ఫ్యాక్ట్ చెక్: బీరు దొరకట్లేదని కేసీఆర్‌కు బ్యాలెట్ బాక్సు ద్వారా లేఖ నిజమేనా?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, వంశీ చైతన్య పెడసనగంటి
- హోదా, బీబీసీ ఫ్యాక్ట్ చెక్ టీం
ఒక బ్రాండ్ బీర్లు జగిత్యాలలో దొరకట్లేదని తమ జిల్లాను కరీంనగర్ జిల్లాలో విలీనం చెయ్యాలి అని ఒక లేఖ రాసి ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్లో వేశారు అన్న దాంట్లో నిజమెంత?
జగిత్యాల స్థానిక ఎన్నికలలో ఓట్ల లెక్కింపు సమయంలో బ్యాలెట్ బాక్సు లో ఒక లేఖ దొరికిందని... అందులో ఒక విచిత్రమయిన విన్నపం రాసి ఉందని సోషల్ మీడియాలో చాలా మంది ఒక పోస్టును షేర్ చేస్తున్నారు.
ఆ లేఖలో ఒక ఓటరు తమ జిల్లాలో కింగ్‌ఫిషర్ బీర్లు దొరకకపోవడం వల్ల జిల్లావాసులు పక్క జిల్లాలకు వెళ్లి బీర్లు తాగవలసి వస్తోంది అని రాసారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి రాసిన ఈ లేఖలో తమ జిల్లాలో కింగ్‌ఫిషర్ బీర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాసిన వ్యక్తి కోరారు. అలాగే కింగ్‌ఫిషర్ బీర్ల కోసం జగిత్యాల జిల్లాను కరీంనగర్‌లోకి విలీనం చెయ్యాలని కూడా ఒక సూచన చేసారు ఆ వ్యక్తి.
సోషల్ మీడియాలో చాలా మంది ఈ లేఖను ఎగతాళి చేస్తూ షేర్ చేసారు.
ఈ వార్తను ప్రముఖ మీడియా సంస్థలు కూడా వారి వెబ్‌సైట్లలో ప్రచురించాయి.

ఇందులో నిజమెంత?
బీబీసీ చేసిన ఫ్యాక్ట్ చెక్ ప్రకారం ఈ వార్త తప్పని తేలింది.
ఈ పోస్టులలో ఉన్న లేఖను దగ్గరగా చూస్తే అది లేఖ కాదని అర్ధం అవుతుంది. పుస్తకంలో ఒక పేజీలో లేఖ రూపంలో రాసి దాన్ని ఫోటో తీసి ప్రచారం చెయ్యడం జరిగింది.
సోషల్ మీడియా పోస్టులలో చాలామంది ఈ లేఖ రకరకాల ప్రాంతాలలోని బ్యాలెట్ బాక్సులలో దొరికింది అని కూడా అంటున్నారు. లేఖ పైన జగిత్యాల జిల్లా అని రాసి ఉన్నా కూడా కొంతమంది ఇది కరీంనగర్‌లోని రాయికల్ మండలంలో దొరికింది అని కూడా రాస్తున్నారు.
ఈ పోస్టులో నిజానిజాలను వెలికితియ్యడానికి జగిత్యాల జాయింట్ కలెక్టర్ రాజేశంతో బీబీసీ మాట్లాడగా.. "మాకు అటువంటి లేఖ ఏది లభించలేదు. మాకు దొరికిన ఒక లేఖలో మాత్రం వారి ఊరిలో రోడ్లను బాగుచెయ్యమని మాత్రం రాసి ఉంది" అని ఆయన అన్నారు. క్రిందటి సంవత్సరం ఇలాంటి లేఖ వచ్చిందని ఒక మీడియా సంస్థ ప్రచురించడంపై ఆయన స్పందన గురించి అడిగితే… "సంవత్సరన్నర క్రితం ప్రజావాణి కార్యక్రమంలో ఒక వ్యక్తి కింగ్‌ఫిషర్ బీర్లు దొరకడం లేదు అని కలెక్టర్ కి ఒక లేఖ ఇచ్చి విన్నవించుకోడం జరిగింది" అని ఆయన అన్నారు. అంతే తప్ప బ్యాలెట్ బాక్సులో ఎన్నడూ బీర్ల గురించి లేఖ రాలేదని ఆయన స్పష్టం చేసారు.
ఇదే విషయం గురించి రాష్ట్ర ఎన్నికల సంఘంతో మాట్లాడితే తమ దగ్గర ఇటువంటి లేఖ గురించి ఎటువంటి సమాచారం లేదు అని స్పష్టం చేసారు.
కనుక బీరు దొరకట్లేదని కేసీఆర్‌కు బ్యాలెట్ బాక్సు ద్వారా లేఖ రాశారంటూ వైరల్ అవుతున్న ఈ విషయంలో ఎటువంటి నిజం లేదు.
ఇవి కూడా చదవండి:
- మహిళలు మద్యం తాగితే సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బ తింటుందా...
- రష్యా: ‘ఐదేళ్లలో 80 శాతం తగ్గిన ఆల్కహాల్ విక్రయాలు’.. నిజమెంత?
- ‘దేశంలో ఎక్కువగా తాగేది తెలుగువాళ్లే’
- మద్యం అతిగా తాగితే... డీఎన్ఏ డామేజ్ అవుతుందా...
- పది నిమిషాల్లో ఆనందాన్ని పెంచుకోవడం ఎలా?
- అభిప్రాయం: ఇది విలీనం కాదు టోకు ఫిరాయింపు
- మహేంద్ర సింగ్ ధోని ఆ కీపింగ్ గ్లవ్స్ వాడకూడదన్న ఐసీసీ.. అవే కొనసాగిస్తాడన్న బీసీసీఐ
- ఎడిటర్స్ కామెంట్: ఇంటర్మీడియట్ పిల్లల చావులకు బాధ్యులెవరు?
- మహిళలకు భావప్రాప్తి కలిగిందో లేదో పట్టించుకోనవసరం లేదా - అభిప్రాయం
- నా కార్టూన్లే నా ప్రాణాలు కాపాడాయి.. కొత్త జీవితాన్ని ఇచ్చాయి.. ఇదీ నా కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








