కరోనావైరస్ - లాక్ డౌన్: మత్స్యకారుల చేపల వేటకు బీఎస్ఎఫ్ సాయం

ఫొటో సోర్స్, Prashant Gupta
- రచయిత, రాక్సీ గగ్డేకర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గుజరాత్‌లోని కచ్ జిల్లాలో గల లఖ్‌పత్, నారాయణ్ సరోవర్ ప్రాంతాల్లో నివసించే మత్స్యకారుల మోముల్లో.. కరోనావైరస్ సంక్షోభ సమయంలోనూ ఆనందం కనిపిస్తోంది.
ఈ జనం కోవిడ్-19 బాధితులుగా మారకుండా ఉండటానికి స్థానిక అధికార యంత్రాంగం, సరిహద్దు భద్రతా దళం 79వ బెటాలియన్ కలిసి స్క్రీనింగ్ నిర్వహించటంతో పాటు రక్షణ పరికరాలనూ అందించారు. అంతేకాదు, వీరి జీవనోపాధి పూర్తిగా దెబ్బతినకుండా ఉండటం కోసం చేపల వేట కొనసాగించేందుకూ ఏర్పాట్లు చేశారు.
గుజరాత్‌లో భారత భూభాగం మీద ఉన్న చిట్టచివరి గ్రామం లఖ్‌పత్. భారత్ – పాకిస్తాన్ సరిహద్దుకు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి జనంలో ఎక్కువ మంది చేపలవేట మీద ఆధారపడి జీవిస్తుంటారు.
ఆరేడుగురు మత్స్యకారులు ఒక బోటులో సముద్రంలో చేపల వేటకు వెళ్లి తిరిగి రావటానికి మూడు నుంచి ఐదు రోజుల సమయం పడుతుంది. చేపలు పట్టుకుని తీరానికి చేరుకున్న తర్వాత ఈ మత్స్యకారులకు స్థానిక మార్కెట్‌లో రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకూ ఆదాయం లభిస్తుంది.
‘‘మామూలుగా అయితే ఇక్కడి మత్స్యకారులు పట్టుకొచ్చిన చేపలను వెరావల్ హోల్‌సేల్ మార్కెట్‌కు పంపిస్తారు. అందులో నాణ్యమైన చేపలను విదేశాలకు ఎగుమతి చేస్తారు. మిగతా చేపలను స్థానిక మార్కెట్‌లో వినియోగిస్తారు’’ అని అఖిల భారతీయ మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు వేల్జీభాయ్ మాసాని బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Prashant gupta
కానీ.. లఖ్‌పత్ మత్స్యకారులు మార్చి 22 నుంచి ఏప్రిల్ 13 వరకూ చేపల వేటకు వెళ్లలేకపోయారు. ఈ పరిస్థితుల్లో వారు మళ్లీ పడవల మీద వేటకు వెళ్లేందుకు బీఎస్ఎఫ్ అధికారులు, స్థానిక యంత్రాంగం సాయం చేశారు.
లఖ్‌పత్ ఓ చిన్న గ్రామం. సుమారు 350 మంది జనాభా ఉంటారు. లాక్‌డౌన్ ప్రారంభంలో ఈ గ్రామానికి ఆహార సరఫరాల కొరత తలెత్తింది. బీఎస్ఎఫ్ అధికారులు ఆహార పదార్థాలు, తాగునీరు అందించారు.
భారత ప్రభుత్వం మార్చి 24న లాక్‌డౌన్ నుంచి చేపల వేటను మినహాయించింది. ఆహార పదార్థమైన చేపలను నిత్యావసర సరకుల్లో చేర్చటం ఇందుకు కారణమని మాసానీ పేర్కొన్నారు.
కానీ లాక్‌డౌన్‌లో ఈ మత్స్యకారులు సముద్రం మీదకు వెళ్లటం సాధ్యం కాలేదు. స్థానిక యంత్రాంగం సాయంతో బీఎస్ఎఫ్ వీరికి వైద్య పరీక్షలు నిర్వహించింది. వీరి భద్రత కోసం రక్షణ పరికరాలు సమకూర్చింది.
ఇది అత్యంత ప్రాథమిక అవసరమని బీఎస్ఎఫ్ గాంధీనగర్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎం.ఎల్.గార్గ్ బీబీసీతో చెప్పారు.
లఖ్‌పత్ సరిహద్దు గ్రామం అయినందున ఈ గ్రామం యోగక్షేమాలతో పాటు సురక్షితంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.
ఈ అనూహ్య సంక్షోభ సమయంలో రాజస్థాన్‌లోని బార్మర్ మొదలుకుని గుజరాత్‌లో ఝకావ్ వరకూ సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజలకు సాయం చేయటానికి తమ బెటాలియన్ కృషి చేస్తోందని గార్గ్ తెలిపారు.

ఫొటో సోర్స్, Prashant gupta
‘‘లఖ్‌పత్ మత్య్సకారుల కోసం మే గ్లవ్స్, శానిటైజర్లు సమకూర్చాం. మొదటి విడత బృందాన్ని చేపల వేటకు పంపించే ముందు సామాజిక దూరం గురించి అవగాహన కల్పించాం’’ అని వివరించారు.
వైరస్ ముప్పు కొనసాగినంత కాలం తమ బెటాలియన్ ఈ కృషిని కొనసాగిస్తుందని చెప్పారు.
మొదటి బృందం వేటకు వెళ్లేటపుడు, వారు తిరిగి వచ్చిన తర్వాత స్క్రీనింగ్ నిర్వహించటానికి స్థానిక కలెక్టరేట్ ఏర్పాట్లు చేసింది.
లఖ్‌పత్ గ్రామం నుంచి 18 మంది, కోటేశ్వర్ గ్రామం నుంచి 94 మంది మత్స్యకారులు ఏప్రిల్ 13న చేపల వేటకు వెళ్లి 16న తిరిగి వచ్చారని స్థానిక తహశీల్దార్ ఎ.ఎల్.సోలంకి బీబీసీకి తెలిపారు.
ఒక్కో బోటులో సాధారణంగా ఆరుగురు చొప్పున వేటకు వెళుతుంటారని.. ఇప్పుడు ఈ సంఖ్యను నలుగురికి పరిమితం చేశామని చెప్పారు.
మత్స్యకారులకు దాదాపు 500 జతల గ్లవ్స్, 500 ఫేస్ మాస్కులు, శానిటైజర్లు అందించారు.
వీరు చేపల వేట కోసం సముద్రం మీదకు వెళ్లటానికి ఐస్, డీజిల్, పచ్చి ఆహారం అవసరమవుతాయి. ఈ వస్తువులన్నీ వీరికి అందేలా చూడటానికి స్థానిక దయాపూర్ పోలీసులు సాయం చేశారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

వేట ముగించి తిరిగి వచ్చాక వారు తెచ్చిన చేపలను వెంటనే అవసరమైన వాహనాల్లో వెరావెల్ మార్కెట్‌కు తరలించటానికి కూడా ఏర్పాట్లు చేసినట్లు ఎస్ఐ జె.పి.సోధా చెప్పారు.
కోటేశ్వర్, లఖ్‌పత్ గ్రామాల్లో సుమారు 50 బోట్లు ఉన్నాయి. చేపలను నిత్యావసర వస్తువుల్లో చేర్చి, చేపల వేటను లాక్‌డౌన్ నుంచి మినహాయించినప్పటి నుంచీ తాము సముద్రం మీద వేటకు వెళ్లటానికి ప్రయత్నిస్తున్నామని, కానీ ఒకవైపు వైరస్ భయంతో, మరోవైపు డీజిల్, ఐస్ వంటి తప్పనిసరి సరకులు అందుబాటులో లేక వెళ్లలేకపోయామని లఖ్‌పత్ మత్స్యకారుడు అలీ బీబీసీకి వివరించారు.
ఒక్కో బోటు సముద్రం మీద వేటకు వెళ్లాలంటే దాదాపు రూ. 10,000 పెట్టుబడి అవసరమవుతుంది.
అయితే సముద్రంలో దూరంగా లోతైన ప్రాంతం దగ్గరకు వెళ్లకూడదని ఆంక్షలు విధించటం పట్ల మరొక మత్స్యకారుడు హసమ్ బాదలా అసంతృప్తి వ్యక్తం చేశారు.
సముద్రంలో దూరంగా వెళ్లటానికి అనుమతి కోరామని, ప్రభుత్వం నుంచి సమాధానం కోసం వేచివున్నామని ఆయన చెప్పారు.
సర్ క్రీక్ చుట్టూ పడాలా, పాబేవాడి, ఓగన్, దేవ్రీవాడీ, కోరీ ప్రవాహాలు ఉన్నాయి. మత్స్యకారులు ప్రస్తుతం కోరీ ప్రవాహం దాటి వెళ్లటానికి అనుమతించటం లేదు.
‘‘మమ్మల్ని పడాలా ప్రవాహం వరకూ వెళ్లటానికి అనుమతించాలని కోరుతున్నాం. అలాగైతేనే మాకు మంచి చేపలు దొరుకుతాయి’’ అని బాదలా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేసే అవకాశాన్ని ప్రపంచం ఎలా చేజార్చుకుంది?
- ‘కరోనావైరస్తో ఐసొలేషన్ వార్డులో నేను ఎలా పోరాడానంటే...’ - తెలంగాణలో పేషెంట్ 16 స్వీయ అనుభవం
- కరోనావైరస్: తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్ తయారు చేసిన భారతీయ శాస్త్రవేత్త
- కరోనావైరస్కు భయపడని ఏకైక యూరప్ దేశం ఇదే
- బ్రిటన్‌లో ఎన్హెచ్ఎస్ కోసం రూ.180 కోట్ల విరాళాలను సేకరించిన 99 ఏళ్ల మాజీ సైనికుడు
- కరోనావైరస్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది?
- కరోనావైరస్ లాక్ డౌన్‌తో రోడ్లపైకి వచ్చిన సింహాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








