అమెరికా అధ్యక్షుడికి కరోనావైరస్.. 74 ఏళ్ల డోనల్డ్ ట్రంప్ ఆరోగ్యానికి పొంచివున్న ముప్పులేమిటి?

డోనల్డ్ ట్రంప్‌

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, జేమ్స్ గళ్లఘెర్
    • హోదా, బీబీసీ హెల్త్ అండ్ సైన్స్ ప్రతినిధి

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు కరోనావైరస్ ఇన్ఫెక్షన్‌ను తీవ్రంచేసే ముప్పులు చాలా వెంటాడుతున్నాయి. ఆయన వయసు, బరువుతోపాటు పురుషుడు కావడం కూడా ఒక విధంగా ముప్పు పెరిగేందుకు అవకాశం ఏర్పడుతోంది.

ఆయన వయసు 74. బరువు, ఎత్తుల నిష్పత్తి (బీఎంఐ)కూడా 30కిపైనే ఉంటుంది. ఇది ఊబకాయానికి సంకేతం.

ప్రస్తుతం ఆయనకు కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీని అర్థం ఏమిటి?

ఇన్ఫెక్షన్ తీవ్రం కావడంలో వయసు ప్రధాన పాత్ర పోషిస్తోంది. వయసు పైబడిన వారు తీవ్రమైన లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు వయసు పైబడిన వారు మరణిస్తున్నారు కూడా.

''అయితే, ఇన్ఫెక్షన్ సోకుతున్న వారిలో చాలా మంది కోలుకుంటున్నారు''అని యూనివర్సిటీ ఎక్సెటెర్ మెడికల్ స్కూల్‌కు చెందిన డాక్టర్ భరత్ ఫంఖానియా తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా వందకుపై ప్రాంతాల్లో చేపట్టిన అధ్యయనాల ఫలితాలను విశ్లేషించిన అనంతరం పిల్లలు, యువకులపై ఈ వైరస్ అంత ప్రభావం చూపడంలేదని తేలింది.

అయితే, కరోనా బాధితుల్లో 75ఏళ్లు పైబడిన ప్రతి 25 మందిలో ఒకరు కోవిడ్-19తో మరణిస్తున్నారు. అదే వయసు 80 దాటితే ప్రతి ఏడుగురిలో ఒకరు, 90 దాటితే ప్రతి నలుగురిలో ఒకరు చనిపోతున్నారు.

కోవిడ్-19

అమెరికాలోనూ అంతే..

అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) అధ్యయనంలోనూ ఇలాంటి ఫలితాలే వెలువడ్డాయి.

దేశంలోని ప్రతి 10 కోవిడ్-19 మరణాల్లో ఎనిమిది 65ఏళ్లు పైబడిన వారివేనని సీడీసీ తెలిపింది. ట్రంప్ వయసులో ఉండేవారికి ఆసుపత్రి చికిత్స అవసరమయ్యే అవకాశం ఐదు రెట్లు ఎక్కువని వెల్లడించింది. 20ల వయసులో ఉండేవారితో పోల్చినప్పుడు ఈ వయసులో వారు మరణించే ముప్పు 90 రెట్లు ఎక్కువని వివరించింది.

వయసు పైబడటంతో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం లేదా ఆరోగ్యం క్షీణించడం తదితర కారణాలే ఈ ముప్పును పెంచుతున్నాయా? అన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు.

''హృద్రోగాలు, ఊపిరితిత్తుల సమస్యలు, టైప్-2 మధుమేహం లాంటి వాటికి వయసుతో సంబంధముంటుంది. దీంతో వయసు పెరగడం వల్లా.. లేక ఈ అనారోగ్య సమస్యల వల్లా మరణ ముప్పు పెరుగుతుంది అనేది అంచనా వేయడం కొంచెం కష్టమే''అని కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా వ్యాఖ్యానించారు.

కోవిడ్-19

ఊబకాయంతోనూ...

మరోవైపు ఊబకాయంతో కూడా కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్ తీవ్రమయ్యే ముప్పుంది.

విపరీతమైన బరువు వల్ల ఇంటెన్సివ్ కేర్ చికిత్స అవరమయ్యే ముప్పు పెరుగుతుందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ రాసిన కథనంలో పేర్కొంది. ఒక్కోసారి విపరీతమైన బరువుతో చనిపోయే ముప్పుందని వివరించింది.

రోగ నిరోధక వ్యవస్థలో భాగమైన తెల్లరక్త కణాలను శరీరంలోని కొవ్వు ప్రభావితం చేస్తుంది. ఫలితంగా శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది. దీని వల్లే ఇన్ఫెక్షన్ ప్రాణాంతకమయ్యే అవకాశముంటుంది.

మరోవైపు ఊబకాయంతో టైప్-2 మధుమేహం, హృద్రోగాలు వచ్చే ముప్పు కూడా పెరుగుతుంది.

తీవ్రమైన కరోనావైరస్‌ లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరినవారిలో మహిళల కంటే పురుషులే ఎక్కువ మంది ఉన్నారు. మృతుల్లోనూ 60 శాతం పురుషులవే.

''పురుషుల్లో, మహిళల్లో రోగ నిరోధక వ్యవస్థ భిన్నంగా ఉండటమే దీనికి కారణం''అని ప్రొఫెస్ రవీంద్ర గుప్తా వ్యాఖ్యానించారు.

మరోవైపు పురుషుల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశముందని ఆయన అన్నారు.

''పురుషులు కావడం లేదా వయసు పెరగడంతో తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ వస్తుందని చెప్పలేం. ఎందుకంటే వయసు పైబడిన ప్రతి పురుషుడికీ తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకడం లేదు కదా''అని భరత్ వ్యాఖ్యానించారు.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, EPA

ట్రంప్ పరిస్థితి ఏమిటి?

ఒక మనిషిపై వైరస్ ఎలా ప్రభావం చూపిస్తుందో అంచనా వేయడం చాలా కష్టం.

ఇప్పుడు మనం చెప్పుకొన్నవన్నీ.. ఒక జనాభాను దృష్టిలో పెట్టుకొని మాట్లడుకున్నవే. అంతేకానీ అమెరికా అధ్యక్షుడికి ఇలా అవుతుందని మనం స్పష్టంగా చెప్పలేం.

వయసుతోపాటు ఉండే అనారోగ్య సమస్యలూ కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్ తీవ్రం కావడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందుకే 74ఏళ్ల వయసున్న ఏ ఇద్దరూ ఒకేలా ప్రభావితం కారు.

ట్రంప్‌కు ఎలాంటి లక్షణాలున్నాయో ఇప్పటివరకూ మనకు తెలియదు.

''కొన్ని ముప్పులు ఉండేటంత మాత్రాన, ఆయనలో తీవ్రమైన లక్షణాలు కనిపించాలని లేదు. ఆయన మరణిస్తారనీ కాదు''అని కింగ్స్ కాలేజీ లండన్‌కు చెందిన డాక్టర్ నటాలియే చెప్పారు.

''ఆయన అమెరికా అధ్యక్షుడు. అనారోగ్య సమయంలో ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఆరోగ్య సేవలు ఆయనకు అందుతాయి''

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)