ఆంధ్రప్రదేశ్ కొత్త మహిళా మంత్రులు వీరే

మహిళా మంత్రులు
ఫొటో క్యాప్షన్, పుష్ప శ్రీవాణి, వనిత, సుచరిత
    • రచయిత, శంకర్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గం శనివారం నాడు ప్రమాణం చేసింది. మొత్తం 25 మంది సభ్యులున్న మంత్రివర్గంలో ముగ్గురు మహిళలకు స్థానం దక్కింది. రాష్ట్ర అసెంబ్లీలో 14 మంది మ‌హిళా ఎమ్మెల్యేలున్నారు. అంటే మొత్తం శాస‌న‌స‌భ్యుల‌లో మ‌హిళ‌లు 8 శాతం మాత్ర‌మే. వారిలో ఒక్క‌రు మిన‌హా మిగిలిన వారంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే.

వారిలో పాముల పుష్ప శ్రీవాణి, తానేటి వనిత, మేకతోటి సుచరిత మంత్రులుగా ప్రమాణం చేశారు. సినీ నటి, ఎమ్మెల్యే రోజాకు కూడా మంత్రి పదవి దక్కుతుందన్న ఊహాగానాలు వినిపించినా, ఆమెకు ఆ పదవి దక్కలేదు.

ఈసారి అసెంబ్లీకి ఎన్నిక‌యిన మ‌హిళా ఎమ్మెల్యేల‌లో గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నుంచి గెలిచిన మేక‌తోటి సుచ‌రిత సీనియ‌ర్ ఎమ్మెల్యే. ఆమె మూడు సార్లు శాస‌న‌స‌భ్యురాలిగా ఎన్నిక‌య్యారు. ఇక ఆ త‌ర్వాత ఆర్కే రోజా, పాముల పుష్ప శ్రీవాణి, విశ్వ‌స‌రాయి క‌ళావ‌తి వంటి వారు గ‌త శాస‌న‌స‌భ‌లో కూడా స‌భ్యులుగా ఉన్నారు.

2009లో గెలిచిన తానేటి వ‌నిత మ‌రోసారి విజయం సాధించారు. టీడీపీ త‌రఫున గెలిచిన ఏకైక మహిళ ఆదిరెడ్డి భ‌వానీ. ఈమె రాజ‌మ‌హేంద్ర‌వ‌రం అర్బ‌న్ నుంచి ఎన్నికయ్యారు. ఈమెతో స‌హా ఈసారి 9 మంది మహిళలు తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.

వారిలో శ్రీకాకుళం జిల్లా పాత‌ప‌ట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే భాగ్య‌ల‌క్ష్మి, తూర్పు గోదావ‌రి జిల్లా రంప‌చోడ‌వ‌రం ఎమ్మెల్యే నాగుల‌ప‌ల్లి ధ‌న‌ల‌క్ష్మి, గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవి, చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ, క‌ర్నూలు జిల్లా ప్ర‌త్తికొండ ఎమ్మెల్యే కె శ్రీదేవి, అనంత‌పురం జిల్లా శింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి, క‌ళ్యాణ‌దుర్గం ఎమ్మెల్యే కేవీ ఉషాశ్రీ చ‌ర‌ణ్ ఉన్నారు.

చంద్ర‌బాబు కేబినెట్‌లో తొలుత ముగ్గురు మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ద‌క్కింది. వారిలో ప‌రిటాల సునీత‌, పీత‌ల సుజాత‌, కిమిడి మృణాళిని ఉన్నారు. ఆ త‌ర్వాత విస్త‌ర‌ణ‌లో పీత‌ల సుజాత‌, మృణాళిని అవ‌కాశం కోల్పోయారు. భూమా అఖిల‌ప్రియ‌కు అవ‌కాశం వ‌చ్చింది.

జగన్ మంత్రివర్గంలోని మహిళా మంత్రుల ప్రస్థానం

వైసీపీ మహిళా మంత్రులు

ఫొటో సోర్స్, Pushmasrivani/fb

ఫొటో క్యాప్షన్, పాముల పుష్ప శ్రీవాణి

పాముల పుష్ప శ్రీవాణి

పాముల పుష్ప శ్రీవాణి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈసారి మంత్రిగా అవకాశం పొందారు. ఈ మాజీ టీచర్ విజ‌య‌న‌గ‌రం జిల్లా కురుపాం అసెంబ్లీ స్థానం నుంచి వ‌రుస‌గా రెండో సారి గెలిచారు. జియ్య‌మ్మ వ‌ల‌స మండ‌లంలోని చిన‌మేరంగి కోట‌లో నివాసం ఉంటున్నారు. ఉపాధ్యాయ వృత్తిని వీడి భ‌ర్త ప్రోత్సాహంతో రాజ‌కీయ ఆరంగేట్రం చేశారు.

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన పుష్ప శ్రీవాణి రాజకీయంగా రాణిస్తూ ఈసారి ఎస్టీ మ‌హిళా కోటాలో మంత్రిప‌ద‌విని ఆశించి, పొందారు.

2014 ఎన్నిక‌ల్లో 27 ఏళ్ల వ‌య‌సులో శ్రీవాణి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. వైసీపీ త‌రుపున బ‌రిలో దిగి 19,083 ఓట్ల తేడాతో గెలిచారు. 2019 ఎన్నిక‌ల్లోనూ వ‌రుస‌గా రెండోసారి విజ‌య‌కేతనం ఎగుర‌వేశారు. ఈసారి 26,602 ఓట్ల ఆధిక్య‌త‌ను సాధించారు.

వైసీపీ మహిళా మంత్రులు

ఫొటో సోర్స్, Thaneti vanitha/fb

తానేటి వ‌నిత‌

వనిత తొలుత తెలుగుదేశం పార్టీ నుంచి రాజ‌కీయ ఆరంగేట్రం చేశారు. 2009లో గోపాల‌పురం ఎస్సీ రిజ‌ర్వుడు సీటు నుంచి విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత వైసీపీలో చేరారు. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా కొవ్వూరులో పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు.

2019లో మ‌ళ్లీ రంగంలోకి దిగి 25,248 ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు. 45 ఏళ్ల వనిత ఎమ్మెస్సీ చ‌దివారు. కొవ్వూరు నివాసి. భ‌ర్త డాక్ట‌ర్ శ్రీనివాస‌రావు ఆమెను రాజకీయాల్లో ప్రోత్స‌హించారు.

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కృష్ణ‌బాబు ప్రోత్సాహంతో రాజ‌కీయ ప్ర‌వేశం చేసిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత స్వశక్తితో గుర్తింపు సాధించారు.

మేకతోటి సుచరిత

ఫొటో సోర్స్, MEKATHOTI SUCHARITHA/FB

మేక‌తోటి సుచ‌రిత‌

మేక‌తోటి సుచ‌రిత మొదట జెడ్పీటీసీగా రాజ‌కీయ ప్ర‌వేశం చేశారు. ఆ త‌ర్వాత ప్ర‌త్తిపాడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఎస్సీ రిజ‌ర్వుడు కావ‌డంతో తొలిసారిగా 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌రుపున బ‌రిలో దిగి విజ‌యం సాధించారు.

ఆ త‌ర్వాత పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి 2012 ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపున పోటీ చేసి గెలిచారు. కానీ 2014 సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యారు. ఇక తాజాగా 2019 ఎన్నిక‌ల్లో మ‌రోసారి వైసీపీ త‌రుపున పోటీ చేసి టీడీపీ, జ‌న‌సేన త‌రుపున పోటీ చేసిన మాజీమంత్రులు డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్, రావెల కిషోర్ బాబుల‌ను ఓడించారు. 7,398 ఓట్ల ఆధిక్యం సాధించారు.

47 ఏళ్ల సుచ‌రిత మూడోసారి గెలిచి వైసీపీలోని సీనియర్ మహిళా ఎమ్మెల్యేల్లో ఒకరిగా నిలిచారు. గుంటూరులోని ఫిరంగిపురంలో ఉంటున్న సుచ‌రిత గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు. ఆమె భ‌ర్త ప్ర‌భుత్వ ఉద్యోగం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)