తెలంగాణ ఆర్టీసీ సమ్మె: ఉద్యోగులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారన్న కేసీఆర్.. నోటీసుల్లేకుండా ఎలా తీస్తారన్న యూనియన్లు

కేసీఆర్

ఫొటో సోర్స్, TELANGNA I&PR/TSRTC

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆర్టీసీ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ప్రభుత్వం, కార్మిక సంఘాలూ ఎవరూ తగ్గడం లేదు. ప్రభుత్వం అయితే సమ్మె చేసిన వారు అసలు ఉద్యోగులే కాదు, కొత్త ఆర్టీసీ ఇలా ఉండబోతోంది అంటూ విధి విధానాలు కూడా ప్రకటించింది.

ఆర్టీసీ సమ్మెపై రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ రూపొందించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కొందరు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్న సమావేశంలో భవిష్యత్తులో ఆర్టీసీని ఎలా నడపాలన్నదానిపై చర్చించారు. ఆర్టీసీలో ప్రైవేటు బస్సులు వస్తాయంటూనే, మొత్తం ఆర్టీసీని మాత్రం ఎప్పటికీ ప్రైవేటీకరించబోమని ప్రకటించారు.

ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం ప్రభుత్వానికి ఏ మాత్రం ఇష్టం లేదనీ, ఆర్టీసీ సంస్థ ఉండి తీరాల్సిందేననీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.

ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అసౌకర్యం కలగకుండా చూడడమే ప్రభుత్వ ధ్యేయం అనీ, తదనుగుణంగానే ఆర్టీసీని పటిష్టపరచడానికి అనేక చర్యలు చేపట్టుతున్నామనీ సీఎం కేసీఆర్ అన్నారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

టీఎస్ ఆర్టీసీ

సునీల్ శర్మ ప్రతిపాదనలపై చర్చించి తీసుకున్న నిర్ణయాలు

  • ఇకపై ఆర్టీసీలో మూడు రకాల బస్సులు.
  • ఉన్న 10, 400లో 50% బస్సులు అంటే 5200 పూర్తిగా ఆర్టీసీ యాజమాన్యంలో ఉంటాయి.
  • 30% బస్సులు, అంటే 3100 బస్సులు అద్దెకు తీసుకుని వాటిని ఆర్టీసీ పర్యవేక్షణలో నడుపుతారు.
  • 20% బస్సులు, అంటే 2100 బస్సులు పూర్తిగా ప్రైవేటువి, ప్రైవేట్ స్టేజ్ కారేజ్‌విగా అనుమతిస్తారు.
  • ప్రైవేటు బస్సులు పల్లెవెలుగు, సిటీ సర్వీసులు కూడా నడపాలి. చార్జీలు ఆర్టీసీ చెప్పినట్టే ఉంటాయి.
  • ఆర్టీసీలో ఇప్పటికే 21 శాతం అద్దె బస్సులున్నాయి కాబట్టి కొత్తగా మరో 9 శాతం అద్దె బస్సులు తీసుకోవాలి.
  • వివిధ వర్గాల రాయితీలు కొనసాగుతాయి. వాటికి ప్రభుత్వం బడ్జెట్ ఇస్తుంది.

అయితే ఇలా అద్దె బస్సులు, ప్రైవేటు బస్సులు ఏ కారణంగా తీసుకుంటున్నారన్న దానికి ప్రభుత్వం స్పష్టమైన కారణాలు చూపలేదు. యూనియన్ల ప్రవర్తన వల్లే ఇలా చేస్తున్నాం అని మాత్రమే ప్రకటించారు.

కేసీఆర్ సమీక్ష

ఫొటో సోర్స్, TELANGANA I&PR

"ఈ చర్యలన్నీ చేపట్టడానికి ప్రధాన కారణం ఆర్టీసీ యూనియన్ల అతి ప్రవర్తనే. తాము ఎక్కిన చెట్టు కొమ్మను తామే నరుక్కున్నారు. గత 40 సంవత్సరాలుగా జరుగుతున్న దాష్టీకం వల్ల ఇదంతా చేయాల్సి వచ్చింది. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలలో సమ్మె చేసిన ఆర్టీసీ యూనియన్లు, టీఆరెస్ ప్రభుత్వంలో కూడా సమ్మెకు దిగారు. ప్రభుత్వం ఏది ఉన్నా వీళ్ళ అతిప్రవర్తనలో మార్పు లేదు. పకడ్బందీ నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ మేనేజ్మెంటుకు ఇవ్వరీ యూనియన్లు. ఏదేమైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడమే ప్రభుత్వ ధ్యేయం" అని తమ ప్రకటనలో ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

ఇక ఉద్యోగుల తీసివేతపై కూడా అంతే ధృడంగా ఉంది. సమ్మె ఉధృతం చేయడం హాస్యాస్పదమని సీఎం వ్యాఖ్యానించారు సీఎం.

"ప్రభుత్వం దృష్టిలో, ఆర్టీసీ యాజమాన్యం దృష్టిలో ఆర్టీసీ సిబ్బంది 1200 మాత్రమే. మిగతావారిని డిస్మిస్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేనే లేదు. ఎవరు ఎవర్నీ డిస్మిస్ చేయలేదు. వాళ్ళంతట వాళ్ళే తొలగిపోయారు. గడువులోపల విధుల్లో చేరకపోవడంతో వాళ్ళు "సెల్ఫ్ డిస్మిస్" అయినట్లే. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్య విజ్ఞప్తికి వారు స్పందించలేదు. తొలగిపోయినవారు డిపోల దగ్గర కానీ, బస్ స్టేషన్ల దగ్గర కానీ గొడవ చేయకుండా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయమని డీజీపీని ఆదేశించాను. విధుల్లో వున్న 1200 మంది తప్ప ఎవరు వచ్చి దురుసుగా ప్రవర్తించినా, సరైన చర్యలు డీజీపీ తీసుకుంటారు" అని ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ప్రకటించింది ముఖ్యమంత్రి కార్యాలయం.

యూనియన్ల దురహంకారం వల్లే ఇదంతా జరుగుతోందన్న సీఎం, సంస్థ లాభాల్లోకి రావడం కోసమే ఇలా చేస్తున్నామని చెప్పారు. ఆర్టీసీ ప్రక్షాళనకు తాము చేస్తున్న దాన్ని చూసి ప్రజలు తమను మెచ్చుకుంటున్నారని ఆయన అన్నారు.

ఎంజీబీఎస్

సమ్మె విచ్ఛిన్నం చేయాలని భయపెడుతున్నారు - కార్మిక సంఘాలు

కార్మిక సంఘాలు ముఖ్యమంత్రి ప్రకటనపై తీవ్రంగా స్పందించాయి.

"కార్మికులను భయబ్రాంతులకు గురిచేసి ఉద్యోగాలకు వచ్చేలా చేయాలని చేస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా తీస్తారు? మేం జేఏసీలో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటాం. కేవలం ఉద్యోగులను భయపెట్టి సమ్మె విచ్ఛిన్నం చేయడానికే ఇలా చేస్తున్నారు" అని విమర్శించారు జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి.

"యూనియన్లు అస్తిత్వంలో ఉన్నాయి. ముఖ్యమంత్రికి అసహనం పెరిగింది. ఆయన పిచ్చి పిచ్చి ప్రకటనలు ఆపాలి. ఆయన పార్టీ ఉనికి ప్రమాదంలో పడింది. కార్మికుల పోరాటంతో ఆ పార్టీ అస్తిత్వం కోల్పోయే పరిస్థితి ఉంది. ఆయన పుట్టక ముందే ఆర్టీసీ పుట్టింది. యూనియన్లు పుట్టాయి. యూనియన్లకు ఒక చరిత్ర ఉంటుంది. ఆయనలా కాదు" అంటూ స్పందించారు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి.

విజయదశమి రోజు కార్మిక సంఘాల సమావేశం ఉండకపోవచ్చు. బుధవారం ఉదయం కార్మిక సంఘాలు సమావేశం అయి తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)