ఈ తెలంగాణ పోలీస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు ఎందుకు

- రచయిత, రాజేంద్రప్రసాద్
- హోదా, బీబీసీ కోసం
రెండు నిండు ప్రాణాలు... చావు బతుకుల మధ్య పోరాడుతున్న స్థితి... చుట్టూ ఉన్న వాళ్లు ఏమి చేయలేని పరిస్థితి. అప్పుడే ఆయన వచ్చారు.
ప్రాణాలకు తెగించి వారిని కాపాడారు. అతడి సాహసం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అసలేం జరిగిందంటే..
మే, 28 మంగళవారం తెలంగాణలోని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లికి చెందిన యాదయ్య.. తన చేదబావిలో పూడిక తీయాలని అదే గ్రామానికి చెందిన ఒల్లాల మల్లయ్యను కోరారు.
అందుకు అంగీకరించిన మల్లయ్య బావిలోకి దిగారు. అరగంట తరువాత బావిలోంచి మల్లయ్య బదులు ఇవ్యకపోవడంతో యాదయ్య కుటుంబసభ్యులు కంగారుపడ్డారు.
ఏంచేయాలో తోచక పక్కనే కట్టెలు కొడుతున్న మారపల్లి రవీందర్ సహాయం కోరారు. వెంటనే బావిలో ఉన్న మల్లయ్యను కాపాడడానికి రవీందర్ బావిలో దిగారు.
బావిలో దిగిన 10 నిమిషాలకు రవీందర్ కూడా బావిలోనే స్పృహ కోల్పోయారు. ఇద్దరి నుంచి ఎలాంటి అలికిడి వినిపించలేదు. దీంతో యాదయ్య కుటుంబసభ్యులు మరింత కంగారు పడ్డారు.
యాదయ్య కుటుంబసభ్యుల కేకలు విన్న స్థానికులు బావి దగ్గరికి చేరుకున్నారు. 100, 108 సర్వీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న జమ్మికుంట టౌన్ సీఐ కోరిపల్లి సృజన్‌రెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అక్కడి పరిస్థితిని గమనించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తాడు సాయంతో బావిలోకి దిగారు. అగ్నిమాపక సిబ్బంది బావిలో ఉన్న బాధితులకు పైపు ద్వారా ఆక్సిజన్ పంపించి శ్వాస అందించారు.

ప్రాణాలతో బయటకు..
అగ్నిమాపక సిబ్బంది, గ్రామస్థుల సహకారంతో బావిలో ఉన్న వారిని తాళ్ల సాయంతో సీఐ బావిలోంచి బయటికి తీశారు. బయటికి వచ్చిన అనంతరం వారికి 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు.
ఈ క్రమంలో సీఐ సృజన్‌రెడ్డికి స్వల్పంగా గాయాలవడంతో చికిత్స అందించారు. సీఐ చేసిన సాహసానికి బాధిత కుటుంబసభ్యులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపంచారు.
సీఐ సరైన సమయంలో స్పందించి తమ ప్రాణాలను కాపాడారంటూ బాధితులు కన్నీళ్లపర్యంతమయ్యారు.

ఆయన పోలీసు శాఖకే వన్నె తెచ్చారు
సీఐ సృజన్ రెడ్డి పోలీసు శాఖకే వన్నె తెచ్చారని, ఇలాంటి వాళ్లను యువతకు ఆదర్శంగా తీసుకోవాలని మడపల్లి గ్రామస్తుడు రితీష్ అన్నారు. ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ‘‘నేను జమ్మికుంట వైపు వస్తుండగా బావి దగ్గర అందరూ గుమిగూడి వుండటంతో విషయం తెలుసుకునే ప్రయత్నం చేశా. మా గ్రామానికి చెందిన మల్లయ్య, రవిందర్ లు బావిలో చిక్కుకున్నది గమనించాను. సీఐ బాధితులను కాపాడుతుండటం ప్రత్యక్షంగా చూశా.’’ అని పేర్కొన్నారు.

మా కుటుంబం ఊపిరి పీల్చుకుంది
సీఐ సహాసం చేసి వారిద్దరిని కాపడాడటంతో మా కుటుంబం ఊపిరి పీల్చుకుంది అని బావి యజమానురాలు వరలక్ష్మీ బీబీసీతో అన్నారు. ‘‘వేసవి కాలం కావడంతో బావిలో నీరు అడుగంటింది. దీంతో చేదబావి పూడికతీత పని కోసం మల్లయ్యను పిలిచాం. తను బావిలోకి దిగిన కొద్దిసేపటికి మల్లయ్య స్పృహ కోల్పోవడం కంగారుకు గురిచేసింది. మల్లయ్యను కాపాడటానికి రవీందర్ సహాయం తీసుకోవడం, ఆయనా స్పృహ కోల్పోవడం మమ్మల్ని భయపెట్టింది. ఆ సమయంలో మాకేం తోచలేదు. సీఐ వారిద్దరిని కాపాడటంతో మా కుటుంబం ఊపిరి పీల్చుకుంది.’’ అని ఆమె చెప్పారు.

వారి ప్రాణాలే ముఖ్యమనిపించింది
ఆ సమయంలో బాధితుల ప్రాణాలు కాపాడటమే ముఖ్యమని భావించానని సీఐ సృజన్ రెడ్డి బీబీసీతో అన్నారు.
‘‘స్థానికులు అందించిన సమాచారంతో మా బృందంతో కలిసి అక్కడి వెళ్లాం. అక్కడి పరిస్థితిని గమనించిన అనంతరం బాధితుల ప్రాణాలను కాపాడాలనే తోచింది తప్ప, వేరే ఆలోచన నాకు రాలేదు. వెంటనే తాడు సాయంతో బావిలోకి దిగి బాధితులు మల్లయ్య, రవీందర్‌లను కాపాడాను. నేను ఉద్యోగంలో చేరాక ఒక మంచిపని చేశానన్న సంతోషం మిగిలింది’’ అని సృజన్ రెడ్డి పేర్కొన్నారు.
సీఐ ధైర్యసాహసాలకు తెలంగాణ ప్రభుత్వం హ్యాట్సాఫ్ చెప్పింది. జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించాలని నిర్ణయించింది. సీఐని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ అభినందించారు. తగిన రివార్డు ఇవ్వాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్‌ను హోంమంత్రి ఆదేశించారు.
సృజన్‌కు నా సెల్యూట్ అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు ట్విటర్ వేదికగా ప్రశంసించారు. ఇలాంటి ధైర్యసాహసాలు పోలీస్ శాఖకే గౌరవం తీసుకువస్తాయని అన్నారు.
ఇవి కూడా చదవండి
- ‘పీరియడ్ పేదరికం’: బహిష్టు సమయంలో పాత గుడ్డలకు ఈ కప్పులే సమాధానమా?
- మోదీ చెప్పిన కెమిస్ట్రీ మేధావులకు ఎందుకు అర్థం కాలేదు..
- ‘టీఎంసీ ఎంపీలు మిమి, నుస్రత్ వేసుకున్న దుస్తుల్లో తప్పేంటి’
- భారత 15వ ప్రధానిగా మోదీ.. అమిత్ షా, కిషన్ రెడ్డి సహా మంత్రులుగా 58 మంది ప్రమాణం
- ఎవరీ నెసమణి.. ఆయన కోలుకోవాలని ట్విటర్‌లో జనాలు ఎందుకు ప్రార్థిస్తున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








