పసిఫిక్ బ్లాక్ డ్రాగన్: ఈ చేప కళ్లముందే ఉన్నా కనిపించకుండా పోగలదు.. ఎలా సాధ్యం?

ఫొటో సోర్స్, KAREN OSBORN/SMITHSONIAN
- రచయిత, విక్టోరియా గిల్
- హోదా, బీబీసీ సైన్స్ కరస్పాండెంట్
అదొక సముద్రపు నిగూఢ రహస్యం. కడలి అట్టడుగున ఉండే ఈ చేపలు ఎందుకంత నల్లగా ఉంటాయి? ఓ పనికి రాని ఫోటోతో మొదలైన ఈ పరిశోధనలో ఈ రహస్యం గుట్టు వీడింది.
"ఏదో ఒక నల్లని చేప ఆకారం తప్ప నేనొక మంచి ఫోటో తీయలేకపోయాను'' అన్నారు స్మిత్సోనియన్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ కరెన్ ఓస్బోర్న్.
ఈ కారు నలుపు రంగు చేపపై ఆమె చర్మం మీద చేసిన పరిశోధనలో.. ఆ చర్మం వెలుతురును ఒడిసిపట్టుకుంటుందని వెల్లడైంది.
దానివల్ల ఈ చేపలను ఫోటో తీయడం చాలా కష్టమవుతుంది. అయితే.. ఆ చర్మం వల్ల ఎవరికీ కనిపించకుండా దాక్కోగలిగే సామర్థ్యం వీటికి లభిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
సముద్రగర్భంలో ఎక్కడా దాక్కోడానికి వీలుకాని పరిస్థితుల్లో, తనను వేటాడే జంతువుల నుంచి రక్షణ పొందేందుకు ఈ చేప కారు నలుపు రంగులోకి మారిపోతుందని.. దానివల్ల దాదాపుగా అదృశ్యంగా మారుతుందని డాక్టర్ ఒస్బోర్న్ వివరించారు.

ఫొటో సోర్స్, KAREN OSBORN/SMITHSONIAN
కరెంట్ బయాలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన ఫలితాలు టెలీస్కోపులు, కెమెరాలలో అల్ట్రాబ్లాక్ పూతలపై కొత్త ఆవిష్కరణలకు ఊతమిస్తున్నాయి.
సముద్ర గర్భంలో ఉండే అనేక నలుపురంగు జంతువులు వేటగాళ్లబారిన పడకుండా ఈ సౌకర్యాన్ని తమకు తామే రూపొందించుకున్నాయి.
"వెలుతురు వచ్చినప్పుడు ఇవి తమ శరీరంపై ఉన్న పిగ్మెంట్ సహకారంతో దాన్ని సంలీనం చేసుకుని కనిపించకుండా ఉండి పోతాయి'' అని వాష్టింగ్టన్‌లోని స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీలో పని చేస్తున్న డాక్టర్ ఓస్బోర్న్ చెప్పారు.
"వాటి మందపాటి శరీరంపై ఉన్న ఈ పిగ్మెంట్లు వెలుతురు ప్రతిఫలించనీయకుండా తమ శరీరంలోకి సంలీనం చేసుకుంటాయి. ఒకరకంగా ఇది వెలుతురును కట్టిపడేయటం'' అన్నారు ఓస్బోర్న్.

ఫొటో సోర్స్, KAREN OSBORN/SMITHSONIAN
తాము పరిశోధన చేస్తున్న ఈ కారు నలుపు చేపలను అతి దగ్గర్నుంచి ఫోటో తీయాలన్న డాక్టర్ ఓస్బోర్న్, ఆమె సహచరుల ప్రయత్నాలు అనేకసార్లు విఫలమయ్యాయి.
"నేను తీసిన ఏ ఒక్క ఫోటో సరిగ్గా రాలేదు. నేను చాలా విసిగిపోయాను'' అని ఓస్బోర్న్ బీబీసీతో అన్నారు.
‘‘అప్పుడే నేను వాటి చర్మం ప్రత్యేకతను గుర్తించా. అది చాలా నల్లగా ఉంది. దానిపై పడే వెలుతురును అది తనలో సంలీనం చేసుకుంటోంది'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, KAREN OSBORN/SMITHSONIAN
సముద్రం అడుగున వేటగాళ్ల బారి నుంచి తప్పించుకుని తిరగడానికి వెలుతురు సంలీన ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుందని పరిశోధకులు అంటున్నారు.
అయితే సముద్రగర్భంలో వెలుతురును మింగే జీవులే కాక, చీకటిలో వెలుతురును వెదజల్లే జంతువులు కూడా ఉంటాయని వారు చెబుతున్నారు.
"అసలు ఆ వెలుతురు ఎక్కడి నుంచి వస్తుందో మనకు అర్ధం కాదు'' అని డాక్టర్ ఓస్బోర్న్ అన్నారు. సముద్రం అట్టడుగున జీవితం ఫుట్‌బాల్ ఫీల్డులో దాగుడు మూతలు ఆడినట్లు ఉంటుంది. అక్కడ మనం ఫోటో తీయలంటే చాలా కష్టపడాలి'' అన్నారామె.

ఫొటో సోర్స్, KAREN OSBORN/SMITHSONIAN
"నలుపు రంగే ఆ జీవుల మనుగడకు సహకరిస్తోంది'' అన్నారు ఓస్బోర్న్.
సముద్రంలో 200 మీటర్ల లోతుకు వెళ్లి, ఈ నల్లని జీవులను ఫోటో తీయాలన్న ఆమె ప్రయత్నాలన్నీ వ్యర్ధంగా మారాయి.
"దీనికోసం స్పెషల్ లైటింగ్, ఫోటోషాప్ సాఫ్ట్‌వేర్‌ను వాడాల్సి వచ్చింది'' అన్నారామె.
ఇవి కూడా చదవండి:
- రిలయన్స్ జియో 5జీ వస్తోంది.. కానీ భారతీయులు ఎన్నాళ్లు ఎదురు చూడాలి?
- సెక్స్ వర్కర్లు ఆ దేశంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటున్నారు?
- టిండర్, డంబుల్ వంటి డేటింగ్ యాప్‌లు పాతపడిపోయాయా?
- బిట్‌కాయిన్ స్కామ్: ఒబామా, ఎలాన్ మస్క్ వంటి అమెరికా ప్రముఖుల ట్విటర్ అకౌంట్లు హ్యాక్
- కరోనావైరస్ కోరల్లో చైనా ఆర్థిక వ్యవస్థ.. దశాబ్దాల కాలంలో తొలిసారి కుదేలు
- భారతీయ భార్య - చైనా భర్త.. వారిద్దరికీ ఓ కూతురు... వారి జీవితం ఇప్పుడెలా మారింది?
- విటమిన్-డి తీసుకుంటే వైరస్ రాకుండా కాపాడుతుందా
- లాక్డౌన్లో పెరిగిన గృహ హింస: ‘‘నా భర్త నన్ను భార్యగా చూడలేదు.. శారీరక అవసరాలు తీర్చుకునే ఒక యంత్రంలాగే చూసేవారు’’
- ‘టీకా వేయించుకోవాలి.. కరోనావైరస్ సోకించుకోవాలి - వలంటీర్లు కావలెను’
- మహిళలు గర్భం దాల్చినప్పుడు రకరకాల ఆహార పదార్ధాలు తినాలని ఎందుకనిపిస్తుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









