కరోనావైరస్ వ్యాక్సీన్ తయారీలో చైనా ముందడుగు... కార్మికులపై టీకా ప్రయోగాలు

కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రతీకాత్మక చిత్రం

చైనాలోని ఒక ప్రైవేట్ హెల్త్ కేర్ సంస్థ యజమాని ఈ నెల ప్రారంభంలో తన సిబ్బందికి ఒక మాట చెప్పారు. అదేమంటే, నవంబరు నాటికి కరోనావైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సీన్ వస్తుందని.

దీన్ని ఆర్థిక పరిస్థితి పుంజుకోవడానికి సంకేతంగా చూస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాదు, వ్యాక్సీన్‌ భారీగా అమ్మడానికి ఇదొక గొప్ప అవకాశమని కూడా ఆయన భావించారు.

కరోనావైరస్ ప్రపంచమంతా పాకడానికి ముందు మొదట మానవుల్లో కనిపించింది చైనాలోనే. ఇప్పుడు చైనా దీనికి టీకా కనుగొనడంలో పోటీపడుతోంది.

గత వారం అక్కడ అభివృద్ధి దశలో ఉన్న వ్యాక్సీన్ చిత్రాలు చైనా ప్రభుత్వ నేతృత్వంలో నడుస్తున్న మీడియాలో వచ్చాయి. ఒక ప్రయోగశాలలో నవ్వులు చిందిస్తున్న మహిళ చేతిలో చిన్న పెట్టెలో ఉన్న వ్యాక్సీన్‌ను చూపించారు.

డిసెంబరు నాటికి దీని విక్రయాలు మొదలు పెట్టగలమని సినోఫార్మ్ సంస్థ చెబుతోంది. ఈ వ్యాక్సీన్ ధర 140 డాలర్లు(సుమారు రూ. 10,300)గా వెల్లడించింది.

కోవిడ్ బాధితులు

ఫొటో సోర్స్, Reuters

అధికారిక, రహస్య ప్రయోగాలు

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చివరి దశ ప్రయోగాలలో ఉన్న ఆరు వ్యాక్సీన్లలో సగం చైనావే. సమర్థమైన వ్యాక్సీన్ కోసం గ్లోబల్ ట్రయల్స్ తప్పనిసరిగా నిర్వహించాలి.

అయితే, చైనా ప్రస్తుతం తన సొంత దేశంలో ఈ ప్రయోగాలు చేసే పరిస్థితిలో లేదు. కరోనావైరస్‌ను అక్కడ దాదాపుగా కట్టడి చేయడమే దీనికి కారణం. ''వ్యాక్సీన్ తయారు చేస్తున్న కంపెనీలన్నీ తమ మూడో దశ ప్రయోగాలకు అనువైన ప్రాంతాల కోసం చూస్తున్నాయి. కోవిడ్-19 ఇప్పటికీ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతున్న దేశాలలో అయితే ఈ మూడో దశ ప్రయోగాలలో వేల మందికి వ్యాక్సీన్ వేసి పరిశీలించొచ్చు'' అన్నారు హాంకాంగ్ యూనివర్సిటీకి చెందిన పబ్లిక్ హెల్త్ స్కూల్ ప్రొఫెసర్ బెన్ కౌలింగ్.

చైనా సంస్థలు తయారుచేస్తున్నవి సహా ప్రస్తుతం మూడో దశ ప్రయోగాలలో ఉన్న వ్యాక్సీన్లు అన్నిటిపైనా ఆయన ఆశావహంగా ఉన్నారు.

గత నెల నుంచి రహస్యంగా కొందరు పబ్లిక్ వర్కర్క్‌పై వ్యాక్సీన్ ప్రయోగాలు చేస్తున్నట్లు చైనా ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి జెంగ్ జాంగ్‌వీ ధ్రువీకరించారు.

చైనా నేషనల్ హెల్త్ కమిషన్‌కు చెందిన జెంగ్ జాంగ్‌వీ చైనా అధికారిక మీడియాతో మాట్లాడుతూ, ఇంకా ఆమోదించని ప్రయోగ దశలోని వ్యాక్సీన్లను పరిశీలన కోసం ఇచ్చేందుకు సరిహద్దుల్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్న అధికారులకు అనుమతించినట్లు చెప్పారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

''డిసెంబరు నాటికి కొన్ని వ్యాక్సీన్లు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయనుకుంటున్నాను. అయితే, అవి పెద్దమొత్తంలో అందుబాటులోకి వస్తాయో లేదో చెప్పలేను'' అన్నారు కౌలింగ్. మొదట ఎవరు తయారుచేశారన్నది ముఖ్యం కాదు ఎంత బాగా పనిచేస్తుందన్నదే ప్రధానమని అన్నారాయన.

2021 వేసవి నాటికి జనాభా మొత్తానికి కోవిడ్-19 వ్యాక్సీన్ వేసే అవకాశం ఉంటుందని కౌలింగ్ అంచనా వేస్తున్నారు. వ్యాక్సీన్ ప్రయోగాల్లో వివిధ దశలుంటాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పెరూ, అర్జెంటీనాల్లోని వేల మంది ప్రజలపై అధికారికంగా ప్రయోగాలు చేస్తున్నట్లు చైనా ఇప్పటికే ప్రకటించింది.

బయటపెట్టకుండా జరుగుతున్న ప్రయోగాలూ ఉన్నాయి. కోవిడ్ విపత్కర కాలంలో దఖలు పడిన అత్యవసర అధికారాలతో ఇలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి.

ఇటీవల చైనా గని కార్మికులు కొందరిని పపువా న్యూగినీలో ప్రవేశానికి నిరాకరించారు. వారిని వ్యాక్సీన్ ట్రయల్స్‌లో వాడుతున్నట్లు యాజమాన్యం ప్రకటించడంతో ఇలా జరిగింది.

చైనా ప్రభుత్వ సంస్థకు చెందిన సుమారు 48 మంది గని కార్మికులకు ఆగస్టు ప్రారంభంలో ఈ టీకాలు వేశారు.

జిన్ పింగ్

ఫొటో సోర్స్, EPA

వ్యాక్సిన్ దౌత్యం

వ్యాక్సీన్ అందుబాటులోకి వస్తే చైనా ఏం చేస్తుందనే విషయంలో అస్పష్టత ఉంది.

''చైనాలో వ్యాక్సీన్ అభివృద్ధి చేసి అందుబాటులోకి వచ్చిన తరువాత అది ప్రపంచ ప్రజా ఉత్తత్తిగానే వినియోగిస్తాం'' అని చైనా అధికారిక పత్రాల్లో పేర్కొన్నారు.

తమ అవసరాలు తీరిన తరువాత ఆగ్నేయాసియాలోని కొన్ని దేశాలు, ఆఫ్రికా దేశాలకు ఆ వ్యాక్సీన్ సరఫరా చేసేందుకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చైనా సంకేతాలిస్తోంది. అయితే, చైనా దౌత్య ప్రయోజనాలనూ చూస్తుందని పలువురు భావిస్తున్నారు.

ఇటలీ, సెర్బియాలో కోవిడ్ ఉద్ధృతంగా ఉన్న దశలో మాస్కుల విషయంలో చైనా వ్యవహరించిన తీరును ఒక సీనియర్ యూరోపియన్ దౌత్యవేత్త ప్రస్తావించారు.

వ్యాక్సీన్ విషయంలో చైనా ప్రభావవంతమైన స్థితిలో ఉండే అవకాశం ఉండడంతో అది వ్యాక్సీన్‌తో దౌత్యం చేస్తుందని అప్రమత్తం చేస్తున్నారు.

''వ్యాక్సిన్ పరిశోధనల్లో వారు చాలా పెట్టుబడి పెట్టారు.. అదిప్పుడు ఫలితమిస్తుంది'' అన్నారు ప్రొఫెసర్ కౌలింగ్.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)