మోదీ ‘మన్ కీ బాత్’కు యూట్యూబ్‌లో డిస్‌లైక్‌ల వెల్లువ

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమానికి యూట్యూబ్‌లో ప్రతికూల స్పందన వస్తోంది.

ఆల్ ఇండియా రేడియోలో ఆదివారం వచ్చిన ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్‌తోపాటు కొన్ని ప్రైవేటు ఛానెళ్లు కూడా ప్రసారం చేశాయి.

మోదీ, పీఐబీ, బీజేపీ యూట్యూబ్ ఛానెళ్లలోనూ ఈ కార్యక్రమాన్ని అప్‌లోడ్ చేశారు.

తాజా కార్యక్రమానికి పాజిటివ్ కంటే నెగిటివ్ లైక్‌లు ఎక్కువయ్యాయి. ఇప్పటివరకు మన్ కీ బాత్‌కు వచ్చిన డిస్ లైక్‌లలో ఇవే అన్నింటి కంటే ఎక్కువ.

ఇలా డిస్‌లైక్‌లు విపరీతంగా రావడం ఇదే తొలిసారి. నెటిజన్ల మనోభావాలకు ఇది అద్దం పడుతోంది. దీనికి కారణం ఏమిటని మీడియాలో చర్చ జరుగుతోంది.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Reuters

అన్ని చోట్లా..

తాజా కార్యక్రమం అప్‌లోడ్ చేసినప్పటి నుంచే డిస్‌లైక్‌ల వెల్లువ మొదలైంది. రాత్రి అయ్యేసరికి ఇవి విపరీతంగా పెరిగాయి.

సోమవారం ఉదయం ఈ వార్త రాసే సమయానికి భారతీయ జనతా పార్టీ యూట్యూబ్ ఛానెల్‌లోని ఈ కార్యక్రమానికి వచ్చిన డిస్‌లైక్‌లు 2.3 లక్షలకు పెరిగాయి.

లైక్‌లు మాత్రం 26 వేలు మాత్రమే ఉన్నాయి. రెండింటి మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది.

మరోవైపు మోదీ యూట్యూబ్ ఛానెల్‌లో ఈ వీడియోకు 23 వేల లైక్‌లు రాగా.. డిస్‌లైక్‌లు మాత్రం 48 వేలకు పైనే ఉన్నాయి.

మరోవైపు పీఐబీ యూట్యూబ్ ఛానెల్‌లో ఈ వీడియోకు 3.4 వేల లైక్‌లు రాగా.. డిస్‌లైక్‌లు 8 వేలకుపైనే ఉన్నాయి.

నరేంద్ర మోదీ

ఇంతకీ మోదీ ఏం చెప్పారు?

మన్ కీ బాత్ 68వ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

ప్రతిసారీ భిన్న అంశాలపై ఆయన మాట్లాడుతుంటారు. ఈ వారం ఆయన బొమ్మల వ్యాపారంలో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని భారత ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఆయన పిలుపునిచ్చారు.

''ప్రపంచంలో బొమ్మల పరిశ్రమ విలువ ఏడు లక్షల కోట్లకుపైనే ఉంది. దీనిలో భారత్‌ వాటా మాత్రం చాలా తక్కువగా ఉంది''అని మోదీ చెప్పారు. దేశీయంగా బొమ్మలు తయారుచేయాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు.

మరోవైపు భారత్‌లో దేశీయ కంప్యూటర్ గేమ్స్‌ను తయారుచేయాలని ఆయన అన్నారు.

''మన దేశంలో చాలా కాన్సెప్ట్‌లు, ఐడియాలు ఉన్నాయి. బొమ్మలు, వర్చువల్ గేమ్స్‌ను దేశీయంగా తయారుచేసే అంశాలపై దృష్టిసారించాలి''అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)