో డాలర్ల వాటా 64 శాతంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ కరెన్సీగా డాలర్ ఉండటం సహజమే. డాలర్ అంతర్జాతీయ మారక ద్రవ్యంగా మారగలగడం అమెరికా ఆర్థికవ్యవస్థ శక్తి సామర్థ్యాలకు సంకేతం.
మొత్తం అమెరికన్ డాలర్లలో 65 శాతం మేర డాలర్లు ఆ దేశం వెలుపలే వినియోగంలో ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ జాబితా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 185 కరెన్సీలు ఉన్నాయి. వీటిలో చాలా కరెన్సీల వినియోగం ఆయా దేశాలకే పరిమితం. ప్రపంచవ్యాప్తంగా ఒక కరెన్సీ వ్యాప్తి ఎంతగా ఉందన్నది ఆ దేశ ఆర్థికవ్యవస్థ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది.
యూరో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ బ్యాంకుల్లో 19.9 శాతం వరకూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వాణిజ్యంలో 85% అమెరికన్ డాలర్ల ద్వారానే జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా రుణాల్లో 39% డాలర్ల రూపంలోనే ఇస్తున్నారు. అందుకే, విదేశీ బ్యాంకులకు అంతర్జాతీయ వాణిజ్యం కోసం డాలర్ల అవసరం ఉంటుంది.
అయితే, డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు రష్యా, చైనా చేతులు కలుపుతున్నాయి. ఈ రెండు దేశాలు మారక ద్రవ్యం విషయంలో ఓ కూటమిగా మారుతున్నాయని కొందరు నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అంతర్జాతీయ కరెన్సీగా డాలర్ ఎలా మారిందంటే...
గతంలో చాలా దేశాలు బంగారాన్ని మెరుగైన మారకంగా భావించేవి. బంగారం నిల్వల ఆధారంగా తమ దేశాల్లో నగదు ముద్రించేవి. 1944లో బ్రెటన్ వుడ్స్ ఒప్పందం కుదిరిన తర్వాత డాలర్‌కు ప్రాధాన్యం పెరిగింది.
న్యూ హాంప్‌షైర్‌లోని బ్రెటన్ వుడ్స్‌లో అభివృద్ధి చెందిన దేశాలు సమావేశమయ్యాయి. అమెరికన్ డాలర్ ఆధారంగా అన్ని నగదు మారకాలను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాయి. అప్పట్లో అమెరికా దగ్గర బంగారం నిల్వలు అత్యధికంగా ఉండేవి.
ఈ ఒప్పందంలో భాగమైన దేశాలు బంగారానికి బదులుగా డాలర్‌ను వినియోగించేందుకు ఇతర దేశాలను కూడా అనుమతించాయి. 1970 ఆరంభంలో ద్రవ్యోల్బణం సమస్యను ఎదుర్కొనేందుకు చాలా దేశాలు డాలర్లకు బదులుగా బంగారం ఇవ్వాలని అమెరికాను డిమాండ్ చేశాయి. అప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న నిక్సన్ ఆ వీలు లేకుండా విధానంలో మార్పు చేశారు. అయితే, అప్పటికే ప్రపంచంలోనే ప్రధానమైన కరెన్సీగా డాలర్ మారిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
చైనా, రష్యా ఏం చేస్తున్నాయంటే...
రష్యా కేంద్రీయ బ్యాంకు, ఫెడరల్ కస్టమ్ విభాగం ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2020 ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో రష్యా, చైనా ద్వైపాక్షిక వాణిజ్యంలో డాలర్ వినియోగం తొలిసారి 50 శాతం కన్నా తగ్గిందని ఆసియా నిక్కెయీ రివ్యూ పత్రిక కథనం ప్రచురించింది.
రష్యా, చైనా ద్వైపాక్షిక వాణిజ్యంలో 46 శాతం మేర మాత్రమే డాలర్లను వినియోగిస్తున్నారు. ఈ రెండు దేశాల వాణిజ్యంలో యూరోల వినియోగం ఎన్నడూ లేనంతగా 30 శాతం కన్నా ఎక్కువకు పెరిగింది. రష్యా, చైనా కరెన్సీలతోనే జరుగుతున్న వాణిజ్యం మరో 24 శాతం దాకా ఉంది. వీటి వినియోగం కూడా ఇదివరకు ఈ స్థాయిలో లేదు.
కొన్నేళ్లుగా రష్యా, చైనా ద్వైపాక్షిక వాణిజ్యంలో డాలర్ వినియోగాన్ని బలవంతంగా తగ్గించుకుంటూ వస్తున్నాయి. 2015 వరకూ ఈ రెండు దేశాల మధ్య 90 శాతం వాణిజ్యం డాలర్లు వినియోగిస్తూనే జరిగేది.
అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మొదలైన తర్వాత డాలర్ వినియోగాన్ని తగ్గించాలనే ఆలోచనలు తీవ్రమయ్యాయి. వాణిజ్యంలో డాలర్ వినియోగాన్ని తగ్గించుకోవాలని చైనా, రష్యాలు బాగా ఆలోచించి కొత్త విధానాలు అమలు చేయడం మొదలుపెట్టాక డాలర్ వినియోగం పడిపోతూ వచ్చింది. 2019 ఆరంభంలో చైనా, రష్యా వాణిజ్యంలో డాలర్ వినియోగం 51 శాతానికి తగ్గింది.

ఫొటో సోర్స్, Getty Images
డాలర్ వినియోగాన్ని నెమ్మదిగా తగ్గిస్తూ, రష్యా, చైనా ఓ కూటమిగా మారుతున్నాయని ఏషియన్ ఎకానమీ ఆఫ్ సైన్సెస్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్ ఈస్టర్న్ స్టడీస్ డైరెక్టర్ అలెక్సె మసలోవ్ అన్నారు. ఆర్థిక పరంగా రష్యా, చైనా రెండు సహకారం అందించుకుంటున్నాయని... ద్వైపాక్షిక వాణిజ్యం కోసం ఈ రెండు దేశాలు కొత్త విధానం నిర్ణయించుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘సైనికపరమైన, వాణిజ్యపరమైన ఒప్పందం జరగొచ్చని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ, బ్యాంకింగ్, ఆర్థిక అంశాలకు సంబంధించిన ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయి. అయితే, రెండు దేశాలు నిర్ణయాల్లో తమ స్వతంత్రతకు భంగం రాకుండా జాగ్రత్తపడాల్సి ఉంటుంది’’ అని అన్నారు.
2014 నుంచే డాలర్ వినియోగాన్ని తగ్గించడంపై చైనా, రష్యా దృష్టి పెట్టాయి. క్రిమియాను రష్యా ఆక్రమించుకున్న తర్వాత, ఆ దేశంతో పాశ్యాత్య దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో రష్యా, చైనా ఆర్థిక సహకారం పెంపొదించుకోవడం మొదలైంది.
అమెరికా ఆంక్షల నుంచి రష్యా తప్పించుకోవాలంటే వాణిజ్యంలో డాలర్ల వినియోగాన్ని తగ్గించుకోవడం తప్పనిసరిగా మారింది. ‘‘ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆన్‌లైన్ నగదు చెల్లింపులు డాలర్ల రూపంలో జరుగుతుంటాయి. ఏదో ఒక అమెరికా బ్యాంకు అనుమతితో ఇవి జరగాల్సి ఉంటుంది. అంటే, అమెరికా ప్రభుత్వం కొన్ని లావాదేవీలను ఆపమని బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వొచ్చు’’ అని రష్యాలోని ఐఎన్‌జీ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త డిమిత్రీ డోలిగిన్ అన్నారు.
అమెరికన్ డాలర్ సూచీలో మార్చితో పోల్చితే తొమ్మిది శాతం పతనం నమోదైంది. ప్రపంచంలోని ఆరు బలమైన కరెన్సీలతో పోల్చి, దాని విలువను లెక్కిస్తారు. 2011 తర్వాత ఆ స్థాయి కనిష్ఠానికి చేరవలో ఇప్పుడు డాలర్ ఉంది. కరోనావైరస్ సంక్షోభం ప్రభావం మిగతా వ్యవస్థలతో పోల్చితే అమెరికాపై భారీగా పడిందన్న అనుమానాలు డాలర్‌పై ఒత్తిడి పెంచుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్‌కు లాభమా?
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో డాలర్‌ది ప్రధాన స్థానం కావడంతో, మార్కెట్‌లో దాని విలువలో హెచ్చుతగ్గులు తరచుగా వస్తుంటాయి. ఒకవేళ డాలర్ విలువ పతనమైతే యూరప్, జపాన్ దేశాలకు చేదు వార్తే అవుతుంది. రెండేళ్లుగా డాలర్ విలువ పెరుగుతూ వచ్చింది. కానీ, గత ఏడాదితో పోల్చితే ఇప్పుడు డాలర్ విలువ మూడు శాతం తక్కువగా ఉంది. 2017లో డాలర్ పది శాతం మేర పడిపోయింది.
డాలర్ విలువ పడిపోతే, అమెరికాకు చెందిన ఎగుమతిదారులకు లాభం కలుగుతుంది. మల్టీ నేషనల్ కంపెనీలు తమ దగ్గర ఉన్న విదేశీ మారకాన్ని డాలర్లుగా మార్చుకొని లాభం పొందొచ్చు. అమెరికా షేర్ మార్కెట్‌లో సూచీలు పెరిగేందుకు ఇదో మంచి వార్త అవుతుంది. కొన్ని వారాలుగా మార్కెట్లు నష్టాల్లోనే నడుస్తున్నాయి.
చరిత్రలో డాలర్ విలువ వేగంగా పడిపోయినప్పుడల్లా అమెరికాలోని ఎస్ అండ్ పీ సూచీ (ప్రముఖ షేర్ మార్కెట్ సూచీ) 2.6 శాతం మేర లాభాలు చవిచూసిందని... టెక్నాలజీ, ఇంధనం రంగాల సంస్థ షేర్లు మెరుగైన ప్రదర్శన చేశాయని అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాక్ ఓ నివేదికలో తెలిపింది.
2020లో డాలర్ విలువ పది శాతం పడిపోతే, షేర్ల విలువ మూడు శాతం పెరుగుతుందని గోల్డ్‌మన్ సాక్ అంచనా వేసింది. వచ్చే ఏడాది కాలంలో డాలర్ విలువ ఐదు శాతం మేర తగ్గవచ్చని అభిప్రాయపడింది.
అయితే, డాలర్ బలహీనపడటం వల్ల అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు రాజకీయంగా ప్రయోజనం కలగొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నవంబర్‌లో అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి. ట్రంప్ రెండో సారి అధ్యక్ష పదవి దక్కించుకోవాలని ఆశపడుతున్నారు. డాలర్ విలువ ఎక్కువగా ఉండటం వల్ల అమెరికన్ ఉత్పత్తిదారులకు నష్టం కలుగుతోందని ఆయన వాదిస్తూ వస్తున్నారు.
డాలర్ విలువ పతనం వల్ల వచ్చే ప్రయోజనం పరిశ్రమల రంగానికి చేరుకునేవరకూ ఒక ఏడాది సమయం పడుతుందని, అప్పటిలోగా అమెరికాలో ఎన్నికలు ముగిసిపోతాయని డ్యూచ్ బ్యాంక్ అంతర్జాతీయ ముఖ్య వ్యూహ కర్త ఎలాన్ రస్కిన్ అన్నారు. ట్రంప్‌కు రాజకీయంగా ఎలాంటి ప్రయోజనమూ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- చైనా - భారత్ సరిహద్దు సంఘర్షణ: 21వ శతాబ్దపు అతిపెద్ద జగడం ఇదేనా?
- ‘నీకు జీవితంలో తోడు దొరకదని శకుంతల దేవి చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- అయోధ్యలో రామమందిరం కింద టైమ్ కాప్స్యూల్?.. అందులో దాగిన రహస్యమేంటి
- బాబ్రీ మసీదు విధ్వంసాన్ని పీవీ నరసింహారావు ఎందుకు ఆపలేదు?
- ‘తిలక్ ఇంకొన్నాళ్లు బతికుంటే భారత్-పాకిస్తాన్‌లు విడిపోయేవి కాదు’
- మహిళల క్రీడా దుస్తులు: నాడు, నేడు
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- స్వదేశంలో కంటే విదేశాలకు అప్పులు ఇవ్వడానికే చైనా బ్యాంకుల మొగ్గు
- టిబెట్‌ను చైనా ఎప్పుడు, ఎలా తన ఆధీనంలోకి తీసుకుంది?
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








