139 మంది తనపై అత్యాచారం చేశారన్న యువతి కేసులో కీలక మలుపు.. అతడే అసలు నిందితుడా?

అత్యాచారం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, దీప్తి బత్తిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''నన్ను 139 రేప్ చేయలేదు. అందులోని కొన్ని పేర్లను రాజశ్రీకర్ రెడ్డి బలవంతంగా రాయించారు" అని బాధిత మహిళ సోమవారం ప్రెస్ మీట్ లో వెల్లడించారు.

బాధిత మహిళకు స్వచ్ఛంద సంస్థగా సాయం చేస్తున్నట్లు చెప్తున్న వ్యక్తే నిందితుడని ఆమె ఆరోపించారు.

తనపై అత్యాచారం జరగడం వాస్తవమే కానీ రాజశ్రీకర్ రెడ్డి సొంత లాభాల కోసం ఈ కేసును ఉపయోగించుకునే ప్రయత్నం చేశాడని భాదిత మహిళ వెల్లడించారు. సోమవారం నాడు కుల సంఘాలు, మహిళా సంఘాల సమక్షంలో హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఇప్పటికే ఈ కేసును పంజాగుట్ట పోలీసుల నుంచి సీసీఎస్ పోలీసు స్టేషన్‌కు బదిలి చేశారు.

కేసు గురించి వివరాలు తెలిసిన మహిళా సంఘం కార్యకర్తతో బీబీసీ తెలుగు మాట్లాడింది. మహిళా సంఘం కార్యకర్త సంధ్య బాధిత మహిళను కలిశారు. తాను తెలిపిన వివరాల ప్రకారం కుల సంఘాల పెద్దలు, మహిళా సంఘాల పెద్దల జోక్యంతో నిజానిజాలు బయట పడుతున్నాయి.

''ఆ అమ్మాయి అత్యాచారానికి గురైన విషయం వాస్తవమే. తన దుర్బల పరిస్థితిని దుర్వినియోగం చేసుకునే ప్రయత్నం జరిగింది. బాధిత మహిళ చిన్న వయస్సులో ఎదురుకున్న సమస్యల కారణంగా ఆ ఊబిలో చిక్కుకుంది. కేసు పరిశోధనలో ఉంది. నిజానిజాలు త్వరలోనే బయట పడుతాయి'' అని సంధ్య అన్నారు.

వీడియో క్యాప్షన్, 'రేప్ చేశారని కేసు పెడితే నన్నే జైల్లో పెట్టారు'

అయితే రాజశ్రీకర్ రెడ్డి వైఖరిపై పలు కుల సంఘాలు, మహిళా సంఘాల కార్యకర్తలకు ముందు నుంచే అనుమానం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ అనుమానంతోనే సీసీఎస్ పోలీసులు కూడా అప్రమత్తమై పాత రికార్డులు పరిశీలించారు.

రాజశ్రీకర్ రెడ్డిపై గతంలోనే అతని భార్య కేసు నమోదు చేసినట్టు తేలింది. ఈ విషయాన్ని హైదరాబాద్ అడిషనల్ పొలీస్ కమిషనర్ (క్రైం, ఎస్ఐటీ) శిఖా గోయల్ బీబీసీ తెలుగుకి ధృవీకరించారు.

ప్రస్తుతం బాధిత మహిళ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసుకుంటున్నారు.

''ఆమె రాజశ్రీకర్ రెడ్డి గురించి ప్రెస్ మీట్‌లో చెప్పింది. కానీ మా వద్ద భిన్నమైన వాంగ్మూలం రికార్డు చేసింది. కనుక మళ్లీ తన స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నాము. భిన్నమైన వాంగ్మూలం ఉంది కనుక మెజిస్ట్రేట్ ముందు కూడా స్టేట్మెంట్ రికార్డు చేయిస్తాము. దానిని బట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది'' అని శిఖా గోయల్ తెలిపారు.

గతంలో బీబీసీ తెలుగుతో మాట్లాడిన రాజశ్రీకర్‌రెడ్డితో మాట్లాడటానికి బీబీసీ తెలుగు ప్రయత్నించింది. పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)