రాజ్‌నాథ్ సింగ్ బీజేపీకి కొత్త చిక్కుముడిలా మారారా: అభిప్రాయం

ఫొటో సోర్స్, AFP
- రచయిత, ప్రదీప్ సింగ్
- హోదా, బీబీసీ కోసం
రాజ్‌నాథ్ సింగ్ బీజేపీకి కొత్త చిక్కుముడిలా మారారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం కేబినెట్ వ్యవహారాల కోసం 8 కమిటీలు ఏర్పాటు చేశారు.
ఈ 8 కమిటీల్లో అమిత్ షా ఉన్నారు. కానీ రాజ్‌నాథ్ సింగ్‌ను మాత్రం మొదట రెండు కమిటీల్లోనే చేర్చారు. రాజకీయ, పార్లమెంటరీ వ్యవహారాలు లాంటి కీలక కమిటీల్లో రాజ్‌నాథ్ సింగ్‌ను తీసుకోలేదు.
ఈ వార్త మీడియాలో రాగానే ప్రభుత్వంలో రాజ్‌నాథ్ సింగ్ పాత్రపై ప్రశ్నలు వెల్లువెత్తాయి. ఇదంతా జరిగిన కొన్ని గంటలకే గురువారం అర్ధరాత్రి కేబినెట్ కమిటీలకు సంబంధించిన కొత్త లిస్టు వచ్చింది. ఆ జాబితాలో రాజ్‌నాథ్ సింగ్‌కు రెండు నుంచి ఆరు కమిటీల్లో స్థానం కల్పించారు.
ఇది మోదీ-షా యుగంలో ఒక ఊహించని మార్పు లాంటిదే.
భారతీయ జనతా పార్టీలో రాజ్‌నాథ్ సింగ్ లాంటి వారికి ఉన్న ఇమేజ్ గురించి ప్రజలకు పెద్దగా సందేహాలు ఉండవు. బయటివాళ్లకు కూడా అదే అనిపిస్తుంది. అయితే పార్టీ లోపల దీనికి పూర్తి భిన్నమైన అభిప్రాయాలు ఉన్న వారికి కొదవ లేదు.
బీజేపీలో అలాంటి వారందరికీ రాజ్‌నాథ్ సింగ్ అదృష్టవంతుడనే అనిపిస్తుంది. మీకు నమ్మకం లేకుంటే కల్‌రాజ్ మిశ్రా లాంటి వారిని అడగచ్చు.
రాజ్‌నాథ్ సింగ్‌కు దక్కిన పదవులు ఆయన సామర్థ్యం వల్లే దక్కాయని ఒప్పుకోడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉండరు. సీనియర్ అయినా కల్‌రాజ్ అందులో ప్రతిసారీ వెనకబడ్డారు.
2002లో రాజ్‌నాథ్ నేతృత్వంలో ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొదటి నుంచి మూడో స్థానంలోకి చేరినపుడు, ఆ తర్వాత రాజ్‌నాథ్ కేంద్ర మంత్రి అయినపుడు కల్‌రాజ్‌కు చాలా బాధగా అనిపించింది.

ఫొటో సోర్స్, AFP
అదృష్టమా, అవకాశమా
కల్‌రాజ్ మిశ్రా దేనిని అదృష్టం అంటున్నారో, దానిని మీరు అవసరం అని కూడా అనొచ్చు. రాజ్‌నాథ్ సింగ్ చాలాసార్లు సమయానికి తగ్గట్టుగా సరిగ్గా ఉండాల్సిన చోట ఉన్నారు.
ఉత్తర ప్రదేశ్‌లో కల్యాణ్ సింగ్ అటల్ బిహారీ వాజపేయీకి వ్యతిరేకంగా ఫ్రంట్ ప్రారంభించినపుడు, ఈ ఇద్దరు పెద్దల యుద్ధం మధ్య వాజపేయీ బంటుగా నిలిచేందుకు రాజ్‌నాథ్ సంతోషంగా సిద్ధమయ్యారు. దాంతో ఆ యుద్ధం కల్యాణ్ సింగ్ వర్సెస్ రాజ్‌నాథ్ అయిపోయింది.
దానికి బహుమతిగా రాజ్‌నాథ్ సింగ్‌కు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, తర్వాత కేంద్ర మంత్రి పదవులు లభించాయి. ఆయన రాష్ట్ర నేత నుంచి జాతీయ నేత అయ్యారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాల్ కృష్ణ అడ్వాణీని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు, రాజ్‌నాథ్‌కు జీవితంలో మరో అవకాశం వచ్చింది.
సంఘ్ పదాధికారుల దృష్టిలో రాజ్‌నాథ్ సింగ్ ఎప్పుడూ, వేరే ఎవరికీ సమస్యగా నిలవని ఒక సమన్వయ నేతగానే కనిపించారు.
అంతే కాదు, ఆయన తనకు పదవి, బాధ్యతలు ఇచ్చినవారు నిర్ణయించిన మూస పద్ధతుల్లో నడిచేందుకు కూడా సిద్ధపడ్డారు. రాజ్‌నాథ్ జాతీయ అధ్యక్షుడు అయిన తర్వాత ఒకానొక సమయంలో ఆయనకు, అడ్వాణీకి బహిరంగ యుద్ధం జరగచ్చేమో అని కూడా అనిపించింది.
కానీ యుద్ధ అంచులకు చేరినా అడుగు వెనక్కు తీసుకోవడం అనేది రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేకత. విజయం కంటే ఎక్కువగా ఆయన ఓటమి ఉండకూడదనే దానిపై దృష్టిపెట్టారు. అసలు యుద్ధమే జరగనప్పుడు ఓటమి ప్రశ్నే ఉండదు అనుకున్నారు.

ఫొటో సోర్స్, AFP
'రాజ్‌నాథ్ పిరికివాడు'
బహుశా అడ్వాణీ, కల్యాణ్ సింగ్, శంకర్ సింగ్ వాఘేలా, ఉమా భారతికి జరిగింది చూసిన రాజ్‌నాథ్ "దేన్నీ తెగేవరకూ లాగకూడదనే" పాఠం నేర్చుకున్నారు.
ఈ స్వభావమే ఆయన బలహీనత అని రాజ్‌నాథ్ శత్రువులు చెబుతారు. ఆయన్ను పిరికివాడుగా వర్ణిస్తారు.
ఆయన పిరికివాడా, కాదా అన్నది పక్కనపెడితే, రాజ్‌నాథ్ ఇప్పటివరకూ సఫలం అయ్యారు అనేది మాత్రం నిజం. ఆయన సఫలం కావడంలో సంఘ్ దయ చాలా ఉంది.
సంఘ్ మద్దతు వల్లే ఆయన రెండుసార్లు జాతీయ అధ్యక్షుడు కాగలిగారు. రెండోసారి కూడా ఆయనకు ఆ అవకాశం రాలిన పండులాగే వచ్చింది.
సంఘ్‌కు నచ్చిన నితిన్ గడ్కరీ రెండో సారి అధ్యక్షుడుగా ఉండేందుకు బీజేపీ నాయకత్వం ఒప్పుకోలేదు. దాంతో మరోసారి రాజ్‌నాథ్‌కు పార్టీ అధ్యక్ష పదవి లభించింది. రెండోసారి అధ్యక్షుడైన తర్వాత మొదటిసారి ఆయనకు తను ప్రధాన మంత్రి పదవికి పోటీపడగలనని అనిపించింది.

ఫొటో సోర్స్, Getty Images
మోదీని అడ్డుకోలేక, చేతులు కలిపారు
కానీ, రాజ్‌నాథ్‌కు ఎదురుగా నరేంద్ర మోదీ ఒక పర్వతంలా నిలిచారు. ఆ సమయంలో జరిగిన మోదీ-అడ్వాణీ యుద్ధంలో అడ్వాణీని ఓడించి పాత లెక్కలు సరిచేయాలని రాజ్‌నాథ్ నిర్ణయించారు.
అలా చేయాలంటే, ఆయనకు మోదీ అండ అవసరం. మోదీకి కూడా ఆ సమయంలో రాజ్‌నాథ్ అవసరం వచ్చింది. అలా, అది రెండు అవసరాల కోసం ఏర్పడిన స్నేహం.
ఎంత చేసినా మోదీని అడ్డుకోలేనని రాజ్‌నాథ్ సింగ్‌కు బాగా తెలుసు. అందుకే ఆయన మోదీతో చేతులు కలిపారు.
జైపూర్‌లో జరిగింది చూడగానే మోదీని ఇక ఎవరూ అడ్డుకోవడం జరగదని రాజ్‌నాథ్ సింగ్, సంఘ్‌కు అర్థమైపోయింది.
ఆరోజు అక్కడ నాటి గుజరాత్ గవర్నర్ కమలా బెనీవాల్ మనవరాలి పెళ్లి జరుగుతోంది. దానికి మోదీకి కూడా ఆహ్వానం అందింది.
అక్కడకు వెళ్లడానికి ముందే మోదీ జైపూర్‌లో తమ పార్టీకి చెందిన ముగ్గురు, నలుగురికి ఫోన్ చేశారు. అక్కడ ఎక్కువ కాంగ్రెస్ వారే ఉంటారని, తనను గుర్తుపట్టే వాళ్లు తక్కువ ఉంటారని మీరంతా నాతో ఉండాలని చెప్పారు.
మోదీ అక్కడకు చేరుకున్నారు. వధూవరులను ఆశీర్వదించడానికి స్టేజివైపు వెళ్తున్నప్పుడు చాలా మందికి మోదీ అనే అరుపులు వినిపించాయి. నిమిషాల్లోనే అవి ఎక్కువయ్యాయి. అన్ని వైపుల నుంచీ మోదీ-మోదీ అని అరుస్తున్నారు. అదంతా చూసి స్వయంగా మోదీనే ఆశ్చర్యపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
నంబర్ 2 అయినా, నమ్మకం లేదు
ఆ తర్వాత పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో మోదీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా నిలపాలనే ప్రస్తావన వచ్చినపుడు, దాన్ని సుష్మా స్వరాజ్ ఒక్కరే వ్యతిరేకించడం రాజ్‌నాథ్ కళ్లారా చూశారు.
అప్పుడు సుష్మా వారిని హెచ్చరిస్తూ "తర్వాత అందరూ బాధపడతారు. రాయండి, నా డిసెంట్ నోట్ రాయండి. నా వ్యతిరేకత లిఖితంగా ఉండాలి" అన్నారు. అప్పుడు రాజ్‌నాథ్ నోరు మెదపలేదు.
"మొదట మోదీ వెంట నిలిచి, మిగతా వాళ్లతో తేల్చుకుంటే, ఎన్నికల తర్వాత మోదీని చూసుకోవచ్చు" అని రాజ్‌నాథ్ అనుకున్నారు. 2014 ఎన్నికల ఫలితాలతో రాజ్‌నాథ్ నిరాశకు గురయ్యారు. మోదీ ఆ స్నేహానికి గౌరవం ఇచ్చి ఆయనకు ప్రభుత్వంలో నంబర్ టూ స్థాయి కల్పించారు. కానీ నమ్మలేదు.
పాచిక చేతి నుంచి జారిపోయిందే అని రాజ్‌నాథ్ ఐదేళ్ల వరకూ బాధపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు చేశాక తన కొడుకు గురించి వార్తలు రావడంతో ఆయన ప్రధాన మంత్రిని కలిసి అసహనం వ్యక్తం చేశారు.
దానితోపాటు మంత్రి మండలి సభ్యులు ప్రచారం చేస్తున్న వార్త నిజం కాదని ఆయన సన్నిహితుల నుంచి కూడా మీడియాలో కథనాలు వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
కమిటీలకు దూరం పెట్టడం పెద్ద సందేశం
ఈ విషయం ప్రధాన మంత్రికి కూడా తెలిసింది. ఆ తర్వాత అప్పుడప్పుడూ రాజ్‌నాథ్... ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాన మంత్రిని ఇబ్బందిపెట్టేలా ఏదో ఒక మాట అంటూ వెళ్లారు.
చివరగా లోక్‌సభ ఎన్నికల సమయంలో "ఉత్తర ప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ కూటమి వల్ల బీజేపీకి 15 సీట్లు నష్టం జరగవచ్చని" అన్నారు.
మోదీ-షా, రాజ్‌నాథ్ మధ్య నమ్మకం తక్కువనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజ్‌నాథ్ సింగ్ అనే ముల్లును వాళ్లు ఎప్పుడో ఒకప్పుడు తీసేయక తప్పదు.
గురువారం దానికే శ్రీకారం చుట్టారు. ఆయన్ను చాలా క్యాబినెట్ కమిటీలకు దూరం పెట్టారు. ఇందులో అత్యంత కీలక విషయం, రాజకీయ వ్యవహారాల కమిటీ నుంచి రాజ్‌నాథ్‌ను బయటపెట్టడం. యూపీ లాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, రెండు సార్లు పార్టీ అధ్యక్షుడుగా, కొన్ని రోజుల ముందు వరకూ దేశ హోం మంత్రిగా ఉన్న ఒక నేతను ఇలా కమిటీలకు దూరం పెట్టడం ఒక పెద్ద సందేశం కూడా ఇస్తుంది.
"నాయకత్వానికి ఇప్పుడు ఆయనపై నమ్మకం లేకుండా పోయిందనేదే" ఆ సందేశం. ఇన్నాళ్లూ పార్టీ లోపలే ఉన్న ఈ విషయం ఇప్పుడు బయటికొచ్చింది.
రాజ్‌నాథ్ సింగ్ ఉదయం దాన్ని అంగీకరించారు. కానీ, చీకటి పడగానే సంఘ్‌తో ఆయన బంధం మరోసారి ఉపయోగపడింది.
పార్టీ ఇలా 24 గంటల్లోనే ఒక నిర్ణయం మార్చుకోవడం అనేది మోదీ-షా యుగంలో బహుశా ఇప్పటివరకూ ఏదీ లేదు. ఇది రాజ్‌నాథ్ సింగ్ విజయమా లేక ముంచుకొచ్చే ఓటమికి సంకేతమా?
ఇవి కూడా చదవండి:
- నాసా: అంతరిక్ష కేంద్రం సందర్శించేందుకు పర్యాటకులను అనుమతి
- డోనల్డ్ ట్రంప్ సుంకాలతో భారతదేశంలో ఉద్యోగాలు పోవడం ఖాయమేనా
- సనావుల్లా భారత సైనికుడా, విదేశీయుడా
- ‘భార్యనే గెలిపించుకోలేకపోయారు.. మాకింకేం సాయం చేస్తారు’
- చైనాలో ఇస్లాం వ్యాప్తి చేస్తున్న పాకిస్తాన్ మదరసా విద్యార్థులు
- పెళ్లి పేరుతో పాక్ అమ్మాయిలను వ్యభిచారంలో దించుతున్న చైనా అబ్బాయిలు
- ఈ మహిళలు చైనాలో లైవ్ సెక్స్‌క్యామ్ రాకెట్ కోరల నుంచి ఎలా తప్పించుకున్నారంటే..
- వైఎస్ జగన్మోహన్ రెడ్డి: కొత్త తరం నాయకుల ప్రతినిధి
- నా కార్టూన్లే నా ప్రాణాలు కాపాడాయి.. కొత్త జీవితాన్ని ఇచ్చాయి.. ఇదీ నా కథ
- మోదీ చెప్పిన కెమిస్ట్రీ మేధావులకు ఎందుకు అర్థం కాలేదు..
- ‘పీరియడ్ పేదరికం’: బహిష్టు సమయంలో పాత గుడ్డలకు ఈ కప్పులే సమాధానమా?
- ప్రభుత్వ వ్యతిరేకత దరిచేరనివ్వని నేత.. ఐదోసారి సీఎంగా ప్రమాణం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








