కరోనావైరస్ ఎఫెక్ట్: అమెరికాలోని ఐదు లక్షల మంది భారతీయులు రోడ్డున పడనున్నారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వినీత్ ఖరే
- హోదా, బీబీసీ ప్రతినిధి
కోవిడ్-19 సంక్షోభం వల్ల అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో పేదరికం రెండింతలు అయ్యే ప్రమాదం ఉందని ఓ అధ్యయనం హెచ్చరించింది.
ప్రస్తుతం భారతీయ అమెరికన్లలో పేదల శాతం 6.5 శాతంగా ఉన్నట్లు అంచనాలున్నాయి. కోవిడ్ సంక్షోభం ఫలితంగా ఈ ఏడాది చివరికల్లా ఇది 10.1 శాతానికి పెరగొచ్చని 'ది ఇన్విసిబుల్ ఇండియన్' నివేదిక అభిప్రాయపడింది.
ఇండయోస్పొరా అనే ప్రవాస భారతీయుల అంతర్జాతీయ సంఘం ఈ నివేదికను విడుదల చేసింది.
అమెరికాలోని సంపన్న వర్గాల్లో భారతీయ అమెరికన్ల వర్గం కూడా ఒకటి. సగటున ఒక్కో భారతీయ అమెరికన్ కుటుంబం ఏడాదికి 1.2 లక్షల డాలర్ల (భారత కరెన్సీలో 87 లక్షలు) దాకా సంపాదిస్తోంది. అమెరికాలోని సగటు కుటుంబ సంపాదనతో పోలిస్తే ఇది రెండింతలు.

ఫొటో సోర్స్, EPA
కరోనావైరస్ అమెరికాపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇప్పటివరకూ ఆ దేశంలో దాదాపు 73 లక్షల మంది కరోనా బారినపడ్డారు. వారిలో రెండు లక్షలకుపైగా మంది ప్రాణాలు కోల్పోయారు.
లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి. అమెరికా ఆర్థికవ్యవస్థ తీవ్రంగా పతనమైంది.
జాన్స్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రొఫెసర్ దేవేశ్ కపూర్ అధ్యయనం చేసి, 'ది ఇన్విసిబుల్ ఇండియన్' నివేదికను రూపొందించారు.
మిగతా అమెరికన్లతో పోల్చితే, భారతీయ అమెరికన్లలో పేదరికం బారినపడే పురుషుల సంఖ్య ఎక్కువగా ఉండొచ్చని ఈ నివేదిక అభిప్రాయపడింది. అమెరికాలో ఇంకా పౌరసత్వం లభించనివారు... బెంగాలీలు, పంజాబీలు వీరిలో అధికంగా ఉండొచ్చని అంచనా వేసింది.
అమెరికాలో పురుషుల కన్నా మహిళల్లో పేదరికం ఎక్కువ. భారతీయ అమెరికన్లలో మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. పితృస్వామ్య కుటుంబాల్లో పేదరికం ఎక్కువగా ఉంటోంది.
''ఇలా ఎందుకు జరుగుతుందో స్పష్టంగా తెలియదు. కష్టాల్లో ఉన్నామని చెప్పుకోవడం నామోషిగా అనిపించి, కొందరు ఎవరి సాయమూ తీసుకోవడం లేదనుకుంటా'' అని ప్రొఫెసర్ కపూర్ అన్నారు.
భారతీయ అమెరికన్లలోని పేదలు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నివేదిక పేర్కొంది.
''చాలా మంది అద్దె ఇంట్లో ఉంటుంటారు. అకస్మాత్తుగా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడితే, వారు రోడ్డునపడతారు. ఆదాయం లేదంటే, తిండికి కూడా ప్రభుత్వం అందించే సాయంపై ఆధారపడాలి. అమెరికాలో హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే, ఎన్నో సమస్యలు తలెత్తుతాయి'' అని వివరించింది.
పేదరికం బారినపడుతున్నవారిలో అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నవాళ్లు కూడా ఉంటున్నారు.
''భారత్ నుంచి వచ్చి అమెరికాలో అక్రమంగా ఉంటున్నవాళ్ల సంఖ్య గత దశాబ్దంలో బాగా పెరిగింది. అలాంటివారు దాదాపు ఐదు లక్షల మంది దాకా ఉంటారని అంచనాలున్నాయి'' అని ప్రొఫెసర్ కపూర్ అన్నారు.

ఫొటో సోర్స్, AFP
రిటైల్, ఆతిథ్యం, రవాణా లాంటి రంగాల్లో పనిచేస్తున్న భారతీయ అమెరికన్లపై కరోనా సంక్షోభం ప్రభావం తీవ్రంగా పడింది.
''ఈ రంగాల్లో పనిచేస్తున్న భారతీయ అమెరికన్లలో మూడింట ఒక వంతు మందికి అమెరికా పౌరసత్వం లేదు. అంటే, ప్రభుత్వం అందించే ప్రయోజనాలు వీరికి వర్తించవు'' అని ప్రొఫెసర్ కపూర్ చెప్పారు.
పేద భారతీయ అమెరికన్లలో సగం మంది న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సాస్, ఇలినాయిస్, న్యూజెర్సీ... ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఉంటున్నారని 'ది ఇన్విసిబుల్ ఇండియన్' నివేదిక అంచనా వేసింది.
‘‘ఉద్యోగాలు ఎక్కువగా పోతున్న రంగాలపై ప్రధానంగా దృష్టిపెట్టాలి. అమెరికాలో అక్రమంగా అంటూ, అద్దె కట్టలేక రోడ్డునపడుతున్నవారిని ప్రభుత్వం ఆదుకోవాలి. చిన్నారులు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఉద్యోగాలు కోల్పోయినవారిని ఉపాధి అవకాశాలున్న వేరే రంగాల అవసరాలకు తగ్గట్లుగా తీర్చిదిద్దాలి'' అని ప్రొఫెసర్ కపూర్ అన్నారు.
భారతీయ అమెరికన్లలో వెనుకబడినవారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అందరి దృష్టికి తేవాలన్న ఉద్దేశంతో ఈ నివేదికను రూపొందించినట్లు ఇండయోస్పొరాకు చెందిన ఎంఆర్ రంగస్వామి అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- చైనా దూకుడుకు కళ్లెం వేయడం ఎలా? ఆ దేశ అసమ్మతివాది ఏమంటున్నారు?
- పోర్ట్ రాయల్: చరిత్రలో ‘అత్యంత దుర్మార్గపు నగరం’ ఎందుకైంది? సముద్రంలో ఎలా మునిగిపోయింది?
- హాథ్రస్ కేసు: ఆమె నాలుక తెగడం, వెన్నెముక విరగడం... అన్నీ అబద్ధాలా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- కోకాకోలా, మొసలిపేడ, పంది పేగులు... గర్భం రాకుండా పూర్వం వీటితో ఏం చేసేవారో తెలుసా?
- కొళాయి నీళ్లలో మెదడును తినేసే సూక్ష్మజీవులు.. ఆ నీళ్లు వాడొద్దంటూ అధికారుల వార్నింగ్
- పదేళ్ల వయసులో ఇల్లొదిలి వెళ్లాడు.. ఎన్నో కష్టాలు పడ్డాడు.. ఇప్పుడు రూ. 2.4 కోట్లకు ఐపీఎల్లో ఆడుతున్నాడు
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- గ్వాదర్: ఒమన్ నుంచి ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఎలా కలిసింది? భారత్ మంచి అవకాశం వదులుకుందా?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ముందుగా ఎవరికి అందుతుంది? పేద దేశాలకు ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తారు?
- అండమాన్ కాలాపానీలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మేయో హత్య.. ‘‘ద ఫస్ట్ జిహాద్’’
- ‘ట్విటర్‌లో పరిచయమైన ఆ తొమ్మిది మందినీ నేనే చంపాను’
- కోటీశ్వరుడైన యజమానితో పనిమనిషి పోరాటం.. ఎందుకు? ఎవరు గెలిచారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








