సీబీఐ వర్సెస్ మమతా బెనర్జీ: ఎవరీ రాజీవ్ కుమార్?

ఫొటో సోర్స్, facebook/AllIndiaTrinamoolCongress
- రచయిత, ఫైజల్ మహమ్మద్ అలీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
సీబీఐకి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి మధ్య వివాదం సుప్రీంకోర్టు నుంచి పార్లమెంటు దాకా, దిల్లీ నుంచి కోల్‌కతా వరకూ తిరుగుతోంది.
కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్జేడీ, ఎస్పీ, ఇతర ప్రతిపక్షాలన్నీ ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి. సీబీఐని నరేంద్ర మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించాయి.
ఫెడరల్ వ్యవస్థకు ఇది చేటు చేసే చర్య అని ప్రముఖ న్యాయవాది, రాజ్యాంగ నిపుణులు ఇందిరా జైసింగ్ వ్యాఖ్యానించారు.
"తమ పరిధిలోని నేరాలపై విచారణ జరిపే అధికారాన్ని సీబీఐకి రద్దు చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కానీ, ఇది ఫెడరల్ వ్యవస్థపై నేరుగా కేంద్రం చేస్తున్న దాడి. రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే పరిస్థితులను సృష్టించింది" అని ఇందిర ట్వీట్ చేశారు.
"ఈ అంశంపై సీబీఐ ఈరోజు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇంతకు ముందే సీబీఐ ఆ పని ఎందుకు చేయలేదు? పశ్చిమ బెంగాల్ పోలీసులు తమ విచారణకు సహకరించడం లేదంటూ ముందే కోర్టుకు ఎందుకు వెళ్లలేదు? ఓ సీనియర్ అధికారి దగ్గరకు వెళ్లి, ఆయనను ఓ క్రిమినల్‌ను విచారించినట్లు విచారిస్తామంటే అది న్యాయసమ్మతమేనా? సీబీఐ ఓ స్వతంత్ర వ్యవస్థ అనే విషయాన్ని ప్రభుత్వం, సీబీఐ కూడా అర్థం చేసుకోవాలి" అని సుప్రీంకోర్టు న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు సూరత్ సింగ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మమత, మోదీ, సీబీఐ
ఈ కేసు విచారణ కోసం సీబీఐని తన ప్రతినిధిగా కేంద్రం పంపించగా, మరోవైపు మమతా బెనర్జీ రోడ్డుపై బైఠాయించారు.
మమతా బెనర్జీ రాజ్యాంగాన్ని రక్షించడం కాదు, తన రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ రాజ్యాంగంపై ఆమెకు అంత గౌరవమే ఉంటే, ఆమె నేరుగా సుప్రీంకోర్టునే ఆశ్రయించిఉండాల్సిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
"కోల్‌కతా పోలీస్ కమిషనర్ విషయంలో సీబీఐ అనుసరించిన విధానం సరైనదే. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ కేసు విచారణ ఇప్పటికే సీబీఐ చేతుల్లో ఉంది" అని సీబీఐ మాజీ అదనపు డైరెక్టర్ ఎన్‌కే సింగ్ అభిప్రాయపడ్డారు.
"కానీ, ఆదివారం నాడు సీబీఐ చేపట్టిన చర్యలన్నీ రాజకీయ ప్రేరేపితంగా కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. సీబీఐకి కొత్త డైరెక్టరును నియమించారు, ఆయన త్వరలోనే బాధ్యతలు చేపట్టబోతున్నారు, ఇంతలోనే ఎందుకింత తొందర?" అని సింగ్ ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
పోలీస్ కమిషనర్‌ను విచారణ చేయడానికి సీబీఐ అధికారుల దగ్గర వారెంట్ కూడా లేదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చెబుతోంది.
అయితే, ఈ విషయంలో ఎలాంటి వారెంటూ అవసరం లేదు. కానీ, కమిషనర్ రాజీవ్ కుమార్ ఇంటికి ఆదివారం సీబీఐ అధికారులు చేరుకున్న విధానం సరైనది కాదని సింగ్ అన్నారు.
ఈ కేసు విషయంలో విచారణకు సహకరించాలని రాజీవ్ కుమార్‌కు గతంలో నాలుగుసార్లు సమన్లు జారీచేసినా ఆయన స్పందించలేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు.
గతంలో ఈ కేసు విచారణ చేసిన ప్రస్తుత కోల్‌కతా పోలీస్ కమిషనర్ సాక్ష్యాలను మాయం చేసే అవకాశం కూడా ఉందని సీబీఐ అభిప్రాయపడుతోందని తుషార్ కోర్టులో అన్నారు.
అలాంటి అవకాశాలేమీ కనిపించడం లేదని తన ముందుకొచ్చిన మధ్యంతర పిటిషన్‌ను ఉద్దేశించి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ వ్యాఖ్యానించారు. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజీవ్ కుమార్ ఎవరు?
ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న అంశం, మమతా బెనర్జీకి, సీబీఐకి మధ్యలో ఇంత వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచిన ఈ రాజీవ్ కుమార్ ఎవరు?
ప్రస్తుత కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ పశ్చిమ బెంగాల్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్‌లో జన్మించారు. ఐఐటీ కాన్పూర్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. నిఘా వ్యవస్థను, టెక్నాలజీని ఉపయోగించి నేరస్థులను పట్టుకోవడంలో ఈయనకు బెంగాల్ రాష్ట్ర పోలీసు శాఖలో ఎంతో పేరుంది.
1990ల్లో అదనపు సూపరింటెండెంట్‌గా ఉండగా బీర్భుమ్ జిల్లాలో బొగ్గు మాఫియాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. చాలామంది స్థానిక మాఫియా నాయకులను అరెస్టు చేశారు. అప్పట్లో బొగ్గు మాఫియాకు వ్యతిరేకంగా పోలీసులెవరూ ఎలాంటి చర్యలూ తీసుకునేవారు కాదు. దీంతో రాజీవ్ పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
మమతాకు రాజీవ్ ఎలా సన్నిహితులయ్యారు?
తన పనితీరుతో రాజీవ్ ప్రభుత్వ పెద్దల కళ్లలో పడ్డారు. తన ఫోన్ సంభాషణలను రికార్డింగ్ చేస్తున్నారంటూ ప్రతిపక్షంలో ఉండగా మమతా బెనర్జీ ఆయనపై ఆరోపణలు చేశారు. కానీ, అధికారంలోకి రాగానే మమతాకు రాజీవ్ అత్యంత సన్నిహిత అధికారుల్లో ఒకరిగా మారిపోయారు.
2016లో కోల్‌కతా కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
శారదా చిట్స్, రోజ్ వ్యాలీ కుంభకోణంలో విచారణకు 2013లో ఏర్పాటు చేసిన సిట్‌కు రాజీవే నేతృత్వం వహించారు. అయితే, ఈ రెండు కేసులను సీబీఐకు అప్పగించాలని 2014లో సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఎన్నో పత్రాలు, ల్యాప్‌టాప్‌లు, పెన్ డ్రైవ్‌లు, మొబైల్ ఫోన్లు రాజీవ్ తమకు స్వాధీనం చేయలేదని సీబీఐ ఆరోపించింది. దీనికి సంబంధించి ఎన్నిసార్లు సమన్లు జారీచేసినా ఆయన స్పందించలేదని తెలిపింది.
ఇవి కూడా చదవండి.
- ఆరోజు సీబీఐ డైరీ, ఈరోజు డైరెక్టర్ తొలగింపు.. అన్నీ రహస్యాలేనా
- 2జీ కుంభకోణం కేసు: ‘ఏడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నా.. ఒక్క సాక్ష్యం లేదు’
- బంగ్లాదేశ్ యుద్ధంలో 'రా' చీఫ్ రామేశ్వర్నాథ్దే కీలక పాత్ర!
- 'పంజరంలో చిలక' సీబీఐలో ఏం జరుగుతోంది?
- సీబీఐ వర్సెస్ సీబీఐ: డైరెక్టర్ అలోక్ వర్మ తొలగింపునకు.. రఫేల్ విచారణకు సంబంధముందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








