మోదీ మంత్రివర్గంలోని మహిళల్లో ఎవరేంటి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దివ్యా ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
నారీ శక్తి గురించి గట్టిగా వాణిని వినిపించే ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేవలం ఆరుగురు మహిళలకే స్థానం దక్కింది. మోదీ గత కేబినెట్ కంటే ఈ సంఖ్య తక్కువ.
నిర్మలా సీతారామన్, స్మృతీ ఇరానీ, హర్‌సిమ్రత్ కౌర్ బాదల్‌లకు ఎన్డీయే నేతృత్వంలోని కొత్త కేంద్ర కేబినెట్‌లో మళ్లీ అవకాశాలు దక్కాయి.
గత కేబినెట్‌లో వీరే కాకుండా, మరో నలుగురు మహిళలు కూడా ఉండేవారు.
విదేశాంగ మంత్రిగా సుష్మ స్వరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా మేనకా గాంధీ, జల వనరులు, నదుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉమా భారతి, మైనార్టీ వ్యవహారాల మంత్రిగా నజ్మా హెప్తుల్లా అప్పుడు పనిచేశారు.
2014తో పోలిస్తే 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 12% అధికంగా మహిళా అభ్యర్థులకు టికెట్లిచ్చింది.
బీజేపీ నుంచి మొత్తంగా 55 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేస్తే, వారిలో 41 మంది గెలిచారు. అయినా కేంద్ర సర్కారులో వారికి సరైన ప్రాధాన్యం దక్కలేదు.
నిర్మలా, స్మృతీ, హర్ సిమ్రత్‌లకు కేబినెట్ మంత్రి పదవులు రాగా, మరో ముగ్గురు మహిళలకు సహాయ మంత్రి పదవులు వచ్చాయి.
మొత్తంగా కేంద్రంలో ఆరుగురు మహిళా మంత్రులయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
నిర్మలా సీతారామన్
రాజ్యసభ ఎంపీగా ఉన్న నిర్మలా సీతారామన్‌కు కీలకమైన ఆర్థిక శాఖతోపాటు కార్పొరేట్ వ్యవహారాల శాఖ కేటాయించారు.
వరుసగా రెండో సారీ ఎన్డీయే కేబినెట్‌లో సీతారామన్‌కు సభ్యత్వం దక్కింది.
గత సర్కారులో తొలుత వాణిజ్య మంత్రిగా పనిచేసి, ఆ తర్వాత కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలను ఆమె తీసుకున్నారు.
ఇందిరా గాంధీ అనంతరం దేశ రక్షణ మంత్రిగా పనిచేసిన రెండో మహిళగా రికార్డుకెక్కారు.
రాజకీయాల్లోకి రాకముందు నిర్మాలా సీతారామన్ బీబీసీ వరల్డ్ సర్వీస్‌లో పనిచేశారు.

ఫొటో సోర్స్, EPA
స్మృతీ ఇరానీ
ఈ లోక్‌సభ ఎన్నికల్లో చాలా మంది దృష్టిని ఆకర్షించిన నేతల్లో స్మృతీ ఇరానీ కూడా ఒకరు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న అమేఠీలోనే ఓడించారామె. 55వేలకుపైగా మెజార్టీతో ఆమె గెలిచారు.
స్మృతీ ఇరానీ మహిళా శిశు సంక్షేమ శాఖ, జౌళి శాఖ బాధ్యతలు అందుకున్నారు.
గత ఎన్డీయే సర్కారు కేబినెట్‌లో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఆమె పనిచేశారు.
రాజకీయాల్లోకి రాకముందే స్మృతీ ప్రసిద్ధ టీవీ నటి. అనేక హిందీ టీవీ సీరియల్స్‌లో ఆమె నటించారు. 2003లో బీజేపీలో చేరారు.

ఫొటో సోర్స్, TWITTER/HARSIMRAT BADAL
హర్ సిమ్రత్ కౌర్
హర్ సిమ్రత్ కౌర్‌ది ఎన్డీయేలోని శిరోమణీ అకాలీ దళ్ పార్టీ. ఆమె కూడా వరుసగా రెండోసారి కేబినెట్ మంత్రి పదవి చేపట్టారు. ఇప్పుడు కూడా ఆమెకు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ బాధ్యతలే దక్కాయి.
గతంలో శిరోమణీ అకాలీ దళ్ అధ్యక్షుడిగా, పంజాబ్ ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన సుఖ్‌బీర్ సింగ్ బాదల్ భార్యే హర్‌సిమ్రత్ కౌర్.
2009లో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి మూడు సార్లు భటిండా లోక్‌సభ స్థానం నుంచి గెలిచారు.

ఫొటో సోర్స్, TWITTER/NIRANJAN JYOTI
నిరంజన్ జ్యోతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేపుర్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన నిరంజన్ జ్యోతికి గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పదవి దక్కింది.
గత ఎన్డీయే సర్కారులో ఆమె ఫుడ్ ప్రాసిసెంగ్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.
12వ తరగతి దాకా చదువుకున్న నిరంజన్ జ్యోతి సన్యాసినిగా జీవితం గడుపుతున్నారు.
ఎంపీగా ఎన్నికవ్వకముందు ఆమె ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు.

ఫొటో సోర్స్, TWITTER/DEBASHREE CHAUDHRI
దేబశ్రీ చౌధరీ
పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్ లోక్‌సభ స్థానం నుంచి దేబశ్రీ చౌధరీ ఎన్నికయ్యారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా ఆమె ఇప్పుడు బాధ్యతలు తీసుకున్నారు.
బీజేపీ పశ్చిమ బెంగాల్ శాఖకు దేబ్‌శ్రీ ప్రధాన కార్యదర్శిగానూ పనిచేస్తున్నారు.
ఆ రాష్ట్రంలో బీజేపీ 18 ఎంపీ సీట్లు గెలిచింది.

ఫొటో సోర్స్, FACEBOOK/RENUKA SINGH
రేణుకా సింగ్ సరూతా
రేణుకా సింగ్‌కు గిరిజన వ్యవహారాల శాఖలో సహాయ మంత్రి పదవి దక్కింది. ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులకు రిజర్వ్ చేసిన సర్గుజా లోక్‌సభ స్థానం నుంచి గెలిచి తొలిసారి ఎంపీగా మారారు.
ఇంతకుముందు రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం రేణుకా సింగ్‌కు ఉంది.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళా శిశు సంక్షేమ మంత్రిగానూ ఆమె పనిచేశారు.
ఇవి కూడా చదవండి:
- క్రికెట్ ప్రపంచకప్ 2019: మీరు తెలుసుకోవాల్సిన 12 విషయాలు
- నా కార్టూన్లే నా ప్రాణాలు కాపాడాయి.. కొత్త జీవితాన్ని ఇచ్చాయి.. ఇదీ నా కథ
- మోదీ చెప్పిన కెమిస్ట్రీ మేధావులకు ఎందుకు అర్థం కాలేదు..
- చంద్రాణి ముర్ము: పోటీ పరీక్షలకు చదువుకుంటున్న యువతికి ఎంపీ పదవి
- మనుషుల్లాగా సెల్ఫీకి ఫోజిచ్చిన గొరిల్లాలు... ఈ ఫొటో వెనకున్న పూర్తి కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








