వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్, విడుదల... అసలేం జరిగింది?

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

ఫొటో సోర్స్, KotamreddySridharReddy/Facebook

    • రచయిత, వి. శంకర్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అధికార వైఎస్సార్సీ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటాచలం మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) సరళ ఇంటిపై శ్రీధర్ రెడ్డి తన అనుచరులతో దాడికి పాల్ప‌డ్డారంటూ అందిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన అరెస్టు తదనంతర ప‌రిణామాలు చివ‌ర‌కు పాల‌క‌ప‌క్షం నేత‌ల మ‌ధ్యే వివాదాన్ని రాజేసేలా కనిపిస్తున్నాయి.

నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా రెండోసారి విజ‌యం సాధించిన కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి ఇటీవ‌ల ప‌దే ప‌దే వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. రెండు నెల‌ల క్రితం స్థానిక ప‌త్రికా విలేక‌రి ప‌ట్ల దురుసుగా మాట్లాడారంటూ ఆయనపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. తాజాగా వెంక‌టాచ‌లం మండ‌ల అభివృద్ధి అధికారి స‌ర‌ళ ఇంటిపై దాడికి పాల్ప‌డ్డారంటూ ఫిర్యాదు వ‌చ్చింది. నెల్లూరు రూర‌ల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా న‌మోదుకావ‌డం, ఆయ‌న్ని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజ‌రుప‌ర్చ‌డంతో బెయిల్ రావ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.

కోటం రెడ్డి
ఫొటో క్యాప్షన్, కోటం రెడ్డికి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్లు

ఎమ్మెల్యే, ఎంపీడీవో మ‌ధ్య వివాదం ఏంటి

వెంక‌టాచ‌లం ఎంపీడీవో స‌ర‌ళ ఆ మండ‌లంలోని ప‌లు పంచాయితీల‌కు పాల‌క‌వ‌ర్గాలు లేక‌పోవ‌డంతో స్పెష‌లాఫీస‌ర్ గా కూడా ఉన్నారు. అంకేప‌ల్లి పంచాయితీలోని గొల‌గుమ్మిడి అనే గ్రామంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి అనుచ‌రుల‌కు ఒక లే-అవుట్ ఉంది. 2.05 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న ఆ లే-అవుట్ కి నిబంధ‌న‌ల ప్ర‌కారం మంచినీటి పైప్ లైన్ ఇవ్వ‌డానికి అవ‌కాశం లేద‌ని ఎంపీడీవో చెబుతున్నారు.

ఖాళీ లే-అవుట్, ఎస్టీ కాల‌నీని ఆనుకుని ఉండ‌డంతో మంచినీటి స‌మ‌స్య ఉన్న త‌రుణంలో కొత్త క‌నెక్ష‌న్లు ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని చెప్పిన‌ట్టు ఎంపీడీవో తెలిపారు. దాంతో, ఈ విష‌యంలో జోక్యం చేసుకున్న ఎమ్మెల్యే శ్రీధ‌ర్ రెడ్డి ఎంపీడీవో మీద ఒత్తిడి చేసిన‌ట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్ర‌వారం రాత్రి నెల్లూరు రూర‌ల్ పీఎస్ లో ఎంపీడీవో స‌ర‌ళ ఫిర్యాదు చేశారు. శ‌నివారం నాడు కేసు న‌మోదు చేసిన పోలీసులు ఆదివారం ఉద‌యాన్నే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.

ఎంపీడీవో స‌ర‌ళ ఈ కేసు విష‌యంపై బీబీసీతో మాట్లాడుతూ "ప్రైవేట్ లే అవుట్ కి మంచినీటి క‌నెక్ష‌న్ విష‌యం ప‌రిశీల‌న‌లో ఉంది. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని చెప్పాను. దాంతో ఎమ్మెల్యేకి కోపం వ‌చ్చి, నేరుగా ఫోన్లో బెదిరించ‌డ‌మే కాకుండా త‌న అనుచ‌రుల‌తో క‌లిసి వ‌చ్చి నా ఇంటిపై దాడికి దిగారు. నేను అప్ప‌టికి ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. ఇంటికి క‌రెంట్ క‌నెక్ష‌న్ తీసేశారు. కేబుల్ కూడా తీసేశారు. మంచినీటి పైప్ లైన్ తొల‌గించ‌డానికి కూడా ప్ర‌య‌త్నించారు. నా త‌ల్లిని నోటికొచ్చిన‌ట్టు మాట్లాడారు. నీ అంతు చూస్తాన‌ని బెదిరించారు. నా గోడు పోలీసుల‌కు చెప్పుకోవడానికి వెళ్లిన‌ప్పుడు స్టేష‌న్ లో అధికారులు ఎవ‌రూ లేర‌ని చెప్ప‌డంతో అక్క‌డే కూర్చున్నాను. చివ‌ర‌కు కేసు ఫైల్ చేశారు. ఇలాంటి ప‌రిస్థితి ఎవ‌రరికీ రాకూడ‌దు" అన్నారు.

ఎంపీడీఓ సరళ
ఫొటో క్యాప్షన్, పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన వెంకటాచలం ఎంపీడీఓ సరళ

సీఎం జోక్యం, ఎమ్మెల్యే అరెస్ట్

నెల్లూరు రూర‌ల్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు కూడా తీసుకోవ‌డం లేదంటూ తొలుత స‌ర‌ళ పీఎస్ ముందు బైఠాయించారు. దాంతో శ‌నివారం తెల్ల‌వారుజామున ఫిర్యాదు స్వీక‌రించారు. ఈ విష‌యం బ‌య‌ట‌కురావ‌డంతో క‌ల‌క‌లం రేగింది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విప‌క్ష టీడీపీతో పాటుగా ఉద్యోగ సంఘాలు ఆందోళ‌న‌లు చేప‌ట్టాయి. ప‌లు చోట్ల ఎంపీడీవోలు విధులు బ‌హిష్క‌రించి నిర‌స‌న‌లు తెలిపారు.

చివ‌ర‌కు నేరుగా సీఎం జ‌గ‌న్ జోక్యం చేసుకున్నారు. ఘ‌ట‌న‌పై పోలీస్ అధికారుల‌తో స‌మీక్ష చేశారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆధారాలు ఉంటే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. దాంతో డీజీపీ సూచ‌న‌ల‌తో నెల్లూరు పోలీసులు కేసు న‌మోదు చేసి ఎమ్మెల్యే శ్రీధ‌ర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి, ఆయన అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డిపై 290, 506, 448, 427 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంత‌రం మెజిస్ట్రేట్ ముందు హాజ‌రుప‌ర్చ‌గా విచార‌ణ అనంత‌రం ఎమ్మెల్యేకి బెయిల్ వచ్చింది.

'నా మీద కుట్ర జ‌రుగుతోంది...రాజ‌కీయంగానే ఎదుర్కొంటా'

కేసు న‌మోదు, అరెస్ట్ వ్య‌వ‌హారంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి స్పందించారు. త‌న మీద కుట్ర సాగుతోందంటూ ఈ కేసుని రాజ‌కీయ కుట్ర‌గా పేర్కొన్నారు.

"ఎంపీడీవో స‌ర‌ళ నా మీద అస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. మంచినీటి పైప్ లైన్ ఇవ్వాల్సి ఉండ‌గా కావాల‌నే జాప్యం చేశారు. అయినా, నేను ఆమె ఇంటికి వెళ్లిన‌ట్టు చెబుతున్న మాట‌లు వాస్త‌వం కాదు. ఎంపీడీవో ముందుగా కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి ఇంటికి వెళ్లిన త‌ర్వాత పోలీస్ స్టేష‌న్ కి వ‌చ్చారు. ఎస్పీతో కూడా నాకు వ్య‌క్తిగ‌త విబేధాలున్నాయి. అవి క‌లెక్ట‌ర్ దృష్టికి తీసుకెళ్లాను. ఈ కేసులో ఆధారాలుంటే చ‌ర్య‌లు తీసుకోమ‌ని సీఎం చెప్పారు. ఆయ‌న ఆదేశాల ప్ర‌కారం విచార‌ణ జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాను" అని అన్నారు.

అయితే, శ్రీధర్ రెడ్డి ఆరోపణలపై స్పందించేందుకు కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి సుముఖంగా లేరు. ఈ నేప‌థ్యంలో వారిద్దరి మ‌ధ్య విబేధాలు కూడా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. వారిద్ద‌రూ స‌మీప బంధువులు కూడా కావ‌డం విశేషం.

శ్రీధర్ రెడ్డి మాత్రం, తన మీద ఉన్న కేసుల‌ను రాజ‌కీయంగానే ఎదుర్కొంటానని చెబుతున్నారు. "ఎంపీడీవో సరళ ఇంటిపై దాడికి పాల్పడ్డానని నిరూపిస్తే ఆమెకు క్షమాపణ చెప్పడమే కాదు, ఆమె తల్లి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. ప్రజా ఉద్యమంలో పుట్టాను... ప్రజా ఉద్యమంలోనే చస్తాను" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)