జీడీపీ పతనం: ప్రభుత్వం ఖర్చు చేయమంటోంది.. ప్రజలు పొదుపు చేయాలనుకుంటున్నారు

ఫొటో సోర్స్, Getty Images
లాక్‌డౌన్ మొదలైన తర్వాత మొదటి త్రైమాసికంలో భారతదేశ జీడీపీ వృద్ధిరేటులో భారీ క్షీణత కనిపించింది.
కేంద్రగణాంక మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం అంటే ఏప్రిల్ నుండి జూన్ మధ్య జీడీపీలో వృద్ధిరేటు - 23.9 శాతానికి పడిపోయింది.
కరోనావైరస్ మహమ్మారి, దానివల్ల దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా తొలి త్రైమాసికంలో భారత జీడీపీ 18శాతం తగ్గుతుందని అంతకు ముందు అంచనా వేశారు.
జనవరి-మార్చి త్రైమాసికంలో ఆర్ధికవ్యవస్థ 3.1 శాతం వృద్ధిని సాధించింది. గడిచిన ఎనిమిదేళ్లలో ఇదే కనిష్ఠం.
జనవరి-మార్చి త్రైమాసికంలో వినియోగదారుల వ్యయంతోపాటు ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతులు తగ్గాయని జీడీపీ గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది ఇదే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వృద్ధిరేటు 5.2శాతంగా ఉంది.
తాజాగా విడుదలైన జీడీపీ గణాంకాలు 1996 తర్వాత అతి పెద్ద పతనంగా చెబుతున్నారు.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్థిక కార్యకలాపాలతోపాటు, గణాంకాల సేకరణ విధానం కూడా ప్రభావితమైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్చి 25నుంచి దేశంలో లాక్‌డౌన్ విధించాక ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోయాయని మంత్రిత్వశాఖ అన్నది.
అసలు జీడీపీలో క్షీణతకు అర్ధమేంటి? దానివల్ల కలిగే పరిణామాలేంటి? దాన్నుంచి బయట పడటానికి ఉన్న అవకాశాలేమిటి? ఈ అంశాలపై బీబీసీ కరస్పాండెంట్ సరబ్‌జిత్ ధలివాల్ ఆర్ధిక నిపుణులు దేవేంద్రశర్మతో మాట్లాడారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రశ్న: జీడీపీలో ఈ క్షీణతను మీరు ఎలా చూస్తారు ? ఇవి పూర్తి లాక్‌డౌన్ సమయంలో నమోదైన గణాంకాలు కదా?
సమాధానం: అవును. ఇవి లాక్‌డౌన్ సమయంలో తీసుకున్న గణాంకాలే. అదే సమయంలో ప్రపంచంలోని ఇరవై పెద్ద ఆర్థిక వ్యవస్థల గురించి మనం చెప్పుకున్నట్లయితే భారతదేశపు ఆర్థిక వ్యవస్థ తీరు అత్యల్ప స్థాయిలో ఉంది.
లాక్‌డౌన్ సమయంలో వ్యవసాయ రంగం మినహా మిగిలిన అన్ని రంగాలు దెబ్బతిన్నాయని ఈ గణాంకాలు చెబుతున్నాయి. హోటల్ రంగం కావచ్చు, సేవా రంగం కావచ్చు, ప్రతిచోటా క్షీణత ఉంది.
లాక్‌డౌన్ సమయంలో పరిశ్రమలు మూసివేత, నిలిచిపోయిన ఆర్థిక కార్యకలాపాల కారణంగా ఎకానమీ తీవ్రంగా ప్రభావితమైందని స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంక్షోభం చాలా పెద్దదని, రాబోయే రోజుల్లో ప్రభుత్వం దీన్ని ఎదుర్కోవడం ప్రభుత్వానికి పెద్ద సవాలని స్పష్టమవుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రశ్న: వ్యవసాయ రంగం ప్రభావితం కాలేదు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు: అన్నిరంగాలు ప్రభావితమైన సమయంలో వ్యవసాయం మాత్రమే సానుకూల వృద్ధి సాధించింది. వ్యవసాయరంగంలో వృద్ధి రేటు 3.4 జీవీఏ. వ్యవసాయం దేశ జీవనరేఖ అన్న విషయం స్పష్టమైంది.
వ్యవసాయం దేశాన్ని జాగ్రత్తగా చూసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడింది. ఇప్పుడు రైతులను కాపాడుకోవడం దేశ బాధ్యతగా మారింది. వ్యవసాయ రంగం ప్రాధాన్యత ఏంటో విధాన రూపకర్తలకు ఇది స్పష్టంగా చెప్పింది.
ఈ లైఫ్‌లైన్ మరింత బలోపేతం కావాలి. వ్యవసాయ రంగానికి మిగతా రంగాలతో సమాన ప్రాముఖ్యం లభించాలి.
ప్రశ్న: దేశంలో కరోనా వినాశనం ఇంకా ముగియలేదు. రాబోయే కాలంలో ఏం జరగబోతోంది?
జవాబు: మనం ఇప్పుడు పడిపోయిన స్థాయి నుండి బయటపడటానికి చాలా సంవత్సరాలు పడుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడున్న జీడీపీనిబట్టి 2021 ఆర్ధిక సంవత్సరం అంటే ఈ ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు అది 6 లేదా 7 శాతం లేదా 5 అంతకంటే తక్కువ వృద్ధి రేటు ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి.
వీటినిబట్టి చూస్తే జీడీపీ వృద్ధిరేటును మెరుగుపరచడానికి సమయం పడుతుందని అర్ధమవుతోంది. ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే లక్షలమంది నిరుద్యోగులుగా మారారు. వారికి తిరిగి ఎలా ఉపాధి కల్పించాలి అన్నది ముఖ్యమైన సవాల్. పైగా వీరంతా వ్యవస్థీకృత రంగంలో ఉన్నవారు మాత్రమే. అసంఘటిత రంగం గురించి ప్రస్తుతం మాట్లాడటం లేదు.
రివర్స్-మైగ్రేషన్ కింద తిరిగి వెళ్ళిన వారిని తిరిగి ఎలా తీసుకొస్తారు అన్నది ముఖ్యం.
ప్రశ్న: మరి ఈ పరిస్థితుల్లో ఏం చేయాల్సి ఉంది ?
జవాబు: ప్రాథమికంగా రెండు పనులు చేయాలి. సెప్టెంబరులో ఒకటిన్నర లక్షల కోట్ల వరకు సంస్థలకు పన్ను-రాయితీ ఇవ్వడం వల్ల డిమాండ్ పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
కానీ అలా ఇచ్చినంత మాత్రాన పెట్టుబడులురావని, ఉపాధి అవకాశాలు పెరగవని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీని అర్థం మన ఆర్థిక ఆలోచనలు ఇంకా మారలేదని.

ఫొటో సోర్స్, Getty Images
మనం కార్పొరేట్ రంగంలో డబ్బు పెట్టే వరకు వృద్ధి ఉండదని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఈ లాక్‌డౌన్ మనకు ఒక పాఠం. పాత ఆలోచనలను మార్చుకోవాలి. డిమాండ్ సృష్టిపై శ్రద్ధ పెట్టాలి. ప్రభుత్వం ఈ ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయలను వ్యవసాయంలో పెట్టుబడి పెట్టవచ్చు.
రెండవది, ప్రభుత్వం ఇటీవల మూడు ఆర్డినెన్స్‌లు జారీ చేసింది. వీటి ద్వారా రైతు మార్కెట్ నుంచి విముక్తి పొందాడని చెబుతున్నారు. ఈ ప్రయోగం అమెరికా, ఐరోపాలలో ఇంతకు ముందే జరిగింది. అయితే అక్కడ ఫెయిలైన విధానాలను మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం.
మన దేశం, మన రైతుల పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలి. రైతును మార్కెట్‌కు వదిలి వేయకూడదు. ఏపీఎంసీ పరిధిని విస్తరించాలి. అక్కడ పెట్టుబడి అవసరం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాల్సిన అవసరం ఉంది.

ఫొటో సోర్స్, Pti
ప్రశ్న: అన్‌లాక్-4 తరువాత ఏమైనా మార్పులు ఉంటాయా?
జవాబు: గత సంవత్సరం కూడా దీపావళికి డిమాండ్ పెరుగుతుందని, దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని అనుకున్నారు. కానీ ఇది జరగలేదు.
మన ఆర్థికవేత్తలు చాలామంది పుస్తక జ్జానాన్ని అనుసరిస్తారు. అందులో పండగలొస్తే డిమాండ్ పెరుగుతుందని రాసి ఉంటుంది. కానీ అది అన్నిసార్లు జరగదు.
సాధారణ ప్రజలు దీనికి చాలా భిన్నంగా ఆలోచిస్తారు. ఇప్పుడు ప్రజలు ఖర్చులు తగ్గించుకుని పొదుపు చేయాలని భావిస్తున్నారు. మన సమాజం కోసం రక్షణాత్మక విధానాలను రూపొందించాలి. ప్రజలు ఎక్కువకాలం డబ్బును బ్యాంకుల్లో ఉంచేలా ఆప్షన్లు ఇవ్వాలి.
ఇవి కూడా చదవండి:
- జీడీపీ అంటే ఏమిటి? ఎలా లెక్కిస్తారు? ఈ గణాంకాలు ఎందుకంత కీలకం
- లిరా పడిపోతోంది.. రూపాయినీ లాక్కెళుతోంది
- జీడీపీ భారీ పతనం.. తొలి త్రైమాసికంలో 23.9 శాతం కుదేలు.. మాంద్యం ముంచుకొస్తోందా?
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారీలో చైనా ముందడుగు... కార్మికులపై టీకా ప్రయోగాలు
- మోదీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఎందుకు పరుగులు పెట్టించలేకపోతోంది?
- మోదీ సర్కారు ప్రభుత్వ కంపెనీలను ఎందుకు అమ్మేస్తోంది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








