మోదీ ప్రభుత్వం వాతావరణ మార్పుల సమస్యను ఎదుర్కొనేందుకు ఏం చేసింది?

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, హృదయేశ్ జోషి
    • హోదా, బీబీసీ కోసం

అమెరికాలో ఈ వారం ఇద్దరు ప్రముఖులు అందరి దృష్టినీ ఆకర్షించారు. అందులో ఒకరు భారత ప్రధాని నరేంద్ర మోదీ కాగా మరొకరు స్వీడన్‌కు చెందిన 16 ఏళ్ల పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్.

మోదీ నిత్యం మీడియాలో పతాక వార్తల్లో ఉండే నేత, గ్రెటా ప్రపంచానికి సవాల్ విసురుతున్న వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాడుతున్న పదహారేళ్ల యువతి.

న్యూయార్క్‌లో నరేంద్ర మోదీ 50 కిలోవాట్ల సామర్థ్యమున్న గాంధీ సోలార్ పార్క్‌ను ఇటీవలే ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన భారత సౌర విద్యుత్ సామర్థ్యం 1,75,000 మెగా వాట్ల నుంచి 4,50,000 మెగావాట్లకు చేర్చుతామని ప్రకటించారు.

మరోవైపు భూమిని ప్రమాదంలో పడేయడానికి కారణం ప్రపంచ నేతలేనని ఆరోపిస్తూ ఇలా చేయడానికి 'మీకెంత ధైర్యం' అంటూ గ్రెటా సవాల్ చేశారు. అంతేకాదు, బాలల హక్కులను ఉల్లంఘనలో ముందున్నాయంటూ 5 దేశాలపై ఐరాస వేదికగా ఆరోపణలు చేశారు.

మోదీ, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఐరాస జనరల్ సెక్రటరీ అంటోనియో గ్యుటెరస్ న్యూయార్క్ వాతావరణ సదస్సుకు రావాలంటూ భారత్‌ను ఆహ్వానించారు. కానీ, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా మోదీ పర్యావరణానికి అనుకూలంగా పెద్దగా పనిచేయలేకపోవచ్చు.

గ్రెటాను, మోదీని కలిపి మాట్లాడడానికి కారణం ఉంది. పర్యావరణం కోసం ప్రపంచ నేతలను ప్రశ్నిస్తున్న గళం గ్రెటాది కాగా.. వాతావరణ మార్పుల వ్యతిరేక పోరాటంలో భారత్‌ను హీరోగా నిలిపే సామర్థ్యమున్న, అదేసమయంలో సవాళ్లు ఎదుర్కొనాల్సిన నేత మోదీ.

నిజం చెప్పాలంటే మోదీ లక్ష్యం గ్రెటా లక్ష్యం కంటే చాలా కష్టతరమైనది. నినాదాలు, బ్యానర్లు, ప్రసంగాలు, ఫొటోలతో ఆ లక్ష్యం చేరుకోవడం సాధ్యం కాదు.

వాతావారణ మార్పులు: ప్రపంచ యవనికపై మోదీ స్థాయి

మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పర్యావరణ సంబంధిత అంశాల్లో ప్రపంచ అగ్ర నేతగా తనను తాను ఆవిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆయన మంత్రివర్గ సహచరులంతా నిత్యం తమ ప్రభుత్వం వాతావరణ మార్పుల వ్యతిరేక పోరాటంలో ఎలా ముందుకెళ్తున్నారో చెబుతుంటారు. కానీ, వాస్తవ పరిస్థితులెలా ఉన్నాయి?

మోదీ 2014లో ప్రధాని పదవి చేపట్టిన తరువాత కొన్ని కీలక చర్యలు చేపట్టారనడంలో సందేహమే లేదు. 2022 నాటికి భారత శుద్ధ ఇంధన సామర్థ్యం 1,75,000 మెగావాట్ల చేర్చాలని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ లక్ష్యాన్ని రెట్టింపు చేశారు.

ఎమాన్యువల్ మేక్రాన్‌తో నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎమాన్యువల్ మేక్రాన్‌తో నరేంద్ర మోదీ

2015లో చారిత్రక పారిస్ ఒప్పందం సమయంలో ఫ్రాన్స్, భారత్‌లు అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్‌ఏ) ఏర్పాటుచేశాయి. దీని ప్రధాన కేంద్రం భారత్‌లోనే ఉంటుంది.

ఇది భారత్ వైపు నుంచి చూస్తే పెద్ద ముందడుగు. ప్రస్తుతం ఇందులో 100 సభ్య దేశాలున్నాయి. సౌర విద్యుత్ వినియోగం పెంచడం, ప్రపంచవ్యాప్తంగా తక్కువ ధరకే సౌర విద్యుత్ అందుబాటులోకి వచ్చేలా చేయడం ఈ కూటమి లక్ష్యాలు.

మోదీ ప్రవేశపెట్టిన ఉజాలా పథకం కారణంగా భారత్‌లో ఎల్‌ఈడీ దీపాల వినియోగం బాగా పెరిగింది.

మోదీ

ఫొటో సోర్స్, Getty Images

కొత్త విధానాల అమలుకు మోదీ మార్గం వేశారా?

శుద్ధ ఇంధనాల విషయంలో భారత్ సాధించిన ప్రగతికి మోదీ, ఆయన ప్రభుత్వానికి క్రెడిట్ ఇచ్చేటప్పుడు అంతకుముందు ప్రభుత్వంలో పర్యావరణ మంత్రిగా పనిచేసిన జైరాం రమేశ్ కాలంలోనూ భారత్ తన పర్యావరణ విధానాల్లో భారీ మార్పులు చేసుకున్న విషయం గుర్తుచేసుకోవాలి. 2009లో జరిగిన కోపెన్‌హాగన్‌ వాతావరణ సదస్సులో 'ధనిక దేశాలు చర్యలకు ఉపక్రమించేవరకు వేచిచూడకుండా భారత్ కర్బన ఉద్గారాల నియంత్రణకు చర్యలు తీసుకుంటుంద'ని జైరాం ప్రకటించారు.

అలాంటి కీలక విధాన మార్పుల విషయంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ విమర్శలు చేసింది. అప్పటి ప్రధాని మన్మోహన్ అభివృద్ధి చెందిన దేశాల ఒత్తిడికి తలొగ్గారని ఆరోపించింది. ఆ సమయంలో జైరాం రమేశ్ ''ఇతర దేశాలు చర్య చేపట్టేవరకు భారత్ అన్నిసార్లూ వేచిచూడదు'' అంటూ తన వాదన వినిపించారు.

జైరాం రమేశ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జైరాం రమేశ్ పర్యావరణ మంత్రిగా ఉన్న సమయంలో భారత్‌లో యూపీఏ-2 ప్రభుత్వం భూతాప నివారణ పోరులో కీలక అడుగులు వేసింది

యూపీఏ-2 హయాంలో దక్షిణాఫ్రికా, బ్రెజిల్, చైనాలతో కలిసి భారత్ BASIC కూటమిని ఏర్పాటు చేసింది. వాతావరణ మార్పుల ఒప్పందాల రూపకల్పనలో అభివృద్ధి చెందిన దేశాలు మరింత ప్రభావం చూపేందుకు వీలుగా భారత్ చొరవ తీసుకుని ఈ కూటమిని ఏర్పాటుచేసింది.

భారత్ సభ్యదేశంగా ఉన్న ఇలాంటి కూటములతో చర్చలు జరిపేందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపైనా ఒత్తిడి పెంచారు.

విద్యుత్ ఉపకరణాల ఇంధన సామర్థ్యంపై నియంత్రణలు అమలుచేస్తూ పర్యవేక్షించే 'బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ)' 2002లోనే ఏర్పాటైంది.

ప్రస్తుతం వాతావరణ మార్పులపై ప్రధాన మంత్రి బృందంలో సభ్యుడిగా ఉన్న ఒకప్పటి బీఈఈ చైర్మన్ అజయ్ మాథుర్ 'బీబీసీ'తో మాట్లాడుతూ.. 'ఫ్రిజ్‌లు, ఏసీలు వంటివాటి కర్బన ఉద్గారాల పరిమితుల స్థాయిలను 2007లోనే నిర్ణయించారు. తయారీదారులకు రెండేళ్ల గడువు ఇచ్చి 2009 నుంచి వాటిని తప్పనిసరి చేశారు. ఇంధన పరిరక్షణ నియమావళిని కూడా 2007లోనే ప్రవేశపెట్టారు.

మోదీ

ఫొటో సోర్స్, Getty Images

వివాదాస్పద నిర్ణయాలు

ఇటీవల అమెరికా వెళ్లినప్పుడు ప్రధాని మోదీ భారత్ శుద్ధ ఇంధన లక్ష్యం 4,50,000 మెగావాట్లుగా ప్రకటించిన సందర్భంలోనే ఆయన అక్కడి పలు చమురు, సహజవాయు సంస్థల సీఈవోలతో సమావేశమయ్యారు.

మోదీ సమక్షంలో భారత్, అమెరికాల మధ్య 250 కోట్ల డాలర్ల మేర ఒప్పందాలపై సంతకాలు చేశారు. వచ్చే మూడేళ్లలో అమెరికా గ్యాస్ కంపెనీలు భారత్‌లో 10 వేల కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంటారని అంచనా వేస్తున్నారు.

''చమురు, సహజవాయు, బొగ్గు విద్యుత్కేంద్రాలు భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థకు భారం కానున్నాయి. అమెరికా ప్రభుత్వాన్ని తృప్తి పరచడానికి గాను విద్యుత్కేంద్రాలు, గ్యాస్ పైప్ లైన్ల పేరిట ప్రజాధనాన్ని ప్రభుత్వమే దోచుకుంటోంద''ని వాతావారణ మార్పుల నిపుణుడు హర్జీజ్ సింగ్ అన్నారు.

తీర ప్రాంతం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తీరప్రాంతంపై ఆధారపడి జీవిస్తున్న లక్షల మంది ప్రజలు వాతావరణ మార్పుల సంక్షోభాన్ని ఎదుర్కొంటారు

దేశీయ విధానాలపై సందేహాలు

పారిస్ ఒప్పందం ప్రకారం 30 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను శోషించుకునేందుకు సరిపడా అడవులను పెంచాలని భారత్ నిశ్చయించుకుంది.

గత ఏడాది ముసాయిదా రూపొందించిన ప్రతిపాదిత అటవీ విధానం ప్రకారం ప్రయివేట్ సంస్థలకు తక్కువ సాంద్రత గల అడవులను అప్పగిస్తారు. అయితే, ప్రయివేటు కంపెనీలకు ఇస్తే వారు కలప కోసం పనికొచ్చే చెట్లనే పెంచుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దిల్లీకి చెందిన 'ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్' సంస్థకు చెందిన అటవీ వ్యవహారాల నిపుణుడు డాక్టర్ యోగేశ్ గోఖలే మాట్లాడుతూ.. ''సరైన పర్యవేక్షణ లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. ఇలాంటి నిర్ణయాల వల్ల అడవులపై ఆధారపడే గిరిజనులకు కానీ... భూతాపాన్ని నివారించే లక్ష్యం కానీ ఏదీ నెరవేరదు'' అన్నారు.

అడవుల విస్తీర్ణానికి సంబంధించి మోదీ ప్రభుత్వం వెల్లడిస్తున్న గణాంకాలపైనా ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. 2018లో ప్రచురించిన అటవీ నివేదికలో కొత్తగా మొక్కలు పెంచిన విస్తీర్ణాన్ని కూడా అడవుల విస్తీర్ణంలో కలిపి చూపించారు. అయితే, అటవీ వ్యవహారాల నిపుణులు మాత్రం అది సరికాదంటున్నారు. అడవి అంటే అందులో జీవజాలం ఇమిడి ఉంటుందని.. కొత్తగా చేపట్టిన మొక్కల పెంపకాన్ని హరిత విస్తీర్ణంగా చూడాలని సూచిస్తున్నారు.

ఐరాసలోని నిపుణుల బృందం కూడా అడవుల విషయంలో భారత్ చెబుతున్న గణాంకాలపై అనుమానాలు వ్యక్తంచేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)