పొలార్ స్టెర్న్ నౌక: ఆర్కిటిక్ మంచు సముద్రంలో వాతావరణ మార్పులపై 600 మంది శాస్త్రవేత్తల పరిశోధన

ఫొటో సోర్స్, ESTHER HORVATH
- రచయిత, జొనాథన్ ఆమోస్
- హోదా, బీబీసీ సైన్స్ ప్రతినిధి
వాతావరణ మార్పులపై ఆర్కిటిక్ మంచు సముద్రంలో ఏడాది కాలం పాటు పరిశోధనలు నిర్వహించటానికి జర్మన్ పరిశోధన నౌక పొలార్ స్టెర్న్ ప్రయాణం ప్రారంభించింది.
ఉత్తర ధృవంలో అతిపెద్ద సుదీర్ఘ పరిశోధన ప్రయాణమిది. ఆర్కిటిక్ సముద్ర పరివాహకంలో సైబీరియా వైపు దీనికి తొలి స్థావరం ఎంపిక చేసుకున్నారు.
భూగోళ శిఖరాగ్రం మీద వాతావరణ మార్పుల ప్రభావాన్ని అధ్యయనం చేయటానికి వందలాది మంది పరిశోధకులు ఈ స్థావరం కేంద్రంగా పనిచేయనున్నారు.
''తీవ్రంగా గాలించిన అనంతరం మేం ఈ స్థావరాన్ని ఎంచుకున్నాం'' అని పరిశోధనా ప్రయాణానికి సారథ్యం వహిస్తున్న ప్రొఫెసర్ మార్కస్ రెక్స్ చెప్పారు. ఆల్ఫ్రెడ్ వెజినర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆయన పనిచేస్తున్నారు.

ఫొటో సోర్స్, ESTHER HORVATH
ఆర్‌వీ పొలార్ స్టెర్న్ రెండు వారాల కిందట మొసాయిక్ (మల్టీడిసిప్లినరీ డ్రిఫ్టింగ్ అబ్జర్వేటరీ ఫర్ ద స్టడీ ఆఫ్ ఆర్కిటిక్ క్లైమేట్) ప్రయాణాన్ని ప్రారంభించింది.
నార్వేలోని ట్రోమ్సో ఓడరేవు నుంచి బయల్దేరిన ఈ నౌకకు మంచును చీల్చి దారి ఏర్పరిచే ఐస్‌బ్రేకర్లు సాయంగా ఉన్నాయి. పరిశోధనలకు ప్రాథమిక శిబిరం ఏర్పాటు చేసుకోవటానికి రెండు వారాల పాటు గాలించి సైబీరియా వైపు గల ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు.
ఈ వేసవి వేడి వల్ల ఆర్కిటిక్ సముద్రపు మంచు ఉపరితలం చాలా పలచబడింది.
అయితే ప్రవాహాలు ఇప్పుడు చలికి గడ్డకట్టుకుంటున్నాయి. నౌక స్థావరం ఏర్పరచుకున్న చోట ఇప్పుడిక సూర్యోదయం కావటం లేదు. మొసాయిక్ ప్రయాణాన్ని 24 గంటలూ చీకటిగా ఉండే 'ధృవపు రాత్రి' అతి త్వరలో చుట్టుముట్టనుంది.
దీంతో ఈ నౌక మంచులో కదలకుండా చిక్కుకుపోతుంది.

ఫొటో సోర్స్, MARKUS REX
మళ్లీ వచ్చే ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ వరకూ ఈ నౌక కదలదు. ఆ సమయానికి మంచుతో పాటు కదులుతూ ఉత్తర ధృవం దాటిపోయి ఫ్రామ్ జలసంధి దగ్గరి జలాల్లోకి చేరుతుంది. అది ఈశాన్య గ్రీన్‌లాండ్ - స్వాల్‌బార్డ్ దీవుల మధ్య మార్గం.
ఆర్కిటిక్‌లో వాతావరణ వ్యవస్థకు సంబంధించిన అన్ని అంశాలనూ అధ్యయనం చేయటం మొసాయిక్ లక్ష్యం. నౌక చుట్టూ మంచులో వాతావరణ అధ్యయన పరికరాలతో స్టేషన్లను ఏర్పాటుచేస్తారు. కొన్నిటిని 50 కిలోమీటర్ల దూరం వరకూ కూడా నెలకొల్పుతారు.
మంచు, సముద్రం, వాతావరణం, జీవం.. అన్నిటి నమూనాలూ సేకరిస్తారు. భవిష్యత్ వాతావరణ మార్పులను మరింత కచ్చితంగా అంచనా వేయటం కోసం ఏడాది పాటు సాగే ఈ పరిశోధనలను రూపొందించారు.
మిగతా భూగోళం కన్నా రెండు రెట్లు ఎక్కువగా ఆర్కిటిక్ వేడెక్కుతోందని.. రాబోయే దశాబ్దాల్లో ఈ ఉష్ణోగ్రతలు ఎలా మారతాయనేది అంచనా వేయటంలో ప్రస్తుత వాతావరణ నామూనాలు చాలా అనిశ్చితంగా ఉన్నాయని ప్రొఫెసర్ రెక్స్ బీబీసీతో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, ESTHER HORVATH
‘‘ఆర్కిటిక్‌కు సంబంధించి బలమైన వాతావరణ అంచనాలు లేవు. అందువల్ల ఈ ప్రక్రియలను అంత బాగా అర్థం చేసుకోలేకపోతున్నాం’’ అని చెప్పారు.
‘‘ఇప్పటివరకూ ఏడాది పొడవునా అధ్యయనం చేయలేకపోవటం వల్ల.. ముఖ్యంగా మంచు అత్యంత మందంగా ఉండే చలికాలంలో అసలు అధ్యయనం చేయకలేకపోవటం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. మన పరిశోధన నౌకలు ఆ కాలంలో మంచును చీల్చుకుంటూ ప్రయాణించలేకపోవటం కూడా దానికి కారణం'' అని ఆయన వివరించారు.
మొసాయిక్ పరిశోధనా ప్రయాణానికి 15 కోట్ల డాలర్ల వ్యయం అవుతోంది. ఇటువంటి పరిశోధనలు చేయాలని ఇంతకుముందు కూడా ప్రయత్నించారు కానీ.. ఇంతటి స్థాయిలో ఎన్నడూ జరగలేదు.

ఈ పరిశోధనలో ఏక కాలంలో 600 మంది శాస్త్రవేత్తలు పోలార్ స్టెర్న్‌లో గడుపుతూ పరిశోధనలు నిర్వహిస్తారు.
ఐస్‌బ్రేకర్ల సాయంతో వారిని ఈ నౌక దగ్గరకు తీసుకువస్తారు.
చలికాలం తీవ్రంగా ఉన్నపుడు అలా తీసుకెళ్లటం సాధ్యంకాకపోతే.. విమానాలు, హెలికాప్టర్ల ద్వారా సరకులు, సహాయ బృందాలను సరఫరా చేయాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- జయలలిత తమిళనాడులో సమ్మె చేస్తున్న ఉద్యోగులను తొలగించినప్పుడేం జరిగింది?
- ఒక యువతి ఆత్మాహుతి, ఇరాన్ దిగివచ్చేలా చేసింది
- సౌదీ అరేబియాలో ఇకపై పెళ్ళికాని జంటలు హోటల్లో కలిసి ఉండవచ్చు...
- ఆంధ్రప్రదేశ్: జగన్ జోక్యంతో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్, విడుదల
- గ్యాంగ్‌స్టర్ జాన్ డిలింగర్ బాడీని 85 ఏళ్ళ తరువాత సమాధి నుంచి ఎందుకు తవ్వి తీస్తున్నారు?
- నాసా: అంటార్కిటికాలో దీర్ఘచతురస్రం ఆకారంలో ఐస్‌బర్గ్
- సోషల్ మీడియాలో స్విమ్ సూట్లో ఉన్న ఫోటోలను షేర్ చేస్తే ఉద్యోగం ఇవ్వరా?
- "ఈరోజు ఇది అడవి కాదన్నారు.. రేపు మేం మనుషులమే కాదని అంటారేమో"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








