పవన్ కుమార్ చామ్లింగ్: దేశంలోనే అత్యధిక కాలం సీఎంగా చేసిన ఈయన ఎందుకు ఓడిపోయారు

పవన్ కుమార్ చామ్లింగ్

ఫొటో సోర్స్, facebook/BeautifulSikkim

పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం రాష్ట్రానికి పాతికేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ రాష్ట్ర ప్రజలు ఈసారి ఆయన ప్రత్యర్థి ప్రేమ్ సింగ్ తమాంగ్‌కు పట్టం కట్టడంతో ఆయన సుదీర్ఘ పాలనకు తెరపడింది. అసలీ మార్పు ఎలా జరిగింది? దాని వెనుకున్న కారణాలేంటి? అనే విషయాలు తెలుసుకోవడం కోసం బీబీసీ ప్రతినిధులు ఆమిర్ పీర్జాదా, నేహా శర్మలు ఈ ఈశాన్య రాష్ట్రంలో పర్యటించారు.

‘‘సిక్కింలో 25 ఏళ్ల పాటు నా ప్రభుత్వం పని చేసింది. ప్రజలు నన్ను ఎంతగానో ప్రేమించారు. నేను రాజకీయాలు నా హృదయంలోంచి చేస్తాను.... నా రాష్ట్రం శాంతియుతంగా, సురక్షితంగా, పరిశుభ్రంగా, తిరుగుబాట్లేవీ లేకుండా ఉంటే నాకు సంతృప్తిగా ఉంటుంది’’ అని పవన్ కుమార్ చామ్లింగ్ బీబీసీతో అన్నారు.

వీడియో క్యాప్షన్, వీడియో: అసలీ మార్పు ఎలా జరిగింది? దాని వెనుకున్న కారణాలేంటి?

కానీ నూతన ముఖ్యమంత్రి మాత్రం ఆయన సాధించిందేమీ లేదని పెదవి విరుస్తున్నారు.

‘‘చామ్లింగ్ ది పాతికేళ్ల పాటు నడిచిన నియంతృత్వ పాలన. చామ్లింగ్ ప్రభుత్వం చేసిన పనులన్నీ చట్టవిరుద్ధమైనవే. నగరం అందంగా ఉంది కానీ పరిపాలనా వ్యవస్థ కుప్పకూలింది. చిన్న రాష్ట్రమే అయినా విపరీతంగా అప్పులు చేయడంతో ఇప్పుడిది రుణభారంతో కుంగిపోతోంది. చదువుకున్న, నిరుద్యోగ యువతకు ఎలాంటి అవకాశాలూ దక్కలేదు. అధికార వ్యతిరేకత, యువశక్తి కారణంగా ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది’’ అని నూతన ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ చెప్పారు.

సిక్కింలో 32 అసెంబ్లీ స్థానాలున్నాయి.

వీటిలో చామ్లింగ్ 15 స్థానాలు గెల్చుకున్నారు.

ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి తమంగ్ పార్టీకి 17 సీట్లు లభించాయి.

ఇది స్వల్ప ఆధిక్యమే అయినా... తమంగ్ నూతన పార్టీకి ఘన విజయమే అని చెప్పుకోవచ్చు.

ప్రేమ్ సింగ్ తమాంగ్

ఫొటో సోర్స్, facebook/skmonline

ఫొటో క్యాప్షన్, ప్రేమ్ సింగ్ తమాంగ్‌ను స్థానికంగా అందరూ పీఎస్ గోలే అని పిలుస్తుంటారు

ఇది ఎలా సాధ్యమైంది?

దీనిపై తమంగ్ స్పందిస్తూ.. ‘‘నేను గ్రామాల్లో ఎన్నో పగళ్లూ, రాత్రులూ గడిపాను. సమయాన్ని ఏ మాత్రం వృథా చేయలేదు. పరివర్తన్ సంకల్ప్ యాత్ర పేరుతో మేం ప్రచారం నిర్వహించాం. ఎన్నికలు ముగిసేంత వరకూ నేను గ్రామాల్లో ప్రచారం చేస్తూనే ఉండిపోయాను. ఈ గెలుపు వెనుక చాలా సంఘర్షణ ఉంది. ఈ మార్పు తప్పక రావాల్సిందే’’ అన్నారు.

అయితే, చామ్లింగ్ ఓటమికి ఇదొక్కటే కారణం కాదు.

చాలా కాలం పాటు ఎంతో ప్రజాదరణ లభించినప్పటికీ... తమ పార్టీ వైఫల్యాలను అంగీకరిస్తున్నారు చామ్లింగ్.

‘‘నేను దీన్ని వినమ్రంగా స్వీకరిస్తాను. మేం ఓడిపోయాం. మా పార్టీ పని తీరు వల్లే మేం ఓడిపోయాం. ఎన్నో లోపాలున్నాయి. అంతర్గత కుమ్ములాటలున్నాయి. మా వాళ్లు క్రియాశీలంగా పని చేయలేదు. అందుకే మేం ఓడిపోయాం’’ అని ఆయన అన్నారు.

ఈ కారణాల వల్లనే చాలా మంది ప్రజలు మార్పు కోరుకున్నారు.

‘‘చామ్లింగ్ సర్ మంచివారు. కానీ ప్రజలు మార్పు కోరుకున్నారు. పాతికేళ్లు చాలా ఎక్కువ కదా’’ అని ఒక మహిళ బీబీసీతో అన్నారు.

సిక్కింలో మొట్టమొదటి సారి బలమైన ప్రతిపక్షం ఉనికిలోకి వచ్చిందని విశ్లేషకులంటున్నారు.

చామ్లింగ్ నేతృత్వంలోని ప్రతిపక్షం ఇప్పుడు సిక్కింలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సి ఉంటుంది.

‘‘ఇప్పటికీ నేను పోటీలోనే ఉన్నాను. సన్యాసం తీసుకోలేదు. నా హృదయంలో కలుక్కుమనే బాధ ఉంది. నేను సిక్కింను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దినప్పటికీ ప్రజలు నాకు గౌరవంగా విరమణ చేసే అవకాశం ఇవ్వలేదు. మధ్యలోనే నన్ను, ప్రభుత్వాన్ని గద్దె దింపారు’’ అన్నారు చామ్లింగ్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)