ఎలిఫెంట్ ష్రూ: 50 ఏళ్ల కిందట అంతరించిన అరుదైన జీవి.. ఆఫ్రికాలో ప్రత్యక్షం

ఫొటో సోర్స్, STEVEN HERITAGE
ఐదు దశాబ్దాల కిందట అంతరించిపోయిన జాబితాలో చేర్చిన ఎలిఫెంట్ ష్రూ అనే జంతువు ఆఫ్రికాలో మళ్లీ కనిపించింది.
పేరులో ఏనుగు, చుంచు ఉన్నప్పటికీ ఇది ఆ రెండూ కాదు. కానీ చుంచులా చిన్నగా ఉంటుంది.
ఈ ఏనుగు చుంచును చివరగా 1970లో అంతరించిన జాతుల రికార్డుల్లో చేర్చారు. అయితే.. హార్న్ఆఫ్ ఆఫ్రికాలోని డిజిబౌతీలో జరిగిన ఒక శాస్త్రీయ అన్వేషణలో ఏనుగు చుంచు అనే ఈ క్షీరదం ఇప్పటికీ సజీవంగా ఉన్నట్టు కనుగొన్నారు.
దీనిని ‘ఎలిఫెంట్ ష్రూస్’ లేదా ‘సెంగిస్’ అంటారు. దీనికి ఏనుగులు, ఆర్డ్ వార్క్, మనాటీస్‌లతో సంబంధం ఉంది.
ఏనుగు చుంచుకు తొండం లాంటి ముక్కు ఉంటుంది. ఇవి కీటకాలను తిని బతుకుతాయి. ప్రపంచంలో 20 జాతుల ఏనుగు చుంచులు ఉన్నాయి. వీటిలో ఒకటైన సోమాలియాలో కనిపించే సోమాలీ సెంగిస్ గత 50 ఏళ్లుగా కనిపించడం లేదు.
గ్లోబల్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ 25 ‘మోస్ట్ వాంటెడ్ లాస్ట్ స్పీసిస్’ జాబితాలో ‘సోమాలీ సెంగిస్’ ఒకటి.
2019లో జరిగిన అన్వేషణలో ఈ జాతి ఏనుగు చుంచు మళ్లీ కనపడడంతో థ్రిల్ అయ్యానని ఆ అన్వేషణలో పాల్గొన్న రీసెర్చ్ సైంటిస్ట్ స్టీవెన్ హెరిటేజ్ చెప్పారు.
మేం మొదటి బోను తెరిచినపుడు అందులో సోమాలీ సెంగీ కనిపించగానే మేం ఉత్సాహంతో గంతులేశాం అని ఆయన బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, HOUSSEIN RAYALEH
స్థానికులకు అది అంతరించలేదు
కానీ, డిజిబౌతీలో నివసిస్తున్న వారు మాత్రం ఆ జంతువు అంతరించిపోయిందని అనుకోవడం లేదు.
శాస్త్రవేత్తల బృందం 12 ప్రాంతాల్లో వెయ్యికి పైగా బోనులు పెట్టింది. వాటిలో ఎరగా పీనట్ బటర్, ఓట్స్, ఈస్ట్ పెట్టింది. తమకు మొదటి బోనులో దొరికిన ఏనుగు చుంచును వారు పొడిగా ఉన్న పర్వత ప్రాంతాలలో వదిలిపెట్టారు.
ఈ అన్వేషణలో శాస్త్రవేత్తలు మొత్తం 12 ఏనుగు చుంచులను పట్టుకున్నారు. సజీవంగా కనిపించిన మొదటి సోమాలీ ఏనుగు చుంచు ఫొటోలు, వీడియోలను డాక్యుమెంటేషన్ కోసం భద్రపరిచారు.
ఏనుగు చుంచుల ఆవాసాలకు ప్రస్తుతం ఎలాంటి ముప్పూ కనిపించలేదు. మనుషులకు, వారి పొలాలకు అవి చాలా దూరంగా ఉన్నాట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఫొటో సోర్స్, STEVEN HERITAGE
“సాధారణంగా అంతరించిపోయిన జాతులను గుర్తించే సమయంలో మేం అవి ఒకటి, రెండు దొరకగానే, అవి అంతరించిపోకుండా వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం” అని శాస్త్రవేత్త రాబిన్ మూర్ చెప్పారు.
“మా మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న సెంగి జాతికే చెందిన డెవింటన్ గోల్డెన్ మోల్, ఇలిన్ ఐలాండ్ క్లౌడ్‌రన్నర్ అనే చిన్న క్షీరద జాతులు కూడా కనిపిస్తాయేమోననే ఇది మాలో కొత్త ఆశలు నింపింది” అని ఆయన చెప్పారు.
డీఎన్ఏ విశ్లేషణలో ఈ సోమాలీ సెంగిస్‌కు మొరాకో, దక్షిణాఫ్రికాలో ఉన్న ఇతర జాతులతో చాల దగ్గరి సంబంధాలు కనిపించాయి.
కాలక్రమేణా ఎలాగోలా సుదూర ప్రాంతానికి చేరుకోగలిగిన ఈ క్షీరదం జీవశాస్త్రవేత్తలకు ఇప్పుడు కొత్త పజిల్‌గా మారింది.
జీపీఎస్ రేడియో టాగ్ చేసిన ఒక ఏనుగు చుంచు ప్రవర్తన, జీవనం గురించి అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలు 2022లో మరోసారి అక్కడకు వెళ్లనున్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారత్‌లో గల్లంతవుతున్న కోవిడ్ మరణాలు ఎన్ని?
- ఉత్తరప్రదేశ్: రేప్‌లు, మహిళలపై నేరాలు పెరుగుతోంటే.. రామరాజ్యం అంటున్న యోగి
- భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ రెండు, మూడు దశలకు డీసీజీఐ అనుమతి
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- కెప్టెన్‌గా ధోనీ తీసుకున్న 10 అసాధారణ నిర్ణయాలు
- కేరళ విమాన ప్రమాదంలో రియల్ హీరోలు వీళ్లే.. సెల్యూట్ చేసిన పోలీసు అధికారి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








