ఏనుగులు వేరే వాటిని కాపాడ్డానికి తమ ప్రాణాలనే పణంగా పెడతాయా?

థాయ్ ఏనుగుల మృతి

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, అన్నా జోన్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వారం క్రితం, ఒకే ప్రమాదంలో 11 ఏనుగులు మృతి చెందడంతో థాయ్‌లాండ్ విషాదంలో మునిగిపోయింది.

ఉప్పొంగి ప్రవహిస్తున్న నదిలో కొట్టుకుపోయిన ఒక ఏనుగును కాపాడే ప్రయత్నంలో మిగతా ఏనుగులు కూడా జలపాతం పైనుంచి పడి చనిపోయాయి.

మొదట ఆరు ఏనుగులు చనిపోయాయని అటవీశాఖ అధికారులు భావించారు. కానీ కొన్ని రోజుల తర్వాత ప్రవాహం దిగువన మరో ఐదు ఏనుగుల కళేబరాలు గుర్తించారు.

ఈ ఏనుగులు నదిలో పడిన గున్న ఏనుగును కాపాడే ప్రయత్నంలో చనిపోయాయని ఖావో యాయ్ నేషనల్ పార్క్ రేంజర్స్ గుర్తించారు. 150 మీటర్ల ఎత్తులో ప్రమాదకరంగా ఉండే హ్యూ నరోక్ లేదా హెల్స్ ఫాల్స్ జలపాతం దగ్గర నదిని దాటుతుండగా ఈ ఘటన జరిగింది. మొదట ఒక గున్న ఏనుగు పడిపోగా.. దానిని కాపాడే ప్రయత్నంలో మిగతావి కూడా జలపాతం పైనుంచి పడిపోయాయి.

ఒకే ఘటనలో 11 ఏనుగులు చనిపోవడంతో థాయ్‌లాండ్‌లో ఏనుగుల జనాభాకు తీవ్ర నష్టం జరిగింది. ఏనుగులు ప్రాణత్యాగం చేసినట్లు అనిపించిన ఈ ఘటన ప్రపంచాన్ని కలచివేసింది.

కానీ, భావోద్వేగాలను పక్కనపెడితే.. ఒక గున్న ఏనుగును కాపాడ్డం కోసం మిగతా ఏనుగులకు తమ ప్రాణాలనే ప్రమాదంలో పెట్టాలనే ఆలోచన, సానుభూతి రావడం అనేది ఎంతవరకూ ఆమోదయోగ్యం? ఇప్పుడు ముఖ్యంగా, ప్రాణాలతో మిగిలిన రెండు ఏనుగులను చూస్తుంటే మనకు ఏం అర్థం అవుతోంది?

ఏనుగులు పడిపోయిన జలపాతం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఏనుగులు పడిపోయిన 'హెల్స్ ఫాల్స్' జలపాతం

న్యూయార్క్‌ హంటర్ కాలేజ్ సిటీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జోషివా ప్లాట్నిక్ థాయ్‌లాండ్‌లోని ఏనుగులపై దశాబ్దానికి పైగా అధ్యయనం చేస్తున్నారు.

"ప్రమాదానికి సంబంధించిన ఏ ఆధారాలు లేకుండా, అక్కడ ఏం జరిగిందో మనం అంచనా వేయలేం. కానీ ఒక గుంపులోని ఒక ఏనుగు ప్రమాదంలో పడితే, మిగతా ఏనుగులు దానికి కచ్చితంగా తమ శక్తి మేరకు సాయం అందించడానికి ప్రయత్నిస్తాయి" అన్నారు.

ఏనుగులు ప్రమాదాన్ని గుర్తించినపుడు, సమన్వయంతో వాటి నుంచి బయటడినట్లు చిత్రీకరించిన కొన్ని ఆధారాలు ఉన్నాయి.

అక్కడ, అవన్నీ అంత ప్రమాదకరంగా ప్రవహిస్తున్న జలపాతాన్ని దాటడానికి వెళ్లినట్టు నాకు అనిపించడం లేదు. అలా చేసుంటే, అక్కడ ఇంకా భయంకరమైన ప్రమాదం జరిగుండేది

"ప్రాణాలు పోతాయని తెలిసినా సరే, ప్రమాదంలో ఉన్న ఒక ఏనుగును కాపాడేందుకు మిగతా ఏనుగులు ఏమాత్రం వెనకాడవు" అని వియన్నా యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ మెడిసన్‌లో ఏనుగుల ప్రవర్తనపై పరిశోధన చేసిన డాక్టర్ రాచెల్ డేల్ చెప్పారు.

"కానీ అవి తెలివైన జంతువులు.. ఏనుగులు చాలా తెలివైనవి.. అంటే, ఏదైనా చేసేముందు, అందులోని ప్రమాదాన్ని కూడా పూర్తిగా అంచనా వేసే సామర్థ్యం వాటికి ఉంటుంది" అని ఆమె అన్నారు.

థాయ్ ఏనుగుల మృతి

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, జలపాతం దిగువన ఏనుగుల మృతదేహాలు

ఆ ప్రాంతం అత్యంత ప్రమాదకరం

థాయ్‌లాండ్ సైన్స్ రీసెర్చ్ అండ్ ఇన్నొవేషన్ ఆఫీసులో థాయ్‌లాండ్ హ్యూమన్-ఎలిఫెంట్ కోఎగ్జిస్టెన్స్ ప్రాజెక్ట్‌కు నేతృత్వం వహిస్తున్న భిచెట్ నూంటో ఏనుగుల ప్రవర్తనపై అధ్యయనం చేస్తున్నారు.

"ప్రమాదం జరిగిన సమయంలో పార్కులో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. వర్షాకాలంలో 'హ్యూ నరోక్' ప్రాంతం ఏనుగులకు చాలా ప్రమాదకరం అనేది అందరికీ తెలిసిందే" అన్నారు.

1992లో అదే జలపాతం పైనుంచి 8 ఏనుగులు పడి చనిపోయాయి. తన బిడ్డ వెనుక ఒక తల్లి ఏనుగు దూకడం పార్క్ అధికారులు కూడా చూశారు. 1987లో కూడా ఒక గున్న ఏనుగు కొండమీద నుంచి పడి చనిపోయినట్లు భావించారు

జలపాతం ఉన్న ప్రాంతంలో భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలూ జరగకుండా, ప్రమాదకరమైన ప్రాంతాల నుంచి ఏనుగులను దూరంగా ఉంచడానికి ఆ పార్క్ అధికారులు కొన్ని మైళ్ల వరకూ కాంక్రీట్ పిల్లర్లు కూడా నిర్మించారు.

థాయ్ ఏనుగుల మృతి

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఏనుగులు జలపాతం దగ్గరికి వెళ్లకుండా కట్టిన కాంక్రీట్ పిల్లర్లు

కాంక్రీట్ పిల్లర్లకు ముళ్ల కంచెలు కూడా చుట్టారు. కానీ అవి అన్ని ప్రాంతాలనూ కవర్ చేయలేకపోతున్నాయి.

ఏనుగులు ఆ పిల్లర్ల పక్కనే నడుచుకుంటూ నదిలోకి దారి వెతుకుతూ వెళ్లినట్లు రేంజర్లు అడుగు జాడలను గుర్తించారు.

ఆ ఏనుగులు ఒక ప్రత్యేకమైన స్థానిక మొక్క కోసం వెతుకుతూ ఉండచ్చని నేషనల్ పార్క్ డిపార్ట్‌మెంట్, వైల్డ్ లైఫ్, ప్లాంట్ కన్సర్వేషన్(డీఎన్‌పి) చెప్పింది.

ఆ మొక్క ఏడాదికోసారి ఆ ప్రాంతంలో మాత్రమే ఉంటుందని, ఆ మొక్క కోసమే అవి అంత ప్రమాదానికీ తెగించి ఉంటాయని భావిస్తున్నారు. లేదంటే మనుషులకు ఎదురుపడకుండా ఉండడానికి అవి అలా వెళ్లుంటాయని చెబుతున్నారు.

"ఏనుగుల్లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని మనుషుల్లా మర్యాదగా, అల్లరిగా, కొన్ని మంచిగా ఉంటాయి. తమకు తెలీని దారుల్లో వెళ్లేటపుడు, వాటిలో కొన్ని పడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది". అని డీఎన్‌పి డైరెక్టర్ సోంగథామ్ సుక్సవాంగ్ చెప్పారు.

థాయ్ ఏనుగుల మృతి

ఫొటో సోర్స్, BHITCHET NOONA

ప్రమాదం నుంచి బయటపడినా...

మరోవైపు, ఈ ఘోర ప్రమాదం నుంచి రెండు ఏనుగులు బయటపడ్డాయి. వాటిలో ఒక తల్లి, దాని పిల్ల ఉన్నాయి. అవి అడుగున జారుడుగా ఉన్న బండల దగ్గర చిక్కుకుపోయాయి. కానీ, పార్క్ అధికారుల సాయంతో అవి సురక్షితంగా బయటకు రాగలిగాయి.

ఏనుగులకు తమ గుంపులో ఒకటి ప్రమాదంలో ఉందని, దానిని కాపాడాలని అర్థం చేసుకునే తెలివితేటలు, సానుభూతి ఉన్నప్పుడు, ఈ బయటపడిన రెండు ఏనుగులను ఎలా అర్థం చేసుకోవాలి.

"ఏనుగులకు పెద్ద మెదడు ఉంటుంది. అందుకే అది చాలా తెలివైన, సామాజిక, సానుభూతి ఉన్న జంతువు. ఏదైనా విషాదం జరిగితే, మనం ఎంత బాధపడతామో.. అలాగే అవి కూడా బాధపడతాయి అని నేను కచ్చితంగా చెప్పగలను" అని అని డాక్టర్ ప్లాత్నిక్ చెప్పారు.

"ఆ ఏనుగుల గుంపు మధ్య ఉన్న కచ్చితమైన బంధం ఏంటనేది ఇంకా తెలీలేదు. కానీ చనిపోయిన వాటిలో ఆ సమూహానికి నాయకత్వం వహించే ఆడ ఏనుగు కూడా ఉంటే.. మిగిలిన రెండు ఏనుగులు అడవిలో తమ ఆవాసం గురించి దశాబ్దాల నుంచీ ఉన్న కీలక సమాచారాన్ని కోల్పోతాయి".

థాయ్ ఏనుగుల మృతి

ఫొటో సోర్స్, Getty Images

"ఎందుకంటే ఏనుగుల జీవితాలు చాలావరకూ మన జీవితాల్లాగే ఉంటాయి. అవి తరతరాల నుంచి అందిన జ్ఞానంపై ఆధారపడతాయి. ఈ విషాదం వాటి ప్రవర్తనను, అవి ఎప్పుడూ వెళ్లే మార్గాలను మారుస్తుందా లేదా అనేది తెలీడానికి మనకు చాలా కాలం పడుతుంది" అని డాక్టర్ డేల్ చెప్పారు.

కానీ పార్క్ అధికారులు మాత్రం ఈ రెండు ఏనుగులకు అడవిలో జీవించగలిగే, ఈ జలపాతాలకు దూరంగా ఉండగలిగే నైపుణ్యం ఉందని చెబుతున్నారు.

"ఆ ప్రాంతంలో రిపోర్టుల ప్రకారం ఇక్కడ ఈ రెండు ఏనుగుల కుటుంబంలోని సభ్యులు ఇంకా చాలా ఉండచ్చు. అలా లేదంటే, వాటిని వేరే కుటుంబం తమ గుంపులో కలుపుకుంటుంది. బంధించిన ఏనుగులను కాపాడి తిరిగి అడవిలో వదిలినపుడు, వాటిపై జరిగిన అధ్యయనాల్లో అలా జరుగుతుందనే విషయం తెలిసింది" అని నూంటో చెప్పారు.

"అవి జీవించగలవు, వేరే గుంపులోకి వెళ్లి ఉండగలవు. తమ కుటుంబాన్ని తిరిగి పెంచుకోడానికి మగ ఏనుగులను కూడా కలవవచ్చు" అన్నారు.

థాయ్ ఏనుగుల మృతి

ఫొటో సోర్స్, KHAO YAI NATIONAL PARK

ఫొటో క్యాప్షన్, చనిపోయిన ఏనుగు దగ్గర బాధలో మరో ఏనుగు

అడవి సురక్షితం కాదు

ఏనుగుల్లో నిస్సందేహంగా ఒక ఆకర్షణ ఉంటుంది. అంత భారీ ఆకారం ఉన్నా, ఆ జంతువులు వేయ్యేళ్లకు పైగా మనిషితో ఒక బంధాన్ని ఏర్పరుచుకుంది.

అవి దాదాపుగా సాధు స్వభావంతో ఉంటాయి. మనలాగే కుటుంబాలతో జీవిస్తాయి. సరదాగా కనిపిస్తాయి. ఈ రెండూ విషాదంలో ఉండడం మనం స్పష్టంగా చూడచ్చు.

ఖావో యాయ్ లాంటి ఘోర ప్రమాదం తర్వాత మనకు ఈ ఏనుగులపై సానుభూతి ఉండడం సహజం..

ఏనుగులను మనుషుల్లాగే చూసినంత మాత్రాన దానివల్ల వాటికి ఎలాంటి సాయం లభించడం ఉండదని డాక్టర్ డేల్ చెప్పారు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

మన మనుగడకు సాయం చేసేలా మనుషులు కొన్ని మంచి పనులు చేస్తారు. మనకు సాయం అయిన ఆ పనులు వేరే ప్రాణులకు ఎప్పుడూ పనిచేయవు. అంటే ఎప్పుడూ మనిషి దృష్టితో చూడడం వల్ల వేరే జీవులను అర్థం చేసుకోవడం, వాటి అభివృద్ధికి అవసరమైనవి ఏవి అని తెలుసుకోడం కుదరదు అని ఆమె అన్నారు.

"భావోద్వేగాలను పక్కనపెట్టి, అవి అలా ఎందుకు ఆలోచిస్తాయి, అలా ఎందుకు చేస్తున్నాయి అని తెలుసుకోవడంపై అధ్యయనం చేస్తే, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలా అడ్డుకోవచ్చు అనే విషయాన్ని శాస్త్రవేత్తలు బాగా గుర్తించవచ్చు".

"ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. కానీ ఈ ఘోరాలు "ఈ అడవి సురక్షితమైన ప్రాంతం కాదు" అని అంత భారీ ఆకారం ఉన్న ఏనుగులకు కూడా గుర్తు చేసేలా, ఒక రిమైండర్‌లా మిగిలిపోతాయి.

థాయ్ ఏనుగుల మృతి

ఫొటో సోర్స్, BHITCHET NOONA

ప్రమాదంలో చనిపోయిన ఏనుగుల కళేబరాలను తీసి, వాటిని పరీక్షించారు. తర్వాత వాటిని పార్కులోనే ఖననం చేశారు. అలా, తమకు దూరమైన ఆ ఏనుగులను పార్కులో ఉన్న వారు ప్రతి ఏటా స్మరించుకోనున్నారు.

"ఇది పార్క్ అధికారులను చాలా విషాదంలో ముంచేసింది. అందుకే, వారు ఇంకోసారి ఇలా జరగకూడదని అనుకుంటున్నారు. ఇది థాయ్ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన విషయం" అని నూంటో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)