ఎల్ నినో సరే, మరి 'ఇండియన్ నినో' అంటే ఏమిటి? హిందూ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు మారితే ఏమవుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
తూర్పు ఆఫ్రికా తీరాన్ని భారీ వర్షాలు కకావికలం చేస్తున్నాయి. సోమాలియాలో లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. దక్షిణ సుడాన్లో పట్టణాలకు పట్టణాలు నీట మునిగాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఇథియోపియా, కెన్యా, టాంజానియా, చుట్టుపక్కలున్న ఇతర దేశాల్లో 250 మందికి పైగా ప్రజలు చనిపోయారు.
తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో భారీ వర్షాలు పడటం సాధారణమే. కానీ ఈ ఏడాది 'ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐవోడీ)' అనే వాతావరణ ప్రక్రియ వల్ల వర్షాలు ఇంత భీకరంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇంతకూ 'ఇండియన్ ఓషన్ డైపోల్' అంటే ఏమిటి? దీని గురించి మీరు తెలుసుకోవాల్సిన మూడు విషయాలు ఇవీ...

ఫొటో సోర్స్, Getty Images
1) ఐవోడీ ఎలా సంభవిస్తుంది?
ఐవోడీ- భూమధ్యరేఖకు దగ్గర్లో హిందూ మహాససముద్రం సరిహద్దుల్లో ఉన్న దేశాల్లో అంటే తూర్పు ఆఫ్రికా నుంచి ఇండొనేషియా వరకు వర్షపాతం తీరును మార్చగల ముఖ్యమైన వాతావరణ ప్రక్రియ. ఇది ఆస్ట్రేలియా వరకు వాతావరణాన్ని ప్రభావితం చేయగలదు.
హిందూ మహాసముద్రం పశ్చిమ భాగంలో అంటే తూర్పు ఆఫ్రికా తీరంలో సముద్ర జలాలు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కితే, నీరు ఆవిరికావడం అధికమై, వాన పడుతుంది. ఈ ప్రక్రియనే 'సానుకూల ఐవోడీ (పాజిటివ్ ఐవోడీ)' అంటారు.
మరోవైపు హిందూ మహాసముద్రం తూర్పు భాగంలో అంటే ఇండొనేషియాలోని జావా, సుమత్రా దీవుల తీరంలో సముద్ర జలాలు సాధారణం కంటే ఎక్కువగా చల్లబడతాయి. ఉష్ణోగ్రతల్లో అసాధారణ తగ్గుదల వల్ల సముద్రం పశ్చిమ భాగంతో పోలిస్తే ఇక్కడ పూర్తి విరుద్ధమైన ప్రభావం ఉంటుంది.

బ్రిటన్లోని 'యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్'లో రుతుపవన వ్యవస్థల అధ్యాపకుడైన ఆండ్రూ టర్నర్ ఈ అంశంపై బీబీసీతో మాట్లాడారు.
ఐవోడీ సంభవించినప్పుడు నీరు వేడెక్కిన ప్రాంతంలో వర్షపాతం ఉంటుందని, అందువల్ల తూర్పు ఆఫ్రికా దేశాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురుస్తుందని ఆయన తెలిపారు.
అదే సమయంలో హిందూ మహాసముద్ర తూర్పు భాగంలో సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా తగ్గుతాయని, దీనివల్ల ఆ ప్రాంతంలో వర్షపాతం తగ్గుతుందని టర్నర్ వివరించారు.
ఐవోడీని పసిఫిక్ మహాసముద్రంలో సంభవించే 'ఎల్‌నినో' వాతావరణ ప్రక్రియతో పోల్చవచ్చు. ఐవోడీని కొన్నిసార్లు 'ఇండియన్ నినో' అని కూడా అంటారు.

ఫొటో సోర్స్, Getty Images
2) 60 ఏళ్లలో ఇదే అత్యంత బలమైన ఐవోడీ
ఈ ఏడాది 'సానుకూల ఐవోడీ' 60 ఏళ్లలో ఎన్నడూ లేనంత బలంగా ఉంది.
ప్రతికూల ఐవోడీ (నెగటివ్ ఐవోడీ) సంభవించినప్పుడు ఆఫ్రికా తూర్పు తీరంలో సముద్ర జలాల ఉష్ణోగ్రత అసాధారణంగా పడిపోతుంది. ఇటు ఇండొనేషియా తీరంలో సముద్ర జలాల ఉష్ణోగ్రత అసాధారణంగా పెరుగుతుంది.
కెన్యాలోని పశ్చిమ పొకోట్ కౌంటీలో కొండచరియలు విరిగిపడ్డాయి. వరదల వల్ల వందల ఇళ్లు ధ్వంసమయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం ఇక్కడ 50 మందికి పైగా చనిపోయారు. ఈ విపత్తు నుంచి తేరుకోవడానికి కౌంటీ అష్టకష్టాలు పడుతోంది.
ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీ (ఐఆర్‌సీ) సమాచారం ప్రకారం- వరదల వల్ల దక్షిణ సుడాన్లో ఆరు లక్షల మందికి పైగా ప్రజలు, సొమాలియాలో 2.73 లక్షల మంది ఇళ్లను వీడాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, AFP
ఇదే సమయంలో, భూగోళంలో ఇంకో దిక్కున ఉండే ఆస్ట్రేలియాలో ఈ వేసవిలో తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొంటున్నాయి. కార్చిచ్చులు సంభవిస్తున్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా సన్నద్ధమవుతోంది. ఇక్కడ వేసవి డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది.
అయితే సాధారణం కంటే ఎక్కువ వేడి వాతావరణం వల్ల ఆస్ట్రేలియాలో కార్చిచ్చులు ముందే సంభవించాయి. నలుగురు చనిపోయారు. 500కు పైగా ఇళ్లు నాశనమయ్యాయి.
బలమైన సానుకూల ఐవోడీయే ప్రస్తుత పరిస్థితులకు, రానున్న రోజుల్లో ఏర్పడగల పరిస్థితులకు కారణమని ఆస్ట్రేలియా వాతావరణ శాఖలో దీర్ఘకాలిక అంచనాల విభాగం సారథి ఆండ్రూ వాట్కిన్స్ వ్యాఖ్యానించారు.
భారత్‌లో కరవు భయాన్ని లేకుండా చేయడానికి ఐవోడీ దోహదం చేస్తోంది. దీనివల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో రుతుపవన వర్షపాతం పెరుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
3) భూగోళం వేడెక్కడం కొనసాగితే తరచూ తీవ్రమైన ఐవోడీ దృష్టాంతాలు
గ్రీన్‌హౌస్ వాయువుల విడుదల పెరిగే కొద్దీ, ఐవోడీ వల్ల ఏర్పడే అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితులు తరచూ తలెత్తుతాయని ఆండ్రూ టర్నర్ అంచనా వేశారు.
1961, 1994, 1997 ఐవోడీల వంటి అత్యంత తీవ్రమైన ఐవోడీలపై కార్బన్‌డయాక్సైడ్ ప్రభావం గురించి 2014లో 'నేచర్' పత్రికలో ప్రచురితమైన అధ్యయనంలో ఆస్ట్రేలియా, భారత్, చైనా, జపాన్ శాస్త్రవేత్తలు చర్చించారు.
ప్రపంచంలో కర్బన ఉద్గారాల్లో పెరుగుదల కొనసాగుతుందనేది ప్రాతిపదికగా తీసుకొని, అత్యంత తీవ్రమైన సానుకూల ఐవోడీలు మరింత తరచూ సంభవిస్తాయని వారు అంచనా వేశారు. ఇప్పుడు సగటున 17.3 ఏళ్లకు ఒకసారి ఇలాంటి ఐవోడీ వస్తుంటే, ఈ శతాబ్దంలో మున్ముందు 6.3 సంవత్సరాలకు ఒకసారి చొప్పున ఇది సంభవిస్తుందని హెచ్చరించారు.
హిందూ మహాసముద్రం పశ్చిమ తీరంలోని దేశాలు, ఆఫ్రికా తీరంలో ఐవోడీ సంబంధ భీకర వర్షాలు, వరదలు మరిన్ని తప్పవని ఆండ్రూ టర్నర్ అభిప్రాయపడ్డారు. పంటలు, మౌలిక సదుపాయాలను ఇంకా ఎక్కువగా దెబ్బతీసే పరిస్థితులు, వరదలు మున్ముందు రాబోతున్నాయని హెచ్చరించారు.
ఐవోడీల వల్ల ఇంకోవైపు అంటే హిందూ మహాసముద్రం తూర్పు భాగంలో, ఇండొనేషియాకు పశ్చిమాన ఉన్న దీవుల్లో కరవు పరిస్థితులు, లోటు వర్షపాతం సంభవించే ఆస్కారం ఎక్కువగా ఉందని ఆయన విశ్లేషించారు.
ఇవి కూడా చదవండి:
- పిల్లల కోపాన్ని పెద్దలు తక్కువగా అంచనా వేస్తున్నారు - గ్రెటా థన్‌బర్గ్
- కృత్రిమ దీవులు నిర్మిస్తామన్న చైనా కంపెనీలు.. అక్కర్లేదన్న పసిఫిక్ దేశం తువాలు
- నీటిపై తేలియాడే వెనిస్ను ముంచెత్తిన వరదలు
- నగర జీవనానికి జంతువులు, పక్షులు ఎలా అలవాటుపడుతున్నాయి?
- దిల్లీ కాలుష్యం: పొల్యూషన్ మానిటర్స్‌కు అందని స్థాయిలో విష వాయువులు
- ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆందోళనలు, నిరసనలకు కారణాలు ఇవేనా...
- 5 నెలలు.. 7 జిల్లాలు.. 2 రాష్ట్రాలు.. 1300 కి.మీ... ఆడ తోడు కోసం తిరిగిన మగ పులి
- "ఈరోజు ఇది అడవి కాదన్నారు.. రేపు మేం మనుషులమే కాదని అంటారేమో"
- మోదీ ప్రభుత్వం వాతావరణ మార్పుల సమస్యను ఎదుర్కొనేందుకు ఏం చేసింది?
- సజ్జనార్: అప్పుడు, ఇప్పుడు ఈయనే...
- బంగారు నగలకు 'హాల్‌మార్క్' తప్పనిసరి చేసిన కేంద్రం... అసలు ఈ మార్క్ ఎందుకోసం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








