టీఎంసీ ఎంపీలు మిమి, నుస్రత్ వేసుకున్న దుస్తుల్లో తప్పేంటి.. సోషల్ మీడియాలో ఎందుకు విమర్శలొస్తున్నాయి

ఫొటో సోర్స్, facebook/itsmimichakraborty/nusratchirps
- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ తరపున తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్‌లపై సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువయ్యాయి. ఎంపీలుగా ఎన్నికైన తర్వాత వారు మొదటిసారి పార్లమెంటుకు వచ్చి, ఫొటోలు దిగగా.. ఆ సమయంలో వారు ధరించిన దుస్తులు ఈ విమర్శలకు కారణమయ్యాయి.
30 ఏళ్ల మిమీ చక్రవర్తి ఇప్పటి వరకూ 20కి పైగా చిత్రాల్లో నటించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో జాదవ్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి అనుపమ్ హజ్రాపై దాదాపు 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
దాదాపు 20 చిత్రాల్లో నటించిన 29 ఏళ్ల నుస్రత్ జహాన్ బసిర్హత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి శంతను బసుపై 3 లక్షల ఓట్లకు పైగా మెజార్టీ సాధించారు.
తమపై వచ్చిన విమర్శలకు, సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు వీరిద్దరూ నిర్మొహమాటంగా సమాధానం ఇచ్చారు.
పార్లమెంటు భవనం వెలుపల ఫొటోలు తీసుకున్న వీరు ఆ సమయంలో జీన్స్, టీ షర్టులు ధరించారు. ఈ ఫొటోలను తమతమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు. దీంతో విమర్శలు మొదలయ్యాయి.

ఫొటో సోర్స్, facebook/itsmimichakraborty
ఈ అంశంపై మిమి చక్రవర్తి బీబీసీతో మాట్లాడుతూ.. ''మేం యవ్వనంలో ఉన్నా, మేం ఎందుకు జీన్స్, టీషర్టులు ధరించకూడదు?'' అని ప్రశ్నించారు.
''వీళ్లంతా మేం వేసుకున్న బట్టల్ని చూసి చాలా బాధపడిపోతున్నారు. కానీ క్రిమినల్ కేసులు, అవినీతి మరకలు ఉండి పవిత్రమైన వ్యక్తుల్లాగా దుస్తులు ధరించే పార్లమెంటు సభ్యుల్ని మాత్రం వీళ్లు పట్టించుకోరు'' అని ఆమె విమర్శించారు.
పార్లమెంటు భవనం ఎదుట మిమి, నుస్రత్‌లు నిలబడ్డ విధానంపైన కూడా చాలామంది విమర్శలు ఎక్కుపెట్టారు. ''ఇదేమైనా పార్లమెంటా? ఫ్యాషన్ షోనా?'' అని ఒకరు ట్వీట్ చేశారు.
''నేను యువతకు ప్రాతినిధ్యం వహిస్తుంటాను. వాళ్లు ఏం వేసుకుంటారో నేనూ అదే వేసుకుంటే వాళ్లు గర్వంగా భావిస్తారు'' అని మిమి చక్రవర్తి అభిప్రాయపడింది.
తాను తన సినీ జీవితంలో అత్యున్నత దశలో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టానని, యువత ద్వారానే మార్పు సాధ్యమని తాను బలంగా నమ్ముతున్నానని మిమి చెప్పింది.

ఫొటో సోర్స్, facebook/nusratchirps
కాగా, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలని నుస్రత్ భావించినప్పుడు ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, తన విజయంతోనే ఆయా విమర్శకులకు తగిన సమాధానం ఇచ్చానని 3 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీ సాధించిన నుస్రత్ అన్నారు.
''నా బట్టలు కాదు ముఖ్యం. నేను పోటీ చేసినప్పుడు ఇలాగే విమర్శలు చేశారు. వారికి నా గెలుపుతోనే సరైన సమాధానం ఇచ్చాను. అలాగే, ఇప్పుడు విమర్శలు చేస్తున్న వారికి కూడా నా పనితోనే సమాధానం ఇస్తాను. ఇది చాలా కష్టమైన పోరు, కానీ.. నేను దీనికి సిద్ధపడే వచ్చాను'' అని నుస్రత్ బీబీసీతో అన్నారు.
పార్లమెంటుకు వచ్చేప్పుడు ఫలానా దుస్తులే ధరించాలన్న డ్రెస్ కోడ్ పార్లమెంటు సభ్యులకు లేదు.
రాజకీయాల్లో పురుషులు ధరించే దుస్తులకంటే మహిళలు ధరించే దుస్తుల గురించే ఎక్కువ మంది మాట్లాడుకుంటారు. మమతా బెనర్జీ, జయలలిత, మాయావతిల వస్త్రధారణపై చాలామంది బహిరంగంగా వ్యాఖ్యానాలు చేశారు.
ఎవరైనా మహిళ సినిమాల నుంచి రాజకీయాల్లోకి వస్తే ఈ వ్యాఖ్యానాలు తీవ్రంగా ఉంటాయి.
టాలీవుడ్‌గా పిలిచే బెంగాలీ సినీ పరిశ్రమలో మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్‌లు పేరున్న నటీమణులు.
''మార్పును స్వీకరించేందుకు ప్రజలకు కొంత సమయం పడుతుంది. యవ్వనంలో ఉన్న ఒక పురుష ఎంపీ జీన్స్, టీ షర్టు ధరిస్తే ఎవ్వరూ అభ్యంతరం వ్యక్తం చేయరు. కానీ, మహిళలు అదే పని చేస్తే మాత్రం వాళ్లకు సమస్య'' అని మిమి చక్రవర్తి అన్నారు.

ఫొటో సోర్స్, TWITTER
అయితే, విమర్శలతో పాటే వీరికి సోషల్ మీడియాలో కొందరి నుంచి మద్దతు కూడా లభిస్తోంది.
ఇది మార్పుకు సంకేతం అని నుస్రత్ అన్నారు. ''ప్రజలు మార్పును అర్థం చేసుకునేందుకు ఇదే తగిన సమయం. రాత్రికి రాత్రి ఇది జరిగిపోదు కానీ మార్పు మాత్రం ప్రారంభమైంది.''
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ గతంలో కూడా సినీ నటులు, నటీమణులకు పార్టీ టిక్కెట్లు ఇచ్చింది.
మిగతా రాజకీయ పార్టీలతో పోలిస్తే, తృణమూల్ కాంగ్రెస్ అందరికన్నా ఎక్కువగా 40 శాతం లోక్‌సభ టిక్కెట్లను మహిళలకు కేటాయించింది.
మొత్తం 17 మంది మహిళలు టీఎంసీ తరపున పోటీ చేయగా వారిలో నలుగురు సినీ నటులు, వీరిలో ముగ్గురు గెలుపొందారు.
2014లో ఎంపీగా గెలుపొందిన పాతతరం నటి మూన్ మూన్ సేన్ ఈ సారి ఎన్నికల్లో ఓడిపోయారు.
నుస్రత్, మిమిలతో పాటు మూడుసార్లు ఎంపీగా వ్యవహరించిన శతాబ్ది రాయ్ కూడా ఈసారి గెలుపొందారు.
ఇవి కూడా చదవండి:
- పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ సినీ నటుల ప్రచారంపై వివాదం
- క్రికెట్ ప్రపంచకప్ 2019: మీరు తెలుసుకోవాల్సిన 12 విషయాలు
- కండలు పెంచే ప్రయత్నంలో సంతానోత్పత్తి సామర్థ్యం కోల్పోతున్నారు
- ‘రాజకీయ నేతల ప్రేమ వ్యవహారాలపై ఎవ్వరూ బహిరంగంగా ఎందుకు మాట్లాడరు?’
- నా కార్టూన్లే నా ప్రాణాలు కాపాడాయి.. కొత్త జీవితాన్ని ఇచ్చాయి.. ఇదీ నా కథ
- మహిళల అవయవాలకు ‘మగ’ పేర్లే ఎందుకున్నాయి?
- చైనాలో ఇస్లాం వ్యాప్తి చేస్తున్న పాకిస్తాన్ మదరసా విద్యార్థులు
- అభిప్రాయం: ఆయనకు ఇద్దరున్నపుడు ఆమెకిద్దరు ఎందుకు ఉండకూడదు?
- ‘పీరియడ్ పేదరికం’: బహిష్టు సమయంలో పాత గుడ్డలకు ఈ కప్పులే సమాధానమా?
- గ్రౌండ్ రిపోర్ట్: పశ్చిమ బెంగాల్లో ఎన్నికల హింస మిగిల్చిన విషాదం
- మోదీ చెప్పిన కెమిస్ట్రీ మేధావులకు ఎందుకు అర్థం కాలేదు..
- చంద్రాణి ముర్ము: పోటీ పరీక్షలకు చదువుకుంటున్న యువతికి ఎంపీ పదవి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








