కరోనావైరస్: గబ్బిలాలు ఈ వైరస్‌ను వ్యాప్తి చేస్తాయా? శాస్త్రీయ సమాధానం ఇదీ

ఫొటో సోర్స్, Getty Images/BBC
గబ్బిలాల గురించి ఆలోచిస్తేనే ఇరోరో టాన్షీ ఉద్రేకానికి లోనవుతారు. ‘‘అవో అద్భుతం’’ అంటారామె.
అమెరికాలోని టెక్సస్ టెక్ యూనివర్సిటీలో డాక్టరేట్ చేస్తున్న నైజీరియన్ పరిశోధకురాలు టాన్షీ. గబ్బిలాల మీద ఉన్న దురభిప్రాయాన్ని.. కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తిలో వాటి పాత్ర ఉందన్న వాదనలతో మరింతగా బలపడిన చెడ్డ పేరును తొలగించటానికి కృషి చేస్తున్న శాస్త్రవేత్తల్లో ఆమె ఒకరు.
ఆస్ట్రేలియా, ఇండొనేసియాల్లో గబ్బిలాలను పెద్ద సంఖ్యలో సంహరించటం, పారదోలటం చేస్తున్నారన్న వార్తలు.. వన్యప్రాణుల సంరక్షకవాదులను ఆందోళనకు గురిచేశాయి.
అయితే.. ఈ మహమ్మారి విషయంలో గబ్బిలాలను నిందించటం వల్ల అసలు దోషి తప్పించుకుపోతాడు. అదెలాగో చూడండి.

ఫొటో సోర్స్, Chidiogo Okoye/SMACON/BBC
గబ్బిలాలను కొందరు ఎందుకు నిందిస్తున్నారు?
ఇప్పుడు కోవిడ్-19 వ్యాధికి కారణమవుతున్న సార్స్-సీఓవీ2 వైరస్.. ఇంతకుముందు అడవిలో కనిపించే గుర్రపునాడా గబ్బిలంలో గుర్తించిన మరొక వైరస్‌ను 96 శాతం వరకూ పోలి ఉండటం వల్ల జనం ఈ వైరస్‌కు కూడా గబ్బిలాలను నిందిస్తున్నారని టాన్షీ వివరించారు.
దీనివల్ల గబ్బిలాలన్నీ అనుమాతితులుగా మారాయి. కానీ తమ పాత్ర లేదనేందుకు గబ్బిలాల దగ్గర శాస్త్రీయమైన సాక్ష్యం ఉంది.
‘‘గుర్రపునాడా గబ్బిలాల్లో కనిపించిన వైరస్ నుంచి 40-70 ఏళ్ల కిందటే సార్స్-సీఓవీ2 వైరస్ వేరుపడిందని ఇటీవలి జీవపరిణామ పరిశోధన చెప్తోంది. దీనినిబట్టి ఈ వైరస్ నేరుగా గబ్బిలాలే మనుషులకు వ్యాప్తి చేసి ఉండకపోవచ్చుననటానికి మరింత ఆధారం లభించింది’’ అని టాన్షీ పేర్కొన్నారు.
కెన్యాలోని మాసాయ్ మారా యూనివర్సిటీలో వైల్డ్‌లైఫ్ బయాలజీ లెక్చరర్ డాక్టర్ పాల్ వెబాలా దీనితో ఏకీభవిస్తున్నారు. ‘‘పరిణామ క్రమంలో గబ్బిలాలు – మనుషుల మధ్య చాలా దూరం ఉంది. కాబట్టి సార్స్ సీఓవీ-2 నిజంగానే గబ్బిలాల నుంచి వచ్చినా కూడా.. అది మరేదైనా జీవి ద్వారా మనిషికి సోకి ఉంటుంది’’ అని ఆయన చెప్పారు.
అంటే.. ఈ వైరస్ నిజంగా గబ్బిలాల నుంచే పుట్టుకొచ్చినప్పటికీ.. దానిని మనకు – మనుషులకు – సంక్రమింపజేసిన జీవులు మాత్రం ఇవి కాదు. మనుషులకు ఈ వైరస్‌ను సంక్రమింజేసిన ఆ మధ్యవర్తి పాంగోలిన్ కావచ్చునని అనుమానిస్తున్నారు.

ఫొటో సోర్స్, Wellcome Collection/BBC
మరి ఎవరిని నిందించాలి?
ప్రస్తుతం కరోనావైరస్ మహమ్మారిలా విజృంభించటానికి, మానవ జనాభాలో వ్యాపించటానికి తప్పుపట్టాల్సింది మనుషులనేనని.. గబ్బిలాలను కాదని టాన్షీ, ఆమె సహచర శాస్త్రవేత్తలు ముక్తకంఠంతో ఉద్ఘాటిస్తున్నారు.
ఈ మహమ్మారి విజృంభించటానికి అవసరమైన పరిస్థితులను మానవ కార్యకలాపాలు సృష్టించాయని డాక్టర్ వెబాలా అంటారు. ‘‘వన్యప్రాణి ఆవాసాలను ఆక్రమించటం, వాటి ఆవాస ప్రాంతాలు కోల్పోవటం, తగ్గిపోవటం, వన్యప్రాణుల వ్యాపారం, వాటిని నిల్వచేయటం, రవాణా చేయటం – ఈ కార్యకలాపాలన్నీ కలిసి.. ఇంతకుముందు మనుషులతో సంబంధం లేని సూక్ష్మజీవులు మనుషులకు సంక్రమించటానికి వీలుకల్పించే పరిస్థితులను కల్పించాయి’’ అని వారు పేర్కొన్నారు.
‘‘వన్యప్రాణుల ఆవాసాల విధ్వంసంతో జంతువుల్లో పుట్టి మనుషులకు సంక్రమించే వ్యాధులు పెరుగుతాయని అనేక ఆధారాలు చాటుతున్నాయి’’ అని టాన్షీ చెప్పారు.
గబ్బిలాలను సంహరిస్తే మనకు కరోనావైరస్ నుంచి రక్షణ లభించదు. పైగా.. వాటిని సామూహికంగా ధ్వంసం చేయటం, వాటి ఆవాసాల నుంచి తరిమివేయటం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారవచ్చునని సంరక్షకవాదులు హెచ్చరిస్తున్నారు.
‘‘ఇప్పుడున్న 14,000కు పైగా గబ్బిలం జాతుల్లో దాదాపు 70 శాతం జాతులు కీటకాలను ఆహారంగా తింటాయి. గాలిలో తిరిగే, రాత్రిళ్లు సంచరించే చాలా రకాల కీటకాలను ఈ గబ్బిలాలు తింటుంటాయి. ఆ కీటకాలు మనుషులకు సంబంధించిన హానికర జీవులను మోస్తుంటాయి’’ అని డాక్టర్ వెబెలా వివరించారు. అంటే.. డెంగీ జ్వరం, మలేరియా వంటి మనుషులకు సోకో జబ్బులను ఆ కీటకాలు మోసుకుంటూ తిరుగుతుంటాయి.
కాబట్టి గబ్బిలాలను సంహరించటం, పారదోలటం వల్ల అనేక జబ్బుల విజృంభణ పెరగవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images/BBC
గబ్బిలాల వల్ల మనుషులకు ప్రయోజనం ఏమిటి?
‘‘ఇప్పుడు మీరు నూలు దుస్తులు ధరించి ఉన్నా, కాఫీ కానీ టీ కానీ తాగి వున్నా, మొక్కజొన్నతో చేసిన ఆహారం ఏదైనా తిన్నా, లేదంటే పండించిన పంటలతో చేసిన మరే ఆహారం తిన్నా.. మీరు ఈ రోజు ఇప్పటికే గబ్బిలంతో అనుసంధానమైనట్లే’’ అంటారు డాక్టర్ వెబెలా.
పరపరాగ సంపర్కంలో, విత్తనాల వ్యాప్తిలో, కీటకాల నియంత్రణలో తమ పాత్ర పోషించటం ద్వారా గబ్బిలాలు కీలకమైన జీవావరణ సేవలు అందిస్తున్నాయి. ఆహారం నుంచి సౌందర్యసాధనాల వరకూ, ఇంటి సామాన్ల నుంచి ఒంటి మందుల వరకూ.. చాలా వాటికి గబ్బిలాల శ్రమ అవసరమవుతుంది.
గబ్బిలాలు లేకపోతే ఇండొనేసియాలో పంట దిగుబడి వచ్చేది కాదు. మడగాస్కర్‌లో విశిష్టమైన బావోబాబ్ వృక్షాలు అంతర్ధానమయ్యేవి. మకాడామియా తోటలు ధ్వంసమైపోయేవి.
‘‘పక్షుల కన్నా రెట్టింపు విత్తనాలను గబ్బిలాలు పంపిణీ చేస్తాయి. తద్వారా ఉష్ణమండల ప్రాంతాల్లో కీలకమైన అటవీ పునరుద్ధరణ జరుగుతుంది’’ అని డాక్టర్ వెబెలా పేర్కొన్నారు.
పలు అధ్యయనాల ప్రకారం.. ఒక్క అమెరికాలోనే రైతులకు ప్రతి ఏటా వందల కోట్ల డాలర్లను గబ్బిలాలు ఆదా చేస్తున్నాయి. పురుగుమందుల వాడకం పెద్దగా అవసరపడకుండా, పంటలు దెబ్బతినకుండా చూడటం ద్వారా అవి సేవలందిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images/BBC
గబ్బిలాల విశిష్టతలు ఏమిటి?
‘‘గబ్బిలాలు చాలా విజయవంతమైన జీవులు: ఒక్క అంటార్కిటికా మినహా అన్ని ఖండాల్లోనూ అవి కనిపిస్తాయి’’ అని టాన్షీ చెప్పారు.
గబ్బిలాల మీద పరిశోధనల్లో భాగంగా ఆమె గుహలు, పర్వతాలు, అడవులు, సవన్నాలు, పచ్చికబయళ్లు అన్నిటినీ కలియదిరిగారు.
జీవపరిణామంలో గబ్బిలాలు అద్భుతంగా వికసించాయని ఆమె అంటారు.
‘‘రెక్కలుగా మారిన వేళ్లు, ఎఖోలొకేషన్ ద్వారా ప్రయాణం, అద్భుతమైన కంటిచూపు.. గబ్బిలాలు రాత్రిళ్లు ఆకాశంలో రాజ్యం చేయటానికి వీలుకల్పించాయి. క్షీరదం అనేది ఒక కళ అయినట్లయితే.. అందులో గబ్బిలాలు అద్భుతమైన కళాఖండాలవుతాయి’’ అని ఆమె వర్ణించారు.
డాక్టర్ వెబెలా కూడా ఇదే ఆసక్తి కనబరుస్తారు. గబ్బిలాలను సంరక్షించాల్సిన అవసరముందని వాదిస్తారు.
‘‘గబ్బిలాలకు గొప్ప రోగనిరోధక వ్యవస్థ ఉండి ఉండొచ్చునని.. ఈ రోగకారకాలు, వ్యాధులను తట్టుకునేలా ప్రత్యేకంగా వికసించి ఉంటుందని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. వీటి అద్భుతమైన పోరాటపటిమ.. వైరస్‌లను తట్టుకోవటంలో మనిషి రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసే సరికొత్త చికిత్సలకు మార్గం చూపగలవు’’ అంటారు డాక్టర్ వెబెలా.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? ‘పది మందిని విడుదల చేసిన చైనా’
- జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహాయం కోరారు’
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కడప జిల్లా: వీరికి గబ్బిలాలు ‘దేవతలు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









