దిల్లీ కాలుష్యం: పొల్యూషన్ మానిటర్స్‌కు అందని స్థాయిలో విష వాయువులు... సరి-బేసి విధానం మళ్ళీ అమలు

ఫొటో సోర్స్, EPA
ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యం భరించరాని స్థాయికి చేరిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దిల్లీలోని అనేక ప్రాంతాల్లో వాయు కాలుష్యం హానికర స్థాయి కంటే ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితి శ్వాసకోశ సమస్యలకు, వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది.
కాలుష్యం కారణంగా దిల్లీ విమానాశ్రయంలో ఆదివారం 30కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. పరిస్థితులు ప్రమాదకరంగా మారడంతో వాహన కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. గతంలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన 'సరి-బేసి' విధానం మళ్లీ కొద్దిరోజుల పాటు అమలు చేయడానికి నిర్ణయించారు.
సోమవారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఒక రోజు సరి సంఖ్య రిజిస్ట్రేషన్ నంబరుగా ఉన్న వాహనాలను, రెండో రోజు బేసి సంఖ్య ఉన్నవి రోడ్లపైకి అనుమతిస్తారు. దీనివల్ల రోడ్లపై తిరిగే వాహనాల సంఖ్య తగ్గి కాలుష్యం తగ్గుతుందని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, AFP
మరోవైపు నవంబరు 5 వరకు పాఠశాలలకు కూడా సెలవులిచ్చారు. భవన నిర్మాణ పనులు చేపట్టరాదని ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలు వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని.. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో బయటకు రావొద్దని దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ప్రజలకు పిలుపునిచ్చారు.
కాలుష్య నివారణ మాస్కులు ధరించాలని, కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లొద్దని.. ఇళ్లలో ఉన్నప్పుడు కూడా తలుపులు, కిటికీలు మూసి ఉంచాలని సూచించారు.

ఫొటో సోర్స్, AFP
ఎందుకీ కాలుష్యం?
ఏటా ఈ సమయంలో దిల్లీని కాలుష్యం ముంచెత్తడానికి ప్రధాన కారణం పొరుగునే ఉన్న రెండు రాష్ట్రాల్లో రైతులు తమ పొలాల్లోని పంట వ్యర్థాలను తగలబెట్టడం.
పంట వ్యర్థాలు తగలబెట్టడం వల్ల వచ్చే పొగలోని సూక్ష్మ రేణువులు, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ అన్నీ కలిసి కాలుష్యం తీవ్రమయ్యే సమయంలోనే బాణసంచా కాల్చడం వల్ల వెలువడే కాలుష్యం దాన్ని మరింత తీవ్రంగా మారుస్తుంది.
పారిశ్రామిక, వాహన కాలుష్యం, భవన నిర్మాణల వల్ల ఏర్పడే ధూళి వల్లా పరిస్థితి జటిలమవుతోంది.
రానున్న వారం రోజుల్లో వర్షం పడి కాలుష్యం తగ్గుతుందని భావిస్తున్నారు. అయితే, గురువారంలోగా వర్షం కురిసే సూచనలు లేవు.

ఫొటో సోర్స్, AFP
పొగమంచు ఎంత ప్రమాదకరమంటే...
ప్రస్తుతం దిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది. పీఎం 2.5 కాలుష్యం చైనాలోని బీజింగ్ కంటే ఏడు రెట్లు అధికంగా దిల్లీలో నమోదైంది.
కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తాజా పరిస్థితిపై మాట్లాడుతూ ''పొల్యూషన్ మానిటర్స్ కూడా రికార్డ్ చేయలేనంత కాలుష్యం ఉంది. దిల్లీలోని పొల్యూషన్ మానిటర్స్‌లో చాలావరకు కాలుష్య స్థాయి 999గా చూపిస్తున్నాయి. వాటిలో మూడు అంకెలు మాత్రమే కనిపిస్తాయి కాబట్టి అంతవరకే చూపిస్తున్నాయి. వాస్తవ కాలుష్యం అంతకంటే మించిపోయింది. ఇది విపత్తు'' అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
దిల్లీ అధికారులు శుక్రవారం నగరమంతటా 50 లక్షల మాస్కులను పంపిణీ చేశారు. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించారు. దిల్లీ సీఎం నగరాన్ని గ్యాస్ చాంబర్‌తో పోల్చారు.
ఊపిరితిత్తుల క్యాన్సర్, హృద్రోగాల వల్ల కలిగే మరణాల్లో 33 శాతం వాయు కాలుష్యం వల్లే సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

ఫొటో సోర్స్, AFP
ప్రజలేమంటున్నారు..?
దిల్లీ యువత ఆదివారం వీధుల్లోకి వచ్చిన కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలంటూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
''బయటకొచ్చి చూస్తే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతోంది. కనీసం మన ముందున్న వస్తువులను కూడా చూడలేనంతగా పొగమంచు కమ్మేసింది'' అని జైవిప్ర చెప్పారు.
తాత్కాలికంగా ఉపశమనం కలిగించేలా కాకుండా దీర్ఘకాలం ఫలితమిచ్చేలా కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని ఆమె కోరారు.
''మేం మా పిల్లలు, ఇంట్లోని పెద్దవాళ్ల తరఫునా పోరాడుతున్నాం. మా అందరి భవిష్యత్తు, ఆరోగ్యంపై ఆందోళన చెందతున్నాం'' అన్నారామె.
కాలుష్యంపై ప్రజలు ఆందోళన చెందుతున్న సమయంలోనే కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ఇలాంటి సమయంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో చెబుతూ చేసిన ట్వీట్లపై నెటిజన్లు ఆగ్రహించారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి హర్షవర్ధన్ 'శీతాకాలంలో కాలుష్య సంబంధిత సమస్యల నుంచి గట్టెక్కడానికి.. రేచీకటి నుంచి రక్షణకు క్యారట్లు తినండి'' అంటూ ట్వీట్ చేయడం వివాదాస్పదమైంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అయితే మంచి సంగీతంతో రోజును ప్రారంభించండి అంటూ ట్వీట్ చేశారు.
దీనిపై ఓ ట్విటర్ యూజర్ స్పందిస్తూ.. కాలుష్యంపై మా ఆక్రందనలు మీకు వినిపించకపోవడానికి అదే కారణమా అని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
- బిగ్‌బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్.. ప్రైజ్‌మనీతో ఏం చేయబోతున్నారు...
- భూపత్ డాకూ: భారత్ నుంచి పారిపోయిన ఈ దోపిడీ దొంగకు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది
- రక్తం చిందినట్టు ఎరుపు రంగులోకి మారిపోయిన ఆకాశం.. ‘ఇది అంగారక గ్రహం కాదు.. మా ఊరే’
- వేముగోడులో రజకులను ఎందుకు వెలివేశారు?
- టర్కీ - సిరియా సంఘర్షణ: కుర్దు ఫైటర్ల మీద క్రూరమైన యుద్ధ నేరాలు... వెలుగులోకి దారుణమైన వీడియోలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








