ప్రమాదంలో బంగ్లాదేశ్ ‘పులస’ హిల్సా.. మితిమీరిన వేటతో అంతరించిపోతున్న అన్ని రకాల చేపలు

బంగ్లాదేశ్ పులస హిల్సా

ఫొటో సోర్స్, oqba/Getty Images

ఫొటో క్యాప్షన్, హిల్సా చేపల మార్కెట్ విలువ సుమారు 18 వేల కోట్ల రూపాయలు
    • రచయిత, అబూ కలాం ఆజాద్, షార్లెట్ పమెంట్
    • హోదా, బీబీసీ బెంగాలీ

బంగ్లాదేశ్ తీరంలో జరుగుతున్న మితిమీరిన చేపల వేట కారణంగా ఈ ప్రాంతంలో చేప జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద సముద్ర జీవజాతులున్న ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి.

కొన్ని మత్స్య జాతులు అంతరించిపోతుండగా, మరి కొన్ని తగ్గిపోతున్నాయని, బంగాళాఖాతంలో మత్స్య నిల్వల గురించి ప్రచురితమైన ఒక నివేదిక తెలిపింది.

గల్ఫ్ అఫ్ థాయిలాండ్ వంటి కొన్ని సముద్ర తీరాల్లో చేపలు పూర్తిగా అంతరించిపోయాయని ఈ నివేదిక తయారు చేసిన వారిలో ఒకరైన సయేదుర్ రెహమాన్ చౌదరి ‘బీబీసీ బెంగాలీ’కి చెప్పారు.

"మా బంగాళాఖాతం అలా మారడం మాకు ఇష్టం లేదు" అని ఆయన అన్నారు.

కొన్ని వందల పెద్ద బోటులు వారు ఇక్కడ అధికంగా చేపలని వేటాడుతున్నారని కొంత మంది పర్యవేక్షకులు చెప్పారు.

పెద్ద ట్రాలర్ల వాళ్ళు సాధారణంగా తాము ఆధారపడే కొన్ని ప్రత్యేక రకాల మత్స్య జాతులను వేటాడటంతో కూడా ఈ సమస్య తలెత్తుతోందని, ప్రభుత్వం వీటిని పట్టించుకోవడం లేదని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు.

బంగాళాఖాతంలో అంతరించిపోతున్న మత్స్య జాతులు

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన దేశాల్లో బంగ్లాదేశ్ ఒకటి. ముఖ్యంగా నదులు బంగాళాఖాతంలో కలిసే ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా జీవిస్తుంటారు.

వీరిలో కనీసం 15 లక్షల జనాభా జీవనాధారం కోసం మత్స్య వేటపై ఆధారపడతారు. దేశ జనాభా తమ ఆహారంలో ప్రోటీన్ కోసం చేపల మీద ఆధారపడుతుంది.

అయితే ఈ ప్రాంతంలో పూర్తిగా టైగర్ రొయ్యలు, సాల్మన్ చేపల రకాలు అంతరించిపోయాయని మూడు సంవత్సరాలు పాటు అధ్యయనం చేసిన ప్రభుత్వ నివేదిక తెలిపింది.

కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఒక రెండు గంటలు వేటాడితే చేపలు పడేవని కానీ ఇప్పుడు 20 గంటలు సముద్రంలో ప్రయాణిస్తే గాని చేపలు పడటంలేదని, 35 సంవత్సరాలుగా చిట్టగాంగ్ రేవులో చేపలు పడుతున్న జాసిం అనే మత్స్యకారుడు చెప్పారు.

"గతంలో చాలా రకాల చేపల్ని పట్టేవాళ్ళం. కానీ, ఇప్పుడు దొరకటం లేదు’’ అని జాసిం చెప్పారు. పెద్ద ట్రాలర్లు చేపల్ని వేటాడటమే ఈ పరిస్థితికి కారణమని జాసిం లాంటి మరి కొంత మంది చిన్న మత్స్యకారులు ఆరోపించారు.

బంగాళాఖాతంలో అంతరించిపోతున్న మత్స్య జాతులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బంగాళాఖాతంలో అంతరించిపోతున్న మత్స్య జాతులు

నియంత్రణలో లేని ట్రాలర్లు

బంగ్లాదేశ్ తీరంలో సుమారు 270 ట్రాలర్లు ఉన్నాయి. పెద్ద ట్రాలర్ ప్రతి సారి కనీసం 400 టన్నుల చేపలను వేటాడగలవు. ఇది సాధారణ బోట్ కన్నా 20 రెట్లు ఎక్కువ.

“దీనిని నియంత్రించకపోతే భావి తరాలకి చేపలు దొరకవేమో” అని చౌదరి అన్నారు.

ట్రాలర్ యజమానులు ప్రభుత్వానికి చెల్లించే లైసెన్స్ ఫీ వారి కంపెనీ లు సంపాదించే లాభాలలో అతి తక్కువ భాగం.

చేపలు పట్టేందుకు కావల్సిన లైసెన్సులను ఈ కంపెనీలు చేపలు పట్టేవాళ్ళకి అమ్ముతాయి. ప్రభుత్వం ఆ అధికారాన్ని ఆ కంపెనీలకి కొన్ని సంవత్సరాల క్రితం ఇచ్చింది.

దీంతో ఫిషరీస్ విభాగానికి సముద్రంలోకి వెళ్లే బోటులను నియంత్రించడం కష్టతరంగా మారింది.

బీచ్‌లో మత్స్యకారులు

ఫొటో సోర్స్, Kabir Uddin/Getty Images

పాత లైసెన్సులని రద్దు చేసేందుకు ఫిషరీస్ విభాగానికి అధికారాలు ఇచ్చే కొత్త చట్టం పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నారు.

అయితే, చాలా సార్లు బోట్ నిర్వాహకులు, వీటిని నియంత్రణలో పెట్టే ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్లను కోర్టుల వరకు తీసుకుని వెళతారు. దీంతో, వ్యక్తిగతంగా కూడా అధికారులకి ముప్పు ఉంటుంది.

సముద్ర ఉత్పత్తుల గురించి సరైన సమాచారం వచ్చే వరకు కొత్త ట్రాలర్లకి లైసెన్సులు ఇవ్వమని నావల్ ట్రేడ్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారి కెప్టెన్ మొహమ్మద్ గియాసుద్దీన్ అహ్మద్ చెప్పారు.

“ఇలాగే జరిగితే చేపలు పట్టే ప్రాంతాల్లో ఇక చేపలు కనుమరుగవుతాయి” అని ఆయన అన్నారు.

చేపల రకాలు తగ్గిపోవడంతో పెద్ద ట్రాలర్ల వాళ్ళు హిల్సా (గోదావరి డెల్టాలో దొరికే పులస రకం) చేపల వేటని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చేప బంగ్లాదేశ్ ఆహార భద్రతలో, సాంప్రదాయ మత్స్యకారుల జీవనాధారంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

చిట్టగాంగ్ సముద్ర తీరంలో లంగరు వేసి ఉన్న సీ వ్యూ, సీ విండ్ ట్రాలర్లను బీబీసీ చూసింది
ఫొటో క్యాప్షన్, చిట్టగాంగ్ సముద్ర తీరంలో లంగరు వేసి ఉన్న సీ వ్యూ, సీ విండ్ ట్రాలర్లను బీబీసీ చూసింది

ప్రమాదంలో విజయం

బంగ్లాదేశ్ జాతీయ చేప హిల్సా ఒక్కటే పునరుత్పత్తి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి

ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల నుంచి అక్టోబర్‌లో 22 రోజుల పాటు హిల్సా చేపల వేటపై నిషేధించింది.

ఈ సమయంలో హిల్సా చేపలు సముద్రం నుంచి నదీ తీరాలకి వెళ్లి అక్కడ గుడ్లు పెడతాయి.

ఆ సమయంలో ప్రభుత్వం సాంప్రదాయ మత్స్యకారుల కుటుంబాలకి 20 కిలోల బియ్యాన్ని సరఫరా చేస్తుంది.

కానీ, కుటుంబాలని పోషించడం చాలా కష్టమైపోతుందని చాలా మంది మత్స్యకారులు చెబుతారు.

గత సంవత్సరం మేలో బంగ్లాదేశ్ ప్రభుత్వం సబ్సిడీలు ప్రకటించకుండా 65 రోజుల నిషేధాన్ని విధించినప్పుడు వందలాది మంది మత్స్యకారులు వీధుల్లోకొచ్చి నిరసన చేశారు.

ఈ నిషేధం వలన హిల్సా నిల్వలు పెరిగాయి. కానీ, వీటి లాభాలు సాంప్రదాయ మత్స్యకారులకు చేరటం లేదని చౌదరి చెప్పారు.

హిల్సాని సంరక్షించే ప్రక్రియలో చిన్న మత్స్యకారులు నష్టపోతుంటే కొన్ని వేల టన్నుల కొద్దీ వేటాడుతున్న ట్రాలర్ల యజమానులు వాటి లాభాలను పొందుతున్నారు.

దీని వలన ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లభించటంలేదని ఆయన అన్నారు.

హిల్సాలు లభించే చోటుని సులభంగా కనిపెట్టగలిగే పరికరాలు ఉన్న విదేశీ ట్రాలర్లు కూడా ఈ హిల్సాల పునరుద్ధరణ పట్ల ఆకర్షితులవుతున్నారు.

సీ వ్యూ, సీ విండ్ ట్రాలర్లు (ఎరుపు వృత్తంలో ఉన్నవి) శాటిలైట్ ఇమేజరీ సాయంతో తీసిన చిత్రం

ఫొటో సోర్స్, Satellite image ©2020 Maxar Technologies

ఫొటో క్యాప్షన్, సీ వ్యూ, సీ విండ్ ట్రాలర్లు (ఎరుపు వృత్తంలో ఉన్నవి) శాటిలైట్ ఇమేజరీ సాయంతో తీసిన చిత్రం

కొత్త ప్రమాదం

పారిశ్రామిక బోటుల కన్నా సూపర్ ట్రాలర్లు అధిక సామర్ధ్యం కలిగి ఉంటాయి.

వాటి సైజు, ఇంజిన్ శక్తి హిల్సాలని తొందరగా వేటాడే శక్తి కలిగి ఉంటాయి. అలాగే అవి ఎక్కడ దొరుకుతాయో కూడా తెలుసుకోగలిగే నైపుణ్యం ఉంటుంది

గత సంవత్సరం చిట్టగాంగ్ కి ఇలాంటి నాలుగు సూపర్ ట్రాలర్లు వచ్చాయి.

వీటిని బంగ్లాదేశ్‌లో నిర్వాహకులు కొనుక్కుని చేపలు పట్టే హక్కులు ఉన్నాయని వాదించారు.

అందులో ఉన్న థాయిలాండ్‌కి చెందిన రెండు బోట్లు సీ వ్యూ , సీ విండ్ , సోమాలియాలో అనధికార వేట చేసినందుకు ఇంటర్‌పోల్ నోటీసులో ఉన్నాయి.

ఓషియన్ మైండ్ , ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ (అంతర్జాతీయ పర్యవేక్షక సంస్థలు) 2018 నుంచి సూపర్ ట్రాలర్లను పర్యవేక్షిస్తున్నాయి. ఈ ట్రాలర్లు చిట్టగాంగ్ రేవులో ఉన్నట్లు సాటిలైట్ చిత్రాల ద్వారా ధృవీకరించారు.

బంగ్లాదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ చట్టాన్ని అనుసరించి సీవ్యూ , సీ విండ్ తమ జలాల్లో ఉన్నాయని సోమాలియాకి సమాచారం అందించాలి.

వీటి గురించి అడిగినప్పుడు తమ వద్ద సమాచారం లేదని గియాసుద్దీన్ అహ్మద్ చెప్పారు.

“మరమ్మత్తుల నెపంతో ఆ బోట్లు బంగ్లాదేశ్‌లో ప్రవేశించాయి, తర్వాత వాటిని బహిష్కరించాం” అని చెప్పారు.

బీబీసీ బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఈ విషయం పై వివరణ అడగగా, కరోనావైరస్ నేపథ్యంలో ఫిషరీస్ విభాగం పని చేయటం లేదని చెప్పారు.

మత్స్య శాఖ మంత్రి దీనికి సమాధానం ఇవ్వలేదు.

సూపర్ ట్రాలర్ల వలన చేపల నిల్వల పై పడే ప్రభావం గురించి, భవిష్యత్‌లో చేపల వేట నిర్వహణ గురించి చౌదరి విచారం వ్యక్తం చేశారు.

ఇవి మత్స్య వనరులకు పెద్ద ముప్పని ఆయన అన్నారు

అనధికార బోట్లు బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించి ఎటువంటి అవాంతరాలు లేకుండా వేట చేయగలిగితే , బహిష్కరించిన బోటులన్నిటికీ బంగ్లాదేశ్ ఆశ్రయం కల్పించినట్లవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)