5జీతో విమానాల భద్రతకు, సైనిక చర్యలకు పొంచి ఉన్న ప్రమాదమేంటి..

5జీ

ఇప్పటి వరకు 2జీ... 3జీ... 4జీ... నెట్‌వర్క్‌లను చాలామంది వినియోగించారు. ఇప్పుడు 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు పలు దేశాల్లో కసరత్తులు జరుగుతున్నాయి.

ఇప్పటికే కొన్ని దేశాలు ఈ నెట్‌వర్క్‌‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించాయి.

అయితే, ఈ టెక్నాలజీ వల్ల అనేక వ్యవస్థల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికన్ నేవీ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అందుకు సంబంధించి ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్‌ (ఎఫ్‌సీసీ)కి మార్చిలో ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా అందజేసింది.

5జీ టెక్నాలజీ అభివృద్ధిలో జాగ్రత్తపడకపోతే అది వాతావరణ హెచ్చరికల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంటుందని నేషనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ఓషియానిక్ అండ్ ఎట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌ఓఏఏ) గతంలో జరిపిన అధ్యయనంలో వెల్లడైంది.

వాతావరణం, తుపాను హెచ్చరికలు

విమానాల భద్రత, మిలిటరీ వ్యూహాలు

ఈ టెక్నాలజీ పట్ల సైనిక దళాలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే, నేవీ, వైమానిక దళాలు తమ ఆపరేషన్లు సజావుగా జరిగేందుకు వాతావరణ సూచనలపై ఎక్కువగా ఆధారపడతాయి.

ప్రత్యేకించి, గాలిలోని నీటి ఆవిరి స్థాయిని అంచనా వేసేందుకు వినియోగించే 23.6 - 24 గిగాహెడ్జ్ తరంగాలను, 5జీలో వాడే తరంగాలు నేరుగా తాకుతాయని (తరంగాలు అధ్యారోపణం చెందడం) అమెరికన్ నేవీ తెలిపింది.

ఆ రెండు తరంగాల బ్యాండ్‌విడ్త్‌లు చాలా దగ్గరగా ఉండటమే అందుకు కారణం.

అలాంటప్పుడు వాతావరణ పరిస్థితులను కచ్చితంగా అంచనా వేయడం కష్టమవుతుంది. దాంతో, విమానాల భద్రతతో పాటు, వ్యూహాత్మక సైనిక చర్యలకు కూడా అవరోధం కలుగుతుందని నిపుణులు అంటున్నారు.

తుపాన్ల వంటి విపత్తుల తీవ్రతను అంచనా వేయడంలోనూ కచ్చితత్వం లోపించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

5జీ

ఫొటో సోర్స్, Getty Images

నగరాల్లో ఎక్కువ ప్రభావం

అమెరికాలో 5జీ స్పెక్ట్రమ్ (24.25- 24.45 గిగాహెడ్జ్, 24.75- 25.25 గిగాహెడ్జ్) వేలాన్ని మార్చి 14 నుంచే ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ ప్రారంభించింది. దాదాపు రెండు బిలియన్ డాలర్ల విలువైన అమ్మకాలు జరిగాయి. ఇప్పటికైనా 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపులను నియంత్రించాలని వాషింగ్టన్ సెనేటర్ మారియా కాంట్వెల్, ఓరెగాన్ సెనేటర్ రోన్ వైడెన్‌లు డిమాండ్ చేశారు.

5జీ టెక్నాలజీ వల్ల ముఖ్యంగా సిగ్నల్ టవర్లు ఎక్కువగా ఉండే పెద్ద నగరాలపై ప్రభావం అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ సమస్య అమెరికాలోనే కాదు, బ్రిటన్‌లోనూ ఉంది. 5జీలో 26గిగాహెడ్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను వాడాలని బ్రిటన్, యూరప్ చెబుతున్నాయి. అయినప్పటికీ నీటి ఆవిరిని అంచనా వేసే సెన్సర్లపై దాని ప్రభావం ఉంటుందని బ్రిటన్ వాతావరణ విభాగం అధికారి మైక్ బ్యాంక్స్ చెప్పారు.

ఈ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే 5జీ ఉపకరణాల విషయంలో స్పష్టమైన నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్‌ఏ) తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)