ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నాలకు FATF షాక్.. పాకిస్తాన్‌ను బ్లాక్ లిస్టులో పెట్టించాలనే భారత్ ప్రయత్నం నెరవేరుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
ఏసియా పసిఫిక్ గ్రూప్(ఏపీజీ) రిపోర్ట్ పాకిస్తాన్‌కు షాకిచ్చింది. మనీ ల్యాండరింగ్, తీవ్రవాదం, నిధుల విషయంలో పాకిస్తాన్ సంతృప్తికరమైన చర్యలు చేపట్టలేదని ఏపీజీ తన ఫైనల్ రిపోర్టులో చెప్పింది.
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) విస్తృత సమావేశానికి 10 రోజుల ముందు ఏపీజీ మనీ ల్యాండరింగ్‌పై తన రిపోర్టు విడుదల చేసింది.
ఈ రిపోర్టు ఆధారంగానే పాకిస్తాన్‌ను గ్రే లిస్టులో కొనసాగించడంపై ఎఫ్ఏటీఎఫ్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.
ఏపీజీ రిపోర్ట్ వల్ల ఎఫ్ఏటీఎఫ్ సమావేశంలో పాకిస్తాన్‌ను గ్రే లిస్టులో కొనసాగించే ప్రమాదం కనిపిస్తోంది.
ఏపీజీ తన రిపోర్టులో "ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ప్రతిపాదన 1267 ప్రకారం తీవ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకోవాలి" అని చెప్పింది.
ఎఫ్‌ఏటీఎఫ్ సమావేశం అక్టోబర్ 13, 18 మధ్య జరగాల్సి ఉంది. ఏపీజీ ఈ రిపోర్టు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు నిరాశ కలిగించనుంది.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సెప్టెంబర్ 27న ప్రసంగించిన ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్‌ను గ్రే లిస్టులో పెట్టించాలని భారత్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
"పాకిస్తాన్ ఆర్థికంగా దివాలా తీయాలని భారత్ కోరుకుంటోంది. మేం భారత్‌తో శాంతి చర్చలకు ప్రయత్నిస్తుంటే, భారత్ తన ఎజెండా మీదే ఉంది" అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
అయితే ఎఫ్ఏటీఎఫ్ పాకిస్తాన్‌ను బ్లాక్ లిస్టులో పెట్టే అవకాశాలు తక్కువే ఉన్నాయి. ఈసారీ ఎఫ్‌ఏటీఎఫ్ చీఫ్ పదవిలో చైనా బ్యాంకర్ షింజమిన్ లియూ ఉన్నారు. పాకిస్తాన్‌కు అది ఉపశమనం కలిగించవచ్చని చెబుతున్నారు.
ఇటీవల టర్కీ, మలేసియా కశ్మీర్ అంశంలో పాకిస్తాన్‌కు బహిరంగ మద్దతు ప్రకటించాయి. ఎఫ్ఏటీఎఫ్ అంశంలో కూడా పాకిస్తాన్‌కు టర్కీ, మలేసియా మద్దతు లభించవచ్చు.
2018 జూన్‌లో పాకిస్తాన్ గ్రే లిస్టులోకి వచ్చినపుడు, అది బ్లాక్ లిస్టులో పడకుండా బయటపడేందుకు టర్కీ సాయం చేసింది. చివరికి చైనా కూడా పాకిస్తాన్ గురించి తన అభ్యంతరాలను వెనక్కు తీసుకుంది.
ఎఫ్ఏటీఎఫ్ అంటే
ఎఫ్ఏటీఎఫ్ ఒక అంతర్జాతీయ సంస్థ, దీనిని జీ7 దేశాల చొరవతో 1989లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం ప్యారిస్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మనీ ల్యాండరింగ్‌ను ఎదుర్కోడానికి ఇది విధానాలు రూపొందిస్తుంది.
2001లో ఇది తీవ్రవాదం, వారికి నిధులు అందించడాన్ని కూడా తన విధానాల్లో చేర్చింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సజావుగా ఉండేలా ఇది విధానాలు రూపొందిస్తుంది. వాటిని అమలు చేసే దిశగా పనిచేస్తుంది.
ఎఫ్ఏటీఎఫ్‌లో మొత్తం 38 సభ్య దేశాలు ఉన్నాయి. వాటిలో భారత్, అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా కూడా ఉన్నాయి.
2018 జూన్ నుంచి పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా మనీ ల్యాండరింగ్‌పై నిఘా పెట్టే సంస్థల దృష్టిలో ఉంది. తీవ్రవాదులకు నిధులు అందించడంతో పాకిస్తాన్‌పై ఈ సంస్థలు నిఘా పెట్టాయి. ఆ దేశం నుంచి ల్యాండరింగ్ ముప్పు ఉండడంతో దానిని గ్రే లిస్టులో పెట్టారు. ఈ గ్రే లిస్టులో సెర్బియా, శ్రీలంక, సిరియా, ట్రినిడాడ్, ట్యునీషియా, యెమెన్ కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌కు అండగా టర్కీ
భారత్ ప్రతిపాదనను బహిరంగంగా వ్యతిరేకిస్తున్న ఏకైక దేశం టర్కీ. అమెరికా, బ్రిటన్ భారత్‌ను సమర్థిస్తున్నాయి. అటు పాకిస్తాన్‌కు చాలాకాలం నుంచీ అండగా నిలిచిన చైనా కూడా ఆ సమయంలో దీనిపై మౌనం వహించింది.
చైనా ఇప్పటివరకూ అన్ని వేదికలపైనా పాకిస్తాన్‌ను బహిరంగంగా సమర్థిస్తూ వచ్చింది. కానీ దీనిపై మాత్రం అది పెదవి విప్పడం లేదు.
ఎఫ్ఏటీఎఫ్, ఏసియా పసిఫిక్ గ్రూపులో సంయుక్త సభ్య దేశమైన భారత్.. పాకిస్తాన్‌ను బ్లాక్ లిస్టులో పెట్టించాలని ప్రయత్నిస్తోంది.
కానీ చైనా, మలేసియా, టర్కీ మద్దతుతో పాకిస్తాన్ ఆ ప్రమాదం నుంచి బయటపడింది. దీనికి చైనా దూరంగానే ఉన్నా భారత్ పక్షాన నిలవకపోవడం వల్ల ప్రయోజనం పాకిస్తాన్‌కే దక్కుతుంది.
38 సభ్య దేశాలు ఉన్న ఎఫ్ఏటీఎఫ్ నియమాల ప్రకారం ఏ దేశమైనా బ్లాక్ లిస్టు నుంచి బయటపడాలంటే, దానికి మూడు సభ్య దేశాల మద్దతు అవసరం అవుతుంది.
గతవారం ఫ్లోరిడాలో జరిగిన ఎఫ్ఏటీఏఫ్ సమావేశం తర్వాత పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికారి ఒకరు "పాకిస్తాన్‌పై కమ్ముకున్న కష్టాల మబ్బులు ఇంకా తొలగిపోలేదు" అన్నారు
పాకిస్తాన్ బ్లాక్ లిస్టులో పెట్టడం లేదనే నిర్ణయాన్ని ఈ సంస్థ వచ్చే వారం ప్యారిస్‌లో జరిగే సమావేశంలో అధికారికంగా ప్రకటిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
గ్రే లిస్టులో ఉంటే ఏటా 10 బిలియన్ డాలర్ల నష్టం
టర్కీ, మిగతా సహచర దేశాలతో నిరంతరం సంప్రదిస్తున్నామని, ఆ దేశాలు తమను గ్రే లిస్టు నుంచి బయటపడేందుకు సాయం చేస్తాయని పాక్ విదేశాంగ శాఖ చెప్పింది.
పాకిస్తాన్ ఇంతకు ముందు 2011లో కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కుంది. అప్పుడు కూడా దానిని గ్రే లిస్టులో పెట్టారు. ఆ తర్వాత పాకిస్తాన్ విజయవంతమైన యాక్షన్ ప్లాన్ అమలు చేసి, 2015లో ఆ జాబితా నుంచి బయటపడింది.
ప్రస్తుతం పాకిస్తాన్ గ్రే లిస్టు నుంచి బయటపడడానికి 36 ఓట్లలో కనీసం 15 ఓట్లు అవసరం అవుతాయి.
ఈ లిస్టులో ఉండడం వల్ల పాకిస్తాన్‌కు ప్రతి ఏటా సుమారు 10 బిలియన్ డాలర్ల నష్టం జరుగుతుంది.
ఇవి కూడా చదవండి:
- నరేంద్ర మోదీ వర్సెస్ ఇమ్రాన్ ఖాన్: ఇంతకీ ఈ ప్రచార యుద్ధంలో గెలిచిందెవరు...
- పాకిస్తాన్‌కు ఆర్థిక సాయం నిలిపివేసిన అమెరికా
- చైనాలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ 'బెగ్గింగ్'
- పాక్‌కు దెబ్బ మీద దెబ్బ, ఇమ్రాన్ ఖాన్ చమురు ఆశలు ఆవిరి
- హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్‌కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి?
- పచ్చరాళ్ళ వేట కోసం డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు... ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు
- భారతదేశంలో నమోదైన మాతృ భాషలు 19,569 - హిందీ కింద వర్గీకరించిన మాతృభాషలు ఎన్ని?
- మరో 10వారాల్లో పాకిస్తాన్ ఖజానా ఖాళీ!
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
- జపాన్ కాకులు కనిపెట్టిన రహస్యమేంటి? నగర జీవనానికి జంతువులు, పక్షులు ఎలా అలవాటుపడుతున్నాయి?
- కశ్మీర్: ఎల్వోసీ వద్ద ‘ఆజాది మార్చ్’ను అడ్డుకున్న పాకిస్తాన్ సైన్యం
- #MentalHealth భారతీయులు తమ మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








