వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్: ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు.. ఏడు బీసీ, ఐదు ఎస్సీ, నాలుగు రెడ్డి, నాలుగు కాపు, ఒక్కొక్క మైనార్టీ, వైశ్య, క్షత్రియ, ఎస్టీ మంత్రులు

ఫొటో సోర్స్, facebook/ysrcpofficial
- రచయిత, బళ్ల సతీశ్, బీబీసీ ప్రతినిధి
- హోదా, శంకర్, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. కొత్త మంత్రుల ఎంపిక పూర్తయ్యింది. జగన్ తన టీమ్‌లో యువతకు పెద్ద పీట వేశారని విశ్లేషకులు అంటున్నారు.
తన తొలి క్యాబినెట్ సహచరుల ఎంపికకు ముందు జగన్ వైసీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. తన లక్ష్యాలు, ప్రాధాన్యతలను శాసనసభ్యులకు వివరించారు. అందుకు అనుగుణంగా సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని క్యాబినెట్‌ని ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించారు.
జగన్ తన ఆలోచనలకు అనుగుణంగా తన టీమ్ సభ్యుల జాబితాను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కి అందించారు. ఆయన ఆమోదించిన క్యాబినెట్ ప్రమాణస్వీకార కార్యక్రమం శనివారం ఉదయం 11.49 గంటలకు వెలగపూడిలోని సెక్రటేరియేట్ ప్రాంగణంలో నిర్వహించబోతున్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారం కోసం గవర్నర్ విజయవాడ చేరుకున్నారు.
ఇక మంత్రులుగా ఎంపికైన వారికి స్వయంగా ఎంపీ విజయసాయి రెడ్డి ఫోన్ చేసి రేపు ఉదయం కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.
రేపు ఉదయం జగన్మోహన రెడ్డి సచివాలయంలోని తన చాంబర్ కి మొదటిసారి వెళ్లి పూజలు చేసి ఆ తరువాత మంత్రివర్గ ప్రమాణ స్వీకార వేదిక దగ్గరకు చేరుకుంటారు.
మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం తరువాత మొట్టమొదటి క్యాబినెట్ సమావేశం జరుగుతుంది.
జగన్ తన టీమ్ ఎంపికలో బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చారని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆయన బీబీసీతో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
‘‘ఎన్నికలకు ముందే సామాజిక సమతుల్యత పాటిస్తామని చెప్పాం. అన్ని నియామకాల్లోనూ బీసీలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పాం. అందుకు అనుగుణంగానే జగన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు వైసీపీని ఆదరించినదానికి అనుగుణంగా పాలన ఉండబోతోంది. ఇప్పటికే పది రోజులుగా ఆశా వర్కర్ల వేతనాల పెంపు సహా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నాం. యువతకు అవకాశం కల్పించడం ద్వారా తనకు తోడుగా రాబోయే ఇరవై, ముప్పై ఏళ్ల పాలనకు ప్రాధాన్యత ఇచ్చారు. రెండున్నరేళ్ల తర్వాత మిగిలిన వారికి కూడా మంత్రిమండలిలో చోటు కల్పిస్తామని ఇప్పటికే ప్రకటించినందున అందరికీ న్యాయం జరుగుతుంది’’ అని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
పవన్ కళ్యాణ్‌ను, నారా లోకేశ్‌ను ఓడించిన వారికి మంత్రి పదవులు వస్తాయని ప్రచారం జరిగినా వారికి క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం కనిపించడంలేదు. రేపల్లె నుంచి ఓడిపోయినప్పటికీ ముందు నుంచీ పార్టీలో ఉన్న, కేసులు ఎదుర్కొన్న మోపిదేవి వెంకటరమణకు మంత్రి పదవి ఖరారయింది.
అధికారికంగా ఇంకా ప్రకటించనప్పటికీ.. పేరు వెల్లడించేందుకు ఇష్టపడని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు జగన్ క్యాబినెట్ కూర్పు ఇలా ఉంది.
వారిలో అందరికన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్. ఆయన ఆరోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది.
పెద్దిరెడ్డితో పాటుగా బొత్స, మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని, పినిపే విశ్వరూప్ కూడా వైఎస్ హయంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది.
మిగిలిన 19 మంది తొలిసారి అమాత్య హోదా దక్కించుకున్నారు.
కాగా, పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ తొలిసారిగా ఎన్నికయిన ఎమ్మెల్యే కావడం విశేషం.
ఇక వయసు రీత్యా పాముల పుష్ప శ్రీవాణి కేవలం 32 ఏళ్ల వయసులోనే మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.


ఈ జాబితాలో ఏడుగురు బీసీ, ఐదు ఎస్సీ, నలుగురు రెడ్లు, నలుగురు కాపు, ఒక మైనార్టీ, ఒక వైశ్య, ఒక క్షత్రియ, ఒక ఎస్టీ ఉన్నారు. ఇక బ్రాహ్మణ వర్గం నుంచి కోన రఘుపతి డిప్యూటి స్పీకర్ గా, కాళింగ వర్గం నుంచి తమ్మినేని సీతారాం స్పీకర్ గా ఉండబోతున్నారు.
ముగ్గురు మహిళలకు అవకాశం దక్కింది. వారిలో ఇద్దరు ఎస్సీ మహిళ, ఒకరు ఎస్టీ మహిళ ఉన్నారు.
ఇక ఈ 25 మంది జాబితాలో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా దక్కబోతోంది. అందులో కూడా కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కోటా ఉంటుందని జగన్ ప్రకటించారు.
జగన్ మంత్రివర్గ కూర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బొత్స, పెద్దిరెడ్డి వంటి వారికి తప్ప ధర్మాన ప్రసాదరావు, ఆర్కే రోజా సహా పలువురు సీనియర్లకు క్యాబినెట్ లో చోటు దక్కకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే సామాజికంగా జగన్ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు.
సీనియర్ జర్నలిస్ట్ పెద్దాడ నవీన్ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ మంత్రుల కూర్పు సంతృప్తికరంగా ఉందని, త్వరలోనే ఏపీలో పెరగబోతున్న జిల్లాలకు అనుగుణంగా ఉన్నట్టు భావించాల్సి ఉంటుందని అన్నారు. 25 జిల్లాలకు గానూ ఒక్కో జిల్లాకు ఒక మంత్రి వుండేలా చూశారని, కులాలు, ప్రాంతాల సమతూకాన్ని గమనిస్తే సోషల్ ఇంజనీరింగ్ బాగుందని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఓటుకు రూ. 2,000 పంచారు.. దేశంలో ఒక్కో లోక్‌సభ స్థానంలో రూ. 100 కోట్ల వ్యయం’’
- పీరియడ్స్ సమయంలో సెక్స్ తప్పా? ఒప్పా?
- లిప్‌స్టిక్ తయారీకి వాడే గింజలు ఇవే... ఆంధ్రప్రదేశ్‌లోనూ జోరుగా సాగు
- ఫ్యాక్ట్ చెక్: బీరు దొరకట్లేదని కేసీఆర్‌కు బ్యాలెట్ బాక్సు ద్వారా లేఖ నిజమేనా?
- ఏపీ శాసనసభలో ప్రొటెం స్పీకర్ విధులేంటి? ఈసారి ప్రొటెం స్పీకర్ ఎవరు?
- మహేంద్ర సింగ్ ధోని ఆ కీపింగ్ గ్లవ్స్ వాడకూడదన్న ఐసీసీ.. అవే కొనసాగిస్తాడన్న బీసీసీఐ
- మహిళలకు భావప్రాప్తి కలిగిందో లేదో పట్టించుకోనవసరం లేదా - అభిప్రాయం
- వరల్డ్ కప్‌లో 10 జట్లే ఉండటానికి బీసీసీఐ అత్యాశే కారణమా
- చైనాలో వ్యభిచార వ్యాపారం.. సెక్స్ బానిసత్వంలో మగ్గిపోతున్న ఉత్తర కొరియా అమ్మాయిలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








